ఎంతవారు గానీ.. వాలు చూపు సోకగానే కైపులో తేలుతున్నారు?

 

తాజాగా మన తెలుగు దినపత్రికల్లో ‘డాక్టర్లపై వలపు వల’ అన్న ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. సోసైటీలో ఉన్నత స్థానంలో ఉన్న డాక్టర్లను కొందరు ఆడవాళ్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ వార్త కళ్లకు కట్టింది. 40 సంవత్సరాల లోపు ఉన్న డాక్టర్ల ను తమ మాటలతో బుట్టలో వేసిన కొందరు మోసగత్తెలు సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తూ వాటిని వీడియోలు తీసి వారి నుంచి డబ్బులు గుంజినట్టు వెల్లడైంది. అయితే దీన్ని ఒక వార్తగా కాకుండా మరో కోణంలో చూస్తూ సమాజంలో జరుగుతున్న మార్పులు, మన విద్యా విధానంలోని లోపాలతో దిగజారుతున్న విలువలను కళ్లకు కడుతోంది. మనిషి బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు నైతికత, విలువలు అనేవే లేకుండా ఉన్నతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు చిన్న చిన్న ప్రలోభాలను, బలహీనతలను జయించలేక బొక్కబోర్లా పడుతున్నారు. సాధిస్తున్న విజయాలను, బ్యాంక్ బ్యాలెన్స్ లను చూసుకుంటున్నారు కానీ తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు తిలోదాలు ఇచ్చి తమకు తాము ఏ విధంగా ద్రోహం చేసుకుంటున్నామో ఎవరూ పట్టించుకోవడం లేదు. యుద్ధప్రాతిపదికన మన విద్యా విధానంలో మార్పులు చేసి పిల్లలకు విలువలు, శీల నిర్మాణం కనుక నేర్పించకపోతే రానున్న రోజుల్లో గొప్పగా చెప్పుకుంటున్న మన సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

 

 

నమ్మకాన్ని నట్టేట ముంచుతున్నారు!

 

మన ఆలోచనను అవతలి వ్యక్తికి వివరించి ఆ విషయాన్ని అంగీకరింపజేసి వాళ్ల మద్ధతు తీసుకోవడాన్ని వ్యాపారం అంటారు కానీ నేడు దానికి విరుద్ధంగా జరుగుతోంది. నమ్మించి ఒక వ్యక్తిని మోసం చేయడం, దాని కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడం అన్నది ఇప్పుడు సాధారణ విష‍యంగా మారిపోయింది. అయితే ఇక్కడ మోసం చేసేవాళ్లదే కాదు మోసపోయే వాళ్లది కూడా కాస్త తప్పు కనిపిస్తోంది. విలువలను గాలికొదిలి మోసం చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లు అవతలి వాళ్ల బలహీనతలపై కొట్టడానికి ఉన్న అవకాశాలను వెతుకుతారు. ముఖ్యంగా మనుష్యుల బలహీనతల్లో కీర్తి, కాంత, కనకం అనేది ప్రముఖంగా ఉన్నాయి. కీర్తి సంపాదించేందుకు ఎటువంటి అడ్డదారులు తొక్కేందుకైనా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇక చాలా మంది పురుషులకు ఆడవాళ్ల బలహీనత అనేది సర్వసాధారంగా మారిపోయింది. ధర్మబద్ధంగా ఉండాల్సిన స్త్రీ పురుష సంబంధాలను బలహీనతల కోసం అవహేళనలా మారుస్తున్నారు. ఇక డబ్బు సంపాదనలో కూడా న్యాయాన్ని, విలువలను అస్సలు పాటించడం లేదు. ఎలా అయినా డబ్బు సంపాదించాలన్న యావ తప్పితే అది ఏ విధంగా సంపాదిస్తున్నాం? ఎలా సంపాదిస్తున్నాం ? అన్నదాన్నిపూర్తిగా మర్చిపోతున్నారు. అయితే ఇక్కడ విచిత్రమైన విష‍యం ఏంటంటే..ఈ మూడు బలహీనతలు ఒకదాని పక్కన ఒక్కటి ఎప్పుడూ నిలవలేవు. పర స్త్రీ వ్యామోహం ఉన్న వారికి వెంటనే కీర్తి దూరమవుతుంది. అలాగే కీర్తి వ్యామోహం ఉన్నవారికి డబ్బు దూరమవుతుంది. అయినా సరే ఈ విషయాన్ని గుర్తించలేక చాలా మంది ఈ బలహీనతల జయించలేక వాటి వెంట పరుగుతీస్తున్నారు.

 

 

ప్రాచీన కాలం నుంచి నేటి వరకూ మనకు ఎన్నో ఉదాహరణలున్నాయి!

 

మన పురాణాల్లో విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడు అతని తపస్సును భంగం చేసేందుకు ఇంద్రుడు దేవకన్యలను పంపడం మనం చదివే ఉంటాం. అలాగే ఎవరైనా శ్రద్ధతో ఒక పనిచేస్తున్నప్పుడు దాన్ని చెడగొట్టేందుకు, భగ్నం చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎంతటి శ్రద్ధ ఉన్నవాడు అయినా, నైపుణ‌్యం ఉన్నవాడు అయినా బలహీనతలను జయించకుంటే మిగిలేది పతనమే. విశ్వామిత్రుడు దేవకన్యల అందానికి లొంగిపోయి మొత్తం తపశ్శక్తిని పొగొట్టుకున్న కథ మనకు తెలిసిందే కదా? అలాగే ఇప్పుడు కూడా అదే రకమైన ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్‌.డీ.తివారీ రాసలీలలు, తాజాగా గుజరాత్ లో పటేళ్ల ఉద్యమనేత హార్టిక్ పటేల్ రాసలీలల వీడియో, పలువురు స్వామీజీలు, రాజకీయ నాయకులు వీడియోలకు కొదువే లేదు. ఇవన్నీ మనకు ఏం చెపుతున్నాయి. మనిషి యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకునే బాపతు వ్యక్తులతో పాటు ఉన్నత స్థాయికి వెళ్లినా చిన్న చిన్న బలహీనతలను జయించలేని వాళ్లు అధికమైపోయారు. మరోవైపు మోసం చేయడానికి చట్టం కల్పించిన రక్షణను దుర్వినియోగం చేస్తున్నవారు, విలువలు లేకుండా మోసం చేసి బతకాలనుకునే వాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.

 

 

బీటలు వారిన పునాదులపై అంతస్తులు కడుతున్నారు!

 

ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత అందమైన అమ్మాయి తన గదికి వస్తే కచ్చితంగా ప్రోసీడ్ అవుతా అని బాహాటంగా చెప్పాడు. సమాజానికి నీతులు ఉద్భోదించే సదరు రచయిత అలాంటి కామెంట్లు చేయడం ఎటువంటి మనస్తత్వాన్ని సూచిస్తోంది. ఈ ఆధునిక కాలంలో మనిషిలో విలువలు, నైతికత అనేవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. గొప్పవాళ్లు కూడా తాము చిన్న చిన్న బలహీనతలకు అతీతులం కాదని రుజువు చేసుకుంటున్నారు. ఎన్ని నీతులు చెప్పే వ్యక్తులైనా బలహీనతలకు లొంగే సందర్భం వచ్చినప్పుడు స్థిరంగా స్థితప్రజ్ణతతో వ్యవహరించలేకుండా ఉన్నారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారుతోంది. ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు లేకపోవడం, గొప్పవాళ్లు అనుకున్న వాళ్లు కూడా బలహీనతలకు అతీతులు కాకపోవడంతో పిల్లలు కూడా అదే రకమైన దారిలోకి మళ్లుతున్నారు. అనైతికత అనేది బీటలు వారిన పునాది మీద ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది వృధానే ఎందుకంటే చివరికి అది కుప్పకూలిపోవడం తథ్యం. అలాగే మనిషి కూడా విలువలు, నైతికత లేకుండా ఎదగాలని ప్రయత్నించినా, ఒక వేళ స్వల్పకాలానికి ఎదిగినా చివరికి పతనం కాక తప్పదు.

 

 

విద్యా విధానంలో విలువలు చేర్చాలి!

 

ఒకప్పుడు మన విద్యావిధానంలో విలువలతో పాటు చదువు నేర్చించేవారు . కానీ ఇప్పుడు మన ఆధునిక విద్యా విధానంలో విలువలను పూర్తిగా తొలిగించి కేవలం చదువు మాత్రమే చెపుతున్నారు. అందుకే ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా విలువలు, నైతికత అనే ముఖ్య లక్షణాలు లేక సాటి మనిషిని మోసం చేయడం, బలహీనతలను వదులుకోలేక పతనం కావడం వంటివి జరుగుతున్నాయి. ఇవి మన ఆధునిక తరాన్ని అలాగే మన దేశ సంస్కృతిని, వారసత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ పరిణామాన్ని వీలైనంత తొందరగా తొలిగించకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( ఎమ్‌సీఐ) వైద్య విద్యలో విలువలు అనే సబ్జెక్ట్ ను ప్రవేశపెట్టింది. ఇదే స్ఫూర్తితో మిగిలిన పాఠ్యాంశాల్లో కూడా విలువలు అనే సబ్జెక్ట్ చేర్చాలి. మనిషిగా ఎలా ఎదగాలి.? నైతికతతో ఎలా జీవించాలి? నిజమైన ఎదుగుదల అంటే ఏమిటి? వంటి విషయాలను భోధించాలి. అప్పుడే విలువలతో కూడా ఆరోగ్యవంతమైన తరం తయారవుతుంది. అది జరగనంత వరకూ ఇలాంటి మోసాలు, ప్రలోభాలు కొనసాగుతూనే ఉంటాయి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)