మీరు “ది బెస్ట్” అవునో, కాదో తెలుసుకోవాలంటే ఇది చదవండి!!

 

 

బీ ద బెస్ట్..ఇది విన‌డానికి చిన్న ప‌ద‌మే కావొచ్చు. కానీ దీన్ని అందుకోవాల‌న్నా..దీన్ని సాధించాల‌న్నా ఎంతో కృషి , ప‌ట్టుదల కావాల్సి ఉంటుంది. అన్నింట్లోనూ అత్యుత్తంగా ఉండాలంటే మ‌నం చేసే ప‌నులు, మ‌న ప్ర‌వ‌ర్త‌న‌, మ‌న న‌డ‌వ‌డిక ఇలా అన్నీ ఎంతో బాధ్య‌త‌, నాణ్య‌త‌తో కూడి ఉండాలి. వీట‌న్నింటికి తోడు నిజాయితీ ఉండాలి. చేసే ప‌నిలో నిజాయితీ ఉంటే దాని నుంచి వ‌చ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఒక విద్యార్ధి అయినా, ఉద్యోగి అయినా లేదా వ్యాపార‌వేత్త అయినా ద బెస్ట్ గా ఎదాగ‌లంటే ఎన్నో ల‌క్ష‌ణాల‌ను, అర్హ‌త‌ల‌ను స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ గా ఎదగాలంటే ముందుగా మీరు ఎదుటివారికి ద బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. మీ కుటుంబ స‌భ్యులు, మీ సహోద్యోగులు, మీ కింద ప‌నిచేసే వారు, మీరు ప‌నిచేస్తున్న సంస్థ‌, మీ తోటివారు ఇలా ఎవ‌రికైనా అత్యుత్త‌మైన‌ది ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ప్పుడు మాత్ర‌మే మీరు బెస్ట్ గా ఎదుగుతారు.

 

 

బాధ్య‌త అంటే అత్యుత్త‌మ‌మైన‌ది అందించ‌డ‌మే!!

 

ఒక తండ్రి త‌న పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్ ను అందించాలంటే వాళ్ల‌కు అత్యుత్త‌మైన స‌దుపాయాలు క‌ల్పించాలి. మంచి స్కూల్, మంచి పెంప‌కం, మంచి తిండి, మంచి ప్ర‌వ‌ర్త‌న అందించ‌గ‌లిగితే వారు ది బెస్ట్ పౌరులుగా ఎదుగుతారు. కెరీర్ ప‌రంగా, ప్ర‌వ‌ర్త‌న ప‌రంగా, సామాజిక ప‌రంగా అత్యున్న‌తమైన వ్య‌క్తులుగా త‌యార‌వుతారు. ఇక్క‌డ ఇంకో అద్భుత‌మైన విష‌యం దాగుంది. తండ్రి త‌న పిల్ల‌ల‌కు ది బెస్ట్ పెంప‌కం అందించిన‌ప్పుడు దాన్ని అందిపుచ్చుకుని వాళ్లు మంచి పౌరులుగా ఎదిగిన‌ప్పుడు వారు కూడా వాళ్ల పిల్ల‌ల‌తో పాటు స‌మాజానికి అదే విధ‌మైన విలువ‌లు, బాధ్య‌త అందిస్తారు. ఒక ప‌ని చేసినప్పుడు విలువ‌లు, నాణ్య‌త‌, నిజాయితీతో కూడిన ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తారు. దీని వ‌ల‌న వారు ఎవ‌రికి మేలు చేసినా అది అత్యుత్త‌మంగా, మంచిదిగా ఉంటుంది. దాని వ‌ల‌న అవ‌త‌లి వ్యక్తుల‌కు మేలు జ‌ర‌గ‌డ‌మే కాకుండా వీరు కూడా త‌మ అత్యుత్త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో స‌మాజంలో , త‌మ వ్యాపారంలో, ఉద్యోగ జీవితంలో ఉన్న‌తంగా ఎదుగుతారు.

 

 

ఇవ్వ‌డం నేర్చుకుంటే నీకు అన్నీ వ‌స్తూనే ఉంటాయ్!!

 

ఇప్పుడు మ‌న స‌మాజంలో చాలా మందికి ఇవ్వ‌డం అనేది అస్స‌లు తెలీడం లేదు. నేను క‌ష్ట‌ప‌డి సంపాదించాను నేను ఎందుకు ఇవ్వాలి? నేనెందుకు స‌హాయ చేయాలి? అన్న ధోర‌ణి మ‌నుష్యుల్లో పెరిగిపోతోంది. ఇది చాలా త‌ప్పు. మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌దాంట్లో మ‌న సంక్షేమానికి త‌గిన మొత్తాన్ని అట్టిపెట్టుకున్న త‌ర్వాత మిగిలిన దాంట్లో కొంత మొత్తాన్ని ఆప‌ద‌లో, అవ‌స‌రంలో ఉన్న‌వారికి ఇవ్వ‌గ‌లిగితే మ‌న వ్య‌క్తిత్వ నిర్మాణంలో ఎంతో మార్పు వ‌స్తుంది. ఎందుకంటే ఇలా ఆప‌ద‌లో ఉన్న మీ పొరుగువారికో, మీ సహోద్యోగికో, మీ కింద ప‌నిచేసే వారికో మీకు చేత‌నైనంత స‌హాయం చేస్తే అది ఎంతో ఆత్మ సంతృప్తిని అందిస్తుంది. ఇలా ఇవ్వ‌డం వ‌ల‌న మీకు వ‌స్తూనే ఉంటుంది అన్న విష‌యాన్ని ఎప్పుడూ మ‌ర్చిపోకండి. ఎందుకంటే ఒక మంచి స‌దుద్దేశ్యంతో, నిజాయితీగా, మ‌న‌స్ఫూర్తిగా మీరు స‌హాయం చేసిన‌ప్పుడు ప్ర‌కృతి మీకు అంత‌కు రెట్టింపు సంప‌ద‌ను అందిస్తుంది. ఇది సృష్టిలో ఉన్న ఒక అద్భుత‌మైన విష‌యం. కాబ‌ట్టి ఎప్పుడూ మీకు స‌హాయం చేసే శ‌క్తి, అవ‌కాశం ఉన్న‌ప్పుడు క‌చ్చితంగా ఇత‌రుల‌కు స‌హాయం చేయండి. ఒక‌సారి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు అర్జెంట్ 20 ల‌క్ష‌ల అవ‌సరం పడింది. ఎంత సూప‌ర్ స్టార్ అయినా స‌మ‌యానికి డ‌బ్బులు లేక‌పోతే ఎవ‌రినో ఒక‌రిని స‌హాయం కోరాల్సిందే. బ్యాంకు ఖాతాలు, ఇంట్లో ఉన్న బీరువాలు అన్నీ గాలిస్తే 16 ల‌క్ష‌లు స‌మ‌కూరాయి. ఇంకో 4 ల‌క్ష‌లు కావాల్సి ఉంది. స్నేహితుల‌కు ఫోన్ చేస్తే ఒకట్రెండు రోజులు స‌మ‌యం ఇస్తే నాలుగు ల‌క్ష‌లు స‌మ‌కూరుస్తామ‌ని చెప్పారు. ఇంత‌లో ర‌జ‌నీ చిన్న‌నాటి స్నేహితుడు అత‌ని ఇంటికి వ‌చ్చాడు. మా అమ్మాయి పెళ్లి రెండురోజుల్లో ఉంది. ఒక ల‌క్ష రూపాయ‌లు అవ‌స‌రం ప‌డింది. ఎలాగైనా నువ్వే స‌ర్దాలి అని ర‌జ‌నీని అడిగాడు. రజ‌నీకాంత్ వెంట‌నే త‌న ద‌గ్గ‌ర ఉన్న 16 ల‌క్ష‌ల్లో ఒక ల‌క్ష రూపాయ‌ల తీసి త‌న స్నేహితుడికి ఇచ్చి అమ్మాయి పెళ్లి ఘ‌నంగా చేయి అని పంపించాడు. ర‌జ‌నీ చేసిన ప‌నికి అత‌ని భార్య కాస్త నొచ్చుకుంద‌ట‌. మ‌న‌మే ఇప్పుడు డ‌బ్బు అవ‌స‌రం ప‌డి అంద‌ర్నీ అడిగాం. ఇప్పుడు మీరు ఈ స‌హాయం చేయ‌డం అవ‌స‌ర‌మా? అని అడిగింది. దానికి ర‌జ‌నీ నేను ల‌క్ష రూపాయ‌ల స‌హాయం చేస్తే నా స్నేహితుడు ప‌ని సంపూర్ణంగా పూర్త‌వుతుంది. అత‌ను సంతోషంగా ఉంటాడు. నేను నాలుగు ల‌క్ష‌ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నాను. ఈ క్ష‌ణం నుంచి 5 ల‌క్ష‌ల కోసం ప్ర‌య‌త్నిస్తాను. పెద్ద తేడా లేదు. కాబ‌ట్టి స‌హాయం చేయ‌డంలో నాకు వెసులుబాటు ఉంది అందుకే చేసాను అని చెప్పాడు. ఇటువంటి వ్య‌క్తిత్వ నిర్మాణం చేసుకున్నాడు క‌నుక‌నే అత‌ను నిజ‌జీవితంలోనూ సూప‌ర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు మ‌న స‌మాజానికి అలాంటి సూప‌ర్ స్టార్ లు కావాలి.

 

 

చేస్తున్న ప‌నిలో నాణ్య‌త, నిజాయితీ ఉండాలి!

 

మీరు ఒక కంపెనీలో ప‌నిచేస్తున్నారు. ప‌ర్య‌వేక్ష‌ణ లేన‌ప్పుడు ప‌నిచేయ‌కుండా త‌ప్పించుకోవ‌డం, ఏదో చేస్తున్నాం లే అన్న ధోర‌ణిలో ఉండ‌టం వంటివి అస్స‌లు చేయ‌కండి. ఎందుకంటే ఇటువంటి వైఖ‌రి మీ కెరీర్ ను దారుణంగా దెబ్బ‌తీస్తుంది. ఎందుకంటే చేస్తున్న ప‌నిలో నాణ్య‌త, నిబ‌ద్ధ‌త లేక‌పోతే ఆ కంపెనీ వ‌దిలి వేరే కంపెనీకి వెళ్లిన‌ప్పుడు మీ ప‌నితీరు దారుణంగా దెబ్బ‌తిని ఉంటుంది. మీరు ప‌నిచేస్తున్న సంస్థ‌, లేదా య‌జ‌మాని మీకు న‌చ్చ‌ని విధంగా ఉన్న‌ప్ప‌టికీ మీ ప‌నితీరులో ఎటువంటి తేడా ఉండ‌కూడ‌దు. న‌చ్చ‌ని చోటు నుంచి వెళ్లిపోవాలి కానీ ప‌ని చేయ‌డం మానేయ‌డం, నిజాయితీగా లేక‌పోవ‌డం వంటి చేస్తే అది మీ వ్య‌క్తిత్వాన్ని, మీ ఉద్యోగ జీవితాన్ని దెబ్బ‌తీస్తుంది. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్లు తమ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న వాళ్లు విష‌యంలో నిజాయితీగా ఉండాలి. వారికి ఎటువంటి ఆప‌ద వ‌చ్చినా ఆదుకునేందుకు రెడీగా ఉండాలి. అలాగే నిబ‌ద్ధ‌త‌, ప‌నితీరు న‌చ్చ‌ని ఉద్యోగుల‌ను కొన‌సాగించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. వాళ్ల‌ను త‌క్ష‌ణ‌మే వ‌దిలించుకోండి. బెస్ట్ ఇవ్వ‌డానికి ట్రై చేస్తే మీకు ఎప్పుడూ బెస్ట్ ఇవ్వ‌డానికి దేవుడు ట్రై చేస్తూ ఉంటాడు. కాబ‌ట్టి ఉద్యోగ జీవితంలో అయినా వ్యాపారంలో అయినా ఎప్పుడూ చేస్తున్న ప‌నిలో నిజాయితీ, నిబ‌ద్ధ‌త చూపిస్తూ, ఆప‌ద‌లో ఉన్నవారిని ఆదుకునేందుకు మీ ప‌రిధి మేర‌కు ప్ర‌య‌త్నం చేస్తే వ్య‌క్తిగా మంచి స్థితికి చేరుకుంటారు. మంచి చేయ‌కున్నా ఫ‌ర్వాలేదు ఎవ‌రికైనా చెడు చేయాల‌న్న తలంపు వ‌స్తే అది గోడ‌కు కొట్టి బంతిలా రెట్టింపు వేగంతో మీ వైపుకు వ‌స్తుంది. మీకే చెడు జ‌రుగుతుంది. అటువంటి ప్ర‌తికూల త‌పంపులు ఎప్పుడూ మ‌న‌కు మేలు చేయ‌వు.

 

 

విత్త‌నం నాటిన వెంట‌నే ఫ‌లాలు రావు!!

 

పూర్వం ఒక రాజ్యంలో రాజుగారు వేట‌కు వెళ్లి బాగా అలిసిపోయి దాహంతో నీళ్ల కోసం అన్వేషిస్తున్నారు. చాలా సేపు తిరిగిన త‌ర్వాత ఒక బాట ప‌క్క‌న మామిడి టెంక‌లు నాటుతున్న వృద్ధుడు క‌నిపించాడు. రాజును చూసిన వెంట‌నే వృద్ధుడు అత‌ని ఒక చెట్టు కింద‌కు తీసుకెళ్లి దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగాక కాస్త స్థిమిత‌ప‌డ్డ రాజు ఏమ‌య్యా పెద్దాయ‌న బాట ప‌క్క‌న ఇలా మామిడి టెంక‌లు నాటుతున్నావు.ఎందుకు? అని అడిగాడు. దానికి వృద్ధుడు రాజా మామిడి మొక్క‌లు వ‌స్తాయ‌ని ఈ ప‌ని చేస్తున్నా అని చెప్పాడు. దానికి రాజు న‌వ్వి ఈ మొక్క‌లు పెరిగి చెట్టుగా మారి మామిడి పండ్లు ఇచ్చేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది క‌దా? అప్ప‌టి వ‌ర‌కూ నువ్వు బ‌తుకుదాం అనుకుంటున్నావా? అని అడిగాడు. ఆ ప్ర‌శ్న‌కు వృద్ధుడు కూడా న‌వ్వి రాజా నేను నా కోసం ఈ మొక్క‌లు నాట‌డం లేదు. రేప‌టి త‌రం కోసం నాటుతున్నాను. గ‌తంలో ఎవ‌రో ఇక్క‌డ మొక్క నాటారు కాబట్టే మీరు, నేను ఈ చెట్టు కింద కూర్చుని సేద‌తీరుతున్నాం. నేను కూడా అదే విధంగా రేప‌టి మ‌న పిల్ల‌ల కోసం ఈ ప‌ని చేస్తున్నా అని చెప్పాడు. వృద్ధుని దూర‌దృష్టికి, అత‌ని సేవానిర‌తికి ఆశ్చ‌ర్య‌పోయిన రాజు త‌న రాజ్యంలో మ‌రిన్ని చెట్టు నాటించే కార్య‌క్ర‌మం చేప‌ట్టాడు. ఇప్ప‌డు స్టార్ట‌ప్ లు ప్రారంభిస్తున్న ఔత్సాహికులు ఈ క‌థ నుంచి ఎంతో నేర్చుకోవ‌చ్చు. ఒక సంస్థ ప్రారంభించ‌గానే ఫ‌లితాలు వ‌చ్చేయ‌వు. ఓపిగ్గా వ్య‌వ‌హ‌రించి, నిజాయితీగా, నాణ్య‌త ప్రధాన వ‌న‌రుగా ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. ఇవ్వ‌డం నేర్చుకోండి. మీకు వ‌స్తూనే ఉంటుంది. సామ‌ర్ధ్యం మేర‌కు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి ఫ‌లితం ఎలా ఉన్నా దాన్ని తీసుకునే నైపుణ్యాన్ని సాధించాలి. సో..గివ్ ద బెస్ట్ అండ్ యు గెట్ ద బెస్ట్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)