గాంధీ, ఎన్టీఆర్, కేసీఆర్…బలమైన నాయకుల సక్సెస్ సీక్రెట్ ఇదే!

 

ఒక ఆశ‌యం, ఒక స్పూర్తి ప్ర‌పంచవ్యాప్తం కావాలి, చ‌రిత్ర‌లో నిలిచిపోవాలి అంటే దాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే నాయ‌కుడు, నాయ‌క‌త్వం కావాలి. అయితే ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేసే ఒక బ‌ల‌మైన‌ నాయ‌కుడు త‌యారు కావ‌డం అన్న‌ది అంత సులువైన విష‌య‌మేమీ కాదు. ఎందుకంటే నాయ‌కునిగా ఎద‌గాలంటే ఎన్నో స‌వాళ్ల‌ను మ‌రెన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎవ‌రు కాద‌న్నా ఔనన్నా కుల వ్య‌వ‌స్థ ముఖ్య‌పాత్ర‌ పోషించే ఇండియా లాంటి దేశంలో సామాజిక వ‌ర్గం అండ‌దండ‌లు లేకుండా ఒక వ్య‌క్తి బ‌ల‌మైన నాయ‌కునిగా ఎద‌గ‌డం అసాధ్యం. విభిన్న వ‌ర్గాల‌ను క‌లుపుకుంటూనే అదే స‌మ‌యంలో స్వంత వ‌ర్గం వారిని కూడా ఆక‌ట్టుకున్న‌ప్పుడే నాయ‌కునికిగా మ‌నుగ‌డ సాధ్యం. బుద్ధుడు నుంచి నేటి కంచె ఐలయ్య వ‌ర‌కూ ఉద్య‌మాలు విజ‌యవంతం కావాలంటే సామాజిక వ‌ర్గాల మ‌ద్ధ‌తు అత్య‌వ‌సరం. గాంధీజీ దేశంలోనే బ‌ల‌మైన నాయ‌కునిగా ఎదిగి దేశానికి స్వాతంత్రం సాధించగ‌లిగాడంటే అత‌నికి సొంత సామాజిక వ‌ర్గం నుంచి పూర్తి స‌హ‌కారం ఉండ‌టం వ‌ల్ల‌నే అది సాధ్య‌మైంది. ఇలా స్పూర్తిని నింపుకుంటూ విభిన్న వ్య‌క్తుల‌ను క‌లుపుకుంటూ ఒక ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లిన‌ప్పుడే ఉద్యోగులు మంచి టీమ్ లీడ‌ర్ గా ఎదిగి కెరీర్ లో ఉన్న‌త స్థానాల‌కు చేర‌గ‌లుగుతారు.

 

 

చ‌రిత్ర‌లో నాయ‌క‌త్వానికి ఆన‌వాళ్లు తెలుసా?

 

క్రీస్తు పూర్వమే భారతదేశంలో హిందూ మతం మనుగడ ప్రమాదంలో పడింది. ముఖ్యంగా వర్ణ వ్యవస్థ వెర్రి తలలు వేయడంతో కొన్ని వర్గాల వారు హిందూ మతానికి పూర్తిగా దూరమయ్యారు. బౌద్ధ మతాన్ని ప్రభోధించిన బుద్ధుని భోధనలకు ప్రభావితమై చాలా మంది హిందూ మతం నుంచి బౌద్ధం లోకి మారిపోయారు. అయితే పురాతన కాలం నుంచి బలంగా పాతుకుపోయిన హిందూ మతాన్ని సవాలు చేస్తూ బుద్ధుడు బౌద్ధమతాన్ని ప్రారంభించి బౌద్ధులు దృష్టిలో దేవునిగా మారడం వెనుక అంతులేని నాయకత్వం పటిమ కనిపిస్తుంది. ఒక సామ్రాజ్యానికి రాజుగా ఉన్న కాలంలో బుద్ధుడు విభిన్న వర్గాలకు, వ్యక్తులు ఎనలేని సహాయం చేసి వాళ్ల మనస్సులను గెల్చుకున్నాడు. అటు తర్వాత అతను రాజ్యాన్ని, అధికారాన్ని త్యజించి సన్యాసిగా మారి బౌద్ధాన్ని ప్రభోధించినప్పుడు అతని నుంచి సహాయం పొందిన వారంతా అతని సంకల్పానికి సహాయపడ్డారు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడంలో ఎనలేని కృషి చేసారు. మనదేశంతో పాటు విదేశాలకు కూడా బౌద్ధం విస్తరించిందంటే బుద్ధుడు అందర్నీ ఆకట్టుకుంటూ, వారి నుంచి ఎలా సహాయం పొందాడో అర్ధమవుతుంది. కొన్ని వర్గాల కొన్ని సమూహాల సహాయం లేనిదే ఎవరూ నాయకుడు కాలేదన్నది బుద్ధుని కాలంలోనే రుజువైంది. ఇక బౌద్ధం దెబ్బకు, ఇతర మతాల ప్రభావానికి ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డ హిందూ మతాన్ని కాపాడుకునేందుకు తీసుకొచ్చిన భక్తి ఉద్యమం వెనుక కూడా కొన్ని వర్గాల అండ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హిందూ మతం క్షీణిస్తే ముందుగా నష్టపోయేది బ్రహ్మణ వర్గం కాబట్టి వాళ్లు వెనుక నుండి భక్తి ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు పరోక్షంగా కృషి చేసారు.

 

 

వీరులైనా, శూరులైనా సామాజిక వర్గం అండ ఉండాల్సిందే!

 

క్రీస్తు పూర్వం మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన చంద్ర గుప్త మౌర్యుడు తన ప్రధాన మంత్రి చాణక్యుని సహాయంతో హిందూ మతాన్ని విస్తరించేందుకు కృషి చేసాడు. చాణక్యుడు బ్రహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సాక్షాత్తూ మహారాజు చంద్రగుప్తుడు తన శిష్యుడు కాబట్టి తన ప్రణాళికలను సుస్పష్టంగా అమలు చేసుకున్నాడు. ఈ పరిణామానికి వెనుక నుంచి బ్రహ్మణ వర్గం అండదండలు చాణక్యునికి పుష్కలంగా ఉన్నాయి. ఇక తురుష్కుల దాడుల నేపథ్యంలో హిందూ ధర్మం మరోసారి ప్రమాదంలో పడ్డప్పుడు ఛత్రపతి శివాజీ బలమైన నాయకునిగా ఎదిగాడు. తన వర్గం, తన సమూహం అండదండలతో బలమైన రాజ్యాన్ని నిర్మించుకుని హిందూ ధర్మ పరిరక్షణ చేసాడు. ఎంతటి వీరులకైనా, నాయకులకైనా ఆయా కాలమాన పరిస్థితులను బట్టి బలమైన వర్గం అండ ఉంటేనే వారి నాయకత్వం నిలబడుతుంది. లేకుంటే ఎంతటి గొప్పవాడైనా బలమైన నాయకుడు కాలేడు. తనకు పూర్తి సహాయ సహకారాలు అందించే ఒక వర్గం సహాయం తీసుకుంటూనే అదే సమయంలో మిగిలిన వాళ్ల మనసులను కూడా గెల్చుకున్నప్పుడే నాయకునికి గెలుపు సాధ్యమవుతుంది. ఇలా విభిన్న వ్యక్తులను, విషయాలను కలుపుకుని పోవడం అన్నది నాయకునికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. ఈ విషయంలో మహాత్మా గాంధీని విజయవంతమైన నాయకునిగా చెప్పవచ్చు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గాంధీ నాయకత్వం ఎందుకు విజయవంతమైంది?

 

విదేశాల్లో బారిష్టర్ చదువు పూర్తి చేసి ఇండియాకు వచ్చిన గాంధీజీ , దేశంలోనే ఒక బలమైన నాయకునిగా ఎలా ఎదగగలిగారు? చదువు పూర్తి చేసి తన ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ ఉండే చిన్న వివాదాలను గాంధీజీ పరిష్కరించేవాడు. ముఖ్యంగా వర్తకులు, వ్యాపారస్తుల సమస్యలను చాలా చాకచక్యంగా పరిష్కరించేవాడు. స్వయంగా గాంధీ కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వాళ్లకు గాంధీజీపై గురి కుదిరింది. ముఖ్యంగా సారాభాయి మిల్స్ వ్యవహారంలో యాజమాన్యానికి, కార్మికులకు మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరించడం అతని ప్రతిష్ఠను ను పెంచింది. అతను జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ఉద్యమాలు నడిపేటప్పుడు స్వంత సామాజిక వర్గానికి చెందిన ట్రేడర్లు గాంధీజీకి పూర్తి సహకారం అందించేవారు. ఫండింగ్ రూపంలో కానీ జన సమీకరణ రూపంలో కానీ ఇలా విభిన్న మార్గాల్లో గాంధీజీ ఉద్యమం విజయవంతమయ్యేలా కృషి చేసేవారు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత వర్గాలు వారు కావడం వలన వారి సహకారంతో గాంధీజీ దేశంలో బలమైన నాయకునిగా ఎదిగాడు. మరోవైపు అదే సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వర్గ , సామాజిక సమీకరణలను అందిపుచ్చుకోలేక స్వాతంత్ర సాధనలో విఫలమయ్యారు. తన సొంత సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటూనే వారి సహాయం పొందుతూనే అదే సమయంలో మిగిలిన వర్గాల వారినీ, కులాల వారిని ఆకర్షించి గాంధీజీ జాతి పితగా మారాడు.

 

 

బలమైన నాయకుని వెనుక ‘బలమైన వర్గం’ ఉంటుంది!

 

సినిమాల్లో తిరుగులేని కథానాయకునిగా వెలుగుతున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించినప్పుడు ఆయన వెనుక ఒక బలమైన సామాజిక వర్గం అండగా నిలబడింది. ముఖ‌్యంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన్ను బాగా ప్రమోట్ చేసేందుకు ఒక దిన పత్రిక ఎనలేని కృషి చేసింది. ఆయన రాజకీయ ప్రచారానికి తమ పత్రికలో బాగా ప్రాధాన్యం ఇచ్చి ఆయన చాలా వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్లేలా చేసింది. ఆ పత్రిక ఒక్కటే కాదు పబ్లిక్ మీటింగ్ లకు ఆర్థిక సమీకరణ, జన సమీకరణ వంటి పనులను ఒక సామాజిక వర్గం బలంగా చేసింది. ఫలితం ఆయన తిరుగులేని నాయకునిగా ఎదిగి స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక వైఎస్ఆర్ పాదయాత్ర కూడా ఒక చరిత్ర సృష్టించిందంటే అతని స్వంత సామాజిక వర్గం చేసిన కృషిని కొట్టిపారేయలేం. అలాగే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ అతన్ని బలమైన నాయకునిగా ఎదిగేలా చేసేందుకు అతని సామాజిక వర్గం అందించిన సహాయ సహకారాలు సుస్ఫష్టం. అంటే కేవలం సామాజిక వర్గాల అండతోనే బలమైన నాయకులు తయారవుతారని పూర్తిగా చెప్పలేం కానీ స్వంత వర్గం అండ లేకుంటే మాత్రం పెద్ద నాయకుడు కావడం అనేది అసాధ్యం.

 

 

విద్యార్ధులు ‘బలమైన నాయకత్వం’ అంటే ఏమిటో తెలుసుకోవాలి!

 

ప్రస్తుత జాబ్ మార్కెట్లో నాయకత్వ లక్షణాలు ఉన్నవారికే కొలువు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కు తోడు ఒక టీమ్ ను విజయవంతంగా నడిపే వాళ్లు ఇప్పుడు కంపెనీలకు కావాలి. విభిన్న మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఉన్న టీమ్ ను కుదుపులు లేకుండా నడపడం అంత సులువేం కాదు. అందుకే కంపెనీలు ఈ ఛాలెంజ్ ను తీసుకునే అభ్యర్ధుల కోసం వెతుకుతున్నాయి. బుద్డుడి దగ్గర్నుంచి కేసీఆర్ వరకూ ఒక బలమైన నాయకుడు కావాలంటే తమ వర్గం అండదండలు పొందుతూనే అదే సమయంలో అందర్నీ కలుపుకుపోయే లక్షణం ఉండాలి. విద్యార్ధులు, ఉద్యోగులు ఈ లక్షణాన్ని స్వీకరించాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకుని, అందర్నీ ఆకట్టుకుంటూ అనుకున్న లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు కెరీర్ లో అయినా వ్యక్తిగతంగా అయినా ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం కలుగుతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్న వారు)