విన‌య విధేయ రామ..ఇప్పుడే ఎందుకు?

 

 

మాతృస్వామ్య వ్య‌వ‌స్థ నుంచి నేటి పితృస్వామ్య వ్య‌వ‌స్థ వ‌ర‌కూ ఆడ‌, మ‌గ మ‌ధ్య విభిన్న కార‌ణాల రీత్యా సంఘ‌ర్ష‌ణ జ‌రుగుతూనే ఉంది. ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నాలు, అణిచివేత‌పై తిరుగుబాట్లు, ఆచారాల సంకెళ్ల‌ను తెంపుకునే ఆరాటాలు, స్వీయ గుర్తింపు కోసం పాకులాట‌లు ఒక‌వైపు.. స్వ‌యంప్ర‌తిప‌త్తి విచ్చ‌ల‌విడిత‌నం అనే క‌ట్టుబాట్లు, బాధ్య‌త‌ల చ‌ట్రంలో ఇరికించే ప్ర‌య‌త్నాలు, సొంత ఆస్తిలా భావించే ఆలోచ‌న‌లు మ‌రోవైపు. అయినా ఎన్ని విభేధాలున్నా ప‌ర‌స్ప‌ర ఆక‌ర్ష‌ణ‌, ప్రాకృతిక ఆదేశాలు, సృష్టి ధ‌ర్మం ఆడ‌, మ‌గ‌ను ఎప్పుడూ క‌లిపే ఉంచుతాయి. శారీర‌క ధ‌ర్మాల విష‌యంలో వ్య‌త్యాసాలు, శ‌క్తి సామ‌ర్ధ్యాల విష‌యంలో హెచ్చుత‌గ్గుల నేప‌థ్యంలో బాధ్య‌త‌ల‌ను, బంధాల‌ను విభ‌జించుకుని కొన్ని నియ‌మాలు ఆధారంగా ప‌ర‌స్ప‌ర జీవ‌నం సాగిస్తున్నారు. అయితే గ‌డిచిన కొన్నాళ్లుగా మ‌హిళ‌లు ఆ నియ‌మాల‌ను, ఆంక్ష‌ల‌ను, అణిచివేత‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఏ విష‌యంలోనూ తాము పురుషుల‌కు తీసిపోమ‌ని చెపుతూ లింగ స‌మాన‌త్వం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు పురుషులు చేసేవి అకృత్యాలు, అన్యాయాలు అంటూ గ‌ళం విప్పుతున్నారు. అయితే చేసే పోరాటంలో నిబ‌ద్ధ‌త కొర‌వ‌డ‌టం, స్వార్ధ ప్ర‌యోజ‌నాలు, ద్వేషం త‌ప్ప ద్యేయం లేక‌పోవ‌డం ఇప్పుడు మ‌హిళా పోరాటాల‌కు విలువ లేకుండా చేస్తున్నాయి.

 

 

‘మీటూ’ అటు తిరిగి ఇటు తిరిగి ఎటో వెళ్లిపోయింది !

 

తాజాగా మ‌న దేశంలో మీటూ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సింది. ప్ర‌స్తుతం ఉన్న‌త స్థానాల్లో ఉన్న చాలా మంది మ‌హిళ‌లు ఒక‌ప్పుడు తామ లైంగిక వేధింపులను గురి అయ్యామంటూ గ‌ళ‌మెత్తారు. ముఖ్యంగా న‌టీమణులు, జ‌ర్న‌లిస్ట్ లు తాము లైంగిక దాడికి గుర‌య్యామ‌ని వివ‌రించారు. అప్ప‌ట్లో కెరీర్ ముఖ్యం కాబ‌ట్టి నోరు విప్ప‌లేక‌పోయామ‌ని, ఇప్పుడు సంద‌ర్భం వ‌చ్చింది కాబ‌ట్టి బ‌హిరంగం చేస్తున్నామ‌ని చెప్పారు. కానీ ఈ ఉద్య‌మంలో నిజాయితీ కంటే స్వార్ధ ప్ర‌యోజ‌నాలు, క‌క్ష్య పూరిత చ‌ర్య‌లు అధికం కావ‌డంతో మీటూ ఉద్య‌మం ఎంత వేగంగా ఎగిసిందో అంతే వేగంగా చ‌ల్ల‌బ‌డిపోయింది. చాలా మంది మ‌హిళ‌లు చేసిన ఆరోప‌ణ‌ల‌కు సాటి మ‌హిళ‌లే మ‌ద్ధ‌తు ఇవ్వ‌ని ప‌రిస్థితులు ఉన్నాయి. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఒక పురుషునితో మంచిగా ఉండి, ఇష్ట‌పూర్వ‌కంగా అన్ని విష‌యాల్లో వ్య‌వ‌హ‌రించి ఇప్పుడు అవ‌న్నీ బ‌ల‌వంతంగా చేసిన‌వ‌ని చెప్ప‌డం స‌త్యదూరంగా ఉండ‌టం మీటూ ఉద్య‌మాన్ని చుల‌క‌న చేసింది. ఆరోప‌ణ‌లు చేసిన వెంట‌నే ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయ‌లేదు అన్న ప్ర‌శ్న త‌క్షణం ఎదుర‌వుతోంది. అప్పుడు నిస్స‌హాయిరాలిని, ప‌రిస్థితులుకు కొత్త‌, అంత ధైర్యం లేదు అన్న స‌మాధానాల్లో కొన్ని నిజాలే అయిన‌ప్ప‌టికీ గ‌డిచిన‌ కాలంతో పాటు ఆ నిజాల‌కు కూడా విలువ లేకుండా పోతోంది.

 

 

మ‌న పురాణాల్లోనూ ‘మీటూ’ ఉంది!

 

లైంగిక అవ‌స‌రాలు స్త్రీ, పురుషులు ఇద్ద‌రికీ స‌మాన‌మే అయిన‌ప్ప‌టికీ పురుషుడు బ‌ల‌వంతుడు కాబ‌ట్టి కొన్నిసార్లు స్త్రీ ఇష్టానికి వ్య‌తిరేకంగా అత్యాచారం చేసే వీలుంది. దీని వ‌ల‌న స‌హ‌జంగానే మ‌హిళ‌ల‌పై కాస్త సానుభూతి, చ‌ట్ట‌ప‌రంగా అనుకూల‌త‌లు ఉంటాయి. ఎందుకంటే బ‌ల‌హీనుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం మ‌న నాగ‌రిక జీవనంలో పెట్టుకున్న మొద‌టి నియ‌మం. అయితే ప‌ర‌స్ప‌ర ఇష్టపూర్వ‌కంగా కొన‌సాగించే సంబంధాల‌ను అవి బెడిసికొట్టాక‌ బ‌ల‌వంత‌పు చ‌ర్య‌గా స్వార్ధ‌పూరితంగా ఆరోపించ‌డమే ఇప్పుడు స‌మ‌స్య‌. మ‌న పురాణాల్లో చూసుకుంటే నిష్ఠ‌గా త‌ప‌స్సు చేసే రుషి పుంగ‌వుల ద‌గ్గ‌ర‌కు ఇంద్రుడు రంభ‌, ఊర్వ‌శి, మేన‌క వంటి అంద‌గ‌త్తెల‌ను పంప‌డం త‌ర్వాత వాళ్ల‌తో ఆరోప‌ణ‌లు చేయించ‌డం, వాళ్ల విశ్వ‌స‌నీయ‌త‌ను, వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీయడం ఇలాంటివి జ‌రిగేవి. అయితే ఇద్ద‌రు స్త్రీ , పురుషులు మ‌ధ్య ప‌ర‌స్ప‌ర అంగీకారంతో జ‌రిగిన ఒక విష‌యాన్ని కేవ‌లం ఒకే వ్య‌క్తి త‌ప్పుగా చిత్రీక‌రించి కేవ‌లం పురుషుల ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీయడం అప్ప‌టి నుంచే జ‌రుగుతోంది. ఒకవైపు స్త్రీ పురుష స‌మాన‌త్వం కోసం మాట్లాడుతూ ఏం చేసినా కేవ‌లం ఒక్క వ్య‌క్తిదే త‌ప్పు అన్న‌ట్టు చిత్రీక‌రించే మ‌న‌స్త‌త్వం ఉన్న‌ప్పుడు స‌మాన‌త్వం ఎలా సాధ్య‌మ‌వుతుంది? నిజంగా త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు లేదా అత్యాచారం జ‌రిగిన‌ప్పుడు క‌చ్చితంగా శిక్ష ప‌డాల్సిందే. కానీ అవ‌స‌రాల కోసం స‌ఖ్యంగా ఉండి ఇద్ద‌రి మ‌ధ్య విభేధాలు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే అది అన్యాయం అంటూ గొంతు చించుకోవ‌డం ఎటువంటి లింగ స‌మాన‌త్వ‌మో, ఎటువంటి నిబ‌ద్ధ‌త ఉన్న పోరాట‌మో కొంద‌రు స్త్రీలు ఆలోచిస్తే బాగుంటుంది. మ‌రోవైపు మీటూ ఉద్య‌మం ద్వారా లాభ‌ప‌డిన మ‌హిళ‌ల సంగతి ఏమో కానీ న‌ష్ట‌పోయిన, పోతున్న మ‌హిళ‌లే ఇప్పుడు ఎక్కువ‌గా క‌న‌నిస్తున్నారు. ఈ ఉద్య‌మం నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు, వారికి ఉన్న‌త స్థానం క‌ల్పించేందుకు బ‌డా కంపెనీలు సైతం భ‌య‌ప‌డుతున్నాయి. ఎందుకు వ‌చ్చిన చిక్కు అనుకుంటున్నాయి. బ‌య‌ట‌కి అటువంటిదేమీ లేదని చెపుతున్నప్ప‌టికీ వాస్త‌వ ప‌రిస్థితి మాత్రం ఇలానే ఉంద‌ని చాలా మంది మ‌హిళ‌లు వాపోతున్నారు. మ‌రోవైపు మీటూతో వేధింపులు ఆగాయోమో కానీ సాధింపులు మాత్రం పెరిగాయి. చేసిన ప‌నినే మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్ప‌డం, ప‌నిచేస్తున్నా ఇంకా ప‌ని అప్ప‌గించ‌డం వంటి వేధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారు పెరిగారు. దీంతో కెరీర్ ను ఎలా కొన‌సాగించాలా అని చాలా మంది మ‌హిళ‌లు మ‌ధ‌న ప‌డుతున్నారు.

 

 

అడ్డుగోడ‌లు క‌ట్టేస్తూ, ద్వేషిస్తూ స‌మాన‌త్వం ఎలా సాధిస్తారు?

 

ఇప్పుడు మ‌నం ప్ర‌భుత్వ బ‌స్సుల్లో చూస్తే స్త్రీల సీట్ల‌కు పురుషుల సీట్ల‌కు మ‌ధ్య ఒక అడ్డు గోడ లాంటి ప్ర‌త్యేక ఏర్పాటును చేసారు. అలాగే చాలా స్కూళ్ల‌లో, కాలేజీల్లో స్త్రీ, పురుషుల‌కు వేరు వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్త్రీ, పురుష స‌మాన‌త్వం సాధిస్తాం అని చెపుతున్న ప్ర‌భుత్వాలు ఇలా చిన్నత‌నం నుంచే వాళ్ల మ‌ధ్య విభ‌జ‌న రేఖ గీస్తూ మాన‌సికంగా దూరం పెంచుతున్నారు. అబ్బాయిలు అంటే మంచి వాళ్లు కాదు అన్న అభిప్రాయం ఏర్ప‌రుచుకున్న ఆడ‌పిల్ల‌లు రేపు వాళ్ల‌తో స‌ఖ్యంగా ఎలా ఉండ‌గ‌ల‌రు. ఒక మ‌గ‌పిల్ల‌వాడికి ఆడ‌పిల్ల‌ను గౌర‌వించ‌డం, జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డం నేర్పించ‌డం ఎంత ముఖ్య‌మో..అలాగే ఒక ఆడ‌పిల్ల‌కు కూడా మ‌గ‌పిల్ల‌ల‌ను గౌర‌వించ‌డం నేర్పించాలి. ఎందుకంటే ఆమె జీవితంలో ప్రతీ మ‌లుపులోనూ మ‌గ‌వాడు ఉంటాడు. తండ్రి, అన్న‌య్య‌, త‌మ్ముడు, స్నేహితుడు, భ‌ర్త ఇలా ఆమె జీవితాంతం మ‌గ‌వాళ్ల‌తోనే బ‌త‌కాలి. అటువంట‌ప్పుడు మ‌గ‌వాళ్ల‌ను ద్వేషించే ప‌రిస్థితులు క‌ల్పిస్తే ఎంతసేపు గొడ‌వ పెట్టుకునే మ‌నస్త‌త్వంలోనే కూరుకుపోతారు. ఇక‌ సామ‌ర‌స్యంగా ఉండి జీవితాన్నిఎలా ఆనంద‌మ‌యం చేసుకుంటారు? ఎవ‌రో ఒక‌రు త‌ప్పు చేసార‌ని మొత్తం అంద‌ర్నీ అనుమానంగా చూడ‌టం, అగౌర‌వంగా ఉండ‌టం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు? మ‌ంచికి చెడుకి ఎప్పుడూ లింగ‌భేధం ఉండ‌దు. మ‌గ‌వాళ్ల‌లో చెడ్డ‌వాళ్లు ఉన్న‌ట్టే ఆడ‌వాళ్ల‌లోనూ చెడ్డ‌వాళ్లు ఉంటారు. అంద‌ర్నీ ఒకే గాటిన క‌ట్ట‌డమే స‌మ‌స్య‌కు మూల కార‌ణం.

 

 

విన‌య విధేయ రాముళ్లు ఎక్కువయ్యారు!

 

మీటూ ఉద్య‌మం ఎప్పుడూ ప్రారంభ‌మైందో అప్పుడే మ‌గ‌వాళ్ల‌లో భ‌యం ప్రారంభ‌మైంది. ఏ క్ష‌ణాన ఏ ఆరోప‌ణను ఎదుర్కోవాల్సి వ‌స్తుందోన‌ని చాలా మంది భ‌య‌ప‌డ్డారు. ఆడ‌వాళ్ల‌తో ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారు మ‌న‌కెందుకు వ‌చ్చిన గొడ‌వ అనుకుంటూ దూరంగా జ‌రిగి విన‌య విధేయ రామ త‌ర‌హాగా మారిపోయారు. గ‌తంలో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో సంబంధాల‌ను కొనసాగించిన వారు, ఇప్పుడు స‌మాజంలో మంచి స్థానంలో ఉన్న‌వారు ఆందోళ‌న చెందారు. ఒక మ‌హిళ‌కు నిజంగా అన్యాయం చేసినవారు శిక్ష అనుభ‌వించాల్సిందే. ఇందులో రెండో మాట‌కు తావు లేదు. కానీ ఒక అంగీకారంతో ఒక సంబంధాన్ని కొన‌సాగించిన‌ప్పుడు అందులో ఏమోష‌న్స్ ఉండ‌వు. ఎందుకంటే ఒప్పందం అంటే వ్యాపారం , వ్యాపారంలో లాభ‌న‌ష్టాలే ఉంటాయి కానీ ఎమోష‌న్స్ ఉండ‌వు. అది ఆడ అయినా మ‌గ అయినా ప్ర‌తీ ఒక్క‌రికి త‌మ హ‌ద్దులు తెలియాల్సిందే. ఎవ‌రి హ‌ద్దులో వాళ్లు ఉన్న‌ప్పుడు ఎటువంటి స‌మ‌స్య‌లు రావు. ఒక‌రి హ‌ద్దుల గోడ‌ను బ‌ద్ద‌లు కొట్టుకుని ఎవ‌రూ మీ కోట‌లోకి రాలేరు. అలా వ‌చ్చారంటే అది మీరు ఇచ్చిన అనుమతి మాత్ర‌మే. నైతిక విలువ‌లు నేర్చుకుని ప్ర‌తీ మ‌నిషినీ గౌర‌విస్తూ ఎవ‌రి హ‌ద్దులో వాళ్లు ఉంటే ఎవ‌రికీ ఎటువంటి స‌మ‌స్య‌లూ రావు. ఇలా గొంతుచించుకునే మీటూ ఉద్య‌మాలు కూడా అవ‌స‌రం లేదు.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)