కొత్త కొలువుల కోసం కొత్తకొత్తగా..


కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. ప్రతిభతో పాటు ఆ రంగంలో కాస్తో కూస్తో అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటోంది. అది లేకుంటే కొలువు సాధించడం కష్టమన్న భావన నుంచి మొదట బయటపడాలి. ఎందుకంటే ఎలాంటి అనుభవం లేకున్నా.. మంచి ప్రణాళిక కసరత్తుతో కూడిన సన్నద్ధత, ఉద్యోగాన్వేషణ చేస్తే తప్పకుండా కొత్త కొలువును సాధించవచ్చు. ఎలాంటి ఉద్యోగ అనుభవం లేకున్నా..విద్యార్థులు తమ ఉన్నత విద్యను పూర్తి చేయకముందే సంస్థలు.. కళాశాల ప్రాంగణాలకు వచ్చి.. ప్రతిభావంతులను ఏటా కోట్లు వేతనం ఇచ్చి ముందస్తుగానే నియమించుకుంటున్నాయి. అంటే ఆయా సంస్థలకు ప్రతిభ, నైపుణ్యాలు ముఖ్యం కాని.. అనుభవంకాదన్న సంగతి గుర్తుంచుకోవాలి.
చాలా మంది చదువు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు రాకుంటే సమయాన్ని వృథా చేస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించి ఒక కొత్త అంశంపై శిక్షణ తీసుకోవడమో.. లేక నైపుణ్యాలను పెంచుకోవడమో చేయాలి. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన సంస్థల్లో మొదట పని చేసేందుకు ప్రయత్నించాలి. జీతం ఇచ్చినా.. ఇవ్వకున్నా.. అక్కడ శిక్షణకు చేరాలి. ఇలా చేయడం వల్ల కొన్నాళ్లకు మీకు ఎంతోకొంత అనుభవం వస్తుంది. అది తర్వాత మంచి ఉద్యోగాలను సాధించేందుకు దోహదం చేస్తుంది. మీరు శిక్షణకు చేరిన సంస్థలో మంచి ప్రతిభకనబరిస్తే.. ఆ సంస్థే మీకు ఉద్యోగం ఇవ్వవచ్చు. అందువల్ల చదువు పూర్తయిన తొలినాళ్లలో ఖాళీగా ఉండకుండా.. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన ఏదో ఒక సంస్థలోకి ‘ప్రవేశించడం’ మేలు.
ఉద్యోగ వేటలో ఉన్నపుడు మీ నైపుణ్యాలు, ప్రతిభ, ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవడం ముఖ్యం. ఉద్యోగ అనుభవం లేనివారికి విద్యార్హతలు.. ప్రతిభ.. చదువుకొనే రోజుల్లో చేసిన ప్రయోగాలు, సాధించిన విజయాలు, శిక్షణ తదితర అంశాలు కీలకం. అవే వారికి ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెడుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకొనే మీకు సరిపోయే కొలువును ఎంచుకోవాలి. ఆ వృత్తికి కావాల్సిన కనీస అర్హతలతో పాటు.. కాస్త ప్రత్యేక నైపుణ్యాలు, ప్రతిభను కూడా సాధించేందుకు కృషి చేయాలి. దీని వల్ల మీకు తగిన అనుభవం లేకున్నా సంస్థ ఉద్యోగం ఇచ్చేందుకు మొగ్గు చూపుతుంది. ఇలాంటి అవకాశం సాధించాలంటే మీరు ఎంచుకున్న రంగంపై పట్టుసాధించాలి. ఇందుకు ఆయా రంగాలపై కొంత పరిశోధన అవసరం.
ఒకరంగాన్ని ఎంచుకున్న తర్వాత అందులో ఉన్న విభిన్న ఉద్యోగ అవకాశాలపై అధ్యయనం చేయాలి. ఆయా రంగాల్లో ఉన్న రకరకాల ఉద్యోగాలు.. వాటి స్థాయిలపై స్పష్టమైన అవగాహన సాధించాలి. దీనివల్ల మీ అర్హతలకు పక్కాగా సరిపోయే ఉద్యోగం ఏదో తెలుస్తుంది. తర్వాత వాటిని లక్ష్యంగా చేసుకొని దరఖాస్తులు చేయవచ్చు. అంతేకాని మీకు సరిపడని.. అన్ని రకాల ఉద్యోగాలకోసం దరఖాస్తులు చేయవద్దు. విద్యార్హతలు ఎక్కువగా ఉన్నాయని అనుభవం అవసరమైన ఉన్నత స్థానాలు.. ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయవద్దు. ఒక ఉద్యోగంపై పూర్తిస్థాయి అవగాహన కలిగాక.. దానికి తగినట్లుగా రెజ్యూమెలు సిద్ధం చేసుకొని.. వాటిని పంపాలి. విద్యార్థి దశలో, శిక్షణ కాలంలో మీరు సాధించిన విజయాలు, కనబరించిన ప్రత్యేక నైపుణ్యాల వివరాలను వెల్లడించాలి. తగిన అనుభదవం లేకున్నా సదరు ఉద్యోగానికి ఎలా అర్హులో.. ఆ ఉద్యోగం అంటే ఎందుకు ఇష్టమో వివరించాలి. ఇలా చేయడం వల్ల తప్పకుండా ఇంటర్వ్యూపిలుపు వస్తుంది. ఇంటర్వ్యూలో కొత్త వ్యక్తి లేదా విద్యార్థిలాగా కాకుండా రెజ్యూమెలో పేర్కొన్న వివరాలకు తగినట్లు కాస్త పరిపక్వత, అనుభవం ఉన్న వ్యక్తిలాగా వ్యవహరించాలి.
ఇక ఈతరం యువతకు సామాజిక అనుసంధాన వేదికల గురించి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. అయితే వీటిని ఉద్యోగాలు సాధించేదుకూ వినియోగించుకోవచ్చు. ఆయా రంగాల్లో నిపుణులను అనుసరించడం, పరిచయాలు పెంచుకోవడానికి సామాజిక అనుసంధాన వేదికలు చక్కగా ఉపయోగపడుతాయి. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ అవకాశాల సమాచారం కోసమే వెలిసిన లింక్డ్‌ఇన్‌, షైన్‌.కామ్‌, మోన్‌స్టర్‌ తదితర సైట్లు ఇప్పుడు సామాజిక అనుసంధాన్నీ అందిస్తున్నాయి. దీంతో ఆయా సంస్థలు, నిపుణులను కలుసుకోవచ్చు. ఈ అవకాశాలనూ సద్వినియోగం చేసుకొంటే.. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అంతేకాని కేవలం ఉద్యోగ అనుభవం లేదని చింతిస్తూ సమయాన్ని వృథా చేయవద్దు.
వాస్తవానికి చాలా మందితో పోల్చితే మీకు లేనిదల్లా అనుభవమే. ప్రతిభ, నైపుణ్యాలు, విద్యార్హతలు ఉన్నపుడు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోవడమే తరువాయి. మరి వీటిని ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలో.. అందుకు ఏం చేయాలో ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొదించుకొని కొత్త కొలువుకోసం కాస్త కొత్తగా సిద్ధం కండి.