వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ తప్పక చదవండి!!

 

ప్రస్తుతం స్టార్టప్ ల ట్రెండ్ నడుస్తోంది. 9 టూ 5 ఉద్యోగం చేస్తూ ఒక ఉద్యోగిగానే జీవితాన్ని ముగించేందుకు నవ యువతరం సిద్ధంగా లేదు. తమకంటూ ఒక ప్రత్యేకమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని కాస్త కొత్తగా లైఫ్ ను డిజైన్ చేసుకునేందుకు చాలా మంది యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక స్టార్టప్ ను ప్రారంభించడం అంత సులువైన విష‍యం కాదు. ప్రతీనెలా స్థిరంగా వచ్చే జీతాన్ని వదులుకుని ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటూ మానసిక సంఘర్షణను భరిస్తూ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోవడానికి ధైర్యం కావాలి. ఒక వందమందికి స్టార్టప్ ఆలోచన ఉంటే కష్టాలను భరించేందుకు రెడీ అయి బరిలోకి దిగే వారు కేవలం అయిదు మంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్లను కుటుంబం, ఆర్థిక అవసరాలు, సమాజం అన్నీ వెనక్కి లాగేస్తాయి. మంచి ఉద్యోగాన్ని వదిలి ఎంట్రెప్రెన్యూర్ గా మారాలనుకుంటున్న వారు కొన్ని సూచనలను తప్పకుండా పాటించాలి. అవేంటో చూద్దామా.

 

లైఫ్ అంటేనే రిస్క్ ..

 

మానవ జీవితం అంటేనే రిస్క్. మనం ఈ భూమి మీదకు రావడమే ఒక పెద్ద రిస్క్ తో కూడుకున్న టాస్క్. రిస్క్ చేయకుంటే లైఫ్ లో ముందుకు వెళ్లడం అసలు సాధ్యం కాదు. రిస్క్ చేసే దమ్ము లేని వారికి పెద్ద కలలనే కనే హక్కు లేదు. మీ లక్ష్యాలను, మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసుకోండి. మీ జీవితాన్ని వేరే వాళ్ల చేతుల్లో ఎప్పుడూ పెట్టకండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీ వర్తమానమే మీ భవిష్యత్ ను నిర్ణయించింది. ఇప్పుడు ఆలోచిస్తూ భయపడుతూ సమయాన్ని వృధా చేస్తే భవిష్యత్ లో అలా భయపడుతూనే జీవితాన్ని ముగిస్తారు. కాబట్టి ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకోండి.

 

 

అనవసర బాధ్యతలను వదిలించుకోవడమే మొదటి మెట్టు!

 

ఒక స్టార్టప్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా మీపై ఉన్న బాధ్యతలను క్రమంగా తొలిగించుకోండి. కార్ కొనుక్కోవడం, ఇళ్లు కొనుక్కోవడం, క్రెడిట్ కార్డు లు తీసుకోవడం, పెళ్లి చేసుకోవడం వంటి బాధ్యతలను నెత్తిన పెట్టుకోకండి. అవి మిమ్మల్ని గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుకుంటాయి. మీ స్టార్టప్ విజయవంతమై ఇవన్నీ మీ చెంతకే వచ్చి చేరుతాయి. వ్యాపారంలో మీకు ఉపయోగపడే వాటినే తీసుకోండి. కానీ అవసరం లేని వస్తువులకు ఈఎంఐలు కట్టేందుకు మీ జీవితాన్ని తాకట్టు పెట్టుకోకండి.

 

జీవన నైపుణ్యాలు నేర్చుకోండి!

 

ఉద్యోగాన్ని వదిలేయడం అనేది జీవితాన్ని చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది. అందుకే స్టార్టప్ కోసం ఉద్యోగాన్ని వదిలేసే ముందుగా ఆరు నెలలకు సరిగా డబ్బును దాచిపెట్టుకోండి. అలాగే స్టార్టప్ ను కొనసాగిస్తూనే వేరే ఆదాయ వనరుల కోసం ప్రయత్నాలు చేయాలి. అప్పుడే రోజువారీ ఖర్చులకు తగిన ఆదాయం వస్తుంది. ఉన్న కొద్దీ మొత్తాన్ని పొదుపుగా ఎలా వాడుకోవాలో తెలియడమే స్కిల్ ఆఫ్ సర్వైవల్. ఒక వేళ మీకు డబ్బులు సరిపోకపోతే పార్ట్‌టైమ్ గా ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ పనులు ఉంటే చేయాలి.

 

 

ఏదైనా సాధించేందుకు ఇదే సరైన సమయం!

 

ఒక పనిని ప్రారంభించే ముందు మనలో చాలా మందికి లక్షల సంఖ్యలో సందేహాలు వస్తాయి. ఇది అసలు వర్కవుట్ అవుతుందా? ఒక వేళ విఫలం అయిపోతే.? నేను చేస్తున్న పని సరైనదేనా? ఇవన్నీ అందరికీ వచ్చే సందేహాలే. జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలా ఆలోచించడం కూడా సబబే. కానీ అతిగా ఆలోచిస్తూ మనకు మనం సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ నిర్ణయం తీసుకోలేం. మనం ఒక మంచి ఎప్పుడు అనుకుంటే అప్పుడే సరైన సమయం. ప్రాథమిక ఆలోచన చేసాక నిర్ణయం తీసుకున్నాక ఇక ధైర్యంగా బరిలోకి దిగాలి. నెగెటివ్ థింకింగ్ అస్సలు పనికిరాదు. చేయాలనుకున్నది నిబద్ధతతో. పట్టుదలతో, శ్రద్ధగా చేయాలి. ఫలితం తప్పుకుండా వస్తుంది.

 

మీ బలాలే కాదు మీ బలహీనతలూ తెలిసుండాలి!

 

స్టార్టప్ మొదలు పెట్టే ముందు ప్రతీ ఒక్కరూ ఈ విషయంపై బాగా ఆలోచన చేయాలి. అసలు నేనేంటి? నేను జీవితంలో ఎక్కడ ఉన్నాను? నా బలాలు ఏంటి? నా బలహీనతలు ఏంటి? ఒక రోజులో ఏ విషయంలో నేను బాగా పనిచేయగలుగుతున్నాను? ఏ విష‍యంలో ఇబ్బంది పడుతున్నాను? ఫలానా పనిని నేను ఎందుకు చేయలేకపోతున్నాను? అన్న ప్రశ్నలను తనను తానే వేసుకుని విశ్లేషించుకోవాలి. బలహీనతలను అధిగమించేందుకు తగిన ప్రయత్నాలు చేయాలి. ఈ క్రమంలో నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. వాటిని వదిలేయాలి. ఏ క్షణంలో కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని నడిపే ఇంధనం.

 

 

కుటుంబాన్ని ప్రేమించండి

 

స్టార్టప్ ప్రారంభించేటప్పుడు ఆర్థికంగా చాలా కష్టాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఇది కుటుంబాల్లో కలతలకు కారణమవుతుంది. ఇటువంటి సమయాల్లో నిబ్బరంగా ఉండాలి. మానసికంగా కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. మీపై మీ పేరెంట్స్ పెట్టుకున్న ఆశలను, ఆకాంక్షలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీ నిర్ణయం కుటుంబ సభ్యలకు నచ్చకపోయినా వారిని ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలి. మీ ప్రయత్నం లోని చిత్తశుద్ధి అర్ధమైతే వారే తగిన ప్రోత్సాహం ఇస్తారు. కుటుంబంతో ఎప్పుడూ గ్యాప్ ను సృష్టించుకోకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ‌్యం.

 

ఇతరులను ఇంప్రెస్ చేయాలనుకోవడం మానుకోండి!!

 

స్టార్టప్ ప్రారంభించాలనుకునే ముఖ‌్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇతరులను ఇంప్రెస్ చేయాలని ఎప్పుడూ ప్రయత్నించకండి. అది మీపై అనవసర ఒత్తిడిని పెంచుతుంది. అలా కాకుండా మీ పని గురించి , మీ సంస్థ గురించి చెప్పుకోండి. అది మీకు ఉపయోగపడుతుంది. అవతలి వారిని ఇంప్రెస్ చేయాలనుకోవడం మనలోని క్రియేటివీటీని చంపేస్తుంది. స్నేహితులు, పేరెంట్స్ ఎవరైనా కానీయండి ఎవర్నీ ఇంప్రెస్ చేయకండి. మీ కోసం, మీ పని కోసం వారికి వివరించండి చాలు. చేసే పనిని భయం లేకుండా , గుండె ధైర్యంతో చేయండి చాలు సరిపోతుంది.

 

 

ధైర్యంతో పాటు వినయమూ ముఖ్యమే!

 

మీరు ప్రారంభించిన సంస్థపై మీరు చేస్తున్న పనిపై పూర్తి నమ్మకాన్ని ఉంచండి. మీ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఎవరినైనా కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి. ఎవరి ముందూ ధైర్యాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీరు చేస్తున్న పనితో మీరు త్వరలోనే విజయవంతమైన వ్యాపారవేత్త కాబోతున్నారు. ఆ నమ్మకాన్ని మీ కళ్లలో కనిపించేలా చూసుకోండి. ధైర్యంగా ఉంటూనే అదే సమయంలో ఎదుటి వాళ్లతో వినయపూర్వకంగా మసులుకోండి. మీలో కనిపించే వినయం, ధైర్యం అన్న విషయాలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఆల్ ది బెస్ట్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)