ఆడ‌వాళ్లూ..మీరు ఎవరితో బ‌తుకుతారు?

 

స్త్రీ వాదం..ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మారుతున్న సామాజిక ప‌రిస్థితుల‌కు ఒక నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఏదైనా ఒక సంద‌ర్భంలో ఒక వ‌ర్గానికి లేదా ఒక స‌మూహానికి జ‌రుగుతున్న అన్యాయాల‌కు, అణిచివేత‌కు వ్య‌తిరేకంగా వాదం పుడుతుంది. త‌మ హ‌క్కులు, సౌక‌ర్యాల కోసం ఆ వ‌ర్గం పోరాటం చేస్తుంది. ప్ర‌పంచం చ‌రిత్ర‌ను మ‌నం తిర‌గేస్తే ఈ విష‌యం మ‌న‌కు చాలా సులువుగా అర్ధమ‌వుతుంది. అయితే స్త్రీవాదంలో మాత్రం ఎన్నో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. లింగ స‌మాన‌త్వం కోసం పోరాడ‌టాన్ని స్త్రీవాదం అన‌డంలో ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు కానీ కేవ‌లం పురుషుల‌ను ద్వేషించ‌డాన్నే కొందరు స్త్రీవాదం అనుకోవ‌డంతోనే అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. స్త్రీ, పురుషుల సంగ‌మం లేనిదే ఈ ప్ర‌పంచం లేదు..మ‌నుష్య మ‌నుగ‌డ లేదు..అస‌లు సృష్టికి అర్ధ‌మే లేదు. అయినా కొంద‌రు మ‌హిళ‌లు మొండిగా వ్య‌వ‌హ‌రిస్తూ వాస్త‌వాన్ని, సృష్టి ధ‌ర్మాన్ని, కుటుంబ సంబంధాల‌ను విస్మ‌రిస్తూ పురుష ద్వేష‌మే స్త్రీవాదం అనుకుంటూ అంద‌రి జీవితాల‌ను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇంత‌టి వివాదాస్ప‌ద‌మైన‌, సున్నిత‌మైన విష‌యాన్ని ‘కెరీర్ టైమ్స్’ లో ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌చ్చిందంటే మ‌నిషికి కెరీర్ నిర్మాణం ఎంత ముఖ్య‌మో కుటుంబ నిర్మాణం కూడా అంతే ముఖ్యం.

 

 

మూర్ఖ‌త్వం స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేస్తుంది!

 

అప్పటి వ‌ర‌కూ ఉన్న ఒక వ్య‌వ‌స్థ లేదా ఒక విధానం మెల్ల‌గా మార్పు చెందుతూ సరికొత్త‌గా పరిణామం చెందుతున్న‌ప్పుడు ఒక సంధికాలం ఏర్ప‌డుతుంది. మార్పు అనేది ఎప్పుడూ కాస్త‌ క‌ఠినంగానే ఉంటుంది. అది ఒక్కోసారి వికృత ఫ‌లితాల‌ను కూడా అందిస్తుంది. అలాగే సంధికాలంలో జ‌రిగే మార్పులు కూడా ఒక్కోసారి మొత్తం వ్య‌వ‌స్థ‌నే కుప్ప‌కూల్చే విధంగా ఉంటాయి. ప‌రిణతి చెందని మ‌న‌స్త‌త్వాలు, మొండి ప‌ట్టుద‌ల‌కు పోయే మూర్ఖ‌త్వాలు స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేస్తాయి. ఇప్పుడు స్త్రీ, పురుష సంబంధాల్లో నెల‌కొన్న మార్పులు మొత్తం కుటుంబ వ్య‌వ‌స్థ ఉనికికే ప్ర‌మాద‌కరంగా మారుతున్నాయి. లేనిపోని అన‌వ‌స‌ర ప‌ట్టుద‌ల‌ల‌కు పోయి మొత్తం జీవితాల‌నే నాశ‌నం చేసుకుంటున్న ఒక ప్ర‌మాద‌క‌ర‌మైన స్థితిలో ఇప్పుడు భారతీయ కుటుంబ వ్య‌వ‌స్థ ఉంది. ముఖ్యంగా క‌ట్టుబాటు అనేదాన్ని అణిచివేత‌గా భ్ర‌మ‌ప‌డుతూ కొంద‌రు మ‌హిళ‌లు చేజేతులా జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. ఈ భూమిపై క‌లిసి బ‌త‌కాల్సిన మ‌గ‌వాళ్ల‌పై ప‌గ‌ను, ప్ర‌తీకారాన్ని పెంచుకుంటూ త‌మ జీవితాల‌ను తామే ఇబ్బందుల్లో ప‌డేసుకుంటున్నారు.

 

 

పితృస్వామ్య వ్య‌వ‌స్థ చ‌ర‌మాంకంలో ఉందా?

 

మానవ చ‌రిత్ర‌లో కొత్త‌గా నాగ‌రిక‌త‌లు వెల్లివిరిసిన కాలంలో మాతృస్వామ్య వ్య‌వ‌స్థ మ‌నుగ‌డ‌లో ఉండేది. అంటే మ‌హిళే కుటుంబాన్ని ముందుండి న‌డిపించేది. పోష‌ణ‌, పెంప‌కం, కుటుంబ నిర్ణ‌యాలు వంటివి మ‌హిళ‌లే తీసుకునేవారు. అయితే క్ర‌మంగా పురుషులు ఆ స్థానాన్ని ఆక్ర‌మించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న స‌మాజంలో పితృస్వామ్య వ్య‌వ‌స్థే కొన‌సాగుతోంది.కానీ ఇప్పుడు మ‌ళ్లీ మాతృస్వామ్య వ్య‌వ‌స్థ రావాలంటూ కొంద‌రు మ‌హిళ‌లు వాదిస్తున్నారు. బాధ్య‌త‌లు, బాంధ‌వ్యాల‌ను కాపాడిన‌ప్పుడే అది పితృస్వామ్య వ్య‌వ‌స్థ అయినా మాతృస్వామ్య వ్య‌వ‌స్థ అయినా మ‌నుగ‌డ సాగించ‌గ‌లుగుతుంది. హ‌క్కులు మాత్ర‌మే మాట్లాడుతూ బాధ్య‌త‌ల‌ను గాలికొదిలేసినప్పుడు మాతృస్వామ్య వ్య‌వ‌స్థ వ‌చ్చి ఏం లాభం? మాతృస్వామ్య వ్య‌వ‌స్థ వ‌చ్చినా కేవ‌లం ఆడ‌వాళ్లే మ‌నుగ‌డ సాగించ‌లేరు.క‌దా ? పురుషుల‌తో మ‌మేక‌మై జీవ‌నం సాగించాల్సిందే. లైంగిక‌త ఆధారంగా ఒక మ‌నిషిని ద్వేషిస్తున్న‌ప్పుడు ఒక వ్య‌వ‌స్థ‌ను ఎలా నిర్మించ‌గ‌ల‌రు? ఈ చిన్న విష‌యాన్నిమ‌ర్చిపోయి పురుష ద్వేషం పెంచుకుంటే ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు. కుటుంబాలు, స‌మాజం కుప్ప‌కూలిపోవ‌డం త‌ప్ప.

 

 

ఆడ‌వాళ్లు జీవించాల్సింది మ‌గ‌వాళ్ల‌తోనే!

 

మ‌న స‌మాజంలో ఆడ‌వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా స్కూళ్లు ఉన్నాయి. ప్ర‌త్యేకంగా కాలేజీలు ఉన్నాయి. ఇవ‌న్నీ ఎందుకు మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసారు? మ‌హిళ‌ల భ‌ద్ర‌త ముఖ్యం కాబ‌ట్టి అలా ప్ర‌త్యేకంగా వాళ్ల ర‌క్షణ కోసం, వాళ్ల స్వాతంత్రం కోసం ఇలాంటి వ్య‌వ‌స్థ‌ను రూపొందించారు. మ‌హిళ‌లు త‌మ‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన స్కూళ్ల‌లో, కాలేజీల్లో చదువుకున్నా బ‌య‌ట ప్ర‌పంచంలోకి వ‌చ్చాక మ‌గ‌వాళ్ల‌తో మ‌మేక‌మై జీవించాల్సి ఉంటుంది. అలా కాకుండా మేం చాలా ప్ర‌త్యేకం అనుకున్న‌ప్పుడు స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది. స‌మాజంలో మంచీ చెడు రెండూ ఉంటాయి. కొంద‌రు చేసిన త‌ప్పుల‌కు అంద‌ర్నీ బాధ్యుల‌ను చేస్తూ ఒక వ‌ర్గం మీద పూర్తిగా ద్వేషాన్ని పెంచుకుంటే వ్య‌క్తిగ‌తంగా న‌ష్టం త‌ప్ప‌దు. స‌ర్దుబాటు అనేదే లేకుండా కాపురాల్లో ఆధిప‌త్యం కోసం వెంప‌ర్లాడుతూ జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్న నాశ‌నం చేస్తున్న మ‌హిళ‌లు ఎంద‌రో. స్త్రీ వాదుల‌కు ఈ స్టేట్ మెంట్ కోపం తెప్పించినా వాస్త‌వాన్ని చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదు. చ‌ట్టాన్ని దుర్వినియోగం చేస్తూ పురుషుల‌పై ప‌గ తీర్చుకునేందుకు సాటి మ‌హిళ‌ల‌పై కూడా త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్న వైనం అంద‌రికీ తెలిసిందే.

 

 

స్త్రీలు ఆభ‌ర‌ణాలు ఎందుకు ధ‌రిస్తారో తెలుసా?

 

ఇంత సీరియ‌స్ విష‌యాన్ని చ‌ర్చిస్తూ మ‌ధ్య‌లో ఆభ‌ర‌ణాల ప్ర‌స్తావ‌న ఎందుకు? అన్న సందేహం రావ‌డం స‌హ‌జ‌మే. కానీ స్త్రీ పురుష సంబంధాల్లో ఇది కూడా కీల‌క‌మైన విష‌యం కాబ‌ట్టి చెప్పాల్సి వ‌స్తోంది. మాన‌సిక శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నాల ప్ర‌కారం ఎవ‌రికైతే ఆత్మ‌విశ్వాసం త‌క్కువ‌గా ఉంటుందో వాళ్లు ఆభ‌ర‌ణాలు ధరిస్తూ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నం చేస్తార‌ట‌. ఒళ్లంతా ఆభ‌ర‌ణాలు ధ‌రించే మ‌హిళ‌ల‌కు ఆత్మ‌విశ్వాసం త‌క్కువ‌న్న విష‌యాన్ని ఇక ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌రం లేదు. మంచి ఉన్న‌త స్థానాల‌కు చేరుకున్న , ప‌రిణ‌తి సాధించిన మ‌హిళ‌ల‌ను చూస్తే చాలా సాధార‌ణంగా క‌నిపిస్తారు. ఆత్మ‌విశ్వాసం అనే ఆభ‌ర‌ణం ఉండ‌గా ఇక పైపై మెరుగులు ఎందుకు? బ‌ంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించి గొప్ప‌గా ప్ర‌చారం చేసుకున్నంత మాత్రాన ఎవ‌రూ గొప్ప‌వాళ్లు కాలేరు. సాటి మ‌నిషిని గౌర‌విస్తూ, లింగ భేధాన్ని చూప‌కుండా కేవ‌లం వ్య‌క్తిత్వాన్ని మాత్ర‌మే చూసే వాళ్లు మాత్రమే ప‌రిణ‌తి చెందిన మ‌హిళ అనిపించుకుంటారు. ఒక వ‌ర్గాన్ని వ్య‌తిరేకించ‌డానికి ఒక ఆద‌ర్శ‌వంత‌మైన ముసుగు వేసుకుని ఒక ల‌క్ష్యం లేకుండా క‌క్ష‌సాధింపుతో ప‌నిచేసే వాళ్ల వ‌ల‌న స‌మాజానికి ప్ర‌మాదం పొంచి ఉంది. ఒక స్త్రీ, ఒక పురుషుడు క‌లిసి ఉన్న‌ప్పుడే ప్ర‌పంచం మ‌నుగ‌డ సాగించ‌గ‌లుగుతుంది. కేవలం మూర్ఖ‌పు ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తే ఎప్ప‌టికీ ఆద‌ర్శ‌వంత‌మైన వ్యక్తులుగా, కుటుంబాన్ని తీర్చిదిద్దే వ్య‌క్తులుగా త‌యారు కాలేరు.

 

 

అన్నింటిక‌న్నా ‘బంధం’ ముఖ్యం!

 

ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా సంబంధం అనేది చాలా ముఖ్యం. అటు ఆడ అయినా ఇటు మ‌గ అయినా సంబంధాన్ని గౌర‌వించిన‌ప్పుడే వాళ్లు నిజ‌మైన ప‌రిణితి చెందిన వ్య‌క్తులుగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తారు. ఒక బంధంలోకి వెళ్లిన‌ప్పుడు కొన్ని విష‌యాల‌ను వ‌దిలేయాల్సి ఉంటుంది. ఆడ‌పిల్ల‌లు పాతిక సంవ‌త్సరాల పాటు త‌మ తల్లిదండ్రుల‌తో క‌లిసి పెరుగుతారు. ఆ త‌ర్వాత అక‌స్మాత్తుగా ఒక కొత్త ఇంటికి ఒక కొత్త వాతావ‌ర‌ణంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మార్పుకు అనుగుణంగా త‌మ‌ను తాము మార్చుకోవాలి. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు. నాకు నచ్చిన‌ట్టు నేను ఉంటాను అంటే అవ‌త‌లి వ్య‌క్తులు కూడా నాకు న‌చ్చిన విధంగా నేనూ ఉంటా అంటారు. రిలేష‌న్ అంటే ఒక బాధ్య‌త దాన్ని ఇద్ద‌రు వ్య‌క్తులు నెర‌వేర్చాల్సి ఉంటుంది. మ‌గ‌వాళ్ల‌లో లోపాలు ఉన్నాయ‌ని, పొర‌పాట్లు ఉన్నాయ‌ని వాళ్లు లేకుండా జీవ‌నాన్ని సాగించ‌డం ఆడ‌వాళ్ల‌కు సాధ్య‌మా? కాదు. మ‌రి అనివార్య‌మైన విష‌యంలో ఎక్క‌డ త‌ప్పు జ‌రిగిందో దాన్ని మాత్ర‌మే వ్య‌తిరేకించాలి కానీ మొత్తం వ్య‌వ‌స్థ‌నే వ్య‌తిరేకిస్తామంటే దాన్ని అప‌రిప‌క్వ‌త అంటారు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)