టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్..ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా??

 

వినడానికి చాలా సులభంగా అనిపించినా ఇంటర్వ్యూలో మాత్రం ఈ ప్రశ్న అభ్యర్ధలకు వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే ఆ ప్రశ్న అభ్యర్ధుల భవిష్యత్ ను డిసైడ్ చేస్తుంది. ఒక అభ్యర్థికి ఉద్యోగం వస్తుందా ? రాదా? అన్నది సరిగ్గా ఇక్కడే తేలిపోతుంది. అటువైపు రిక్రూటర్లు కూడా ఈ ప్రశ్న ద్వారానే తమకు కావాల్సిన అభ్యర్దులను ఎంపిక చేసుకుంటారు? ఉద్యోగాన్ని సాధించడంలో ఇంటర్వ్యూ అనేది చాలా కీలకం. చాలా మంది ఈ దశను దాటడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అకడమిక్ లో మంచి మార్కులు తెచ్చుకున్న వారు కూడా ఇంటర్వ్యూ దశ వచ్చేటప్పటికీ తడబడుతూ ఉంటారు. ఎందుకంటే రిక్రూటర్లు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు? ఏం సమాధానం చెప్తే వాళ్లు సంతృప్తి పడతారు అన్న విషయాలు తెలియడం అన్నది ఇంటర్వ్యూకు వెళ్లేవారికి అతిపెద్ద సవాలు. అయితే ధైర్యం, చిన్న అవగాహన, ఎక్స్‌పర్ట్స్ చెప్పే సూచనలు పాటిస్తే ఇంటర్వ్యూ గండాన్ని దాటి ఉద్యోగాన్ని పట్టడం అంత కష్టమేమీకాదు.

 

 

మీ గురించి మీరు చెప్పుకోవడం అంత సులువేమీ కాదు!

 

ఇంటర్వ్యూ గది లోకి వెళ్లగానే రిక్రూటర్ ముందుగా నీ గురించి చెప్పు అనగానే చాలా మంది అభ్యర్ధులకు చెమటలు పడతాయి. అసలు రిక్రూటర్ తన నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలియదు. ఏం చెపితే ఏం అవుతుందో. ఎలా చెపితే వాళ్లకు నచ్చుతుందో? ఇలాంటి సందేహాలు ఒక్కసారిగా వారిని గందరగోళంలో పడేస్తాయి. అందుకే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న చాలా మందికి భయాన్ని కలుగుజేస్తుంది. అయితే కొద్దిగా సాధన చేస్తే ఈ ప్రశ్నకు చాలా సులువుగా జవాబు చెప్పవచ్చని హెచ్‌ఆర్ ఎక్స్‌పర్ట్స్ చెపుతున్నారు. అసలు నిజానికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న మనల్ని గూర్చి మనం చెప్పుకునేందుకు వచ్చే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్న వాళ్లకు ఉద్యోగం గ్యారంటీ.

 

 

రెజ్యుమెలో అంతా ఉంది కదా? మళ్లీ ఎందుకు చెప్పడం?

 

ఇంటర్వ్యూలో చాలా మంది అభ్యర్ధులకు కలిగే మొదటి సందేహం ఇదే. రెజ్యుమెలో మొత్తం సమాచారం ఉన్నప్పుడు మళ్లీ ఎందుకు అడగడం అనుకోవడం అనవసర సందేహం. అసలు నిజానికి అక్కడే ఉంది అసలైన కిటుకు. కాస్త నిదానంగా ఆలోచిస్తే విషయం అర్ధమవుతుంది. రెజ్యుమెలో ఉన్న విషయం తెలుసుకుని సంతృప్తి చెంది మిమ్మల్ని ఇంటర్వ్యూకు పిలిచారు. అయినా మిమ్మల్ని అడుగుతున్నారు అంటే అర్ధమేమిటంటే..రెజ్యుమెలో లేనిది ఇంకా ఏమైనా ఉంటే చెప్పండని వాళ్ల ఉద్దేశం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రశ్నకు చెప్పే సమాధానంలో రెజ్యుమెలోని లేని విషయాలు చెపితే చాలా మంచిది. మన నేపథ్యం, కష్టపడే తత్వం, నేర్చుకునే ఆసక్తి ఇలా చాలా విషయాలు చెప్పొచ్చు. అయితే ఆ సమాధానంలో మీ నైపుణ్యం, అనుభవం కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది తెలియజేయాలి.

 

 

రెజ్యుమెలో ఉన్నవాటినే తిప్పి చెపితే ఉద్యోగం రానట్టే!

 

ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రశ్నలో చాలా మంది అభ్యర్ధులు ఒకటే తప్పు చేస్తారు. అదేంటంటే రెజ్యుమెలో ఉన్న విషయాలనే మళ్లీ మళ్లీ చెపుతారు. ఇది రిక్రూటర్లకు ఎంత మాత్రం నచ్చదు. ఎందుకంటే మీరు వాళ్ల సమయాన్ని వృధా చేస్తున్నట్టు వాళ్లు భావిస్తారు. ప్రత్యేకంగా అడిగితే తప్ప మీ హాబీలు, వ్యక్తిగత అభిరుచులు, ప్రాధాన్యాల గురించి చెప్పకూడదు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న మీతో మాటలు కలపడానికి రిక్రూటర్ కు వీలు కల్పించే ప్రశ్న. తమ కంపెనీకి సరిపోయే అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలన్న ఒత్తిడి రిక్రూటర్ పై కూడా ఉంటుంది. కాబట్టి మీరు సరైన ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగితే ఉద్యోగం మీకే రావచ్చు. మీ గురించి మీరు చెప్పుకుంటున్నప్పుడు సమాధానాన్ని ఒకటి రెండు నిమిషాల్లోనే ముగించేందుకు ప్రిపేర్ కండి.

 

 

సమాధానాలు ఇలా ఉండాలి!

 

కంపెనీ ఆఫర్ చేస్తున్న ఉద్యోగానికి మీరు ఏ విధంగా సరిపోతారో రిక్రూటర్ సరైన పద్ధతిలో వివరించండి. సదరు జాబ్ కు సరిపోయే అర్హతలు, ఒకవేళ ఎక్కువ అర్హతలు ఉన్నప్పటికీ ఆ ఉద్యోగానికి మీరు ఏ విధంగా న్యాయం చేయగలరో వివరించండి. ఆ రంగంలో మీ అనుభవం. సాంకేతిక నైపుణ్యాలు, అదే విధంగా మీరు ఆ ఉద్యోగాన్ని చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో కూడా రిక్రూటర్ కు స్పష్టంగా తెలియజేయగలగాలి. మీ బలాలను ప్రభావవంతంగా చెప్పడమే కాదు. ఇంటర్వ్యూకు వచ్చిన మిగిలిన అభ్యర్ధుల కంటే వాళ్ల కంటే మీరు మెరుగు అన్నట్టు ఓ రెండు, మూడు అంశాలనైనా కొత్తగా ప్రజంట్ చేయగలగాలి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం బాగున్నప్పటికీ సవాలుతో కూడుకున్న కొత్త జాబ్ ను ఆస్వాదించాలనుకుంటున్నట్టు చెప్పండి. ఇంకో ముఖ్య విష‍యం ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఒక సంభాషణ రూపంలో జరగాలి. కానీ మీపాటికి మీరు మాట్లాడుకుంటూ , ఒక్కరే కంఠతా పెట్టినట్టు చెప్పుకుంటూ పోతే మీకు ఉద్యోగం రాదు.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)