పిల్లలను చదువుకు దూరం చేసే ఏ సిద్ధాంతమైనా పనికిమాలినదే!

 

ఒకప్పుడు కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలం అనేది అంతర్లీనంగా ఉండేది. కమ్యూనిస్ట్ భావజాలానికి ప్రభావితమైనప్పటికీ చాలా మంది విద్యార్ధులు దాన్ని అదుపులోనే ఉంచుకునే వారు. అయితే విప్లవ సాహిత్యంతో తీవ్రంగా ప్రభావితమైన వారు, తాము నమ్మిన సిద్ధాంతమే పూర్తిగా సరైనది అనుకునేవాళ్లు, అన్యాయం జరిగిన వాళ్లు, ఒక వాదాన్ని పూర్తి స్థాయిలో అథ్యయనం చేయని వాళ్లు తీవ్రవాదులుగా మారేవారు. అయితే ఆ తర్వాత రాను రానూ బాగా చదువుకున్న వాళ్లు ఉన్నత విద్యా వంతులు కూడా సమాజంలో జరుగుతున్న దోపీడికి తీవ్రవాదులుగా మారి హింస ద్వారానే సమ సమాజ స్థాపన జరుగుతుందని నమ్మడం మొదలు పెట్టారు. దీని వలన మన దేశంలో మావోయిస్టు తీవ్రవాదులు బాగా పెరిగిపోయారు. వారి సిద్ధాంతాలను, భావజాలాలను విమర్శించాలన్న ఉద్దేశం కాదు కానీ రాజ్యానికి, రాజ్య వ్యతిరేక శక్తులకు జరుగుతున్న పోరాటంలో అమాయకులు, చిన్నపిల్లలు బలైపోవడం అన్నది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మన దేశంలో మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు ఆధిపత్యం చెలాయించాలన్న ఉద్దేశంతో చేస్తున్న పనులు విమర్శలపాలవుతున్నాయి. చదువు లేకుండా ఒక మనిషి అభివృద్ధి సాధించడం అన్నది అసాధ్యం. ఆదివాసీల పిల్లలకు చదువు అందుకుండా స్కూళ్లను పేల్చేయడం వంటి చర్యల ద్వారా మావోయిస్టులు తమ సిద్ధాంతాలకు తామే తూట్లు పొడుచుకుంటున్నారు.

 

 

విద్య‌కు వ్య‌థ‌గా మారిన తీవ్ర‌వాదం!

 

తీవ్ర‌వాదంతో బాగా న‌ష్ట‌పోయిన దేశాల జాబితాలో మ‌న దేశం కూడా ఉంది. కశ్మీర్ తీవ్ర‌వాదులు మొదులుకుని ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాదులు, బోడో తీవ్ర‌వాదులు, మావోయిస్టులు ఇలా తీవ్రవాద సంస్థ‌ల జాబితా చాలానే ఉంది. ప్ర‌స్తుతం అందులో కొన్ని సంస్థ‌లు క‌నుమ‌రుగైనా ఇప్ప‌టికీ టెర్రరిజం బాధిత దేశాల్లో ఇండియా ముందు వ‌రుస‌లో ఉంటుంది. ముఖ్యంగా ఉగ్ర‌వాదం మూలంగా ప్ర‌జ‌ల సామాజిక, భౌగోళిక‌, ఆర్థిక స్థితిగ‌తులు తీవ్రంగా దెబ్బ‌తింటున్నాయి. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలా మంది పిల్ల‌లు విద్య‌కు దూర‌మై చివ‌ర‌కు తీవ్ర‌వాదులుగా మారుతున్న వైనం ఆందోళ‌న క‌లిగిస్తోంది. బీహార్, ఝార్ఖండ్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులు స్కూళ్ల‌ను పేల్చేయ‌డం వ‌ల‌న పిల్ల‌లు చెట్లు కింద చ‌దువుకునే దుస్థితి దాపురించింది. తీవ్ర‌వాదుల దాడుల భ‌యంతో కొన్ని స్కూళ్లు అయితే ఏకంగా మూత‌బ‌డ్డాయి. దీంతో విద్యార్ధులు చ‌దువుకునే అవ‌కాశాన్ని కోల్పోతున్నారు. ఒక‌వైపు పేద‌రికం మ‌రోవైపు చ‌దువుకునే వెసులుబాటు లేక‌పోవ‌డంతో చాలా మంది టీనేజ్ పిల్ల‌లు నేర‌గాళ్లుగా మారి సంఘ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేస్తూ చివ‌రికి తీవ్రవాదంపై మొగ్గు చూపుతున్నారు.

 

 

పూర్తిగా ప‌డ‌కేసిన విద్య!

 

బీహార్ లోని మావోయిస్ట్ ప్ర‌భావిత జిల్లాల్లో ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉంది. తీవ్రవాదులు స్కూళ్ల‌ను పేల్చేయ‌డంతో పాటు టీచ‌ర్ల‌ను కూడా భ‌య‌పెట్ట‌డంతో చాలా మంది ఉపాధ్యాయులు సుధీర్ఘ సెల‌వులు పెట్టి విధుల‌కు గైర్హాజ‌ర‌వుతున్నారు. దీంతో పిల్ల‌లు స్కూల్ మొఖం చూడ‌కుండా ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. కొన్ని స్కూళ్లు న‌డుస్తున్న‌ప్ప‌టికీ మొత్తం అన్ని త‌రగతుల‌ను ఒకే రూమ్ లో నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఏం వింటున్నామో తెలియ‌క విద్యార్ధులు తిక‌మ‌క‌ప‌డుతున్నారు. 500 మందికి పైగా విద్యార్ధులు ఉన్న స్కూళ్లు కూడా ఇప్పుడు కేవ‌లం 100 మంది విద్యార్ధుల‌కే ప‌రిమిత‌మైపోయాయి. మ‌రోవైపు మావోయిస్టుల‌కు భ‌య‌పడి చాలా మంది టీచ‌ర్లు కూడా విధుల‌కు రావ‌డం మానుకున్నారు. దీంతో స‌రైన నిర్వ‌హ‌ణ లేక బీహార్, ఝార్ఖండ్ లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలా స్కూళ్లు మూత‌పడ్డాయి. మిగిలిన స్కూళ్లు కూడా ఉపాధ్యాయులు లేక ఉపాధ్యాయులు వ‌చ్చిన విద్యార్ధులు రాక భవంతులు లేక చెట్ల కింద కాలం వెళ్ల‌దీస్తున్నాయి.

 

 

న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు

 

ప్ర‌స్తుతం బీహార్, ఝార్ఖండ్, ఒడిషాల‌లో మావోయిస్టుల ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డంలో పోలీసులు గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా కాస్త విజ‌య‌వంత‌మ‌య్యారు. దీంతో మావోయిస్టులు స్కూళ్ల‌ను పేల్చేసిన ఘ‌ట‌న‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. అయినా ఇప్ప‌టికే న‌ష్ట‌పోయిన ప్రాంతాల్లో మాత్రం ప‌రిస్థితి అలానే ఉంది. పేల్చేసిన స్కూల్ భ‌వ‌నాల స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు కాంట్రాక్ట‌ర్లు ముందుకు రావ‌డం లేదు. మావోయిస్టులతో ప్రాణ భ‌యం ఉంద‌ని చాలా మంది స్కూల్ భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు ముందుకు రావ‌డం లేదు. దీంతో చాలా స్కూళ్లు తాత్కాలిక శిబిరాల్లోనూ, చెట్ల కింద న‌డుస్తున్నాయి. అయితే ఈ తాత్కాలిక చ‌దువులు కాస్త వ‌ర్షాకాలం చ‌దువులుగా మారిపోయాయి. ఎండ కాసినా , వ‌ర్షం ప‌డినా స్కూళ్లను పూర్తిగా మూసివేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో పిల్ల‌లు పూర్తి స్థాయిలో చ‌ద‌వ‌లేక చ‌దువుకోక ప్రాథ‌మిక స్థాయిలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. దీంతో దేశంలోనే ఆదివాసీ గ్రామాలు ఇప్పటికీ స్వాతంత్ర పూర్వం నాటి వెనుకబాటుతనంలోనే మగ్గిపోతున్నాయి. ఇప్పుడు పోలీసు రక్షణలో చాలా వరకూ స్కూళ్లు నడుస్తున్నాయి. అయితే పోలీసులే నిజమైన విలన్లని మావోయిస్టులు చెపుతున్నారు. అణిచివేత ద్వారా స్కూళ్లను తెరిపించినా పెద్దగా ఉపయోగం లేదన్నది వారి వాదన. అయితే రాజ్యం, సమసమాజ స్థాపన వంటి సిద్ధాంతాల వలన మధ్యలో పిల్లలు చదువులేకుండా నష్టపోతున్నారన్న ప్రశ్నకు మావోయిస్టుల దగ్గర సమాధానం లేదు.

 

 

ఆధిపత్య ధోరణులతో పిల్లలు నలిగిపోతున్నారు!

 

ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం అన్ని రకాల సంబంధాలకు దూరంగా ఉన్న మారుమూల పల్లెలకు మాత్రమే పరిమితమైపోయింది. అటువంటి కమ్యూనికేషన్ లేని గ్రామాల్లో తమ ప్రభావాన్ని పెంచుకుని తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారు. అక్కడ ప్రజలు మావోయిస్టుల చెప్పిన మాటలకు, సాహిత్యానికి ప్రభావితమవుతున్నారు. అయితే హింసా మార్గం ద్వారా కమ్యూనిస్ట్ రాజ్యాలు స్థాపించినా అవి మనుగడ సాగించలేవని గతంలోనే తేలిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యహరించాల్సి ఉంటుంది.తీవ్రవాదులను జన జీవన స్రవంతిలోకి తీసుకురావడం, మారుమూల గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టాలి. అవి నత్తనడకన సాగడంతో ప్రజలు మావోయిస్టులే కరెక్ట్ అనే భావనలో ఉన్నారు. మరోవైపు తీవ్రవాదులకు, పోలీసులకు జరుగుతున్న పోరాటంలో చిన్న పిల్లలు నలిగిపోతున్నారు. మావోయిస్టులు స్కూళ్లను పేల్చివేయడంతో వాళ్లు విద్యకు దూరమవుతున్నారు. తర్వాత క్రమంగా తీవ్రవాదులుగా మారుతున్నారు. ఈ పరిణామం అస్సలు సహేతుకం కాదు. అటు ప్రభుత్వం ఇటు మావోయిస్టులు విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే చర్యలు మాని వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు చేపట్టాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)