పిల్ల‌ల ‘హాస్ట‌ల్’ కు పెద్ద‌ల ‘ఓల్డేజ్ హోమ్’ కు ఉన్న సంబంధం తెలుసా?

 

ఈ ఆధునిక యుగంలో పిల్ల‌ల పెంప‌కం అనేది అతిపెద్ద స‌వాలు. ఇది మ‌నం గ‌తంలో చెప్పుకున్న విష‌య‌మే అయినా ఇది అనుక్ష‌ణం గుర్తుపెట్టుకోవాల్సిన విష‌యం కాబ‌ట్టి మ‌రోసారి చెప్ప‌డం జ‌రిగింది. మీ పిల్ల‌ల‌ను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల‌నుకుంటే ముందు మీరు మంచి పౌరులుగా త‌యారు కావాలి. ఎందుకంటే ఈ ప్ర‌పంచంలో పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రుల‌ను మించిన రోల్ మోడ‌ల్స్ ఎవ‌రూ ఉండ‌రు. చాలా మంది త‌ల్లిదండ్రులు తాము త‌మ పిల్ల‌ల‌కు మంచి పెంప‌కం అందిస్తున్నామ‌ని భ్ర‌మ‌ల్లో బ‌తుకుతూ పిల్ల‌ల జీవితాల‌తో పాటు త‌మ స్వంత జీవితాల‌ను కూడా ఇబ్బందుల్లో ప‌డేసుకుంటున్నారు. స‌రైన పెంప‌కం అందించ‌క‌పోతే పేరెంట్స్ జీవితాలు ఇబ్బందుల్లో ఎందుకు ప‌డ‌తాయి? అన్న సందేహం మీకు రావ‌చ్చు. తెలిసో తెలియ‌కో ఇప్పుడు మీరు మీ పిల్ల‌ల‌కు అంద‌కుండా చేస్తున్నవ‌న్నీ రేపు మీకు అంద‌కుండా పోతాయి. ఎందుకంటే వ‌ర్త‌మానంలో మ‌నం తీసుకున్న నిర్ణ‌యాలు, చేస్తున్న ప‌నులే మన భ‌విష్య‌త్ ను నిర్ణ‌యిస్తాయి. క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో పిల్ల‌ల్ని హాస్ట‌ల్ లో చేర్పిస్తున్న త‌ల్లిదండ్రులు త‌మ జీవిత చ‌ర‌మాంకంలో క‌చ్చితంగా వృద్ధాశ్ర‌మాల‌కు చేరుకోవాల్సి ఉంటుంద‌న్న క‌ఠిన స‌త్యాన్ని గుర్తించాలి.

 

 

భ‌విష్య‌త్ అంటే వ‌ర్త‌మాన‌మే!

 

తాజాగా ఒక ఉపాధ్యాయుడు పిల్ల‌ల పెంప‌కంపై ఒక అద్భుత‌మైన ప్ర‌సంగం ఇచ్చాడు. ప్ర‌స్తుత స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాలు, పిల్ల‌ల పెంప‌కంలో చోటుచేసుంటున్న మార్పులు, త‌ర్వాతి కాలంలో వీటి ప‌ర్య‌వ‌సానాలు ఇలా అత‌ను విభిన్న విష‌యాల‌ను ప్ర‌స్తావించాడు. ప్ర‌తీ విష‌యానికి పిల్ల‌ల‌ను ప్ర‌శ్నించ‌డం, లేదా వాళ్ల‌కు సూచ‌న‌లు చేయ‌డం..ప్ర‌తీ ఇంట్లోనూ ఇదే తంతు జ‌రుగుతుందని..కానీ పిల్ల‌ల‌తో కాస్త స‌మ‌యం మ‌న‌స్సు విప్పి మాట్లాడేందుకు ఏ తల్లిదండ్రులు సుముఖంగా లేర‌ని చెప్పాడు. ఈ రోజుల్లో చాలా మంది త‌ల్లిదండ్రులు ఎంత‌సేపు ఆదేశాలు జారీ చేస్తూ, ఆర్డ‌ర్లు వేస్తూ పిల్ల‌ల‌ను చేజేతులా దూరం చేసుకుంటున్నారు. ఎంతసేపు క్ర‌మ‌శిక్ష‌ణ‌, చ‌దువు, కెరీర్ అంటూ వాళ్ల‌ను ఒక బోనులో బందించేస్తున్నారు. చ‌దువు, కెరీర్ కావాల్సిందే కానీ దాన్ని చెప్పేందుకు పిల్ల‌ల ద‌గ్గ‌ర విల‌న్ లా మారిపోవాల్సిన అవ‌స‌రం లేదు. చిన్న‌త‌నం నుంచి హాస్ట‌ల్ లో పెరిగిన పిల్ల‌వాడికి అనుబంధాలు, ఆప్యాయ‌త‌లు ఏం తెలుస్తాయి? తాను పెద్ద‌య్యాక‌, త‌ల్లిదండ్రులు ముస‌లివాళ్లు అయ్యాక త‌న‌ను ఎలా అయితే హాస్టల్ లో ప‌డేసారో వాళ్ల‌ను కూడా అలాగే ఓల్డేజ్ హోమ్ లో ప‌డేస్తాడు. బాగా సెటిల్ అయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న చాలా మంది ఇక్క‌డ త‌మ త‌ల్లిదండ్రుల‌ను వృద్ధాశ్ర‌మాల్లోనే జాయిన్ చేస్తున్నారు. ఎక్క‌డ త‌ప్పు జ‌రుగుతోంది? పిల్ల‌ల ఆలోచ‌నా విధానంలోనా? త‌ల్లిదండ్రుల పెంప‌కంలోనా? క‌చ్చితంగా త‌ల్లిదండ్రుల పెంప‌కంలోనే జ‌రుగుతోంది.

 

 

పిల్ల‌ల‌కు మ‌నం నిజ‌మైన విద్య‌నే నేర్పిస్తున్నామా?

 

సాధార‌ణంగా ప్ర‌తీ త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు LSRW నేర్పిస్తారు. అంటే కేవ‌లం లెర్నింగ్, స్టడీ, రీడింగ్, రైటింగ్ మాత్రం చెపుతారు. ఇది పిల్ల‌ల మానసిక వికాసానికి అంత‌గా ఉప‌యోగ‌ప‌డ‌దు. మూస ప‌ద్ధ‌తిలో బ‌ల‌వంతంగా నేర్చుకునే విషయానికి ఎప్ప‌టికీ విలువ ఉండ‌దు. ప‌ల‌క‌పై అక్ష‌రాలు దిద్దుస్తున్నారు కానీ అస‌లు ప‌ల‌క అంటే ఏమిటో చెప్ప‌లేక‌పోతున్నారు. ప‌ల‌క‌ను ఇంగ్లీష్ లో స్లేట్ అంటారు అని తెలుసుక‌దా? అక్ష‌రాల‌ను నేర్చుకోవ‌డానికి పునాది వేసిన ప‌ల‌కలోని అస‌లైన వివ‌ర‌ణ‌ను తెలుసుకున్న‌ప్పుడు అస‌లైన విద్య‌ను నేర్చుకున్న‌ట్టు. SLATE అంటే సోష‌ల్, లీడ‌ర్ షిప్, అవేర్ నెస్, టెక్నిక‌ల్, ఎడ్యుకేష‌న్. స‌మాజం ప‌ట్ల అవ‌గాహ‌న‌తో ఒక విష‌యాన్ని సాంకేతిక దృక్కోణంతో చూసి నాయ‌కత్వంతో ముందుకు తీసుకెళ్లే విధంగా నేర్చుకునే చ‌దువు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ విధంగా జ‌రుగుతుందా? చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు ఏది అవ‌స‌ర‌మో అది కాకుండా అన‌వ‌స‌ర‌మైన విష‌యాల‌ను ఇస్తున్నారు. దీని వ‌ల‌న ఇటు పిల్ల‌వాడి భ‌విష్య‌త్ తో పాటు త‌ల్లిదండ్రుల భ‌విష్య‌త్ కూడా ఇబ్బందులో ప‌డుతోంది.

 

 

ఈ త‌రం పిల్ల‌ల‌కు ప్ర‌కృతి అంటే తెలుసా?

 

ఎంత‌సేపూ చ‌దువుల ప‌రుగు పోటీల త‌మ పిల్ల‌ల‌ను ముందుంచాల‌నే ఆత్రం తప్పితే ఇప్ప‌టి త‌ల్లిదండ్రులు తాము ఎక్కడ పొర‌పాటు చేస్తున్నామో గుర్తించ‌లేక‌పోతున్నారు. పిల్ల‌ల ఎదుగుద‌ల ఎప్పుడూ ప్ర‌కృతితో మ‌మేకమై ఉండాలి. స‌హ‌జ సిద్ధంగా జ‌రిగే ప‌రిణామాలు, సాటి జీవులు, బ‌తుకు పోరాటం ఇవన్నీ పిల్ల‌లు చూసి, అనుభ‌వం చెంది మాత్ర‌మే నేర్చుకోగ‌లుగుతారు. పిల్ల‌ల‌కు అడ‌విని చూపించాల‌ని , అక్క‌డ కుద‌ర‌క‌పోయినా జూలో జంతువులను చూపించాల‌ని నిపుణులు చెపుతున్నారు. సాటి జీవుల ప‌ట్ల ప్రేమ, ఆహారాన్ని సంపాదించుకునేందుకు, గూడును ఏర్పాటు చేసుకునేందుకు అవి ప‌డే తప‌న అర్ధ‌మ‌వుతాయ‌ని అంటున్నారు. కానీ అలా ప్ర‌కృతిని చూసే అవ‌కాశం ఎంత మంది పిల్ల‌ల‌కు ఉంది. కాంక్రీట్ అర‌ణ్యాల్లో పెర‌గుతున్న వారి అర‌ణ్యాల గూర్చి ఏం తెలుస్తుంది. అడ‌వి, అక్క‌డ పచ్చ‌ద‌నం, జంతువులు ఇలా పిల్ల‌ల‌కు అన్ని విష‌యాల‌ను తెలియ‌జేయాల్సిన త‌ల్లిదండ్రులకు ఎంత సేపూ చ‌దువు చ‌దువు అంటూ పిల్ల‌ల‌ను రుద్ద‌డ‌మే స‌రిపోతోంది. ఇక పిల్ల‌వాడు ఎప్పుడు మానసికంగా ఎదుగుతాడు? ఎలాంటి ప‌రిణతి సాధిస్తాడు. క‌చ్చితంగా సాధించ‌లేడు. మెల్ల‌గా త‌న సున్నిత‌త్వాన్ని కోల్పోయి పెద్ద‌య్యాక త‌న త‌ల్లిదండ్రుల‌తో అలాగే ప్ర‌వ‌ర్తిస్తాడు. త‌మ‌ను త‌మ పిల్ల‌లు ఓల్డేజ్ హోమ్ ల‌లో ప‌డేస్తున్నార‌ని బాధ‌ప‌డే త‌ల్లిదండ్రులు త‌మ పెంప‌కంపై ఒక‌సారి స‌మీక్ష చేసుకోవాలి.

 

 

పిల్ల‌ల‌కు ఇవ్వాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్ లు కాదు!

 

చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల కోసం రాత్రీ ప‌గ‌లు క‌ష్ట‌ప‌డి వారి కోసం బాగా డ‌బ్బు కూడ‌బెట్టాలి అనుకుంటారు. మీరు మీ పిల్ల‌ల‌తో మీరు నాణ్య‌మైన స‌మ‌యం గ‌డ‌ప‌లేన‌ప్పుడు మీరు వారి ఎంత డ‌బ్బు సంపాదించినా అది బూడిద‌లో పోసిన ప‌న్నీరే. పిల్ల‌లు త‌మ చిన్న‌త‌నంలో నాన్న త‌న‌తో గ‌డిపిన క్ష‌ణాల‌నే గుర్తుంచుకుంటారు కానీ మీరు సంపాదించిన డ‌బ్బులను కాదు. ఎందుకంటే క‌ష్ట‌ప‌డ‌కుండా వ‌చ్చిన డ‌బ్బుల‌ను చాలా మంది సరైన విధంగా ఉప‌యోగించుకోలేరు. ఏదైనా క‌ష్ట‌ప‌డి సంపాదించిన‌ప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఒక ప్ర‌ముఖ యాడ్ లో ఇలా ఉంటుంది. మాట్లాడితే ప‌నులు జ‌రుగుతాయి. ఈ లైన్ పిల్ల‌ల పెంప‌కంలో క‌చ్చితంగా స‌రిపోతుంది. పిల్ల‌ల‌తో మ‌న‌స్సు విప్పి మాట్లాడండి. స్నేహితుల్లా ఉల్లాసంగా మాట్లాడండి. వారితో త‌గినంత స‌మ‌యం గ‌డ‌పండి. ఆ గ‌డిపిన క్ష‌ణాలు వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా వ్య‌వ‌హ‌రించండి. మీ పిల్ల‌ల‌కు మీరిచ్చే అద్భుత‌మైన కానుక ఇదే. అలా కాకుండా వారిని ఆదేశిస్తూ, ఫ‌లానా ప‌ని చేయాల‌ని శాసిస్తూ ఉంటే చివ‌ర‌కు వృద్ధాప్యంలో మీకు కూడా అటువంటి ప‌రిస్థితే ఎదుర‌వుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)