ఈ పార్ట్‌టైం కోర్సుతో కెరీర్‌కు ఫుల్‌టైం జోష్!!

 

చాలా మందికి చదువు పూర్తి కాగానే ఉద్యోగం వస్తుంది. కెరీర్ లో తొందరగా స్థిరపడాలన్న కోరికతో తక్కువ జీతమైనా ఉద్యోగంలో జాయిన్ అవుతారు. అయితే ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఇక ఉన్నత విద్య అనేది తీరని కోరికగా మిగిలిపోతుంది. ఆఫీస్ లో టార్గెట్ లు హడావుడి, బాధ్యతలు వీటితోనే సమయం గడిచిపోతుంది. అయితే మనసుంటే మార్గం ఉంటుంది. అలాగే అర్హతలను మరింత పెంచుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని బలమైన కోరిక ఉండాలే కానీ దాన్ని సాధ్యం చేసుకునేందుకు ఇప్పుడు ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ రంగంలో ఉన్నవారికి ఉన్నత చదువులు చదివి తమ కెరీర్ లో వెలిగిపోయేందుకు పార్ట్‌టైమ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీయే వీలు కల్పిస్తోంది.

 

 

వీలున్నప్పుడే చదువుకోవచ్చు!

 

పార్ట్ టైమ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీయే లో ప్రయోజనకరమైన విషయం ఏంటంటే మనకు నచ్చిన, కుదిరిన టైం లో క్లాస్ లకు హాజరయ్యే వీలు. అంత సమయం ఉంటే ఉద్యోగం చేసుకుంటూనే ఉదయం, సాయింత్రం క్లాస్ లకు వెళ్లొచ్చు. లేదంటే వీకెండ్ లో హాజరు కావచ్చు. కొన్ని బిజినెస్ స్కూల్స్ ఆన్‌లైన్ భోధనా విధానాన్ని కూడా అమలు చేస్తున్నాయి. పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీయే కోర్సు కాల వ్యవధి ఏడాది నుంచి మూడేళ్ల వరకూ ఉండొచ్చు. తరగతి భోధనను వీలైనంత తగ్గించి మిగిలిన పద్ధతుల్లో సబ్జెక్ట్ ను భోధించేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.

 

 

ప్లానింగ్ ఉన్నవాళ్లకు చాలా సులువు!

 

వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమన్వయం చేసుకునే నేర్పు ఉన్నవాళ్లకు ఎగ్జిక్యూటివ్ ఎంబీయే ఒక అద్భుతమైన అవకాశమని చెప్పొచ్చు. ఉద్యోగం చేస్తున్న నగరంలోనే మీరు అనుకున్న కోర్సును చదవొచ్చు. ఆఫీస్ టైమింగ్స్ అయిపోగానే క్లాస్‌ లకు వెళ్లి తర్వాత ఇంటికొచ్చి అసైన్‌మెంట్లు, రెగ్యులర్ ప్రిపరేషన్ ను కొనసాగించవచ్చు. అయితే ఇది అనుకున్నంత సులువైతే కాదు. ఎందుకంటే చాలా మందికి ఆఫీస్ పనివేళలు ఎప్పుడు పూర్తవుతాయన్నదానిపై స్పష్టత ఉండదు. కొన్ని సార్లు పని ఎక్కువ ఉంటే మరింత సమయంలో ఆఫీస్ లోనే ఉండాల్సి రావచ్చు. అలాగే ఆఫీస్ పని అయిపోయాక కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు ఉంటాయి. వీటన్నింటిని సమన్వయం చేసుకుని ప్రతీరోజూ సాయింత్రం క్లాస్ కు వెళ్లడం అంటే కాస్త కష్టమే. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కనీసం వీకెండ్ లో అయినా సరైన ప్రణాళిక వేసుకుంటే మంచి టాప్ డిగ్రీని సాధించొచ్చు.

 

 

ప్రాక్టికల్ నాలెడ్జ్ అపారం!

 

పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీయే తో ఒక మంచి ప్రయోజనం ఉంది. ప్రతీ రోజూ లేదా ప్రతీ వారం తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను తన ఉద్యోగంలో అమలు చేసే అవకాశం లభించడం. ఇది రెగ్యులర్ విద్యార్ధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకదు. ఇలా తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను వృత్తిగత జీవితంలో ఎప్పటికప్పుడు అప్లయ్ చేయడం వలన ఉద్యోగి పనితీరు మెరుగుపడుతుంది. ఒక వేళ తన పనిలో ఏమైనా సందేహాలు వస్తే వెంటనే తర్వాత క్లాస్ రూమ్ లో ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ ఎంబీయే తో పోల్చుకుంటే పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీయే ఫీజులు చాలా తక్కువ. పేరొందిన కాలేజీల్లో ఫీజ్ రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. దీంతో కొన్ని బిజినెస్ స్కూళ్లు స్కాలర్ షిప్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి.

 

 

మంచి కాలేజీని ఎంపిక చేసుకోవడమే కీలకం

 

పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీయేను ఎప్పుడూ పేరొందిన సంస్థల్లోనే చేయడం ఉత్తమం. ఎందుకంటే అక్కడ ఫుల్‌టైం కోర్సులకు, పార్ట్ ‌టైం కోర్సులకు ఒక రకమైన సిలబస్ ఉంటుంది. విద్యార్ధుల వెసులుబాటు కోసం కాస్త రీడిజైన్ చేసినా సిలబస్ మాత్రం రెగ్యులర్ అభ్యర్ధులకు ఉన్న విధంగానే ఉంటుంది. అన్నింటికంటే ప్రయోజనం ఏంటంటే ఫుల్ టైం విద్యార్ధులకు భోధించే ఫ్యాకల్టీయే పార్ట్ టైం విద్యార్ధులకు కూడా భోధిస్తారు. అందువల్ల నేర్చుకునే విషయంలో మంచి నాణ్యత ఉంటుంది. రెగ్యులర్ కోర్సుతో పోల్చుకుంటే అసైన్‌మెంట్స్ , ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండవు కనుక పార్ట్‌టైం కోర్సు విద్యార్ధులకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది.

 

 

నెట్‌వర్క్ పెంచుకునేందుకు సరైన వేదిక! 

 

పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీయే వలన ఉన్నత డిగ్రీ, కెరీర్ లో ఎదుగుదలతో పాటు అన్నింటికన్నా ముఖ్యంగా నెట్‌వర్క్ విసృతమవుతుంది. మంచి కాలేజీని ఎంచుకున్నప్పుడు క్లాస్ రూమ్ లో అత్యుత్తమ ఫ్యాకల్టీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విశ్లేషకులు గెస్ట్‌ లెక్చర్స్ లో భాగంగా పాఠాలు భోధిస్తారు. వాళ్లతో పరిచయాలు పెంచుకుంటే మీ కెరీర్ కు ఎంతగానే ఉపయోగపడుతుంది. అలాగే మీ లాగే ఎంతో మంది సహ విద్యార్ధులతో, ఇతరులతో పరిచయాలు పెరుగుతాయి. కెరీర్ అభ్యున్నతికి పరిచయాలు , నెట్‌వర్కింగ్ అనేది చాలా ముఖ్యం. భవిష్యత్ లో కెరీర్ ఛేంజ్ లోనూ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలోనూ పరిచయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)