ప్రచారం ఊరికే రాదు..ఇవన్నీ ఫాలో కావాల్సిందే!

 

య‌ద్య‌దాచ‌ర‌తి శ్రేష్ఠః త‌త్త‌దేవేత‌రో జ‌నః
స య‌త్ప్ర‌మాణం కురుతే లోక‌స్త‌ద‌నువ‌ర్త‌తే

 

భ‌గ‌వ‌ద్గీత‌లోని ఈ శ్లోకం అర్ధ‌మేమిటంటే.. ‘ఉత్త‌ములైన వారు దేనిని ఆచ‌రిస్తారో, దానినే ఇత‌రులు కూడా ఆచ‌రిస్తారు. అలానే ఉత్త‌ములు దేనిని అయితే ప్ర‌మాణముగా అంగీక‌రిస్తారో లోక‌మంతా కూడా దానినే అనుస‌రిస్తుంది’. భ‌గ‌వ‌ద్గీత‌లోని ఈ శ్లోకాన్ని స‌రిగ్గా అర్ధం చేసుకుంటే మ‌న‌ వ్యాపారాభివృద్ధికి అతికిన‌ట్టు స‌రిపోతుంది .వ్యాపారంలో ఒక బ్రాండ్ ను క్రియేట్ చేయడం అన్నది ఆషామాషీ విష‌యం కాదు. చెమ‌టోడ్చి సృష్టించిన బ్రాండ్ విలువ‌ను నిల‌బెట్టుకోవ‌డం, దాన్ని పెంచుకోవ‌డం కాస్త శ్ర‌మ‌తో కూడిన ప‌నే. అయితే భ‌గ‌వ‌ద్గీత‌లోని ఈ శ్లోకాన్ని అనుస‌రించి త‌మ‌ను తాము ఉత్త‌ములుగా తీర్చిదిద్దుకున్న‌వాళ్ల‌ను మిగిలిన వాళ్లు త‌ప్పుకుండా అనుస‌రిస్తారు. మీ బ్రాండ్ ను మీరు ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ఇంత‌కంటే మంచి మార్గం ఇంకేముంది? మీకు స‌మాజంలో మంచి పేరు, ప్ర‌తిష్ఠ ఉంటే అంద‌రూ మిమ్మ‌ల్నే ప్రామాణికంగా తీసుకుంటారు. మీరు ప్ర‌వ‌ర్త‌న‌లో, న‌డ‌వ‌డిక‌లో ఉన్న‌తంగా ఉన్న‌ప్పుడు మీ బ్రాండ్ ను ప్ర‌చారం చేసేందుకు వేరే ఎవ‌రూ అవ‌సరం లేదు. మీ బ్రాండ్ కు మీరే అంబాసిడ‌ర్.

 

 

బ్రాండ్ కు ప్ర‌చారం అంటే విశ్వ‌స‌నీయ‌త‌కు ప్ర‌చారం!

 

తాజాగా కొన్ని సంస్థ‌ల‌కు ప్ర‌చారం చేసి న‌టీన‌టుల‌పై కొంద‌రు కోర్టుల్లో కేసులు వేసారు. ఎందుకంటే వారిపై న‌మ్మ‌కంతో వారు చెప్పిన మాట‌ల‌ను న‌మ్మి స‌ద‌రు కొనుగోలు జ‌రిపామ‌ని అయితే ఆ కొనుగోలు వ‌ల‌న తాము న‌ష్ట‌పోయామ‌ని కాబట్టి ప్ర‌చారం చేసినవారే త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌న్న‌ది వారి వాద‌న‌. బాగా త‌ర‌చి చూస్తూ వారి వాద‌న‌లో నిజం కూడా క‌నిపిస్తుంది. ఎందుకంటే స‌మాజంలో ఉన్న‌త స్థానంలో ఉన్న గౌర‌వ‌ప్ర‌ద‌మైన వ్య‌క్తులు ప్ర‌చారం చేయ‌డం వ‌ల‌న చాలా మంది స‌ద‌రు కంపెనీ ఎలాంటిదో, ఏమిటో తెలుసుకోకుండా వారిని న‌మ్మి కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మంచి పేరు ప్ర‌తిష్ఠ‌లు ఉన్న సెల‌బ్రెటీలు ప్ర‌చారం చేస్తే ఆ బ్రాండ్ కు మ‌రింత విలువ పెరుగుతుందన్న‌ది కంపెనీల వ్యాపార వ్యూహం. అది ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌నిచేస్తూనే ఉంది. సినిమా స్టార్ల‌తో , స్పోర్ట్స్ స్టార్ల‌తో ప్ర‌చారం చేయిస్తూ కంపెనీలు త‌మ బ్రాండ్ విలువ‌ను పెంచుకుంటున్నాయి. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఇది మోస‌పూరిత చ‌ర్య కింద‌కు వ‌స్తోంది. ఎందుకంటే తాము ఉప‌యోగించ‌ని వ‌స్తువుల‌కు చాలా మంది స్టార్లు ప్ర‌చారం చేస్తున్నారు. అంద‌రికీ స‌ద‌రు వ‌స్తువును కొన‌మ‌నో, వాడ‌మ‌నో చెపుతున్నారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు. అందుకే ఇప్పుడు ఎవ‌రి బ్రాండ్ కు వారు ప్ర‌చారం చేసుకునే కొత్త ప‌ద్ధ‌తి వ‌చ్చింది. ఇది వ్యాపార రంగంలో కొత్త విప్ల‌వమే కాదు భ‌గ‌వ‌ద్గీత‌లో ఉన్న వ్యాపార మెళుకువ‌ల‌కు కొత్త రూపం.

 

 

మీరుండగా మీ బ్రాండ్ కు వేరే ప్రచారకర్త ఎందుకు?

 

ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన యాడ్స్ లో లలితా జ్యూయలర్స్ యాడ్ ఒకటి. డబ్బులెవరికీ ఊరికే రావు అంటూ వచ్చే ఆ సంస్థ అధినేత కిరణ్ తన బ్రాండ్ ను బాగా ప్రమోట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తన తోటి వ్యాపారస్తుల్లా ఆయన పెద్ద పెద్ద సినీ స్టార్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోలేదు. తన బ్రాండ్ కు తనే బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. భగవద్గీతలో, మేనేజ్‌మెంట్ పాఠ్యాంశాల్లో చెప్పిన విధంగా ఒక వ్యాపార సంస్థకు వ్యాపారవేత్త కంటే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఎవరూ ఉండరు. ఎందుకంటే బ్రాండ్ అనేది విశ్వసనీయతకు ప్రతిరూపం. పారితోషకం తీసుకుని వచ్చే బయటి వ్యక్తులు అటువంటి విశ్వసనీయతను కల్పించలేరు. స్వల్పకాలానికి కంపెనీకి లాభం చేకూరినా అది ధీర్ఘకాలం కొనసాగాలన్నా వినియోగదారుల్లో పూర్తి విశ్వాసాన్ని చూరగొనాలన్నా ఎవరి బ్రాండ్ ను వారే ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పటికే విదేశాల్లో బాగా పాపులర్ ఈ మేనేజ్‌‌మెంట్ సూత్రం ఇప్పుడు ఇండియాలో కూడా మెల్లగా అడుగుపెట్టింది. మీరు ప్రారంభించింది ఎంత చిన్న సంస్థ అయినా సరే మీ బ్రాండ్ ను మీరే ప్రమోట్ చేసుకోండి. మీరు వ్యక్తిగతంగా విలువలతో, విశ్వసనీయతతో కూడిన నమ్మకాన్ని సంపాదించుకుంటే మీ బ్రాండ్ కూడా ఉన్నతంగా ఎదుగుతుంది.

 

 

మీలోని మంచి లక్షణాలే మీ బ్రాండ్!

 

కొన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తే మనకు కొన్ని విషయాలు అర్ధమవుతాయి. ఉదాహరణకు సినీ రంగంలో ప్రస్తుతం సూపర్ స్టార్లుగా ఉన్న రజనీకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి వారు ఎందుకు అంత క్రేజ్ సంపాదించుకున్నారు? వాళ్లు మిగతా వాళ్లలా అద్భుతంగా నటించలేరు, డ్యాన్స్ లు చేయలేరు అయినా సరే ఇవన్నీ అవలీలగా చేసే మిగతా నటీనటుల కంటే ప్రేక్షకులు అభిమానాన్ని పొందారు. ఎందుకు? తెర వెనుక వారి వ్యక్తిత్వం..వాళ్ల సింప్లిసిటీ..విశ్వసనీయత అనే లక్షణాలు వాళ్లకు క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. సూపర్ స్టార్లను చేసాయి. ఔత్సాహికులు తమ బ్రాండ్ ప్రమోషన్ లో కూడా ఇదే సూత్రాన్ని అమలు చేయాలి. ముందు వ్యక్తిగతంగా ఉన్నతంగా ఎదిగి అందరి దగ్గర విశ్వసనీయతను సంపాదించుకుంటే మిగిలిన వాళ్లు మిమ్మల్ని అనుసరించేందుకు మీరు చెప్పింది వినేందుకు సిద్ధంగా ఉంటారు. మీరు చెప్పిన మాటకు విలువ ఉంటుంది. అప్పుడు మీరే మీ బ్రాండ్ కు వెలకట్టలేని అద్భుతమైన ఆస్తి అవుతారు. ఇక మీ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి డబ్బులు తీసుకుని నటించే అంబాసిడర్లు అస్సలు అవసరం లేదు.

 

 

సమూహం ముందు నడవడం నేర్చుకోండి!

 

మనం ముందు చెప్పుకుంటున్నట్టు సరిగ్గా అర్ధం చేసుకోవాలే కానీ భగవద్గీతలో ప్రతీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది వ్యక్తిగత ఎదుగుదల కావచ్చు..వ్యాపారపరమైన ఎదుగుదల కావచ్చు. పరిష్కారాన్ని వెతుక్కునే సామర్ధ్యం ఉండాలి అంతే. ముందు మనం ఉత్తములుగా మారితే మనల్ని నమ్మేందుకు అంతా రెడీగా ఉంటారు. అదే బ్రాండ్ ను క్రియేట్ చేసుకోవడంలో మూల సూత్రం. భగవద్గీత మనకు చెపుతోంది కూడా అదే. అందుకు మనిషిగా ఎదిగేందుకు ముందుగా ప్రయత్నాలు చేయండి. అది చేయగలిగితే దాన్ని అనుసరించి మిగతా అన్నీ మనల్ని వెన్నంటి వస్తాయి. అది కీర్తి కావచ్చు. డబ్బు కావచ్చు. మరేదైనా కావచ్చు. అయితే అవన్నీ రావడానికి ముందు మీ దగ్గర విశ్వసనీయత అనే ముఖ్య లక్షణం ఉండాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)