లక్ష్యాలు నిర్దేశించుకోండి!

కష్టపడి పని చేస్తే.. విజయం దక్కుతుంది. అనుకున్నవాటిని సాధించవచ్చు. కాని కొందరు కష్టపడి పని చేస్తున్నా.. వృత్తిగతంగా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించలేకపోవచ్చు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవచ్చు. ఇందుకు కారణం చేస్తున్న కసరత్తు… ఎంచుకున్న లక్ష్యాలకు తగినట్లు లేకపోవడం. విజయానికి ఆటంకంగా మారే కొన్ని అలవాట్లు ఉండటం. అందువల్ల ముందుగా విజయానికి ఆటంకం కలిగించే అలవాట్లను గుర్తించి వాటికి దూరం కావాలి. వృత్తిపరంగా కొంత అనుభవం వచ్చాక.. ఎక్కువ మంది అన్నీ తమకు తెలుసు.. అన్ని పనులనూ తామే ఒంటరిగా చేసేయవచ్చని భావిస్తుంటారు. ఇలాంటి వైఖరి కెరియర్‌ పరంగా కొన్నిసార్లు చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. అందువల్ల కార్యాలయంలో ప్రతి పనినీ ఒంటరిగానే పూర్తిచేయాలని భావించవద్దు. చేస్తున్న పనికి సంబంధించి ఏమాత్రం చిన్న అనుమానం వచ్చినా సహచరులు, సీనియర్లను సంప్రదించి వారితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం మేలు. ఇలాంటి వైఖరితో మీ పని సులభం కావడంతో పాటు ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది.
వృత్తిపరంగా ప్రతి పనినీ వంద శాతం పక్కాగా పూర్తి చేయాలి. చాలా మంది ఈ విషయంలో కాస్త ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది పనికి రాదు. ఫలితం ఆశించిన మేర వచ్చేవరకూ కృషి చేస్తూనే ఉండాలి. తగిన సమయం లేక.. ఇక ఆలస్యం చేస్తే నష్టం వస్తుంది అనుకున్నపుడు కాస్త రాజీపడొచ్చు. అంతేకాని పనిని పక్కాగా పూర్తి చేసే విషయంలో ఎప్పుడూ రాజీ వద్దు. ఒకసారి గతంలో వృత్తికి సంబంధించిన ఏయే విషయాల్లో రాజీపడ్డారు.. దీని వల్ల కలిగిన ప్రతికూలతేంటో గుర్తుచేసుకొని వాటిని విశ్లేషించుకోండి. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా ఇకపై అన్ని పనులనూ పక్కాగా పూర్తి చేసేందుకు సిద్ధంకండి.
కొంత మంది బాగా పని చేస్తారు. కాని వారికి ఏమీ లక్ష్యాలు ఉండవు. దీంతో కొన్ని రోజులు గడిచాక వెనక్కి తిరిగి చూసుకొంటే ఇలాంటి వారికి చెప్పుకోదగిన విజయాలు పెద్దగా ఉండవు. అందువల్ల ప్రతి ఉద్యోగీ తమకు ఏదో ఒక లక్ష్యం ఉండేలా చూసుకోవాలి. తాము చేస్తున్న వృత్తి.. ప్రతిభ.. నైపుణ్యాలు.. ప్రస్తుత పరిస్థితికి తగినట్లు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకొని ఇకపై వాటిని దృష్టిలో పెట్టుకొని పని చేయాలి. ప్రతి నెలా.. సంవత్సరం.. ఇలా కాలపరిమితికి తగినట్లు లక్ష్యాలను పెట్టుకోవాలి.
కొందరు కార్యాలయానికి వెళ్లామా.. చెప్పిన పని చేశామా.. జీతం వచ్చిందా అన్న ధోరణిలో ఉంటారు. ఈ తీరు సరికాదు. ఇలాంటి తీరును కొనసాగిస్తే ఎంత కాలం పని చేసినా పెద్దగా అభివృద్ధి చెందలేరు. అనుభవం తోడవడం తప్ప మరే ఇతర ప్రయోజనమూ ఉండదు. కొన్నాళ్లకు చేస్తున్న పని కూడా విసుగనిపిస్తుంది. అందువల్ల ఎప్పుడూ ఒకే తరహా పని తీరుకు అలవాటుపడవద్దు. మీరు చేస్తున్న పనితీరును మరింత బాగా అభివృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. మరింత బాగా పని చేసి.. మీ సత్తా ఏంటో చాటేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టవద్దు. అవకాశం రాకపోతే మీ నైపుణ్యాలేంటో ఉన్నతాధికారులకు తెలియజేసి మంచి అవకాశాలనూ అందిపుచ్చుకోగలమన్న ధీమాను వ్యక్తం చేయండి. అలా చేయకుండా ఉంటే ఎప్పటికీ సాధారణ ఉద్యోగిగానే మిగిలిపోయే ప్రమాదముంటుంది. అందువల్ల ఎప్పుడూ ఒకే తరహా పనితీరుతో సంతృప్తి చెందవద్దు. బాగా పని చేసేందుకు కృషి చేస్తూ ఉన్నత లక్ష్యాలను అందుకోవాలి.
కొన్నిసార్లు అనుకున్నవి సాధించాలంటే కొద్దిపాటి సాహసం చేయాల్సి ఉంటుంది. దీనికి వెనకాడితే లక్ష్యం సకాలంలో నెరవేరకపోవచ్చు. ఒక్కోసారి సంస్థలో సహచరులు కూడా మీ వృత్తిగత విజయాలను ప్రభావితం చేయవచ్చు. ఎక్కువ మంది మిమ్మల్ని విజయంవైపు ప్రొత్సహిస్తే.. కొందరు ఆటంకాలు సృష్టించేవారూ ఉండవచ్చు. అందువల్ల సంస్థలో సహచరుల విషయంలోనూ కాస్త ఆచితూచి వ్యవహరించాలి. వేర్వేరు మనస్తత్వాలు, విభాగాలు, పనులకు సంబంధించిన వారితో కలిసి పని చేస్తే కొన్ని అదనపు విషయాలను నేర్చుకోవడంతో పాటు వారిచ్చే సలహాలు మీ అభివృద్ధికి పనికి వస్తాయి.
మార్పును ఆహ్వానిస్తూ..
ప్రస్తుతం యువత సామాజిక చైతన్యం కోసం కొంతమేర అయినా కృషి చేసే సంస్థల్లో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ప్రైస్‌ వాటర్‌ హౌజ్‌ కూపర్స్‌ అనే సంస్థ భవిష్యత్తులో ఉద్యోగ విధానంపై జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కొంత మంది యువత వద్ద అభిప్రాయ సేకరణ జరిపింది. 75 శాతం మంది భారత యువత సామాజిక చైతన్యం కోసం కొంతైనా కృషి చేస్తున్న సంస్థల్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. మరో 26 శాతం మంది వైవిధ్యం ఉన్న ఉద్యోగాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ అధ్యయనం ప్రకారం.. భవిష్యత్తు ఉద్యోగం తీరు అంశానికి వస్తే.. మరికొన్నేళ్లలో దేశంలోని చిన్న సంస్థలన్నీ సామాజిక అనుసంధాన వేదికలు, అంతర్జాలం వేదికగా కలిసి పని చేసే అవకాశముంది. నైపుణ్యం ఉన్నవారు వ్యక్తిగతంగానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రపంచ వ్యాప్తంగా తమ నైపుణ్యాలను అవసరమైన వారి వద్దే పని చేస్తారు. భారత్‌లో సగం మందికిపైగా సుదీర్ఘ కాలం ఉద్యోగం చేయాలని భావిస్తున్నారు. ఇంతే స్థాయిలో యువత భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాలు చేయాలనుకోవడం లేదు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 41 శాతం మంది ఉద్యోగులు నచ్చిన రీతిలో పని చేయాలని భావిస్తున్నారు. 81 శాతం మంది మారుతున్న పరిస్థితులకు తగినట్లు నైపుణ్యాలు పెంచుకోవాలని అనుకుటున్నారు. 2022కి దేశ వ్యాప్తంగా కార్యాలయాల్లో సాంకేతిక పరిజ్ఞానం, గొప్ప నైపుణ్యాలున్న యువతే ఉంటుందని పేర్కొన్నారు. అయితే వీరు సంప్రదాయ పద్ధతుల్లో కార్యాలయంలో పని చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు.