ఇంటర్వ్యూకు వెళ్లే ముందు వీటిని సరిచూసుకోండి!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఉద్యోగం సంపాదించడం అంటే ఆషామాషీ విషయమేమీ కాదు. నైపుణ్యతకు, నాయకత్వ లక్షణాలకు పెద్ద పీట వేస్తున్న కంపెనీలు నాణ్యమైన అభ్యర్ధులను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు అభ్యర్ధుల్లో భయాన్ని కలిగిస్తోంది. ఇంటర్వ్యూకు వెళ్లినా ఉద్యోగం వస్తుందా రాదా అన్న ఆందోళన చాలా మందికి ఒత్తిడిని కలిగిస్తోంది. అయితే ఆ ఒత్తిడిని అధిగమించి ధైర్యంగా తన నైపుణ్యాలను ప్రదర్శించే వారే ఇంటర్వ్యూలో విజయం సాధించి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఇంటర్వ్యూను విజేతలు కావాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలపై పూర్తిగా పట్టు సాధించాలని హెచ్ఆర్ నిపుణులు చెపుతున్నారు. లేటేస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా వీటిని పదును పెట్టుకుంటే కచ్చితంగా జాబ్ సాధించేందుకు అవకాశాలు మెరుగవుతాయి.

 

సంపూర్ణ అవగాహన చాలా అవసరం!

 

 

ఒక కంపెనీకి ఇంటర్వ్యూకు వెళుతున్నప్పుడు అభ్యర్ధులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఏదైతే కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్తున్నారో ఆ కంపెనీపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఆ కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆ కంపెనీ నిర్వహిస్తున్న కార్యకలాపాలు, వాళ్ల లక్ష్యాలు ఇలా అన్ని విషయాలపై ఒక నాలెడ్జ్ ను సంపాదించాలి. ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ గూర్చి మీకు ఏం తెలుసున్నదే అక్కడ కీలకంగా మారుతుంది. ముఖ‌్యంగా ఈ కంపెనీలో నిర్దేశించిన విధులకు తాను ఏ విధంగా న్యాయం చేయగలను అన్న విషయాన్ని అభ్యర్ధి సావధానంగా చెప్పాల్సి ఉంటుంది. దీని వలన కంపెనీ తన నుంచి ఏ ఆశిస్తుందో అన్న విషయంపై పూర్తి సాధికారత వస్తుంది. ఇలా ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ పూర్తి సమాచారం , అవగాహన మీ దగ్గర ఉన్నప్పుడు మీరు జాబ్ విష‍యంలో ఎంత సీరియస్ గా ఉన్నారన్న విష‍యం ఇంటర్వ్యూ చేసేవాళ్లకి అర్ధమవుతుంది.

 

 

కంపెనీకి అనుగుణంగా సీవీ!

 

చాలా మంది అభ్యర్ధులు ఒక సీవీ ని రెడీ చేసుకు పెట్టుకుని దాన్నే ప్రతీ ఇంటర్వ్యూకు తీసుకెళ్తారు. ఇది సరైన పద్ధతి కాదు. మనం ఇంటర్వ్యూకు వెళుతున్న కంపెనీ, అక్కడి పొజిషన్ ఆధారంగా సీవీని ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. చూడగానే సీవీ ఆకట్టుకునేలా ఉండాలి. సంక్షిప్తంగా సింపుల్ ఇంగ్లీష్ లో సీవీ ఉండాలి. అనవసర ఆడంబరాలు, డాంబికాలు లేకుండా సీవీని చాలా శ్రద్ధగా తయారు చేసుకోవాలి. అప్పటివరకూ సాధించిన అచీవ్‌మెంట్స్ ను చిన్న చిన్న వాక్యాలతో రాసుకుంటే చూసిన వారిని ఈజీగా అర్ధమవుతుంది. అలాగే వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలను బుల్లెట్ పాయింట్స్ తో రాసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగా సీవీలో అబద్ధాలకు, అతిశయోక్తులకు చోటు లేకుండా చూసుకోవాలి.

 

కమ్యూనికేషన్ మెరుగుపర్చుకోవాలి!

 

అసలు ఇంటర్వ్యూ అంటే ఏమిటి? ఒక అభ్యర్ధిలోని సత్తాను, సామర్ధ్యాన్ని గుర్తించే ప్రక్రియ. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ఒక వ్యూహం ప్రకారం బెరుకు లేకుండా సమగ్రంగా సమాధానాలు చెప్పాలి. అలా చెప్పాలి అంటే అభ్యర్ధులు కమ్యూనికేషన్ వ్యూహం ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఇంటర్వ్యూ చేసే వాళ్లు ఏమి అడుగుతున్నారు. అన్న దాన్ని చూసుకుని ప్రశ్నకు తగ్గ సమాధానాన్ని చాలా క్లుప్తంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెపుతున్న సమాధానాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ అంశాలపై పట్టు ఉన్న వారికి జాబ్ రావడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు.

 

 

సోషల్ మీడియా, జాబ్ పోర్టల్స్ పరిశీలన!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో కూడా సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అభ్యర్ధుల ప్రొఫైల్ ను చూసే ఉద్యోగాన్ని ఇచ్చే కంపెనీలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రొఫైల్ ను ప్రొఫెషనల్ గా తయారు చేసుకోవడంపై అభ్యర్ధులు దృష్టిపెట్టాలి. ఎటువంటి వివాదాలు, లోపాలు లేకుండా సోషల్ మీడియా ప్రొఫైల్, వ్యక్తిగత పేజ్ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. తనకు సంబంధించిన రంగంపై చేస్తున్న పోస్ట్ లు, అభిప్రాయాలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి మంచి కంపెనీలో మంచి జాబ్ కావాలంటే సోషల్ మీడియా ప్రొఫైల్ పై కూడా దృష్టి పెట్టాలి.

 

ఇంప్రెషన్, ఫాలోఅప్ కూడా కీలకం!

 

ఇంటర్వ్యూలో గెలుపు సాధించామా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇంటర్వ్యూ చేసేవాళ్లకు అభ్యర్ధులు మంచి ఇంప్రెషన్ ను కలిగించాలి. చెప్పిన సమయానికి ఇంటర్వ్యూకు రావడం, మంచి డ్రెస్సింగ్, కాన్ఫిడెన్స్, ఐ కాంటాక్ట్, చెప్పే విషయంలో క్లారిటీ, గతంలో సాధించిన అచీవ్‌మెంట్స్ పై ఆచితూచి మాట్లాడటం వంటివి అభ్యర్ధులపై మంచి ఇంప్రెషన్ ను కలిగిస్తాయి. ఇంటర్వ్యూలో చేసే వాళ్లకు మంచి ఇంప్రెషన్ కలిగించారంటే ఉద్యోగం వచ్చినట్టే. కంపెనీ మీ నుంచి ఏం ఆశిస్తుందో సూచన ప్రాయంగా తెలియజేస్తుంది. దాన్ని అర్ధం చేసుకుని తుది ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలి. అలాగే ఫాలోఅప్ ను మిస్ కాకుండా చూసుకోవాలి. ఆ కంపెనీలో అవకాశం ఉందా అని అడగటం ద్వారా మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటే కంపెనీకి అదనపు లాభం చేకూరుతుందని వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పగలగాలి.

 

(ఈ ఆర్టికల్  ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)