ఆ ‘డేంజ‌ర్ జోన్’ లోకి వెళ్తే ఇక అంతే సంగ‌తులు!!

 

ఈ లోకంలో ప్ర‌తీ మ‌నిషి సౌక‌ర్య‌వంత‌మైన‌, భ‌ద్ర‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని కోరుకుంటాడు. అయితే సౌక‌ర్య‌వంత‌మైన‌, భ‌ద్ర‌మైన జీవితం అత‌న్ని ఉన్న‌త స్థితికి చేరుస్తుందా అంటే లేదు అనే స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంది. ఎందుకంటే మ‌నిషి ప్ర‌తీ క్ష‌ణం మ‌నుగ‌డ కోసం, అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల్సిందే. ఒక స్థితికి చేరుకుని విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా..సౌక‌ర్యాల‌కు లొంగిపోయి అక్క‌డే ఉండిపోదాం అనుకున్నా అది అత‌ని వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త‌ ప‌త‌నానికి దారితీస్తుంది. కంఫ‌ర్ట్ జోన్ లోని విలాసాల‌కు, స‌దుపాయాల‌కు ఆక‌ర్షితులు కాకుండా ప్ర‌తీ క్ష‌ణాన్ని పోరాటంలా ఎవ‌రైతే తీసుకుంటారో, స‌వాళ్ల‌కు ఎవ‌రైతే సిద్ధ‌ప‌డ‌తారో వారే నిజ‌మైన విజేత‌లుగా నిలుస్తారు. ప్ర‌స్తుతం యువత‌ను నిర్వీర్యం చేస్తున్న కంఫ‌ర్ట్ జోన్ పై ‘కెరీర్ టైమ్స్ ఆన్ లైన్’ ప్ర‌త్యేక విశ్లేష‌ణ‌.

 

 

కంఫ‌ర్ట్ జోన్ లో ఉంటే డేంజ‌ర్ జోన్ లో ఉన్న‌ట్టే!

 

చాలా మంది వ్య‌క్తులు చిన్న సౌక‌ర్యాల‌కు మ‌రిగి ఒకే స్థాయిలో ఉండిపోయేందుకు సిద్ధ‌ప‌డుతూ ఉంటారు. ఆ కంఫ‌ర్ట్ జోన్ లోంచి బ‌య‌ట‌కు రావ‌డానికి అస‌లు క‌నీస‌మైన ప్ర‌య‌త్నం కూడా చేయ‌రు. అందులోంచి బ‌య‌ట‌కు వ‌స్తే క‌ష్టాలు చుట్టుముడ‌తాయ‌ని, ఇక్క‌డ ప్ర‌స్తుతానికి బాగానే ఉంది క‌దా అన్న ధోర‌ణిలోకి వెళ్లిపోతారు. చివ‌రికి వాళ్లు ఏదైతే డేంజర్ జోన్ అనుకుంటున్నారో అదే డేంజ‌ర్ జోన్ లో చిక్కుకుని జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుకుంటారు. రాము, రాజు ఇద్ద‌రే ఒకే సంస్థ‌లో ఉద్యోగం చేసేవారు. రాముకు రిస్క్ తీసుకోవ‌డం అస్స‌లు ఇష్టం ఉండ‌దు. రాజు అలా కాదు. ఎంత పెద్ద రిస్క్ తీసుకునేందుకు అయినా వెనుకాడ‌డు. అద్దె త‌క్కువ ఉంది అని రాము చాలా దూరం నుంచి ఆఫీస్ కు వ‌చ్చేవాడు. పైగా జీతం త‌క్కువైనా పెద్ద‌గా ప‌ని ఉండ‌ద‌ని అదే ఉద్యోగంలో కొన‌సాగాడు. రాజు మాత్రం అద్దె ఎక్కువైనా ఆఫీస్ తో పాటు అన్ని అవ‌కాశాలు ద‌గ్గ‌రగా ఉన్న మంచి లోకేష‌న్ లో ఉండేవాడు. కొన్ని రోజుల త‌ర్వాత జీతం అంతగా వృద్ధి చెంద‌ని ఆ ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప‌దేళ్లు తిరిగేస‌రికి పెద్ద వ్యాపారవేత్త‌గా ఎదిగాడు.

 

 

ఒకే ద‌గ్గ‌ర ఉండిపోయారంటే ఓడిపోయిన‌ట్టే!

 

రాము, రాజు క‌థ చ‌దివాక మ‌న‌కు తెల‌సింది ఏమిటి? నెల‌కు ఇంత జీతం వ‌స్తుంది. చ‌క్క‌గా ఉంది. అని స్వీయ స‌మ‌ర్ధింపులు చేసుకుంటూ ఒకే ద‌గ్గ‌ర ఉండిపోయే వాళ్లు ఎప్ప‌టికీ జీవితంలో అభివృద్ధిని సాధించ‌లేరు. ఒకే స్థాయిలో ఉండిపోయి చివ‌రికి ఏమీ సాధించ‌కుండానే మిగిలిపోతారు. కానీ రిస్క్ తీసుకుని ధైర్యంతో ముందడుగు వేసే వ్య‌క్తులు ఉన్న‌త స్థితికి చేరుకుంటారు. మొద‌ట్లో త‌మ‌ను ఎవ‌రైతే చూసి హేళ‌న చేసారో, విమ‌ర్శించారో వాళ్లంద‌రినీ దాటుకుని అభివృద్ధిని సాధిస్తారు. బాగా తిని కొమ్మ‌పై చ‌క్క‌గా ఎప్పుడూ కూర్చుని ఉంటే చిలుక కూడా ఎగ‌ర‌లేదు. అలాగే మ‌నిషి నైజం క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం, సుఖానికి , సౌక‌ర్యానికి శ‌రీరాన్ని, మ‌న‌స్సును అల‌వాటు చేస్తే అవి ఎప్ప‌టికీ మీ మాట విన‌వు. చివ‌రికి చిలుక‌లా చ‌లాకీగా ఎగిరే స‌హ‌జ గుణాన్ని కోల్పోతారు. ఏం చేసినా ఎక్క‌డ ఉన్నా ప్ర‌తీ క్ష‌ణం ఏదో సాధించాల‌న్న త‌ప‌నను విడ‌నాడ‌కూడ‌దు. థింక్ బిగ్ అన్న సూత్రాన్ని అటు విద్యార్ధులు, ఇటు ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా అనుక్ష‌ణం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నచోట, ఉన్న స్థితితో ఎప్పుడూ రాజీ ప‌డ‌కూడ‌దు. ఏదో జీవితం బాగానే గ‌డుస్తుంది క‌దా అన్న ఆలోచ‌న మీలో సృజ‌నాత్మ‌క‌త‌ను చంపేసి మీ గొప్ప‌త‌నానికి స‌మాధిగా మారుతుంది. పెద్ద‌గా ఆలోచించాలి. అభివృద్ధి చెందడానికి ఆలోచించాలి. ఆ ఆలోచ‌న‌ను ఆచ‌ర‌ణ‌గా మార్చాలి. ఉన్న‌తంగా ఎద‌గాలి.

 

 

సేఫ్టీ జోన్ నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఏం చేయాలి?

 

        మనిషి ప‌రిణామ క్ర‌మంలోనే సవాళ్ల‌ను ఎదుర్కొనే శ‌క్తి ఉంది. యితే అభివృద్ధిలో భాగంగా చిన్న చిన్న ల‌క్ష్యాల‌నే గొప్పవిగా ఊహించుకుంటూ, ఉన్న స్థితిని అల‌వాటుగా మార్చుకుంటూ స్వీయ త‌ప్పిదాల‌కు పాల్ప‌డుతున్నాం. ఒక విధంగా కంఫ‌ర్ట్ జోన్ లో ఉండ‌టం అంటే మ‌న జీవితం ముగిసిన‌ట్టే. కొత్త స‌వాళ్లు, కొత్త వ్యూహాలు, కొత్త ఆలోచ‌న‌లు ఇవేమీ లేకుండా నిస్సార‌మైన జీవితాన్ని బాగుంది, భ‌లే ఉంది అన్న భ్ర‌మ‌ల్లో చాలా మంది ఉండిపోతున్నారు. కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోకుండా దాన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మ‌న‌కు మ‌న‌మే కొన్ని స్వీయ ప‌రీక్ష‌లు పెట్టుకోవాలి. కొంచెం క‌ఠినంగా, ఇంకొంచెం విచిత్రంగా, నిజంగా ఇలా కూడా చేయొచ్చా అనిపించినా ఈ కింద మ‌నం చెప్పుకుంటున్న ప‌నులు చేస్తే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

1. జేబులో ఉన్న చివ‌రి రూపాయి కూడా ఖ‌ర్చు పెట్టేయ్ ( మ‌ళ్లీ డ‌బ్బు సంపాదించుకోగ‌ల‌ను అన్న న‌మ్మ‌కం మిమ్మ‌ల్ని న‌డిపిస్తుంది)

 

2. అవ‌స‌రం ఏర్ప‌డిన‌ప్పుడు అప్పులు చేసేందుకు వెనుకాడొద్దు. నీకు అప్పు దొర‌క‌ని ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు నువ్వు మ‌రింత‌గా రాటుదేలుతావు.

 

3. ఒక ప‌నిని చివ‌రి నిమిషం వ‌ర‌కూ వాయిదా వేసి చివ‌రి నిమిషంలో నీ స‌ర్వశ‌క్తులూ ఒడ్డి పూర్తిచేయ్

 

4. ట్రైన్, బస్, ఫ్లయిట్, సినిమా ఇలాంటి టిక్కెట్స్ ముందుగా కాకుండా అప్ప‌టిక‌ప్పుడు దొర‌క‌పుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

 

5. ఒక ఉద్యోగంలో ఉంటూ వేరే ఉద్యోగంలోకి మారాల‌నుకున్న‌ప్పుడు వెంట‌నే ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పుడు కొత్త ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టండి.

 

6. జేబులో చివ‌రి రూపాయి వ‌ర‌కూ ఖ‌ర్చ‌పెట్టేయ్. ఆ రోజు అవ‌స‌రాల‌కు ఎలా సంపాదించుకోవాల‌న్న విష‌యాన్ని సీరియ‌స్ గా ఆలోచించి అందులో విజ‌యం సాధించు.

 

 

        ఇవ‌న్నీ కంఫ‌ర్ట్ జోన్ నుంచి మిమ్మ‌ల్ని బ‌య‌ట‌ప‌డేసి మీ మెద‌డు చురుగ్గా ప‌నిచేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జీవితం యొక్క ప‌ర‌మార్ధం, డ‌బ్బు విలువ తెలిసేలా చేస్తాయి. ఇవి కొన్ని రోజులు మాత్ర‌మే చేయ‌వ‌ల‌సిన ప‌నులు. కంఫ‌ర్ట్ జోన్ లోని ప్ర‌మాదాన్ని అర్ధం చేసుకున్నాక మీరు ఇలాంటి ప‌నులు చేయ‌కుండా మీ విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుకుంటూ ఉన్న స్థాయి నుంచి ఉన్న‌త స్థాయికి చేరుకునేందుకు మీర‌నుకున్న డేంజ‌ర్ జోన్ మీకు కంఫ‌ర్ట్ జోన్ గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంక చాలు… నాకు ఇక్క‌డ బాగుంది.. అన్న ఆలోచ‌నల‌ను మీ మెద‌డులోకి అస్స‌లు రానీయ‌కుండా చూసుకొండి. ఇంక చాలు అన్న‌ది మ‌న చురుకుద‌నాన్ని, ఉత్సాహాన్ని చంపేసి మ‌న‌ల్ని ప‌త‌నం దిశ‌గా తీసుకువెళుతుంది.

 

ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్సాన్స‌ర్ చేస్తున్న‌వారు