బాగా కిక్ ఇచ్చే డ్రగ్స్ ఏంటో తెలుసా?

 

 

ఇప్పుడు మ‌న దేశంలో మాద‌క ద్ర‌వ్యాలు అతిపెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించాయి. మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌లుగా మార‌డంతో ఉత్సాహంతో ఉర‌క‌లెత్తాల్సిన యువ‌త, జ‌వ‌స‌త్వాలు ఉడిగి య‌వ్వ‌నంలోనే శారీరకంగా మానసికంగా నిర్వీర్వ‌మైపోతున్నారు. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా కుటుంబాల‌కు కుటుంబాలే నాశ‌న‌మై ఆ రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వాలు ఎన్ని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చినా మ‌న దేశంలో ఇప్ప‌టికీ మాద‌క ద్ర‌వ్యాలు సులువుగానే దొరుకుతున్నాయి. ఒకవైపు దేశానికి వెన్నుముక లాంటి యువ‌త మాద‌క‌ద్ర‌వ్యాల సేవ‌నంతో ప‌త‌న‌మ‌వుతుంటే మ‌రోవైపు పాల‌కులు మాత్రం ఇంకా నిషేధం అన్న ద‌గ్గ‌రే నిలిచిపోయారు. అయితే మాదక ద్ర‌వ్యాలపై ఎప్ప‌టి నుంచో నిషేధం ఉన్న‌ప్ప‌టికీ అవి యువ‌త‌కు ఎలా అందుబాటులోకి వ‌స్తున్నాయి? అస‌లు అన్నింటికంటే ముఖ్యంగా కేవ‌లం మాద‌క ద్ర‌వ్యాల‌ను నిషేధిస్తే ఈ పెను స‌మ‌స్య ప‌రిష్కార‌మైపోతుందా? అన్న ప్ర‌శ్న‌లు అతిపెద్ద చ‌ర్చ‌నీయాంశాలు. ఈ నేపథ్యంలో మాద‌క ద్ర‌వ్యాలు, యువ శ‌క్తిపై “కెరీర్ టైమ్స్” ప్ర‌త్యేక విశ్లేష‌ణ‌.

 

 

నిషేధం అన్న ప‌ద‌మే అతిపెద్ద మాద‌క‌ద్ర‌వ్యం!!

 

మ‌నిషి ఆలోచ‌నా విధానం, మాన‌సిక ప‌రిప‌క్వ‌త‌, వికాసం అన్న‌వి అత్యంత సంక్లిష్ఠ‌మైన విష‌యాలు. మానసిక శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నాల ప్ర‌కారం ఫలానా ప‌నిచేయొద్దు..ఫ‌లానా వ‌స్తువును తినొద్దు…ఫ‌లానాది తాకొద్దు, చూడొద్దు..అంటూ నియంత్ర‌ణ‌లు విధిస్తే ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఆ ప‌ని చేయాల‌ని..వ‌ద్దు అన్న‌దాన్నే తినాల‌ని..తాకొద్దు అన్నదాన్నే తాకాల‌ని..చూడొద్దు అన్న దాన్నే చూడాల‌ని మ‌నిషి మ‌న‌స్సు ఉబ‌లాట‌ప‌డుతుంది. ముఖ్యంగా నియంత్ర‌ణ విధించిన ఆ ప‌నులపై అర‌కొర స‌మాచారం, త‌ప్పుడు స‌మాచారం వాటిపై మ‌రింత ఆక‌ర్ష‌ణ పెరిగేలా చేస్తుంది. దీంతో వాటిని ఎలాగైనా తినాల‌ని, వాటిని సాధించి అందులోని మ‌జాను ఆస్వాదించాల‌ని మ‌న‌స్సు ఉవ్విళ్లూరుతుంది. మాద‌క ద్ర‌వ్యాల విష‌యంలో ఇప్పుడు స‌రిగ్గా ఇలానే జ‌రుగుతోంది. వాటికి నిషేధం అన్న ముసుగు వేయడంతో ఆ ముసుగు వెన‌కాల అద్బుత‌మైన ఆనందం దాగి ఉంద‌ని యువ‌త‌ను పెడ‌దారి ప‌ట్టించే అరాచ‌క శ‌క్తులు ఎక్కువైపోయాయి. దీంతో యువ‌త డ్ర‌గ్స్ ఏదో అద్భుతం దాగి ఉంద‌న్న ఆక‌ర్ష‌ణ‌తో జీవితాల‌ను స‌ర్వ నాశ‌నం చేసుకుంటున్నారు.

 

 

మ‌న రోజువారీ జీవితంలోనూ మాద‌క ద్ర‌వ్యాలు ఉన్నాయి!

 

మ‌న రోజూవారీ జీవితంలో మాద‌క ద్ర‌వ్యాలు ఉండ‌ట‌మేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అవును మీరు చ‌దివింది నిజ‌మే. అస‌లు మాద‌క ద్ర‌వ్యం అంటే ఏమిటి? ఒక ప్ర‌త్యేక‌మైన రసాయ‌నాన్ని శ‌రీరంలోకి ఎక్కించుకుని అది అందించే మ‌త్తులోకి జారిపోవ‌డ‌మే క‌దా? మాద‌క ద్రవ్యాలు అంటే కొకైన్, హెరాయిన్, గంజాయి వంటివే కాదు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో వాడే కొన్ని ర‌కాల మందులు కూడా మాద‌క ద్ర‌వ్యాలు కింద‌కే వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు షుగ‌ర్ పెషెంట్ల‌కు వాడే కొన్ని ర‌కాల ముందులను డ్ర‌గ్స్ గానే ప‌రిగ‌ణించాలి. అంటే ఆరోగ్యానికి చేటు చేస్తాయ‌ని కాదు. మ‌నిషి ఆ ముందులు వేసుకోవ‌డానికి అల‌వాటు ప‌డి స‌హ‌జ సిద్ధంగా శారీర‌క వ్యాయామం చేసి మంచి స‌మ‌తుల ఆహారం తీసుకుని జీవ‌నశైలిని మార్చుకుని షుగ‌ర్ ను అదుపులోకి తెచ్చుకుందాం అన్న ఆలోచ‌న మ‌ర్చిపోతున్నాడు. కేవ‌లం ఆ డ్ర‌గ్స్ ను శ‌రీరంలో వేసుకుని వాటికి అల‌వాటు ప‌డి అందులోనే జోగుతున్నాడు. అలాగే ప్ర‌స్తుతం మ‌నిషి జీవితాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న స్మార్ట్ ఫోన్, సోష‌ల్ మీడియా వంటి వాటిని కూడా మాద‌క ద్ర‌వ్యాలు గానే ప‌రిగ‌ణించాలి. అవి లేకుంటే ఒక్క‌క్ష‌ణం కూడా మ‌నుగ‌డ సాగించలేని మ‌న బ‌ల‌హీత‌నను డ్ర‌గ్స్ సేవ‌నంతో స‌మాన‌మైన వ్య‌స‌నంగానే చూడాల్సి ఉంటుంది.

 

 

నిషేధంతో మాద‌క ద్ర‌వ్యాల క‌ట్ట‌డి సాధ్యం కాదు!

 

నిషేధం విధిస్తేనో లేక నియంత్రిస్తేనో మాదక ద్ర‌వ్యాల స‌మ‌స్య అంతం కాదు. ఎందుకంటే వాటిని దొంగ దారిలో యువ‌త‌కు చేర‌వేసే ఆరాచ‌క శ‌క్తులు లెక్క‌కు మించి ఉన్నాయి. నిషేధం అనేది ఎప్ప‌టికీ స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌దు. ఇప్పుడు ప్ర‌భుత్వాలు చేయవ‌ల‌సిన ప‌ని నిషేధంతో పాటు స‌మ‌స్య మూలాల్లోకి వెళ్లి దాన్ని తొలిగించే ప్ర‌య‌త్నం చేయ‌డం. పాఠ‌శాల స్థాయి నుంచే పిల్ల‌ల‌కు ధ్యానం, యోగా, కుటుంబ విలువ‌లు, శారీర‌క, మానసిక ఆరోగ్యాల ప్రాధాన్య‌త‌ను వివ‌రిస్తే అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. ధ్యానం చేయడం ద్వారా ల‌భించే అలౌలిక ఆనందం ముందు డ్ర‌గ్స్ అందించే మ‌త్తు బ‌లాదూర్. దీంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌, స్వీయ నియంత్ర‌ణ వంటి విష‌యాల్లో పిల్ల‌ల‌ను సుక్షితులుగా త‌యారు చేయాలి. ఇటు త‌ల్లిదండ్రులు కూడా డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంగా కాకుండా త‌మ పిల్ల‌ల‌కు త‌గిన స‌మ‌యం కేటాయించి వారి పెంప‌కంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వారి అల‌వాట్లు, ప్ర‌వ‌ర్త‌న పై త‌గు నిఘా ఉంచి అదే స‌మ‌యంలో వారికి ధ్యానం, మ‌న‌స్సుని నియంత్రించే విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెపుతూ ఉండాలి. తాత్కాలిక ఆనందాలు, సుఖాలు త‌ర్వాత జీవితాన్ని ఎంత‌గా ప్ర‌భావితం చేస్తాయో, ఎటువంటి ప‌త‌నావ‌స్థ‌కి చేరుస్తాయో వారికి స‌రైన ప‌ద్ధ‌తిలో వివ‌రించాలి. ముఖ్యంగా విలువ‌ల‌తో కూడిన పెంప‌కాన్ని అందించాలి.

 

 

న‌మ్మ‌కంలోని మజాతో జీవితానికి కొత్త చిగురులు!

 

ఒక రోగి తీవ్ర‌మైన శారీర‌క రుగ్మ‌త‌తో డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. అత‌న్ని క్షుణ్ణంగా ప‌రీక్షించిన డాక్ట‌ర్ ఇంకో మూడు నెల‌లు మించి మీరు బ‌త‌కడం సాధ్యం కాద‌ని రోగికి స్ప‌ష్టం చేసారు. దీంతో ఆ రోగి మాన‌సికంగా మ‌రింత‌గా దిగ‌జారిపోయాడు. అత‌ను ఎంత‌గా దిగ‌జారిపోయాడంటే క‌నీసం డాక్ట‌ర్ చెప్పిన మూడు నెల‌లైనా బ‌తుకుతాడా? అన్న సందేహం అంద‌రికీ క‌లిగింది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆ రోగిని ప‌రామ‌ర్శించేందుకు అత‌ని స్నేహితుడు హాస్పిట‌ల్ కు వెళ్లాడు. వృత్తిరీత్యా సైకాల‌జిస్ట్ అయిన రోగి స్నేహితుడు అత‌ని ప‌రిస్థితిని గ‌మ‌నించాడు. అత‌నికి శారీర‌క స‌మ‌స్య కంటే మానసిక స‌మ‌స్య అధికంగా ఉన్న‌ట్టు గుర్తించాడు. త‌న స్నేహితుడ్ని హాస్ప‌ట‌ల్ నుంచి ప్ర‌కృతికి ప్ర‌శాంత‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ఒక ఇంట్లోకి మార్పించాడు. అత‌ని మంచం ప‌క్క‌నే కిటికీ ఉండేట‌ట్టు చూసి అక్క‌డ ఒక మొక్క‌ను నాటాడు. అప్పుడు ఆ రోగితో ఇలా చెప్పాడు. “ఇప్పుడు ఇక్క‌డ ఒక మొక్క‌ను నాటాను. ఈ మొక్క ఆరోగ్యంగా ఎదిగితే నువ్వు కూడా నీ జ‌బ్బు నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టే. ఒకవేళ మొక్క చ‌నిపోతే నువ్వు కూడా తొంద‌ర‌గా చ‌నిపోతావ్” అని చెప్పాడు. ఆ రోగి ప్ర‌తిరోజూ ఉద‌యం లేవ‌గానే ఆ మొక్క వంక ఆశ‌గా చూసేవాడు. ఆ మొక్క మెల్ల‌గా ఆకులు, పూలు కాస్తూ ఏపుగా పెరుగుతోంది. రోగిలో ఆనందం పెరిగింది. త‌న మొక్క ఎంత బాగా పెరుగుతుంది అన్న ఆనందంలో అత‌ను త‌న జ‌బ్బు సంగ‌తే మ‌ర్చిపోయాడు. ఆరోగ్యంగా పెరిగిన ఆ మొక్క‌లానే అత‌ను కూడా ఆరోగ్యంగా త‌యార‌య్యాడు. వాస్త‌వానికి మొద‌ట నాటిన మొక్క తొలిరోజే చ‌చ్చిపోయింది. కానీ రోగికి తెలియ‌కుండా అతని ఒక కొత్త మొక్క‌ను నాటి దానికి త‌గిన నీరు, ఎరువులు వేసి అది బాగా ఎదిగేలా చూసుకున్నాడు. మొక్క బాగా పెరుగుతుంద‌న్న సంతోషంలో రోగి కూడా ఆరోగ్యంగా త‌యార‌య్యాడు. ఈ క‌థ‌లో నీతి ఏంటి మ‌నలోని న‌మ్మ‌కం, ఆనంద‌మే మ‌న స్థితిని నిర్ణ‌యిస్తాయి. అయితే ఆ ఆనందాన్నిఏ విధంగా సంపాదించుకుంటామ‌న్న‌దే ముఖ్యం. మాద‌క ద్ర‌వ్యాలు తీసుకుని, తాత్కాలిక ఆనందాల కోసం వెంప‌ర్లాడితే ఆనందం, ఆరోగ్యం రెండూ దూర‌మ‌వుతాయి.

 

 

మాద‌క ద్ర‌వ్యాల కంటే కిక్ నిచ్చే సాధ‌నాలున్నాయి!!

 

మాద‌క ద్ర‌వ్యాలు, మ‌ద్య‌పానం కిక్ నిస్తున్నాయి కాబ‌ట్టి వాటిని సేవిస్తున్నారు. ఆ కిక్ కోస‌మే ఆరోగ్యం పాడుచేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు. కొంద‌రు వాదిస్తారు. కానీ వాస్త‌వానికి వాటి కంటే కిక్ నిచ్చే విష‌యాలు ఎన్నో ఉన్నాయి. ఒక గంట‌సేపు క‌ద‌ల‌కుండా ఒకచోట కూర్చుని , ఒక విష‌యంపై శ్ర‌ద్ధ పెట్టి త‌దేకంగా ధ్యానం చేస్తే వ‌చ్చే కిక్ ఎన్ని మాద‌క ద్ర‌వ్యాలు తీసుకున్నా రాదు. అలాగే ఒక మంచి ప‌ని చేసిన‌ప్పుడు, సాటి మ‌నిషికి ఉపకారం చేసిన‌ప్పుడు, ఆక‌లితో అల‌మ‌టిస్తున్న పేద‌వాళ్ల‌కు క‌డుపునిండా అన్నం పెట్టిన‌ప్పుడు వ‌చ్చే కిక్ ఎంతో బాగుంటుంది. ఇటువంటి విష‌యాల‌ను ప్ర‌తీ విద్యార్ధికి అటు త‌ల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు చిన్న‌త‌నం నుంచి చెప్ప‌గ‌ల‌గాలి. ఇక ప్ర‌భుత్వాలు కూడా మాద‌క ద్ర‌వ్యాల వంటి పెను స‌మ‌స్య‌ల‌కు నిషేధం అన్న ప‌రిష్కారం మార్గం ద‌గ్గ‌ర ద‌గ్గ‌రే ఆగిపోకుండా స‌మ‌స్య మూలాల‌ను అర్ధం చేసుకుని , విలువలు, క్ర‌మ‌శిక్ష‌ణ‌, స్వీయ‌నియంత్ర‌ణ వంటి విష‌యాల్లో విద్యార్ధులకు మ‌రింత శిక్ష‌ణ ఇచ్చేందుకు విద్యా విధానంలో త‌గిన మార్పులు చేయాలి. అప్పుడు డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి ఎటువంటి నిషేధం అవ‌స‌రం లేకుండానే మ‌న దేశాన్ని వీడిపోతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)