ఈ త‌ప్పులు చేస్తే మీరు గొప్ప‌వాళ్లు కావ‌డం ఖాయం!

 

ఈ టైటిల్ ను చ‌ద‌వ‌గానే త‌ప్పులు చేస్తే గొప్ప‌వాళ్లు కావ‌డం ఏంటి? అన్న అనుమానం మీకు త‌ప్ప‌క క‌లుగుతుంది. ఆ త‌ర్వాత ప్ర‌య‌త్నించ‌డం అంటే త‌ప్పులు చేయ‌డ‌మే క‌దా? అన్న ఆలోచ‌న చేస్తారు. అయితే మ‌నం ఇప్పుడు మ‌నం చ‌ర్చించుకుంటున్న విష‌యం త‌ప్పుల నుంచి కొత్త విష‌యాలను వేగంగా నేర్చుకోవ‌డం. జీవితం అనేది అనుభ‌వాల స‌మాహారం. మ‌న‌కు ఎదురైన అనుభ‌వాలు, స‌వాళ్లే మ‌న‌ల్ని విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులుగా నిల‌బెడ‌తాయి. అయితే మ‌న సొంత అనుభ‌వాల నుంచి మాత్ర‌మే నేర్చుకుందాం అనుకుంటే విలువైన స‌మ‌యం వృధా అవుతుంది. అదే అనుభ‌వ‌జ్ఞుల అనుభ‌వాల నుంచి పాఠాల‌ను తీసుకుని వాటి ఆధారంగా ప్రయత్నం చేసి ఆ క్రమంలో తప్పులు చేసి వాటిని వేగంగా సరిదిద్దుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఒక విజయవంతమైన వ్యక్తి జీవితం నుంచి మనం ఎటువంటి సారాంశాన్ని సంగ్రహించాం..దాన్ని ఎంత వరకూ అమలు చేయగలిగాం..అన్న రీతిలో ప్రణాళిక వేసుకుని ముందు సాగితే తక్కువ సమయంలో ఎక్కువ తప్పులు చేసి వాటికి పరిష్కార మార్గాలు కనుక్కుని స్వల్ప కాలంలోనే విజేతగా నిలిచేందుకు అవకాశం ఉంటుంది.

 

 

సమయం లేదు మిత్రమా!

 

ఈ ఆధునిక యుగంలో చేసే పనిని వేగంగా పూర్తి చేయాలి. ఏ మాత్రం ఆలస్యం జరిగినా మనల్ని పక్కకు తోసుకుంటూ వందలాది మంది ముందుకు వెళ్లిపోతారు. పోటీలో మనం వెనకబడి పోతాం. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు అది పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక పనిని, ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నప్పుడు దాన్ని సాధించడం అన్నది అంత సులభమైన విషయం కాదు. ప్రతీ రోజూ ఏదో ఒక తప్పు చేసేస్తూ ఉంటాం. అసలు తప్పు చేస్తేనే మనం సరైన దారిలో ఉన్నట్టు. అయితే ఆ అనుభవం నుంచి పాఠాల నేర్చుకుందాం. మెల్లగా నేర్చుకుందాం అంటే ఇప్పుడు కుదిరే పని కాదు. అందుకే విజేతల జీవితాలను వాళ్ల అనుభవాలను కేస్ స్టడీస్ గా తీసుకుని వాళ్లు 2 ఏళ్లలో చేసిన పనిని మీరు 2 నెలల్లో, అలాగే వాళ్లు 20 ఏళ్లలో పూర్తి చేసిన పనిని మీరు 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే ఈ పోటీలో మీరు నెగ్గుకు రాగలరు. తీరిగ్గా స్వీయ అనుభవాల నుంచి నేర్చుకుందామంటే రేస్ లో మీరు చివరి నిలవడం ఖాయం. కాబట్టి సమయం లేదు పనిని ఇప్పుడే మొదలు పెట్టాలి. స్ఫూర్తి పొందాలి. ప్రణాళిక వేసుకోవాలి. తప్పులు చేయాలి.కానీ వాటిని త్వరగా చేసేసి త్వరగా విజయ శిఖరాన్ని చేరుకోవాలి.

 

 

తీసుకోవాల్సింది అనుభవాలను మాత్రమే!

 

మనం వేగంగా ఫలితాలు సాధించాలంటే విజయవంతమైన వ్యక్తుల అనుభవాలను తీసుకుని కేస్ స్టడీ చేసి ముందుకు సాగాలని మనం చెప్పకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మనం వాళ్ల నుంచి స్ఫూర్తి పొందాలి..వాళ్ల ప్రయాణాన్ని అధ్యయనం చేయాలి. అంతేకానీ వాళ్లు చేసిన పనిని మీరు కూడా చేయాలి అనుకోకూడదు. ఎవరో చేసిన పనిని నువ్వు చేస్తే ఎప్పటికీ విజేతవు కాలేవు. నువ్వు విభిన్నమైన ఒక కొత్త పనిని ప్రారంభించి దాని కోసం కష్టపడాలి. దాని కోసం విజేతల ప్రయాణంలోని అనుభవాలను అధ్యయనం చేయాలి. త్వరగా నేర్చుకోవాలి. కానీ చివరికి నీ గమ్యం, నీ లక్ష్యం నీవే. అవి వేరే వాళ్లలా ఎప్పుడూ ఉండకూడదు. నీవు చేస్తున్న పనిలో , నీ ప్రయాణంలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఈ విషయాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ నిరంతరం లక్ష్య సాధన కోసం కృషి చేస్తే విజయం త్వరగా వరిస్తుంది.

 

 

చేసే పనిని కొత్తగా చేయడమే విజయం!

 

ఒక ప్రముఖ ఇంగ్లీష్ రచయిత చెప్పినట్టు విజేతలు ఎప్పుడూ ఎవరూ చేయని కొత్త కొత్త పనులు చేయరు..చేసే పనినే కొత్తగా చేస్తారు. ఈ మాటను ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఒక లక్ష్యాన్ని, ఒక పనిని ఎంచుకుని దాన్ని విభిన్నంగా, వినూత్నంగా చేయడమే విజయం అంటే. ఫలానా పని చేసి ఒకతను విజయవంతంఅయ్యాడని మనం కూడా అలాంటి పనిని చేయాలనుకోవడం మనల్ని వైఫల్యానికి చేరువ చేస్తుంది. అతను చేసిన పనిని తీసుకో..దాన్ని కొత్తగా ఎలా చేయగలవో ఆలోచించు..అతని అనుభవాలను, తప్పులను గమనించు. వాటి ఆధారంగా తక్కువ సమయంలో విజయం సాధించు. ఇదే సూత్రం. ఒక స్వల్పకాలిక లక్ష్యం పెట్టుకుని తప్పులు జరుగుతున్నా, నిరాశ కలిగిస్తున్నా అధైర్యపడకుండా ముందుకు సాగాలి. చేయాల్సిన తప్పులు అన్నీ చేసేయ్. వాటి నుంచి విలువైన పాఠాలు నేర్చుకో. కానీ చేయాల్సింది తొందరగా చెయ్.

 

 

విద్యా విధానంలోనే దీనికి బీజం పడాలి!

 

మన విద్యా వ్యవస్థలో ఒక లోపం ఉంది. ఒక ఉపాధ్యాయుడు తాను కోర్సులో భాగంగా నేర్చుకున్న విషయాలనే విద్యార్ధులకు భోధిస్తాడు. ప్రశ్నలు, సమాధానాలు అన్నీ రెడీగా ఉంటాయి. దీంతో విద్యార్ధి కేవలం బట్టి పట్టడం, పుస్తకాలను చూసి సమాధానాలు రాయడం వరకు మాత్రమే పరిమితమవుతున్నాడు. అలా కాకుండా పాఠ్య పుస్తకాల్లో సమాధానాలు లేని కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటిని సమాధానం తీసుకురండి అన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. వాళ్లు సమాధానం కోసం ప్రయత్నం చేస్తారు. వెతుకుతారు.. అడుగుతారు.. ఆలోచిస్తారు..వాళ్లు తప్ప సమాధానాలే తయారు చేసి తీసుకురావచ్చు. కానీ సమాధానాన్ని వెతికే క్రమంలో వాళ్లు చేసిన తప్పులు, పొరపాట్లు, అనుభవాలు వాళ్లు విజేతలుగా నిలుపుతాయి. కానీ దురదృష్టవశాత్తూ మన దగ్గర అటువంటి విధానం లేదు. కనీసం లక్ష్య సాధకులు అయినా సరే ఈ విధానాన్ని అన్వయించుకుని గొప్పవాళ్ల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని వాళ్ల అనుభవాన్ని గ్రహించి, తక్కువ సమయంలో ఎక్కువ తప్పులు చేసి , విభిన్నంగా చేస్తే విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)