ఇంటర్వ్యూకు వెళ్లే ముందు వీటిని సరిచూసుకోండి!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఉద్యోగం సంపాదించడం అంటే ఆషామాషీ విషయమేమీ కాదు. నైపుణ్యతకు, నాయకత్వ లక్షణాలకు పెద్ద పీట వేస్తున్న కంపెనీలు నాణ్యమైన అభ్యర్ధులను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు అభ్యర్ధుల్లో భయాన్ని కలిగిస్తోంది. ఇంటర్వ్యూకు వెళ్లినా ఉద్యోగం వస్తుందా రాదా అన్న ఆందోళన చాలా మందికి ఒత్తిడిని కలిగిస్తోంది. అయితే ఆ ఒత్తిడిని అధిగమించి ధైర్యంగా తన నైపుణ్యాలను ప్రదర్శించే వారే ఇంటర్వ్యూలో విజయం సాధించి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఇంటర్వ్యూను విజేతలు కావాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలపై పూర్తిగా పట్టు సాధించాలని హెచ్ఆర్ నిపుణులు చెపుతున్నారు. లేటేస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా వీటిని పదును పెట్టుకుంటే కచ్చితంగా జాబ్ సాధించేందుకు అవకాశాలు మెరుగవుతాయి.

 

సంపూర్ణ అవగాహన చాలా అవసరం!

 

 

ఒక కంపెనీకి ఇంటర్వ్యూకు వెళుతున్నప్పుడు అభ్యర్ధులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఏదైతే కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్తున్నారో ఆ కంపెనీపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఆ కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆ కంపెనీ నిర్వహిస్తున్న కార్యకలాపాలు, వాళ్ల లక్ష్యాలు ఇలా అన్ని విషయాలపై ఒక నాలెడ్జ్ ను సంపాదించాలి. ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ గూర్చి మీకు ఏం తెలుసున్నదే అక్కడ కీలకంగా మారుతుంది. ముఖ‌్యంగా ఈ కంపెనీలో నిర్దేశించిన విధులకు తాను ఏ విధంగా న్యాయం చేయగలను అన్న విషయాన్ని అభ్యర్ధి సావధానంగా చెప్పాల్సి ఉంటుంది. దీని వలన కంపెనీ తన నుంచి ఏ ఆశిస్తుందో అన్న విషయంపై పూర్తి సాధికారత వస్తుంది. ఇలా ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ పూర్తి సమాచారం , అవగాహన మీ దగ్గర ఉన్నప్పుడు మీరు జాబ్ విష‍యంలో ఎంత సీరియస్ గా ఉన్నారన్న విష‍యం ఇంటర్వ్యూ చేసేవాళ్లకి అర్ధమవుతుంది.

 

 

కంపెనీకి అనుగుణంగా సీవీ!

 

చాలా మంది అభ్యర్ధులు ఒక సీవీ ని రెడీ చేసుకు పెట్టుకుని దాన్నే ప్రతీ ఇంటర్వ్యూకు తీసుకెళ్తారు. ఇది సరైన పద్ధతి కాదు. మనం ఇంటర్వ్యూకు వెళుతున్న కంపెనీ, అక్కడి పొజిషన్ ఆధారంగా సీవీని ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. చూడగానే సీవీ ఆకట్టుకునేలా ఉండాలి. సంక్షిప్తంగా సింపుల్ ఇంగ్లీష్ లో సీవీ ఉండాలి. అనవసర ఆడంబరాలు, డాంబికాలు లేకుండా సీవీని చాలా శ్రద్ధగా తయారు చేసుకోవాలి. అప్పటివరకూ సాధించిన అచీవ్‌మెంట్స్ ను చిన్న చిన్న వాక్యాలతో రాసుకుంటే చూసిన వారిని ఈజీగా అర్ధమవుతుంది. అలాగే వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలను బుల్లెట్ పాయింట్స్ తో రాసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగా సీవీలో అబద్ధాలకు, అతిశయోక్తులకు చోటు లేకుండా చూసుకోవాలి.

 

కమ్యూనికేషన్ మెరుగుపర్చుకోవాలి!

 

అసలు ఇంటర్వ్యూ అంటే ఏమిటి? ఒక అభ్యర్ధిలోని సత్తాను, సామర్ధ్యాన్ని గుర్తించే ప్రక్రియ. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ఒక వ్యూహం ప్రకారం బెరుకు లేకుండా సమగ్రంగా సమాధానాలు చెప్పాలి. అలా చెప్పాలి అంటే అభ్యర్ధులు కమ్యూనికేషన్ వ్యూహం ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఇంటర్వ్యూ చేసే వాళ్లు ఏమి అడుగుతున్నారు. అన్న దాన్ని చూసుకుని ప్రశ్నకు తగ్గ సమాధానాన్ని చాలా క్లుప్తంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెపుతున్న సమాధానాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ అంశాలపై పట్టు ఉన్న వారికి జాబ్ రావడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు.

 

 

సోషల్ మీడియా, జాబ్ పోర్టల్స్ పరిశీలన!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో కూడా సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అభ్యర్ధుల ప్రొఫైల్ ను చూసే ఉద్యోగాన్ని ఇచ్చే కంపెనీలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రొఫైల్ ను ప్రొఫెషనల్ గా తయారు చేసుకోవడంపై అభ్యర్ధులు దృష్టిపెట్టాలి. ఎటువంటి వివాదాలు, లోపాలు లేకుండా సోషల్ మీడియా ప్రొఫైల్, వ్యక్తిగత పేజ్ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. తనకు సంబంధించిన రంగంపై చేస్తున్న పోస్ట్ లు, అభిప్రాయాలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి మంచి కంపెనీలో మంచి జాబ్ కావాలంటే సోషల్ మీడియా ప్రొఫైల్ పై కూడా దృష్టి పెట్టాలి.

 

ఇంప్రెషన్, ఫాలోఅప్ కూడా కీలకం!

 

ఇంటర్వ్యూలో గెలుపు సాధించామా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇంటర్వ్యూ చేసేవాళ్లకు అభ్యర్ధులు మంచి ఇంప్రెషన్ ను కలిగించాలి. చెప్పిన సమయానికి ఇంటర్వ్యూకు రావడం, మంచి డ్రెస్సింగ్, కాన్ఫిడెన్స్, ఐ కాంటాక్ట్, చెప్పే విషయంలో క్లారిటీ, గతంలో సాధించిన అచీవ్‌మెంట్స్ పై ఆచితూచి మాట్లాడటం వంటివి అభ్యర్ధులపై మంచి ఇంప్రెషన్ ను కలిగిస్తాయి. ఇంటర్వ్యూలో చేసే వాళ్లకు మంచి ఇంప్రెషన్ కలిగించారంటే ఉద్యోగం వచ్చినట్టే. కంపెనీ మీ నుంచి ఏం ఆశిస్తుందో సూచన ప్రాయంగా తెలియజేస్తుంది. దాన్ని అర్ధం చేసుకుని తుది ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలి. అలాగే ఫాలోఅప్ ను మిస్ కాకుండా చూసుకోవాలి. ఆ కంపెనీలో అవకాశం ఉందా అని అడగటం ద్వారా మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటే కంపెనీకి అదనపు లాభం చేకూరుతుందని వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పగలగాలి.

 

(ఈ ఆర్టికల్  ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

పని ఒత్తిడి..ఆరోగ్యం, కెరీర్ చిత్తడి!!

 

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉద్యోగులు తీవ్ర‌మైన ప‌ని ఒత్తిడిలో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ముఖ్యంగా టార్గెట్లు, నివేదిక‌లు, బాసిజం వంటివి ఉద్యోగుల‌పై మాన‌సిక ఒత్తిడిని పెంచుతున్నాయి. కార్పోరేట్ రంగంలో ప‌నిచేస్తున్న వారైతే మ‌రింత‌గా ప‌ని ఒత్తిడికి గుర‌వుతున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగుల‌ను శారీర‌క స‌మ‌స్య‌ల‌కు తోడు మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా వేధిస్తున్నాయి. మెల్ల‌గా మొద‌ల‌య్యే ఈ స‌మ‌స్య త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డంతో త‌ర్వాత పెను స‌మ‌స్య‌గా మారుతోంది. ముఖ్యంగా ఆఫీస్ లో ప‌ని ఒత్తిడి ఊబ‌కాయానికి దారితీస్తోందని తాజా అధ్య‌య‌నాలు తేల్చి చెపుతున్నాయి. ఒక్కసారి ఊబ‌కాయం వ‌స్తే ఆ త‌ర్వాత ర‌క్త‌పోటు, షుగర్ వంటి వ్యాధులు మెల్ల‌గా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తున్నాయి. దీంతో ప‌నిచేసే వ‌య‌స్సు, స‌త్తా ఉండ‌గానే చాలా మంది అనారోగ్యం పాల‌వుతున్నారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా వ్యాయామానికి త‌గిన స‌మ‌యం కేటాయించ‌డం, స‌రైన ప‌ద్ధ‌తిలో స‌రైన తిండి తిన‌డం వ‌ల‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. లేదంటే ఎంత ఉన్న‌త స్థితిలో ఉన్నా ఎంత శాల‌రీ తీసుకుంటున్నా అదంతా ఎందుకూ కొర‌గానిదిగానే మారుతుంది. ఒత్తిడిని ద‌రి చేర‌నీయ‌కుండా ఆరోగ్య‌వంత‌మైన జీవన‌శైలిని అవ‌లంభించిన‌ప్పుడే కెరీర్ లోని మజాను ఆస్వాదించేందుకు వీలు క‌లుగుతుంది.

 

 

ఉద్యోగుల వెన్ను విరుస్తున్న ప‌ని ఒత్తిడి!

 

అసలు మనుష్యు జీవనంలో ఒత్తిడి అనేది ఒక భాగం. ఆదిమ కాలం నుంచి మనిషి ఒత్తిడిలోనే మనుగడ సాగిస్తున్నాడు. అయితే ఈ ఆధునిక కాలంలో మనిషి ఎందుకు ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నాడు. దీనికి ఒకటే కారణం మారుతున్న జీవనశైలి. ప్ర‌జంట్ ట్రెండ్ లో టార్గెట్లను అనుస‌రించి ప‌నిచేయాల్సి ఉంటుంది. పోటీ వాతావ‌ర‌ణంలో ప్ర‌త్య‌ర్ధుల‌ను ఎదుర్కోవాల‌న్న‌, క‌స్ట‌మ‌ర్ కు అత్యుత్తమ స‌ర్వీస్ ను అందించాల‌న్నా టార్గెట్ అనేది చాలా కీల‌క‌మైన విష‌య‌మే. అయితే అనుకున్న గ‌డువులోగా పూర్తి కావాల‌న్న ఆ ఒత్తిడి ఉద్యోగుల‌పై తీవ్రంగా ప్ర‌భావం చూపుతోంది. ఫ‌లిత‌మే మానసిక కుంగుబాటు, ఊబ‌కాయం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు. ముఖ్యంగా కార్పోరేట్ ఆఫీసుల్లో ప‌నిచేసే వారు ఈ విధ‌మైన ప‌ని ఒత్తిడి గుర‌వుతున్నారు. మంచి శాల‌రీ వ‌స్తున్నా గ‌డువు లోగా ప‌ని పూర్తి చేయాల‌న్న ఒత్తిడి వాళ్ల ఆరోగ్యానికి ప్ర‌తికూలంగా మారుతోంది. ఒకే చోట‌ కూర్చుని ప‌నిచేయ‌డానికి తోడు శారీరక వ్యాయామం లేక‌పోవ‌డం, మానసిక ఒత్తిడి పెరిగిపోవ‌డంతో అది కాస్తా ఊబ‌కాయానికి దారితీస్తోంది. మ‌రోవైపు ఒత్తిడితో అధికంగా తిన‌డం, జీవ క్రియ వేగం మంద‌గించ‌డం వంటి కార‌ణాలు కూడా ఒబేసిటీకి కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో య‌వ్వ‌నంలోనే చాలా మంది వ‌య‌సు మ‌ళ్లిన వ్య‌క్తుల్లా క‌న‌బడుతున్నారు. అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌డంతో నెల‌కు రెండుమూడు సార్లు డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాల్సి వ‌స్తోంది. ఈ ప‌రిణామం వ్య‌క్తిగ‌త ఎదుగుద‌ల‌తో పాటు కంపెనీ ఉత్పాద‌క‌త‌కు పెద్ద అవ‌రోధంగా మారుతోంది.

 

 

ఒత్తిడి కొవ్వును పెంచుతోంది!

 

నిపుణులైన మెట‌బాలిక్ స‌ర్జ‌న్స్ చెపుతున్న విష‌యాన్ని చూస్తే ఒత్తిడి అనేది శ‌రీరంలో అద‌న‌పు కొవ్వును విడుద‌ల చేస్తోంది. ఒత్తిడితో అద‌నంగా విడుద‌లైన కొవ్వు స్థాయిలు స‌రైన శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డంతో శ‌రీరంలో పేరుకుపోతున్నాయి. ఫ‌లితంగా ఊబ‌కాయం వ‌స్తోంది. అన్ని వైద్య నివేదిక‌లు తేల్చి చెప్పిన విష‌య‌మేమిటంటే ప‌ని ఒత్తిడి అనేది శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంద‌ని. ఇటువంటి ప‌రిస్థితుల్లో త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోకుంటే ఆరోగ్యం పెను ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశ‌ముంది. ఈ విష‌యాన్ని కంపెనీలు కూడా గుర్తించి కొన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఉద్యోగుల ఆరోగ్యంపై కంపెనీలు తీసుకుంటున్న చ‌ర్య‌లు ఎప్పుడూ అర‌కొర‌గానే ఉంటాయి. ఈ విష‌యంలో ఉద్యోగులు త‌మ వ్య‌క్తిగ‌త ఆరోగ్యంపై తామే త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. ఒత్తిడిని అధిగ‌మించేందుకు ప‌నిలో కొన్ని మార్పులు చేసుకోవ‌డంతో పాటు జీవ‌న‌శైలిని మార్చుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాలి. అవ‌స‌ర‌మైతే ముంద‌స్తుగా డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించి ప్రారంభ ద‌శ‌లోనే ప‌ని ఒత్తిడిని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

 

 

స‌రైన ప్ర‌ణాళిక ఉంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే!

 

ప్ర‌స్తుతం పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద జీతాలు తీసుకుంటున్నారు. కానీ వ్య‌క్తిగ‌త ఆరోగ్యంపై ఎవ‌రికీ స‌రైన అవ‌గాహ‌న లేదు. ముఖ్యంగా ఆహారం, వ్యాయామంపై మ‌న దేశంలోని యువ‌తకు క‌నీస అవగహన ఉండటం లేదు. శారీరక శ్రమ యొక్క ప్రాధాన్యతను గుర్తించడంలో ప్రతీ ఒక్కరు విఫలమవుతున్నారు. ఫలితమే ఈ ఒత్తిడి. గతంలో ప్రతీదానికి శారీరక శ్రమ చేస్తూ ఆహారాన్ని సంపాదించుకునే వారు. దాని వలన జీవ క్రియల వేగం పెరిగి మనిషి ఆరోగ్యంగా ఉండేవాడు. ఇప్పుడు అసలు కూర్చున్న చోటికే అన్ని అందుబాటులోకి రావడం వలన శారీరక శ్రమ అన్నదే లేకుండా పోతోంది. దీనికి తోడు మానసికంగా ఒత్తిడికి గురికావడంతో అదుపు తప్పి తిని ఒంట్లో కొవ్వు పెరిగేలా చేసుకుంటున్నారు. తన శరీరంపై, తను తింటున్న తిండిపై అదుపు లేనప్పుడు కెరీర్ లో ఎంత ఎదిగిలా అది సరైన ఎదుగుదల కాబోదు. మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని ప్రతీ రోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించి సరైన పద్ధతిలో తిన్నప్పుడు ఆఫీస్ ఎంత పని ఒత్తిడి ఉన్నా అది ఆరోగ్యంపై ప్రభావం చూపదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు) 

 

 

గాంధీ, ఎన్టీఆర్, కేసీఆర్…బలమైన నాయకుల సక్సెస్ సీక్రెట్ ఇదే!

 

ఒక ఆశ‌యం, ఒక స్పూర్తి ప్ర‌పంచవ్యాప్తం కావాలి, చ‌రిత్ర‌లో నిలిచిపోవాలి అంటే దాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే నాయ‌కుడు, నాయ‌క‌త్వం కావాలి. అయితే ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేసే ఒక బ‌ల‌మైన‌ నాయ‌కుడు త‌యారు కావ‌డం అన్న‌ది అంత సులువైన విష‌య‌మేమీ కాదు. ఎందుకంటే నాయ‌కునిగా ఎద‌గాలంటే ఎన్నో స‌వాళ్ల‌ను మ‌రెన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎవ‌రు కాద‌న్నా ఔనన్నా కుల వ్య‌వ‌స్థ ముఖ్య‌పాత్ర‌ పోషించే ఇండియా లాంటి దేశంలో సామాజిక వ‌ర్గం అండ‌దండ‌లు లేకుండా ఒక వ్య‌క్తి బ‌ల‌మైన నాయ‌కునిగా ఎద‌గ‌డం అసాధ్యం. విభిన్న వ‌ర్గాల‌ను క‌లుపుకుంటూనే అదే స‌మ‌యంలో స్వంత వ‌ర్గం వారిని కూడా ఆక‌ట్టుకున్న‌ప్పుడే నాయ‌కునికిగా మ‌నుగ‌డ సాధ్యం. బుద్ధుడు నుంచి నేటి కంచె ఐలయ్య వ‌ర‌కూ ఉద్య‌మాలు విజ‌యవంతం కావాలంటే సామాజిక వ‌ర్గాల మ‌ద్ధ‌తు అత్య‌వ‌సరం. గాంధీజీ దేశంలోనే బ‌ల‌మైన నాయ‌కునిగా ఎదిగి దేశానికి స్వాతంత్రం సాధించగ‌లిగాడంటే అత‌నికి సొంత సామాజిక వ‌ర్గం నుంచి పూర్తి స‌హ‌కారం ఉండ‌టం వ‌ల్ల‌నే అది సాధ్య‌మైంది. ఇలా స్పూర్తిని నింపుకుంటూ విభిన్న వ్య‌క్తుల‌ను క‌లుపుకుంటూ ఒక ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లిన‌ప్పుడే ఉద్యోగులు మంచి టీమ్ లీడ‌ర్ గా ఎదిగి కెరీర్ లో ఉన్న‌త స్థానాల‌కు చేర‌గ‌లుగుతారు.

 

 

చ‌రిత్ర‌లో నాయ‌క‌త్వానికి ఆన‌వాళ్లు తెలుసా?

 

క్రీస్తు పూర్వమే భారతదేశంలో హిందూ మతం మనుగడ ప్రమాదంలో పడింది. ముఖ్యంగా వర్ణ వ్యవస్థ వెర్రి తలలు వేయడంతో కొన్ని వర్గాల వారు హిందూ మతానికి పూర్తిగా దూరమయ్యారు. బౌద్ధ మతాన్ని ప్రభోధించిన బుద్ధుని భోధనలకు ప్రభావితమై చాలా మంది హిందూ మతం నుంచి బౌద్ధం లోకి మారిపోయారు. అయితే పురాతన కాలం నుంచి బలంగా పాతుకుపోయిన హిందూ మతాన్ని సవాలు చేస్తూ బుద్ధుడు బౌద్ధమతాన్ని ప్రారంభించి బౌద్ధులు దృష్టిలో దేవునిగా మారడం వెనుక అంతులేని నాయకత్వం పటిమ కనిపిస్తుంది. ఒక సామ్రాజ్యానికి రాజుగా ఉన్న కాలంలో బుద్ధుడు విభిన్న వర్గాలకు, వ్యక్తులు ఎనలేని సహాయం చేసి వాళ్ల మనస్సులను గెల్చుకున్నాడు. అటు తర్వాత అతను రాజ్యాన్ని, అధికారాన్ని త్యజించి సన్యాసిగా మారి బౌద్ధాన్ని ప్రభోధించినప్పుడు అతని నుంచి సహాయం పొందిన వారంతా అతని సంకల్పానికి సహాయపడ్డారు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడంలో ఎనలేని కృషి చేసారు. మనదేశంతో పాటు విదేశాలకు కూడా బౌద్ధం విస్తరించిందంటే బుద్ధుడు అందర్నీ ఆకట్టుకుంటూ, వారి నుంచి ఎలా సహాయం పొందాడో అర్ధమవుతుంది. కొన్ని వర్గాల కొన్ని సమూహాల సహాయం లేనిదే ఎవరూ నాయకుడు కాలేదన్నది బుద్ధుని కాలంలోనే రుజువైంది. ఇక బౌద్ధం దెబ్బకు, ఇతర మతాల ప్రభావానికి ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డ హిందూ మతాన్ని కాపాడుకునేందుకు తీసుకొచ్చిన భక్తి ఉద్యమం వెనుక కూడా కొన్ని వర్గాల అండ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హిందూ మతం క్షీణిస్తే ముందుగా నష్టపోయేది బ్రహ్మణ వర్గం కాబట్టి వాళ్లు వెనుక నుండి భక్తి ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు పరోక్షంగా కృషి చేసారు.

 

 

వీరులైనా, శూరులైనా సామాజిక వర్గం అండ ఉండాల్సిందే!

 

క్రీస్తు పూర్వం మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన చంద్ర గుప్త మౌర్యుడు తన ప్రధాన మంత్రి చాణక్యుని సహాయంతో హిందూ మతాన్ని విస్తరించేందుకు కృషి చేసాడు. చాణక్యుడు బ్రహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సాక్షాత్తూ మహారాజు చంద్రగుప్తుడు తన శిష్యుడు కాబట్టి తన ప్రణాళికలను సుస్పష్టంగా అమలు చేసుకున్నాడు. ఈ పరిణామానికి వెనుక నుంచి బ్రహ్మణ వర్గం అండదండలు చాణక్యునికి పుష్కలంగా ఉన్నాయి. ఇక తురుష్కుల దాడుల నేపథ్యంలో హిందూ ధర్మం మరోసారి ప్రమాదంలో పడ్డప్పుడు ఛత్రపతి శివాజీ బలమైన నాయకునిగా ఎదిగాడు. తన వర్గం, తన సమూహం అండదండలతో బలమైన రాజ్యాన్ని నిర్మించుకుని హిందూ ధర్మ పరిరక్షణ చేసాడు. ఎంతటి వీరులకైనా, నాయకులకైనా ఆయా కాలమాన పరిస్థితులను బట్టి బలమైన వర్గం అండ ఉంటేనే వారి నాయకత్వం నిలబడుతుంది. లేకుంటే ఎంతటి గొప్పవాడైనా బలమైన నాయకుడు కాలేడు. తనకు పూర్తి సహాయ సహకారాలు అందించే ఒక వర్గం సహాయం తీసుకుంటూనే అదే సమయంలో మిగిలిన వాళ్ల మనసులను కూడా గెల్చుకున్నప్పుడే నాయకునికి గెలుపు సాధ్యమవుతుంది. ఇలా విభిన్న వ్యక్తులను, విషయాలను కలుపుకుని పోవడం అన్నది నాయకునికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. ఈ విషయంలో మహాత్మా గాంధీని విజయవంతమైన నాయకునిగా చెప్పవచ్చు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గాంధీ నాయకత్వం ఎందుకు విజయవంతమైంది?

 

విదేశాల్లో బారిష్టర్ చదువు పూర్తి చేసి ఇండియాకు వచ్చిన గాంధీజీ , దేశంలోనే ఒక బలమైన నాయకునిగా ఎలా ఎదగగలిగారు? చదువు పూర్తి చేసి తన ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ ఉండే చిన్న వివాదాలను గాంధీజీ పరిష్కరించేవాడు. ముఖ్యంగా వర్తకులు, వ్యాపారస్తుల సమస్యలను చాలా చాకచక్యంగా పరిష్కరించేవాడు. స్వయంగా గాంధీ కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వాళ్లకు గాంధీజీపై గురి కుదిరింది. ముఖ్యంగా సారాభాయి మిల్స్ వ్యవహారంలో యాజమాన్యానికి, కార్మికులకు మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరించడం అతని ప్రతిష్ఠను ను పెంచింది. అతను జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ఉద్యమాలు నడిపేటప్పుడు స్వంత సామాజిక వర్గానికి చెందిన ట్రేడర్లు గాంధీజీకి పూర్తి సహకారం అందించేవారు. ఫండింగ్ రూపంలో కానీ జన సమీకరణ రూపంలో కానీ ఇలా విభిన్న మార్గాల్లో గాంధీజీ ఉద్యమం విజయవంతమయ్యేలా కృషి చేసేవారు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత వర్గాలు వారు కావడం వలన వారి సహకారంతో గాంధీజీ దేశంలో బలమైన నాయకునిగా ఎదిగాడు. మరోవైపు అదే సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వర్గ , సామాజిక సమీకరణలను అందిపుచ్చుకోలేక స్వాతంత్ర సాధనలో విఫలమయ్యారు. తన సొంత సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటూనే వారి సహాయం పొందుతూనే అదే సమయంలో మిగిలిన వర్గాల వారినీ, కులాల వారిని ఆకర్షించి గాంధీజీ జాతి పితగా మారాడు.

 

 

బలమైన నాయకుని వెనుక ‘బలమైన వర్గం’ ఉంటుంది!

 

సినిమాల్లో తిరుగులేని కథానాయకునిగా వెలుగుతున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించినప్పుడు ఆయన వెనుక ఒక బలమైన సామాజిక వర్గం అండగా నిలబడింది. ముఖ‌్యంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన్ను బాగా ప్రమోట్ చేసేందుకు ఒక దిన పత్రిక ఎనలేని కృషి చేసింది. ఆయన రాజకీయ ప్రచారానికి తమ పత్రికలో బాగా ప్రాధాన్యం ఇచ్చి ఆయన చాలా వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్లేలా చేసింది. ఆ పత్రిక ఒక్కటే కాదు పబ్లిక్ మీటింగ్ లకు ఆర్థిక సమీకరణ, జన సమీకరణ వంటి పనులను ఒక సామాజిక వర్గం బలంగా చేసింది. ఫలితం ఆయన తిరుగులేని నాయకునిగా ఎదిగి స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక వైఎస్ఆర్ పాదయాత్ర కూడా ఒక చరిత్ర సృష్టించిందంటే అతని స్వంత సామాజిక వర్గం చేసిన కృషిని కొట్టిపారేయలేం. అలాగే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ అతన్ని బలమైన నాయకునిగా ఎదిగేలా చేసేందుకు అతని సామాజిక వర్గం అందించిన సహాయ సహకారాలు సుస్ఫష్టం. అంటే కేవలం సామాజిక వర్గాల అండతోనే బలమైన నాయకులు తయారవుతారని పూర్తిగా చెప్పలేం కానీ స్వంత వర్గం అండ లేకుంటే మాత్రం పెద్ద నాయకుడు కావడం అనేది అసాధ్యం.

 

 

విద్యార్ధులు ‘బలమైన నాయకత్వం’ అంటే ఏమిటో తెలుసుకోవాలి!

 

ప్రస్తుత జాబ్ మార్కెట్లో నాయకత్వ లక్షణాలు ఉన్నవారికే కొలువు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కు తోడు ఒక టీమ్ ను విజయవంతంగా నడిపే వాళ్లు ఇప్పుడు కంపెనీలకు కావాలి. విభిన్న మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఉన్న టీమ్ ను కుదుపులు లేకుండా నడపడం అంత సులువేం కాదు. అందుకే కంపెనీలు ఈ ఛాలెంజ్ ను తీసుకునే అభ్యర్ధుల కోసం వెతుకుతున్నాయి. బుద్డుడి దగ్గర్నుంచి కేసీఆర్ వరకూ ఒక బలమైన నాయకుడు కావాలంటే తమ వర్గం అండదండలు పొందుతూనే అదే సమయంలో అందర్నీ కలుపుకుపోయే లక్షణం ఉండాలి. విద్యార్ధులు, ఉద్యోగులు ఈ లక్షణాన్ని స్వీకరించాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకుని, అందర్నీ ఆకట్టుకుంటూ అనుకున్న లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు కెరీర్ లో అయినా వ్యక్తిగతంగా అయినా ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం కలుగుతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్న వారు)