ప్ర‌తీ మ‌నిషి ఆ ‘సంబంధం’ విలువ‌ తెలుసుకోవాల్సిందే!

 

ఈ క్ష‌ణం మీ జీవితం అద్భుతంగా ఉందా? లేక అస్త‌వ్య‌స్థంగా ఉందా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం అంత సుల‌భం ఏమీ కాదు. ఎందుకంటే జీవితం అద్భుతంగా ఉండ‌టం అంటే చేతినిండా డ‌బ్బు, కోరుకున్న స‌దుపాయాలు ఉండ‌టం కాదు. మాన‌సికంగా ఆనందంగా ఉండ‌టం.ఎంత మంది అలా ఉన్నారని అడిగితే ఈ రోజుల్లో అవును నేను ఉన్నా అని ట‌క్కున‌ స‌మాధానం చెప్పేవాళ్లు చాలా త‌క్కువ మందే ఉన్నారు. ఎందుకంటే సాంకేతికంగా ఎంత ఎదిగినా మాన‌వ సంబంధాల విష‌యంలో ఇప్పుడు మ‌నం రోజురోజుకీ తీసిక‌ట్టుగానే ఉన్నాం. ఒక మ‌నిషి జీవితం గొప్ప‌గా ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? అత‌ను అత్యుత్త‌మంగా ప్రేమించే వ్య‌క్తి, లేదా వ్య‌క్తుల‌తో అత‌ని సంబంధాలు స‌రిగా ఉన్నాయ‌ని అర్ధం. మీ ఆత్మీయుల‌తో మీ సంబంధాలు స‌రిగా లేవంటే మీరు ఎప్ప‌టికీ ఆనందాన్ని సాధించలేని ఒక విఫ‌ల వ్య‌క్తిగానే మిగిలిపోతారు. ఎందుకంటే మంచి సంబంధాలే మంచి జీవితం.

 

 

సంబంధాలు విత్త‌నాలు లాంటివి!

 

బాగా దున్నిన పొలంలో మీరు విత్త‌నాలు నాటారు అనుకోండి. మీరు వాటిని ఎంత అపురూపంగా కాపాడాల్సి ఉంటుంది. మొల‌క‌లు వ‌చ్చి ఏపుగా పెరిగి ఫ‌ల‌సాయం వ‌చ్చేవ‌ర‌కు అత్యంత జాగ్ర‌త్త‌గా వాటిని చూసుకోవాలి. మ‌న ఆత్మీయుల‌తో, మ‌న శ్రేయోభిలాషుల‌తో మ‌నం కొన‌సాగించాల్సిన సంబంధాల‌ను కూడా విత్త‌నాల్లా నాటిన ద‌గ్గ‌ర్నుంచి ఎదిగే వ‌ర‌కూ అప్ర‌మ‌త్తంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. స‌రిగ్గా కాపాడుకోలేక‌పోతే విత్త‌నం ఎలా అయితే మొక్క‌గా మారి ఫ‌ల‌సాయం ఇవ్వ‌దో ..సంబంధాల‌ను స‌రిగా కాపాడుకోలేక‌పోతే మ‌నం ఎప్ప‌టికీ విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా త‌యారుకాలేం. మ‌న జీవితంలో అన్ని సంబంధాలు చాలా చాలా ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యం మ‌నం అప‌రిమితంగా ప్రేమించే వ్య‌క్తుల‌తో మ‌న సంబంధాలు ఎలా ఉన్నాయ‌న్న‌దే. వాళ్ల‌ను స‌రిగా ప్రేమించిన‌ప్పుడే మ‌న జీవితం ఏపుగా పెరిగిన పంట‌లా స‌స్య‌శ్యామ‌లం అవుతుంది. లేదు అంటే విత్త‌నాలు వేసి నిర్ల‌క్ష్యం చేసిన పంట‌లా క‌ళావిహీనం అవుతుంది. అప్పుడు వ్య‌వ‌సాయం క్షేత్రంలోనే కాదు జీవితంలోనూ మిగిలేది బీడు వారిన వేధ‌నాభ‌రిత అనుభ‌వ‌మే.

 

 

తేడా వ‌స్తే సంబంధాలే మీ పాలిట మందుపాత‌ర‌లు!

 

మ‌నం జీవితంలో కృషి చేసి చాలా విష‌యాల్లో అత్యున్న‌త స్థాయికి ఎదుగుతాం. అయితే ఎంత ఎదిగినా మానవ సంబంధాలు విష‌యంలో స‌రైన విధంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతే అదంతా వ్య‌ర్ధ ప్ర‌య‌త్నంగా మిగిలిపోతుంది. సంబంధాల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేని వారి జీవితం చింద‌ర‌వంద‌ర అవుతుంది. సంబంధాల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేని ఆ అస‌మ‌ర్ధ‌త ఎలాంటిదంటే మందుపాత‌ర‌ల‌తో నిండి ఉన్న మైదానంలో ఆట ఆడ‌టం లాంటిది. ఎప్పుడో ఒకప్పుడు మందుపాత‌ర మీద కాలు వేయ‌డం అది పేల‌డం ఖాయంగా జ‌రిగి తీరుతుంది. అప్పుడు మీ సామ‌ర్ధ్యాలు, మీ బ‌లాలు , మీ డ‌బ్బు ఏవీ మిమ్మ‌ల్ని ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌లేవు. అంద‌రితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయో ఎప్పటిక‌ప్పుడు స‌మీక్ష చేసుకోవాల్సిందే. సంబంధాలు లింక్ ఏ మాత్రం బ‌ల‌హీనంగా ఉన్నా అది ఎప్పుడైనా తెగిపోవ‌చ్చు. అంత‌వ‌ర‌కూ తెచ్చుకోకుండా ముందుగానే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని దాన్ని అతికించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. లేదంటే ఆ లింక్ తెగిపోవ‌డం మాత్ర‌మే కాదు. మీరు అడుగుపెట్టే మైదానంలో ముందుపాత‌ర‌లా త‌యార‌వుతుంది. అప్పుడు మీ జివిత‌మే ఇబ్బందుల్లో ప‌డొచ్చు. సంబంధాల విష‌యంలో ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉంటూ, ప్రేమిస్తూ ప్రేమ‌ను పొంద‌డ‌మే విజ‌య‌వంత‌మైన వ్య‌క్తుల ల‌క్ష‌ణం.

 

 

వ‌స్తువుల్ని కాదు వ్య‌క్తుల్ని ప్రేమించండి!

 

ఒక పెద్ద వ్యాపారవేత్త త‌న‌ భార్య‌కు ఆమె పుట్టినరోజు సంద‌ర్భంగా ఒక ఖ‌రీదైన కారును బ‌హుమ‌తిగా ఇచ్చాడు. కారు తాళాల‌తో పాటు ఒక క‌వ‌ర్ ను కూడా ఆమెకు ఇచ్చాడు. కొత్త కారులో ఉత్సాహంగా స్నేహితురాళ్ల‌తో షికారుకెళ్లిన ఆమె వేగంగా కారును పోనిచ్చి ప్ర‌మాదం చేసింది. కారులో మ‌నుష్యుల‌కు గాయాలు కాన‌ప్ప‌టికీ కారు మాత్రం బాగా దెబ్బ‌తింది. ఆమె చేసిన ప‌నికి తిట్టుకుంటూ ఆమె స్నేహితురాళ్లు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు వ‌చ్చారు. ఆమెకు భ‌యం వేసింది. క‌నీసం కాస్త డ‌బ్బులు ఇస్తే పోలీసులు ఏమీ అన‌ర‌న్న ఉద్దేశంతో భ‌ర్త ఇచ్చిన క‌వ‌ర్ ను తెరిచింది. అందులో డ‌బ్బులు లేవు ఒక లెట‌ర్ ఉంది. అందులో ఇలా ఉంది. నీకు స‌రిగా డ్రైవింగ్ రాద‌ని నాకు తెలుసు. నువ్వు కారుకు యాక్సిడెంట్ చేస్తే దాన్ని అక్క‌డే వ‌దిలి వ‌చ్చేయ్. దానికి ఇన్సూరెన్స్ ఉంది. ఆ కారు ఎంత ఖ‌రీదైనదైనా నీ అంత ఖ‌రీదైంది కాదు. నువ్వు నాకు చాలా ముఖ్యం. అని రాసి ఉంది. భార్య‌పై త‌న ప్రేమ‌ను అత‌ను వ్య‌క్త‌ప‌రిచిన విధానం, వ‌స్తువు కంటే త‌ను అత్యుత్తంగా ప్రేమించే వ్య‌క్తే ముఖ్య‌మ‌ని అత‌ను చెప్ప‌డం వాళ్ల సంబంధాన్ని పటిష్ఠం చేస్తుంది. అటువంటి సంబంధాల‌ను నిర్మించుకోవ‌డం, మీరు బాగా ప్రేమించే వ్య‌క్తుల‌కు మీ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ వాళ్ల‌తో స‌రైన బంధం ఏర్ప‌రుచుకోవ‌డం మీ జీవితంలో చాలా ముఖ్యం.

 

 

గుడి మెట్ల‌కు కోర్టు మెట్ల‌కు తేడాను గుర్తించాలి!

 

ఈ ఆధునిక యుగంలో మాన‌వ సంబంధాల‌ను స‌రిగా నిర్వ‌హించుకోలేక చాలా మంది విఫ‌ల వ్య‌క్తులుగా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా యువ జంట‌లు చిన్న స‌మ‌స్య రాగానే విడాకుల కోసం కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. స‌మ‌స్య‌ను సామ‌రస్యంగా ప‌రిష్క‌రించుకుని సంబంధాల‌ను తిరిగి నెల‌కొల్పుకుందామ‌న్న రాజీ ధోర‌ణి కాన‌రావ‌డం లేదు. ఇదే ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం. ప్రతీ పంట‌లో క‌లుపు మొక్క‌లు ఎలా అయితే వ‌స్తాయో ప్ర‌తీ సంబంధాల్లోనూ అపోహ‌లు, అపార్ధాలు అలానే వ‌స్తాయి. క‌లుపు మొక్క‌ల‌ను తీసేసి వ్య‌వ‌సాయాన్ని ఎలా అయితే కాపాడుకుంటామో అపార్ధాల‌ను తొలిగించుకుని సంబంధాల‌ను కూడా అలానే కాపాడుకోవాలి. మ‌న‌కు ఏమైనా చిన్న బాధ వ‌చ్చిన‌ప్పుడు, క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌శాతంగా ఉంటే మ‌న ఇష్ట‌దైవం చెంత‌కు వెళతాం క‌దా? అక్క‌డ మ‌న గోడు విని స‌మాధానం చెప్ప‌ని దేవుడు ఉన్నా కాస్త ప్ర‌శాంతంగా ఆలోచిస్తే బంధం యొక్క విలువు తెలుస్తుంది. అదే కోపంతో, ఆవేశంతో కోర్టుకు వెళితే అక్క‌డ మీ మాట వినే జ‌డ్జీలు మీ బంధానికి ముగింపు ప‌లుకుతారు. జీవితంలో అన్నింటిక‌న్నా సంబంధాలే ముఖ్య‌మ‌ని , మ‌న‌ల్ని బాగా ప్రేమించే మ‌నుష్యులే ముఖ్య‌మ‌ని గుర్తిస్తేనే మ‌నుగ‌డ సాధ్యం.

 

 

సంబంధం అనే అకౌంట్ లో ప్రేమ‌ను క్రెడిట్ చేయండి!

 

అస‌లు మంచి ప్రేమ పూర్వ‌క సంబంధాన్ని ఎలా నెల‌కొల్పుకోవాలి. అందర్నీ వేధించే ప్ర‌శ్న ఇది. ఎందుకంటే ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కొన్ని సార్లు త‌ప్పులు జ‌రుగుతాయి. అటువంటి మ‌న‌కు ఇష్ట‌మైన వాళ్ల‌తో మ‌న సంబంధం ప్ర‌మాదంలో ప‌డుతుంది. అలా జ‌రగ‌కుండా ఉండాలంటే సంబంధం అనే అకౌంట్ లో వీలున్నన్ని సార్లు ప్రేమ‌ను క్రెడిట్ చేయండి. చిన్న చిన్న‌ త‌ప్పుల‌కు కొంత డెబిట్ అవుతున్నా ప్రేమ అనే క్రెడిట్ అధిక మొత్తంలో ఉన్న‌ప్పుడు మీ సంబంధం అనే అకౌంట్ లో ఎప్పుడూ ఖాతా నిండుగా ఉంటుంది. జీవితం ఆనంద‌మ‌యం కావాలంటే మీరు ప్రేమించే వ్యక్తుల‌తో మంచి సంబంధాల‌ను నెల‌కొల్పుకోవ‌డ‌మే. మీ సంబంధాల‌ను కాపాడుకోండి. మీ ఆనందాన్ని కాపాడుకోండి. ఈ రెండు కాపాడుకుంటే చాలు మీ జీవితం ఇక ఆనంద‌మ‌య‌మే.

 

(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)