‘అజ్ఞాతవాసి’ వీరుడా లేక శూరుడా??

 

ఒక వ్య‌క్తి సామ‌ర్ధ్యాన్ని, అతను సాధించిన‌ విజ‌యాల‌ను చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు అత‌న్ని విజేత‌గా, వీరుడిగా కీర్తిస్తూ ఉంటాం. వీరుడు అంటే ల‌క్ష‌ల్లో ఒక‌డు. ఎన్నో ఆటుపోట్ల‌ను, క‌ష్టన‌ష్టాల‌ను భ‌రిస్తే గానీ వీరుడు కావ‌డం కుద‌ర‌దు. అయితే వీరునిగా మారితే తుది ల‌క్ష్యం చేరుకున్న‌ట్టేనా? అస‌లు వీరులే ప్ర‌పంచ విజేత‌లా? వీరులను త‌ల‌దన్నే వారు, వీరుల‌కంటే గొప్ప‌వాళ్లు లేరా? మ‌నం మ‌న ఇతిహాసాల్లో ఒక వ్య‌క్తిని కీర్తించేట‌ప్పుడు వీర‌, శూర అన్న మాట‌లు వింటూ ఉంటాం. వీరత్వం ఓకే మ‌రి శూరత్వం ఏంటి? అస‌లు వీరత్వంతో పాటు శూరత్వం కూడా ఒక ప్ర‌త్యేక ల‌క్ష‌ణ‌మా ? అని అంటే క‌చ్చితంగా అవున‌నే చెప్పాలి. అత్యుత్త‌మ ప‌నితీరును క‌న‌బ‌ర్చ‌డంలో వీరత్వం అనేది తుది గ‌మ్యం కాదు.వీర‌త్వం తో పాటు శూర‌త్వం కూడా ఉన్న‌ప్పుడే ఒక మ‌నిషికి పూర్తి మార్కులు వేయ‌వచ్చు. సాధించిన దానితో సంతృప్తి ప‌డిపోయినా లేక ఎత్తుకు పై ఎత్తులు వేసే సామ‌ర్ధ్యం లేక‌పోయినా అత‌ను వీరునిగానే మిగిలిపోతాడు. ముఖాముఖి త‌ల‌పడిన‌ప్పుడు వీరుడు ఎంతటి బ‌ల‌వంతుడైనా శూరుడ్ని మాత్రమే విజ‌యం వ‌రిస్తుంది.

 

 

శూరులే విశ్వ‌విజేత‌లు!

 

వీరత్వం అనేది ఒక వ్యక్తి సామర్ధ్యానికి నిదర్శనం అయితే శూరత్వం అనేది అతనికున్న ప్రత్యేక లక్షణాలను ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు ఇద్దరు అత్యుత్తమ సామర్ధ్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు టెన్నిస్ ఆడుతున్నారు అనుకుందాం. అంటే ఇద్దరు వీరులు పోటీలో తలపడుతున్నారు. ఇక్కడ విజయం ఎవర్ని వరిస్తుంది.? వీరుడికి ఉండాల్సిన లక్షణాలతో పాటు అదనంగా ప్రత్యేకత ఉన్న శూరుడే ఇక్కడ విజయం సాధిస్తాడు. ఎందుకంటే అతను తన సామర్ధ్యం, నైపుణ‌్యంతో పాటు అవసరమైన సందర్భంలో తన విచక్షణను ఉపయోగించి ఎత్తుకు పై ఎత్తు వేసి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. బంతిని బలంగా కొట్టే సత్తాతో పాటు ఎక్కడ కొడితే ప్రత్యర్ధి నిలవరించొచ్చు? ప్రత్యర్థి బలహీనతలు ఏంటి? ఇవన్నీ అతను చదివేస్తాడు. కేవలం బంతిని బలంగా కొట్టే నేర్పు ఉన్నప్పుడు వీరుడిగానే మిగిలిపోతారు. బంతిని బలంగా కొట్టే నేర్పుతో పాటు ప్రత్యర్ధిని మానసికంగా చదివేసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని తన ప్రణాళికలు అమలు చేసే వాడే శూరుడు. ప్రపంచాన్ని జయించిన విజేతలు, రాజ్యాలు విస్తరించిన మహావీరులను నిశితంగా గమనిస్తే వారిలో యుద్ధనైపుణ‌్యం ఉన్న వీరులే కాదు సరైన సమయానికి సరైన ప్రణాళికలు వేసే శూరులు కనిపిస్తారు.

 

 

వీరత్వం అన్నిచోట్లా మనుగడ సాగించలేదు!

 

మనం క్రీడల్లో ఒక అథ్లెటిక్స్ నో లేక వెయిట్ లిఫ్టింగ్ వంటి గేమ్స్ ను తీసుకున్నప్పుడు అక్కడ వ్యక్తిగత ప్రతిభ అన్నది మాత్రమే కనిపిస్తుంది. తన సత్తా తాను ప్రదర్శించి తన బలాన్ని తాను ప్రదర్శించి విజయం సాధిస్తారు. కానీ అవతలి వారితో ముఖాముఖీ తలపడినప్పుడు ఒక వ్యక్తి సామర్ధ్యానికి నిజమైన పరీక్ష ఎదురవుతుంది. వీరుడు తన తన ప్రతిభను ప్రదర్శించి లక్షల్లో ఒకడిగా నిలిచినా శూరత్వాన్ని అభివృద్ధి చేసుకోకపోతే వీరుడిగానే మిగిలిపోతాడు. వ్యక్తిగత జీవితంలో అయినా వృత్తిగత జీవితంలో అయినా వీరుని స్థాయికి చేరుకోవడం ఒక ఘనతే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అదే స్థాయిలో ఉండిపోకుండా వీరుడు అనే వాడు శూరుడిగా మారేందుకు ప్రయత్నం చేయాలి. కేవలం తన సామర్ధ్యాన్ని మాత్రమే నమ్ముకోకుండా సమస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడం, అవతలి వారి కన్నా ఆలోచనలో ఒక మెట్టు ముందు ఉండేందుకు ప్రయత్నించడం ఇవన్నీ ఒక వ్యక్తిని ప్రత్యేకమైన వాడిగా మారుస్తాయి. ఆ ప్రత్యేకమైన వాడే శూరుడు. వీరుడు కేవలం తన సంక్షేమం దగ్గర ఆగిపోతే శూరుడు తన సంక్షేమంతో పాటు ఒక సమూహానికి స్పూర్తిగా నిలుస్తాడు. ఒక బృందాన్ని విజయవంతంగా నడిపిస్తాడు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. తన సత్తాకు పరీక్ష ఎదురైనప్పుడు దాన్ని ఆలోచనతో అధిగమిస్తాడు.

 

 

పవన్‌ కళ్యాణ్ వీరుడు మాత్రమే!!

 

మనం జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఒక ఉదాహరణగా తీసుకుంటే మనకు వీరత్వం , శూరత్వంపై మరింత స్పష్టత వస్తుంది. కోట్లాది మంది అభిమాన గణం ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో వీరుడు. తన సామర్ధ్యంతో, తనకు ఉన్న క్రేజ్ తో పాలిటిక్స్ లో సంచలనం రేపుతున్నాడు. అయితే శూరత్వం అనే లక్షణాన్ని సాధించుకున్నప్పుడే అతను అభిమానులు ఆశిస్తున్న సీఎం పీఠం అధిష్టించగలడు. అతనికి కేవలం బలం మాత్రమే ఉంది. వ్యూహం లేదు. తెలివిగా ఎత్తులు వేసే చాతుర్యం లేదు. ప్రత్యర్ధులకు అందకుండా వారి బలహీనతల ఆధారంగా లబ్ది పొందే ఒడుపు లేదు. ఇవన్నీ సంపాదించినప్పుడే పవన్ కళ్యాణ్ వీరుడితో పాటు శూరుడు కూడా అవుతాడు. వీరుడికి వ్యూహం లేనప్పుడు అతన్ని తమకు అనుకూలంగా వాడుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు శూరులు. వీరులను వాడుకుంటూ మహాసామ్రాజ్యాన్ని నిర్మించడం శూరుల లక్షణం. కాబట్టి శూరుడిగా ఎదగాలనుకుంటున్న ఒక వీరుడు ..మరో శూరుని వలలో పడకుండా తన సొంత తెలివితేటలను సమకూర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అత్యవసరంగా చేయాల్సిన పని ఇదే. తను వీరుడిగానే ఉండిపోయి మిగిలిన శూరులకు ప్రయోజనం కలిగించాలా? లేక తానే శూరుడిగా మారాలా? అన్న దానిపై స్పష్టత తెచ్చుకోవాలి.

 

 

శూరత్వమే శిఖరంపైకి చేర్చుతుంది!

 

గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ధీరూభాయ్ అంబానీనే తీసుకొండి. అతను ఒక మామూలు వ్యక్తి. కానీ అతనికి దార్శనికత అనే ఒక గొప్ప వీరత్వం ఉంది. దాన్ని మరింత పదును పెట్టుకుని సమయానుకూల నిర్ణయాలు తీసుకుని శూరుడిగా ఎదిగాడు. ఈ క్రమంలో ఎందరో వీరులను ముందుండి నడిపించి ఒక పెద్ద వ్యాపారాన్ని నిర్మించుకున్నాడు. అతనికన్నా ఎంతో సామర్ధ్యం , సత్తా ఉన్న వీరులు కేవలం అతనికి సహకరించడానికి మాత్రమే పరిమితం అయిపోయారు. వీరులను గుర్తించి వారిని తనకు అనుకూలంగా వాడుకుని ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించే వాడే శూరుడు. అసలు వీరత్వం అనేది ఒక పెద్ద అచీవ్‌మెంట్. ఇందులో సందేహం లేదు. అయితే దానితోనే సంతృప్తి పడిపోకుండా శూరునిగా ఎదిగేందుకు ప్రయత్నం చేయాలి. నాయకత్వ లక్షణాలు పెంపోదించుకోవడం, పరిస్థితులకు తగ్గట్టు తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుత సాధిస్తే మరింత ఉన్నత స్థితి సాధ్యమవుతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)