పిల్ల‌ల పెంప‌కంలో ఆ ‘అతిపెద్ద’ అవ‌రోధాన్ని ఎలా దాటుతారు??

 

మ‌నిషి భావోద్వేగాల‌కు బానిస‌. ఉద్వేగాల‌ను నియంత్రించుకోలేని వారు జీవితంలో ఎటువంటి అభివృద్ధిని సాధించ‌లేరు. అది వ్య‌క్తిగ‌త జీవితం జీవితం కావ‌చ్చు..వృత్తిగ‌త జీవితం కావొచ్చు. కోపాన్ని ఇత‌ర మానసిక వికారాల‌ను అదుపు చేసుకోలేని వారు మంచి వ్య‌క్తులుగా ఎప్ప‌టికీ మార‌లేరు. వ్య‌క్తిగ‌త ఎదుగుద‌ల విష‌యంలోనే కాదు పిల్ల‌ల పెంప‌కంలో కూడా ఉద్వేగాల అదుపు అన్న‌ది ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది.కోపాన్ని అదుపు చేసుకోలేని వారు త‌మ పిల్ల‌ల‌కు మంచి పెంప‌కాన్ని అలాగే మంచి భ‌విష్య‌త్ ను కూడా అందించ‌లేరు. మీ పిల్ల‌ల‌కు నాణ్య‌మైన పెంప‌కాన్ని అందించి వాళ్లకు అద్భుత‌మైన జీవితాన్ని కానుక‌గా ఇవ్వాలంటే ముందు మీరు భావోద్వేగాల‌ను అదుపు చేసుకోవ‌డం నేర్చుకోవాలి. కోపాన్ని అదుపు చేసుకోలేని కుటుంబాల్లో పెరిగిన పిల్ల‌లు పెద్ద‌య్యాక ఉద్వేగాల‌ను అదుపు చేసుకోలేని దుర్భ‌లురుగా త‌యారైన‌ట్టు నివేదిక‌లు చెపుతున్నాయి.

 

 

కోపం అనేది ఒక సాధార‌ణ ఉద్వేగం!

 

కోపం రావ‌డం అనేది ప్ర‌తీ మ‌నిషికి స‌ర్వ‌సాధార‌ణమైన విష‌యం. అయితే అది ప‌రిధులు దాటిన‌ప్పుడే స‌మ‌స్య మొద‌ల‌వుతుంది. కోపంలో ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎటువంటి ప్ర‌వ‌ర్త‌న క‌న‌బ‌రుస్తున్నాం అన్న‌దాన్ని పూర్తిగా మర్చిపోతాం. ఇది తీవ్ర‌మైన ప‌రిణామాల‌కు దారితీస్తుంది. మ‌నిషి త‌న ప్ర‌వ‌ర్త‌న‌పై అద‌పు త‌ప్పిన‌ప్పుడు జ‌రిగే ప‌రిణామాలు ఆమోద‌యోగ్యం కానివిగా ఉంటాయి. కోపంతో త‌న‌ను తాను బాధ‌పెట్టుకోవ‌డ‌మే కాక ఎదుటి వ్య‌క్తుల‌ను కూడా మాన‌సికంగా తీవ్రంగా గాయ‌ప‌రుస్తున్నారు. ప‌రిణితి చెందిన వ్య‌క్తుల విష‌యంలోనే కోపం ప‌ర్యవ‌సానాలు ఇలా ఉంటే ఇక పిల్ల‌ల విష‌యంలో కోపం తాలూకూ ఫలితాలు మరింత దారుణంగా ఉంటాయి. కోపంతో పసిపిల్ల‌ల లేత మ‌న‌స్సులు గాయ‌ప‌డ‌ట‌మే కాదు, కోపంలో త‌ల్లిదండ్రులు చేసే శారీర‌క, మానసిక హింస వాళ్ల‌ను జీవితాంతం వెంటాడుతుంది. క్ష‌ణికావేశంతో పిల్ల‌ల విష‌యంలో చూపించే కోపం వాళ్ల భ‌విష్య‌త్ ను ప్ర‌భావితం చేస్తుంద‌న్న విష‌యాన్ని పేరెంట్స్ గుర్తించాలి.

 

 

నేర్చుకోవ‌డ‌మే కాదు నేర్పించాలి!

 

కోపాన్ని అదుపు చేసుకోవ‌డం ఎలాగో ముందు త‌ల్లిదండ్రులు నేర్చుకోవాలి. భావోద్వేగాల ప‌రంగా తీవ్ర‌మైన అల‌జ‌డి ఉన్న‌ప్పుడు అవ‌స‌ర‌మైతే మానసిక నిపుణుల స‌హాయం తీసుకోవ‌చ్చు. ప‌రిస్థితి అంత తీవ్రంగా లేన‌ట్టయితే చిన్న చిన్న జాగ్ర‌త్త‌లు తీసుకుని కోపాన్ని అదుపు చేసుకోవ‌చ్చు. కోపం తెప్పించే విష‌యాల‌కు దూరంగా ఉండ‌టం, ఒక వేళ కోపం వ‌స్తున్న‌ట్టు అనిపిస్తే ఆ ప్ర‌దేశం నుంచి వెళ్లిపోవ‌డ‌మో లేక నంబ‌ర్ కౌంటింగ్ టెక్నిక్ ను అప్ల‌య్ చేయ‌డ‌మో చేయాలి. అలాగే గ‌ట్టిగా ఊపిరి పీల్చి వ‌దిలినా మంచి ప్ర‌యోజ‌న‌మే ఉంటుంది. పిల్ల‌ల ద‌గ్గ‌ర కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు అనుకుంటే వాళ్ల‌కు మీరు కూల్ త‌ల్లిదండ్రులుగా ఉండాలంటే ఈ అన్ని ప‌నులు చేయాల్సిందే. అయితే చాలా సంద‌ర్భాల్లో పిల్ల‌లు కూడా కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ , మొండిగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌ల్లిదండ్రుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతూ ఉంటారు. అటువంటుప్పుడు కోపాన్ని నియంత్రించుకోవ‌డ‌మే కాక పిల్ల‌లు ఆ విధంగా ప్ర‌వ‌ర్తించ‌కుండా క‌ట్ట‌డి చేసే బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దే. స‌రిగ్గా ఇక్కడే పేరెంట్స్ గా మీ స‌త్తా, మీ సామ‌ర్ధ్యం బ‌య‌ట‌ప‌డుతుంది. పిల్ల‌ల కోపానికి మీరు బ‌ర‌స్ట్ అయితే మీరు ఎన్న‌టికీ మంచి త‌ల్లిదండ్రులు కాలేరు.

 

 

కోపాన్ని అదుపు చేసుకునే ప‌ద్ధతులు తెలియాలి!

 

పెంప‌కంలో త‌ల్లిదండ్రుల ముందున్న ఎన్నో స‌వాళ్ల‌లో కోపాన్ని అదుపు చేసుకోవ‌డం కూడా ఒక‌టి. అయితే ఇలా చేయాలంటే పేరెంట్స్ కొన్ని ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రించాల్సి ఉంటుంది.

1. కోపాన్ని ఒక సాధార‌ణ ఉద్వేగంగానే ప‌రిగ‌ణించి, ఆ విష‌యాన్ని అంగీక‌రించాలి.
2. మీ పిల్ల‌లు త‌మ కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని, మిమ్మ‌ల్ని ఇబ్బంది పెడుతున్నార‌ని మీరు ఎమోష‌న‌ల్ ఫీల్ అయి కోపం తెచ్చుకోవ‌ద్దు.
3. మీకు దేనికి కోపం వ‌స్తుంది. ఏ ప‌ని చేస్తే మీరు ఓవ‌ర్ గా రియాక్ట్ అవుతారు అన్న విష‌యం మీ పిల్ల‌ల‌కు తెలియ‌జేయండి. అది కోపంతో కూడా చాలా శాంతంగా వాళ్ల‌కు అర్ధ‌మ‌య్యేలా చెప్పండి.
4 . భావోద్వేగాల‌కు సంబంధించి పిల్ల‌ల‌తో మీ సంబంధాలు దృఢంగా ఉండేలా చూసుకోండి.
5. మీ పిల్ల‌ల‌కు కోపం వ‌స్తే దాన్ని వారు ప్ర‌ద‌ర్శిస్తే…అస‌లు వాళ్ల కోపం దేనికోస‌మో తెలుసుకోండి.
6. కోపం వ‌చ్చిన సంద‌ర్భంలో ఏ విధంగా నియంత్రించుకోవాలో, అలా చేయ‌క‌పోతే జ‌రిగే ప‌ర్య‌వ‌సానాల‌ను వాళ్ల‌కు వివ‌రించి చెప్పండి.
7. పిల్ల‌ల‌కు కోపం యొక్క దుష్ప‌రిణామాలు చెపుతూనే అదే స‌మయంలో తాము కోపాన్ని జ‌యించేందుకు త‌గిన ప్ర‌య‌త్నాలు చేయాలి. ఎందుకంటే పిల్ల‌లు త‌ల్లిదండ్రుల‌ను ఆద‌ర్శంగా తీసుకుంటారు.

 

 

భావోద్వేగాలది కెర‌టాల తీరు!

 

కోపంతో ఉద్వేగంతో ఉన్న‌ప్పుడు మీరు పిల్ల‌ల‌కు ఏం నేర్పించ‌గ‌ల‌రు? శాంతంగా ప్ర‌శాంతచిత్తంతో ఉన్న‌ప్పుడే మీరు పిల్ల‌ల‌కు ఏమైనా నేర్పించ‌గ‌లుగుతారు. చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణం, మ‌నుష్యులు, ప‌రిస్థితులు అంతా ప్ర‌శాంతంగా ఉన్న‌ప్పుడే ఎవ‌రైనా ఏమైనా నేర్చుకోగ‌లుగుతారు. దీనికి పిల్ల‌లు కూడా అతీతులు కారు. మీరు మీ పిల్ల‌లకు మంచి విష‌యాలు నేర్పి వాళ్ల‌ను మంచి వ్య‌క్తులుగా తీర్చిదిద్దాల‌నుకుంటే మీ ఇంట్లో ప్ర‌శాంతం వాతావ‌ర‌ణం ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు చెప్పింది, చెప్ప‌బోయేది పిల్ల‌ల‌కు అర్ధమ‌వుతుంది.
ఒక ఉద్వేగం అనేది ఎంత తొంద‌ర‌గా వ‌స్తుందో అంతే తొంద‌ర‌గా వ‌స్తుంది. కోపాన్ని తీసుకుంటే కోపం వ‌చ్చిన‌ప్పుడు 90 సెకండ్లు కామ్ గా ఉంటే అది పోతుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. కాబ‌ట్టి కోపం వ‌చ్చిన‌ప్పుడు ఉద్వేగ ప‌డ‌కుండా శాంతంగా నిరీక్షించండి. మీ కోపం క‌చ్చితంగా పోతుంది. కోపం పోయాక చెప్పే విష‌యం, జ‌రిగే చ‌ర్చ అర్ధ‌వంతంగా ఉంటాయి. పెంప‌కంలో త‌ల్లిదండ్రులు కోపాన్ని అదుపు చేసుకోవడాన్ని క‌చ్చితంగా నేర్చుకోవాల్సిందే. లేదంటే మీరు మంచి తల్లిదండ్రులు ఎప్ప‌టికీ కాలేరు.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)