తెలుగు మ‌హాస‌భ‌లతో తెలుగుకు ప‌ట్టిన తెగులు వ‌దిలిపోద్దా??

 

తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డ్డాక తొలిసారిగా హైద‌రాబాద్ లో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వీటిని నిర్వ‌హించేందుకు కేసీఆర్ స‌ర్కార్ స‌మాయుత్త‌మైంది. ఈ నెల 15 నుంచి 19 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు దాదాపు 50 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌నున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ప్ర‌పంచం న‌లుమూలల నుంచి తెలుగు వారు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఈ మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌తో తెలుగు భాష‌కు ఒరిగేదేంటి అన్న‌దే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. యునెస్కో విడుద‌ల చేసే మృత భాష‌ల జాబితాలోకి త్వ‌ర‌లో తెలుగు కూడా చేర‌వ‌చ్చ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించ‌డం తెలుగు భాషాభిమానుల గుండెల్ని పిండేసింది. ఇటాలియ‌న్ ఆఫ్ ద ఈస్ట్ గా ప్ర‌ఖ్యాతి గాంచిన‌ప్ప‌టికీ నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అద్భ‌త‌మైన భాష‌ల్లో తెలుగు ఒక‌టి. అటువంటి తెలుగు భాష ఇప్పుడు మ‌న విద్యా విధానంతో, ఇత‌ర భాష‌ల‌పై మోజుతో ప్ర‌మాదంలో ప‌డింది. ప‌క్క రాష్ట్రాల వారు త‌మ భాషను అభివృద్ధి చేసుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటుంటే మ‌న మాత్రం ప‌ర‌భాషా వ్యామోహంలో కొట్టుకుపోతున్నాం.

 

పిల్ల‌ల‌కు తెలుగును దూరం చేస్తుంది మ‌న‌మే!

 

తెలుగు భాష‌కు ద్రోహం చేస్తున్న వాళ్ల‌లో మొద‌టి దోషులు క‌చ్చితంగా త‌ల్లిదండ్రులే. ప‌ర భాషపై విప‌రీత‌మైన వ్యామోహాన్ని పెంచుకుని త‌మ పిల్ల‌ల‌ను తెలుగు భాష‌కు దూరం చేస్తున్న త‌ల్లిదండ్రులు ఎంద‌రో. తెలుగు మీడియంలో చ‌దివితే ఉద్యోగం రాదు తెలుగు చదివితే చిన్న స్థాయిలో ఉండిపోతారు అన్న అపోహ‌ల‌ను, అవాస్త‌వాల‌ను ప్రచారం చేయ‌డంలో కొన్ని ప్ర‌యివేట్ విద్యా సంస్థ‌లు విజ‌యం సాధించాయి. వారి మాయ‌లో ప‌డి చాలా మంది పేరెంట్స్ త‌మ పిల్ల‌ల‌ను తెలుగులో చ‌దివించ‌డం మానుకున్నారు. స‌మాజంలో వ‌చ్చిన ఈ స్ప‌ష్ట‌మైన, దుర‌దృష్ట‌క‌ర‌మైన మార్పుకు ఈ త‌రం ప్ర‌త్య‌క్ష సాక్షిగా ఘోర‌మైన పాపాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఒక వైపు స్కూల్లో తెలుగు మాట్లాడితేనే కొట్టే టీచ‌ర్లు, మ‌రోవైపు ఇంట్లో కూడా పిల్ల‌ల్ని ఇంగ్లీష్ లోనే మాట్లాడ‌మ‌ని ఒత్తిడి చేస్తూ న‌యా మాయానందంలో త‌మ‌ను తాము మోసం చేసుకుంటున్న త‌ల్లిదండ్రులు. వెర‌సి తెలుగు భాష ఇప్పుడు అంప‌శయ్య పైకి చేరుకుంది.

 

 

తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాలు రావా?

 

తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాలు రావ‌ని ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గ‌లేమ‌ని చాలా మందిలో ఉన్న భావ‌న‌. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో చ‌ద‌వ‌కుంటే పిల్ల‌లు ఈ పోటీ ప్ర‌పంచంలో మ‌నుగ‌డ సాగించ‌లేర‌ని చాలా మంది త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు. నిజ‌మే..ప్ర‌స్తుత కార్పోరేట్ జ‌మానాలో ఉద్యోగాన్ని సాధించాలన్నా దాన్ని కాపాడుకుంటూ మ‌రింత‌గా ఎద‌గాలన్నా ఇంగ్లీష్ లో నైపుణ్యం అవ‌స‌ర‌మే. ఇందులో సందేహం లేదు. అయితే ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషైన తెలుగుపై నిర్ల‌క్ష్యం ఎందుక‌న్న‌ది ఇప్పుడు అర్ధం కాని ప్ర‌శ్న‌. ఒక పీరియ‌డ్, ఒక స‌బ్జెక్ట్ గా తెలుగును చ‌దివినంత మాత్రాన పిల్ల‌లు ప‌నికిరాని వారిగా మారిపోతారా? ఇప్పుడు తెలుగు భాషాభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న ఇదే. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్ గా చేయ‌డంలో మీన‌మేషాలు లెక్కించింది. ఇప్పుడు తెలంగాణీ సీఎం కేసీఆర్ తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసారు. మ‌రి ఆయ‌న ఆదేశాలు ఎంత వ‌ర‌కూ అమ‌లవుతాయో క్షీణ ద‌శ‌లో ఉన్న తెలుగుకు ఎంత వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డ‌తాయో వేచి చూడాలి. ప్ర‌స్తుతం పుస్త‌కాలు చ‌దివే అలవాటున్న పిల్ల‌ల చేతుల్లో ఇంగ్లీష్ పుస్త‌కాలు త‌ప్పించి తెలుగు పుస్త‌కాలు అస్స‌లు క‌నిపించ‌డం లేదు. పిల్ల‌ల్లో పుస్త‌క ప‌ఠ‌నంపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు బాల సాహిత్యంలో మ‌రిన్ని పుస్త‌కాలు రావాల్సి ఉంది. అలాగే త‌ల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ నేర్పిస్తూనే అదే స‌మ‌యంలో తెలుగు చ‌ద‌వ‌డం, రాయ‌డం వ‌చ్చేలా వారికి శిక్ష‌ణ‌నివ్వాలి.

 

 

తెలుగును బ‌తికించ‌డం త‌ల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది!

 

తెలుగుకు ప్రాచీన భాష హోదా ద‌క్కింద‌న్న ఆనందం ఎక్కువకాలం నిల‌వ‌కుండానే ఇటీవ‌ల యునెస్కో విడుద‌ల చేసిన ఒక నివేదిక ఆందోళ‌న రేపింది. తెలుగు భాష‌పై ఇదే ర‌క‌మైన వైఖ‌రి కొన‌సాగుతూ ఉంటే మ‌రికొద్ది సంవత్సరాల్లో తెలుగు కూడా మృత భాషల జాబితాలో చేరిపోవ‌చ్చ‌న్న‌ది ఆ నివేదిక సారాంశం. తియ్య‌నైన తెలుగు భాష క‌నుమ‌రుగు కావ‌చ్చ‌న్న ఆలోచ‌నే భ‌రింప‌రానిదిగా ఉంది. దేశ భాష‌లందు తెలుగు భాష లెస్స అన్న శ్రీ కృష్ణ‌దేవ‌రాయ‌ల మాట‌ల‌ను గుర్తుకు తెచ్చుకుని మ‌న తెలుగు భాష‌ను బ‌తికించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అది ముందుగా త‌ల్లిదండ్రుల నుంచే మొదలు కావాలి. చిన్న‌త‌నం నుంచి పిల్ల‌ల‌ను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల‌లో జాయిన్ చేసినా ఇంటి ద‌గ్గ‌ర వాళ్ల‌కు తెలుగులో మాట్లాడ‌టం నేర్పించాలి. అలాగే కొంచెం స‌మ‌యం తీసుకుని వాళ్ల‌కు తెలుగు భాష‌ను క్షుణ్ణంగా నేర్పించాలి. వాళ్ల‌కు తెలుగులో ఉన్న మంచి బాల సాహిత్యాన్ని చ‌ద‌వ‌డం అల‌వాటు చేయాలి. స్కూళ్ల‌లో ఎలా అయితే తెలుగు మాట్లాడొద్ద‌ని ఆంక్ష‌లు విధిస్తారోఇంట్లో కూడా అలానే ఇంగ్లీష్ మాట్లాడొద్ద‌ని ఆంక్ష‌లు విధించి కుటుంబం మొత్తం తెలుగులోనే మాట్లాడుకోవాలి. క‌ఠిన ప‌దాల‌కు , సామెత‌ల‌కు పిల్ల‌ల‌కు అర్ధాల‌ను వివ‌రించి చెప్పాలి. ఏ ప‌దాన్ని ఎక్క‌డ ఏ సంద‌ర్భంలో వాడాలి అన్న‌దానిపై పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులే తెలియజేయాలి. కుంగిపోతున్న తెలుగును బ‌తికించ‌డం కేవ‌లం త‌ల్లిదండ్రులు చేతుల్లోనే ఉంది. వారు త‌ల్చుకుంటే మ‌న భాష‌ను బ‌తికించుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మైన విష‌య‌మేమీ కాదు.

 

 

చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్య‌మే!

 

తెలంగాణా జ‌రుగుతున్న ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల స్ఫూర్తితో మ‌నం తెలుగును బ‌తికించుకునేందుకు, దాన్ని త‌ర్వాత త‌రాల‌కు అందించేందుకు కృషి చేయాలి. తెలంగాణాలోని అన్ని పాఠ‌శాలలో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌న్నెండో త‌ర‌గ‌తి వ‌ర‌కూ తెలుగును త‌ప్ప‌నిసరి చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం చాలా గొప్ప‌ది. అయితే ఇది స‌రిగ్గా అమ‌లు జ‌రిగేలా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాలి. తెలుగు భాష‌ను మ‌రింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను మ‌హాస‌భ‌ల్లో చ‌ర్చించి వ‌దిలేయ‌డం కాకుండా వాటి అమ‌లును ప‌ర్య‌వేక్షించే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా తెలుగు భాష గొప్ప‌త‌నంపై త‌ల్లిదండ్రుల‌ను చైత‌న్యం చేయాలి. అలాగే తెలుగు మీడియంలో చ‌దివిన విద్యార్ధుల‌కు కూడా ఉద్యోగావ‌కాశాలు ఎక్కువ‌గా ఉండేట‌ట్టు చేస్తే చాలా మంది తెలుగులో చ‌దివేందుకు ఆస‌క్తి చూపిస్తారు. అలాగే మ‌న ప‌క్క‌రాష్ట్రాల త‌రాహాలోనే భాష‌పై ప్రేమ‌ను పెంచుకుని దాని అభివృద్ధికి అనుక్ష‌ణం ప్ర‌య‌త్నం చేయాలి. ఇలా చేసిన‌ప్పుడు తియ్య‌నైన మ‌న‌ తెలుగు భాష త‌న పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుని త‌ళుకులీనుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)