జీతాల్లేని ఈ ఫేస్‌బుక్ కూలీలు ఏం చేస్తున్నారో తెలుసా??

 

సోష‌ల్ మీడియా..గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో మాన‌వాళి జీవితాల‌ను విశేషంగా ప్ర‌భావితం చేసిన ఒక సామాజిక విప్ల‌వం. రెండు వైపులా ప‌దునున్న ఈ సామాజిక మాధ్య‌మం అనే క‌త్తితో ప్ర‌జ‌లు కూర‌గాయ‌లు కోసుకోవ‌డం మాని త‌మ గొంతుల‌తో పాటు ప‌క్క‌వాళ్ల గొంతులు కూడా తెగ్గోస్తున్నారు. ప‌క్క ఇంట్లో ఉన్న‌వాడికి కూడా అభినంద‌న‌లో, ఆప్యాయ‌త‌తో, ఆస‌రానో అందిచాల్సిన టైంలో కూడా ఒక మెసెజ్ , ఒక లైక్ ప‌డేసి మానవ సంబంధాల‌ను గొయ్యి తీసి పాతిపెట్టేస్తున్నారు. భావ వ్య‌క్తీక‌ర‌ణ పేరుతో ఫేస్‌‍బుక్ లో, ట్విట్ట‌ర్ లో పెద్ద గొంతు వేసుకుని ప‌డిపోయే న‌యా ఉత్త‌ర కుమారులు బ‌య‌ట‌కు వ‌చ్చి రోడ్డు మీద ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేని ద‌ద్ద‌మ్మ‌లుగా త‌యార‌య్యారు. ఒక మ‌నిషి ఎదురుగుండా మాట్లాడే ధైర్యం లేక‌, ఒక విష‌యం గూర్చి కూలంకుషంగా చ‌ర్చించే విజ్ఞానం లేక కామెంట్ల రూపంలో, పోస్ట్ ల రూపంలో అర‌కొత పైత్యాన్ని, ద్వేషాన్ని వెళ్ల‌గ‌క్కుతూ మాన‌సిక రోగులుగా మారిపోతున్నారు. ప‌రిస్థితి ఇలానే కొనసాగితే మానవ సంబంధాలు దెబ్బ‌తిన‌డంతో పాటు మ‌నుష్యులు మాన‌సికంగా ప‌రిణితి సాధించ‌లేని ఒక దుర్భ‌లురుగా మారిపోయే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియా విసృతి, అది మ‌నుష్యు జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన వైనం, బీట‌లు వారుతున్న బంధాలు, సామాజిక మాధ్యమాల పుణ్యమాని పెరుగుతున్న మాన‌సిక రుగ్మ‌త‌ల‌పై “కెరీర్ టైమ్స్” అందిస్తున్న ప్ర‌త్యేక విశ్లేష‌ణ.

 

 

అస‌లు ల‌క్ష్యం ఎప్పుడో నీరుగారిపోయింది!!

 

బ‌య‌ట స‌మాజంలో ఒక అన్యాయం జ‌రిగింది.. లేదా ఒక అక్ర‌మం జ‌రిగింది.. ఇది బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డానికి మ‌న‌కు ఒక‌ప్పుడు వార్తాప‌త్రిక‌లు, వార్తా ఛానెళ్లు వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియానే దిక్కు. వాళ్లు రిపోర్ట్ చేసింది విని మ‌నం ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించి ఒక అభిప్రాయానికి వ‌చ్చేవాళ్లం. త‌ర్వాత సోష‌ల్ మీడియా రంగ ప్ర‌వేశం చేసింది. ఒక‌ విష‌యం లేదా సంఘ‌ట‌న జ‌రిగిన‌ వెంట‌నే అంద‌రూ త‌మ అభిప్రాయాల‌ను, అనుభ‌వాల‌ను, ప‌రిష్కార మార్గాల‌ను సోష‌ల్ మీడియాలో సూచిస్తారు. దీని వ‌ల‌న స‌మ‌స్య‌కు చాలా వేగంగా ప‌రిష్కారం దొరుకుతుంది. అయితే ఇంత అద్భుత‌మైన వేదిక‌ను విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగిస్తూ, స్వీయ గుర్తింపు కోస‌, విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌నకు వాడుకోవ‌డంతో ఈ వేదిక అస‌లు ల‌క్ష్యం మెల్ల‌గా ప‌క్క‌దారి ప‌ట్టింది. దీంతో అస‌త్యాల‌ను, సొంత అజెండాల‌ను ప్ర‌చారం చేసే కొన్ని మెయిన్ స్ట్రీమ్ వార్తా సంస్థ‌ల‌కు, సోష‌ల్ మీడియా అనేది అనుబంధ సంస్థ‌గా మారిపోయింది. దీంతో సామాజిక మాధ్యమం ఆవిర్భావ ల‌క్ష్యం నీరుగారిపోయింది. ఈ విష‌యాన్ని గుర్తించ‌కుండా అవ‌స‌రానికి మించి సోష‌ల్ మీడియాలో విహ‌రిస్తూ త‌న తెలివితేట‌లను, త‌న సామాజిక బాధ్య‌త‌ను, త‌న గొప్ప‌తనాన్ని కేవ‌లం త‌న వాల్ మీదే ప్ర‌ద‌ర్శించుకుంటున్నారు.

 

 

స్వీయ గుర్తింపు కోసం పాకులాట త‌ప్ప నిబ‌ద్ధ‌త ఏది??

 

ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ లో రెచ్చిపోయేవాళ్లు, లింక్డ్ ఇన్ లో ఫోటోల‌తో హ‌ల్ చ‌ల్ చేసేవాళ్లు నిజంగా ఒక మ‌నిషి ఎదురుగా నిల్చుని మాట్లాడ‌గ‌ల‌రా? అంటే క‌చ్చితంగా లేరు అనే చెప్పాలి. ఒక నాయకుడి కోసం, అతని అవినీతి కోసం , అతని అసమర్దత కోసం ప్రతీరోజూ ఫేస్‌బుక్ లో పుంఖాపుంఖాలు రాసే మహానుభావులు ఆ నాయకుడి రోడ్డు మీద నడిచిపోతుంతే కనీసం దగ్గరగా వెళ్లేందుకు కూడా ధైర్యం చేయరు. ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం వీళ్లకి లేదు. తమ ఆక్రోషానికి కాస్త పైత్యాన్ని రంగరించి ఫేస్‌బుక్ లో పోస్ట్ లు పెడుతూ పేపర్ పులులుగానే మిగిలిపోతారు. వీళ్లు పెట్టిన పోస్ట్ లకు పదిమంది లైక్ కొడితేనో లేక బాగుంది అని కామెంట్ చేస్తేనో నేను సమాజానికి ఎంతో చేసాను అనుకుంటూ భ్రమల్లో బతికేస్తూ ఒక రకమైన మానసిక ధౌర్బల్యంలోకి జారిపోతున్నారు. వీళ్లకు ఎంతసేపు గుర్తించబడాలనే తాపత్రయం తప్పితే చిత్తశుద్ధితో పనిచేయాలనే విధానం ఉండదు. అవతలి వాడ్ని నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో తిడుతూ ఒక రకమైన చెత్తను పోస్ట్ చేస్తూ దానికి మురిసిపోతూ పైగా తాను నిజమైన సామాజిక సేవకులుగా ఊహించుకుంటారు. వీళ్లలో ఒక్కరూ కూడా బయటకు వచ్చి సమస్యపై స్పందించి దాన్ని క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్న దృష్టిలో ఉండరు. ఒక వ్యక్తికి పెద్ద ఆపద వచ్చింది నాకు ప్రత్యక్షంగా సహాయం చేయండి అని ఫేస్‌బుక్ లో పోస్ట్ వస్తే ఎంతమంది ఆ బాధితుడి ఇంటికి వెళ్లి ఆ ఆపదను తీరుస్తారు. ఒక్కరూ కూడా వెళ్లరు. ఎవరిదైనా పుట్టిన రోజు రాగానే వాట్సాప్ లో మెసెజ్ , ఫేస్‌బుక్ లో ఒక గూగుల్ డస్ట్ ఫోటోను పెట్టి చేతులు దులుపుకునే వారు ఇప్పుడు ఎక్కువైపోయారు. ప్రత్యక్షంగా వెళ్లి అతనికి శుభాకాంక్షలు చెపుదాం. అనుబంధాన్ని, ఆత్మీయతను పెంచుకుందాం అనుకునే వాళ్లు ఎంతమంది?

 

 

ప్రశ్నించే ధైర్యం ఉన్నవాళ్లే విజేతలు!!

 

అణగారిన వర్గాలు, లేదా అణిచివేయబడిన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించాలంటే ప్రశ్నించే ధైర్యం కావాలి. కానీ ఇప్పుడు చాలా మంది కేవలం సామాజిక మాధ్యమాల్లోనే ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చి నాయకులను, అధికారులను ప్రశ్నించడం మానేసారు. ఒక నాయకుడ్ని, అధికారిని ప్రత్యక్షంగా కలిసి అతని నిలదీయలేని వారు సమాజాన్ని ఎలా మార్చగలుగుతారు. అలా అని ఒక సమస్యపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని కాదు. అలా పోస్ట్ చేయడం వలన ఆ సమస్య తీవ్రత పదిమందికి తెలుస్తుంది. ఈ పది మందితో ఫేస్‌బుక్ లో చర్చ పెట్టి కామెంట్లు చేసుకుంటూ అభిప్రాయాలను చెప్పుకుంటూ పోతే సమస్యకు పరిష్కారం రాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. అధికారానికి చేరువ కావాలన్నా, సామాజిక మార్పును సాధించాలన్నా ఎవరినైనా ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యాన్ని సంపాదించుకోవాలి. అలా కాకుండా సామాజిక మాధ్యమాల్లో అవాకులు, చెవాకులు వాగితే ఉపయోగం ఏముంటుంది? ఒక అన్యాయం జరిగినప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించాల్సిందే. కానీ అదే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోతే సమస్య ఎక్కడ ఉందో అక్కడకు వెళ్లి దాన్ని పరిష్కరించేది ఎవరు? ఫేస్‌బుక్ పేపర్ పులులు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక విషయంపై ఒక పోస్ట్ పెట్టి తన సామాజిక బాధ్యత అద్భుతం అంటూ తనలో తానే మురిసిపోయి ఒక రకమైన మానసిక రుగ్మతకు లోనవుతున్నారు.

 

 

“గుడ్ మార్నింగ్” , “గుడ్ నైట్” బ్యాచ్ ను వదిలించుకోండి!

 

ఇప్పుడు వాట్సాప్ లో కొత్త రకం వ్యక్తులు తయారయ్యారు. ఉదయం లేవగానే తన ఫోన్ బుక్ లో ఉన్నవారందరికీ ఒక గుడ్ మార్నింగ్ మెసెజ్ పెడతారు. తన పక్కనే ఉన్న తన భార్యకో, తన ఆత్మీయులకో గుడ్ మార్నింగ్ చెప్పరు కానీ ఇలా వాట్సాప్ లలో గుడ్ ‌మార్నింగ్ లు చెపుతారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుతారు. వీళ్లలో ఒక్కరు కూడా తన ఫ్రెండ్ ను ప్రత్యక్షంగా కలిసి విషెస్ చెప్పరు. వాట్సాప్ ఒక మెసెస్ టైప్ చేసి చేతులు దులుపుకుంటారు. కనీసం ఫోన్ చేసి అయినా వాళ్లతో మాట్లాడాలి అన్న ఇంగితం కూడా మర్చిపోయారు. దీనికి తోడు ఒక వాట్సాప్ మెసెజ్ రాగానే వెనుకా ముందా చూడకుండా అందరి ఫ్రెండ్స్ కు ఫార్వార్డ్ చేసేయడం. తాము తమకు తెలియకుండా అబద్ధాలను ప్రచారం చేసే వాహకాలుగా పనిచేస్తున్నామన్న సోయ కూడా ఎప్పుడో మర్చిపోయారు. ఒక మెసెజ్ రాగానే అందులో నిజమెంత? అందులో ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఈ మెసెజ్ వలన వచ్చే పరిణామాలేంటి? అన్న విషయాలు ఆలోచించకుండా ఉన్నత విద్యావంతులు కూడా మెసెజ్ లను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఎంతసేపూ ఫార్వార్డ్ మెసెజ్ లు చేసి చేసీ సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు. ఒక విషయంపై తన సొంత అభిప్రాయాలను రాసి దానిపై విమర్శలను కూడా స్వీకరించే స్థాయి ఎంత మందికి ఉంది. ఒక అద్భుతమైన మాధ్యమాన్ని దుర్వినియోగం చేయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ తన ఒక్కడికే పరిమితం అనుకోవడం, తాను చేసిందే కరెక్ట్ అనుకోవడం వంటి అవలక్షణాలను పెంచుకుంటున్నారు.

 

 

ఈ ఫేస్‌బుక్ కూలీలతో ఈ సమాజానికి పైసా ఉపయోగం లేదు!

 

ఫేస్‌బుక్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే లాభసాటి సంస్థ. దాని వ్యవస్థాపకుడు ఇప్పుడు కొన్ని లక్షల కోట్లకు అధిపతి. విచిత్రం ఏమిటంటే ఫేస్‌బుక్ ఇలాంటి అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లను చాలా మందిని తయారు చేసింది. వీళ్లనే ఇప్పుడు ఫేస్‌బుక్ కూలీలు అని కూడా అంటారు. వీళ్లకి ఫేస్‌బుక్ ఒక పైసా కూడా ఇవ్వదు. వీళ్లు మాత్రం కంటెంట్ రాసి ఫేస్‌బుక్ కు ఆదాయం సమకూరుస్తారు. నిరంతరం ఫేస్‌బుక్ లో విహరించే ఈ అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లే వాళ్లకు ఆస్తి. నిజంగా పనిచేసే వాళ్లు , సమస్యపై స్పందించేవాళ్లు ఫేస్‌బుక్ లో ఒక పోస్ట్ పెట్టి వెంటనే రంగంలోకి దిగిపోతారు. అంతేకానీ ఫేస్‌బుక్ లో చర్చకు దిగరు. తమ స్వీయ గుర్తింపు కోసం పాకులాడరు. పెద్ద బిజినెస్ మ్యాన్‌లు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించండి. వాళ్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో పరిమితంగానే ఉంటారు. క్షేత్ర స్థాయిలో తాము చేసిన పనిని మాత్రమే అందులో ప్రస్తావిస్తారు. క్రేజ్ ఉన్న ఒక హీరోను తిడుతూ ఒకడు, పొగుడుతూ మరొకడు తాము పాపులర్ కావాలని తాపత్రయపడుతూ ఉంటారు. తమ సొంత ప్రతిభతో ఆ పాపులారిటీని సంపాదించుకోవాలని ఒక్కరోజూ అనుకోరు. పాపులారిటీ, గుర్తింపు అనేది చేసే పని, నిజాయితీ, కష్టించే మనస్తత్వం వలన వస్తుంది. ఇలా సోషల్ మీడియాలో సొంత అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, వాల్ మీద మాత్రమే సామాజిక బాధ్యతను నిర్వర్తించే వాళ్లకు దూరంగా ఉండండి. వీళ్ల వలన దేశానికే కాదు మీకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. బీ కేర్ ఫుల్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్  చేస్తున్నవారు)