మాయ చేయొద్దు..! దొరికిపోతారు!


ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వాలంటే.. మొదట మిమ్మల్ని నిజాయతీపరుడని నమ్మాలి. ఆ నమ్మకం కుదిరినపుడే మీకు అవకాశమిస్తుంది. అలా కాకుండా మీరు మోసం చేస్తారు.. మోసం చేసే అవకాశముంది.. అని భావిస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం ఇవ్వదు. అందువల్ల ప్రతి వ్యక్తీ ఉద్యోగం ఇచ్చే సంస్థకు తాను నిజాయతీపరుడని.. ప్రతిభావంతుడని నమ్మకం కలిగించాలి. అభ్యర్థిలో ప్రతిభ, నైపుణ్యాలతో పాటు నిజాయితీని గుర్తించేందుకూ.. పరీక్షల్లో.. ముఖాముఖిల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. అన్ని రకాలుగా ఒక వ్యక్తిపై నమ్మకం కుదిరిన తర్వాత అతనికి ఉద్యోగం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారు. చాలా మంది యువత ఈ విషయానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తాము ఏం చెప్పినా సంస్థ నమ్ముతుందని భావించి రెజ్యూమెలో కొన్ని అతిశయోక్తులు.. అవాస్తవాలను పేర్కొంటున్నారు. ఇవి ఉద్యోగ అవకాశాలకు ఎసరు తెస్తున్నాయి. ఈ మేరకు కెరీర్‌బిల్డర్ ఇండియా సర్వేలో స్పష్టమైంది.
ఉద్యోగం కోసం పంపే దరఖాస్తులకు జత చేసే రెజ్యూమెల్లో 30 శాతం వాటిలో అబద్ధాలు ఉంటున్నాయట. ఈ మేరకు సర్వేలో పాల్గొన్న మేనేజర్లలో 78 శాతం మంది వెల్లడించారు. తాము ప్రతి మూడింటిలో ఒక రెజ్యూమెలో అవాస్తవాలను గుర్తిస్తున్నామని తెలిపారు. రెజ్యూమెలో పేర్కొన్న అంశం అవాస్తవమని తెలిస్తే.. దాన్ని వెంటనే పక్కన పెట్టేస్తున్నట్లు 58 శాతం మంది చెప్పారు. అంటే రెజ్యూమెలో అవాస్తవాలున్నాయని రిక్రూటర్లు ఏమాత్రం అనుమానించినా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లినట్టే.
ఒకవేళ అభ్యర్థిలో అత్యుత్తమ ప్రతిభ, నైపుణ్యాలు ఉండి.. చాలా చిన్న అంశాల్లో అవాస్తవాలను వెల్లడిస్తే.. అలాంటి వ్యక్తులను తీసుకొనేందుకు సిద్ధమని చాలా కొంత మంది రిక్రూటర్లు మాత్రమే చెబుతున్నారు. 14 శాతం మంది అభ్యర్థిలో ప్రతిభ నచ్చితే.. అంతకన్నా మంచి అభ్యర్థి దొరకనపుడు.. అతను రెజ్యూమెలో పేర్కొనే చిన్నపాటి అబద్ధాలను పెద్దగా పట్టించుకోమని అంటున్నారు. వీరూ వీలైనంత వరకు నిజాయతీపరులైన అభ్యర్థులనే ఎంచుకొనేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ సందర్భంగా కెరియర్ బిల్డర్ మానవ వనరుల నిపుణులు మాట్లాడుతూ.. వృత్తిగత సంబంధాల్లో విశ్వాసం చాలా కీలకం. కాని కొందరు రెజ్యూమె లేదా సీవీల్లో అవాస్తవాలను వెల్లడిస్తూ.. సంస్థల వద్ద నమ్మకాన్ని కోల్పోతున్నారు. నిజంగా మీరు మీ రెజ్యూమెను గొప్పగా తీర్చిదిద్దాలనుకొంటే మీలో ప్రత్యేకతలను ప్రధానంగా ప్రస్తావించండి. దాదాపు ఏ రెజ్యూమె కూడా సదరు ఉద్యోగానికి సరిగ్గా సరిపోయేలా ఉండదు. సదరు ఉద్యోగానికి తగిన విధంగా.. వక్రీకరణలు, అతిశయోక్తులు, అవాస్తవాలు, దోషాలు లేకుండా ఉంటే చాలు. అని తెలిపారు.
ఎందుకిలా..!: మొదట మన సీవీ/రెజ్యూమె రిక్రూటర్ల దృష్టిలో పడాలి. అప్పుడే ముఖాముఖికి పిలుపు వస్తుంది.. అని ప్రధానంగా భావించడం వల్లే రెజ్యూమెల్లో అవాస్తవాల ప్రస్తావనకు ప్రధానకారణమంటున్నారు రిక్రూటర్లు. రెజ్యూమెలను పరిశీలించే మానవ వనరుల నిపుణులు.. ఆయా రెజ్యూమెలో పేర్కొన్న అంశాలు ఏమేరకు వాస్తవమో పక్కాగా గుర్తించగలరు. ఏఅంశంపై అయినా వారికి అనుమానమొస్తే.. జాబ్ పోర్టళ్లలో లేదా సామాజిక అనుసంధాన వేదికల్లో మీ ప్రొఫైల్‌ని పరిశీలించి ధ్రువీకరించుకొనే ధోరణి ఇప్పుడు పెరిగింది. దీంతో ఒకచోట అవాస్తవం వెల్లడిస్తే.. మరోచోట అయినా దొరికపోయే అవకాశముంది.
ఒకవేళ రెజ్యూమె పరిశీలనలో అవాస్తవాలను పసిగట్టలేకపోతే.. ముఖాముఖి పరీక్షలో తప్పకుండా దొరికిపోయే అవకాశముంది. ఎందుకంటే రెజ్యూమెలో అబద్ధాలు చెబితే.. అందులో వెల్లడించిన అంశాల ఆధారంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పలేకుంటే వారికి మీపై అనుమానం వస్తుంది. ఒక ప్రశ్నకు ఎలాగో ఒకలాగా సమాధాన మిచ్చినా మరో ప్రశ్నలో అయినా దొరికపోతారు. దీనివల్ల మీకు ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు సుముఖత చూపరు.
వాస్తవాన్ని గొప్పగా చెప్పడం వేరు.. వక్రీకరించడం వేరు. ఈ రెండింటి మధ్యా తేడా ఉంటుంది. దాన్ని గుర్తెరిగి రెజ్యూమెను రూపొందించాలి. అంతేకాని లేనిపోని గొప్పలకు పోయి అవకాశాలను చేజార్చుకోవద్దు. ప్రతిభ, నైపుణ్యాలు మెరుగుపరచుకుని.. నిజాయతీగా ఉద్యోగాన్ని సాధించేందుకు కృషి చేస్తే తప్పక లభిస్తుంది.
ఇవీ ఆ అబద్ధాలు..
ఒక్కో అభ్యర్థి తన రెజ్యూమెను ఒక్కో విధంగా రాస్తారు. కాని అవాస్తవాల విషయానికి వచ్చే సరికి ఎక్కువ మంది ఒకే విషయంలో చేస్తుంటారు. సర్వేలో పాల్గొన్న మేనేజర్లు వెల్లడించిన వివరాల మేరకు.. రెజ్యూమెల్లో ఎక్కువగా కనిపించే అవాస్తవాలు ఇవీ..
నైపుణ్యాలు: 61 శాతం అవాస్తవాలు నైపుణ్యాల అంశానికి సంబందించే ఉంటున్నాయి. లేని నైపుణ్యాలను అభ్యర్థులు రెజ్యూమెలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
పని చేసిన సంస్థలు: తాము గతంలో పని చేసిన సంస్థలకు సంబంధించిన అబద్ధాలు 50 శాతం దాకా ఉన్నాయి.
* నిర్వర్తించిన బాధ్యతలకు సంబంధించి కూడా ఎక్కువగానే అబద్ధాలు చెబుతున్నారు. 49 శాతం మేర రెజ్యూమెల్లో ఈ అంశానికి సంబంధించిన అవాస్తవాలుంటున్నాయి.
* ఇక పని చేసిన తేదీలు.. ఉద్యోగ వివరాల్లోనూ వరుసగా 47 శాతం, 46 శాతం మేర అబద్ధాలుంటున్నాయి.
* అవార్డులు, గుర్తింపునకు సంబంధించి 35 శాతం, విద్యార్హతలకు సంబంధించి 30 శాతం మంది అవాస్తవాలు పేర్కొంటున్నారు