మీరు మంచి పేరెంట్స్ అనిపించుకోవాలంటే ఈ 8 విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోవాలి!

ఏ విష‌యాలు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను మంచి త‌ల్లిదండ్రులుగా త‌యారు చేస్తాయి? అనేక ప‌రిశోధ‌న‌ల అనంత‌రం మాన‌సిక శాస్త్ర‌వేత్తలు పిల్ల‌ల పెంప‌కంతో కొన్ని శాస్త్రీయ‌మైన ప‌ద్ధ‌తుల‌ను క‌నిపెట్టారు. అయితే వైద్యుడు ఇచ్చే మందుల కంటే జ‌బ్బు త‌గ్గుతుంద‌న్న న‌మ్మ‌క‌మే రోగిని బ‌తికిస్తుంది. అలాగే పెంప‌కంలో ఎన్ని శాస్త్రీయ ప‌ద్ధ‌తులు ఎన్ని వ‌చ్చినా పిల్ల‌ల సంక్షేమంపై త‌ల్లిదండ్రుల అనుక్ష‌ణం ప‌డే ఆరాట‌మే మంచి పెంప‌కం అనిపించుకుంటుంది.ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ పర్ ఫెక్ట్ కాదు మంచి త‌ల్లిదండ్రులు కూడా దీనికి అతీతులు కారు. అంద‌రిలోనూ లోపాలు ఉంటాయి. లోపాలు ఉన్నంత మాత్రాన మంచి త‌ల్లిదండ్రులు కాలేరు అనుకోవ‌డం త‌ప్పు. అనుక్ష‌ణం లోపాల‌ను స‌రిదిద్దుకుంటూ వ్య‌క్తిగ‌తంగా ఉన్న‌తంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటే పిల్ల‌ల పెంప‌కంలో మీరు విజ‌యం సాధించిన‌ట్టే. ఎందుకంటే మీ పిల్ల‌ల‌కు మీరే రోల్ మోడ‌ల్. వ్య‌క్తిగ‌తంగా ఎదుగుతూ అదే స‌మ‌యంలో పిల్ల‌లతో ప్రేమ‌పూర్వ‌క సంబంధాల‌ను నెరుపుతూ పెంప‌కంలో చిత్త‌శుద్ధిని ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడే ఒక వ్య‌క్తి ఎదుగుద‌ల‌ను నిజ‌మైన ఎదుగుద‌ల‌గా భావించాల్సి ఉంటుంది. వ్య‌క్తిగ‌తంగా ఎంత ఎదిగినా పిల్లల పెంప‌కంలో విఫ‌ల‌మై వారిని స‌రైన దారిలో పెట్ట‌లేన‌ప్పుడు అది వ్య‌క్తిగ‌త ప‌రాజ‌యం కింద‌కే వ‌స్తుంది. ఈ నేపథ్యంలో పిల్ల‌ల పెంప‌కంలో పాటించాల్సిన 8 ముఖ్య‌మైన విష‌యాల‌ను ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

 

 

1. ఆద‌ర్శంగా ఉండండి!

 

ఫ‌లానా విధంగా చేయండి..మీరు ఆ విధంగా త‌యారు కావాల్సిందే..ఇలాంటి మాట‌లు పిల్ల‌ల‌కు అస్స‌లు చెప్ప‌కండి. మీరు వాళ్ల‌ను ఏం విధంగా చూడాల‌నుకుంటున్నారో వాళ్లు ఆ దారిలో వెళ్లేలా వాళ్ల‌కు మార్గం చూపండి. అలా మార్గం చూపాలంటే ముందు మీరు ఆ మార్గంలో ఉన్న‌తంగా ఎద‌గాలి. అనుక‌రించ‌డం అనేది మాన‌వ నైజం. పిల్ల‌లు కూడా అనుక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. వాళ్లు ముందుగా త‌ల్లిదండ్రుల‌నే అనుక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. కాబ‌ట్టి త‌ల్లిదండ్రులు ఆద‌ర్శంగా ఉండేందుకు అనుక్ష‌ణం ప్ర‌య‌త్నించాలి. సానుకూల దృక్ఫ‌ధం, భావోద్వేగాలు ఇలా అన్నీ మీ నుంచి కాపీ కొట్టేందుకు పిల్లలు రెడీగా ఉంటారు. ఏం ప‌ని చేసినా అందులో ప్రేమ‌, సానుకూల‌త‌, స‌హ‌నం ఉండేలా చూసుకున్న‌ప్పుడు పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.

 

2. ప్రేమ‌తో మెల‌గండి!

 

పిల్ల‌ల‌పై మీకున్న ప్రేమ‌ను అనుక్ష‌ణం ప్ర‌ద‌ర్శించండి. ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించే పిల్లు చెడిపోతార‌నే భావ‌న అస్స‌లు వ‌ద్దు. వాళ్ల‌కు ఆనందాన్నిచ్చే ప‌నులు చేయ‌డం, ఏమీ ఆశించకుండా, కోర‌కుండా ప్రేమ‌ను పంచ‌డం వ‌ల‌న పిల్ల‌ల మానసిక వికాసం మెరుగ‌వుతుంది. త‌ల్లిదండ్రుల‌తో వాళ్ల బంధం బ‌ల‌ప‌డుతుంది. మీ ప్రేమ‌లో నిజాయితీ ఉంటే అది పిల్ల‌ల‌కు చేటు చేసే విధంగా అయితే ఉండ‌దు. వాళ్ల‌తో అధిక స‌మ‌యం కేటాయించ‌డం, ప్రేమ‌తో కూడిన ఆలింగ‌నం వాళ్ల‌ను మీకు మాన‌సికంగా ద‌గ్గ‌ర చేస్తుంది. స్ప‌ర్శ అనేది పెంప‌కంలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. పిల్ల‌ల‌తో ప్రేమ‌తో మెల‌గ‌డం వ‌ల‌న వాళ్ల మ‌స్తిష్కంలో ఆక్సిటాసిన్, ఒపియాయిడ్స్, ప్రొలాక్టిన్ వంటి సానుకూల హార్మోన్లు విడుద‌ల‌వుతాయి.ఈ న్యూరో ర‌సాయ‌న‌క చ‌ర్య వాళ్ల‌లో సానుకూల దృక్ఫ‌ధం, భావోద్వేగాల అదుపు వంటివి అల‌వ‌డ‌తాయి.

 

 

 

3. సానుకూల పెంప‌కం

 

పిల్ల‌లు పుట్టిన‌ప్పుడు మెద‌డులో 100 బిలియ‌న్ల బ్రెయిన్ సెల్స్ ను క‌లిగి ఉంటారు. చిన్న‌త‌నంలో ఈ న్యూరాన్స్ ఒక‌దానితో మ‌రొక‌టి క‌నెక్ట్ అయి ఉంటాయి. ఈ కనెక్ష‌న్స్ మ‌న ఆలోచ‌న‌ల‌ను, వైఖ‌రిని, వ్య‌క్తిత్వాన్ని నిర్ణ‌యిస్తాయి. చిన్న‌త‌నంలో రూపాంత‌రం చెందే ఈ న్యూరాన్ క‌నెక్ష‌న్స్ యే త‌ర్వాత మ‌న జీవితాన్ని నిర్దేశిస్తాయి. చిన్న‌త‌నంలో ప్రేమతో , ఆప్యాయ‌త‌తో కూడిన మంచి పెంప‌కంలో పెరిగిన పిల్ల‌లు మంచి వ్య‌క్తులుగా ఎదుగుతారు. అలా కాకుండా ప్రేమ‌రాహిత్యం, త‌ల్లిదండ్రుల నిర్ల‌క్ష్యంతో పెరిగిన పిల్లలు భావోద్వేగాలను అదుపు చేసుకోలేని విఫ‌ల వ్య‌క్తులుగా మిగులుతారు. మీ పిల్ల‌ల‌తో క‌లిసి ఒక స‌ర‌దా పాట పాడండి. పార్క్ కు వెళ్లండి.న‌వ్వుతూ వాళ్ల‌తో ఆట‌లాడండి. స‌ర‌దాగా వాహ‌నంపై షికారుకు వెళ్లండి. ఇవన్నీ మీ పిల్ల‌ల మెద‌డులో సానుకూల క‌నెక్ష‌న్స్ ను ఏర్పాటు చేస్తాయి. వాళ్లు అనుభ‌వించిన ఆ ప్రేమ ఒక మంచి జ్ఞాపకంగా వాళ్ల మెద‌డులో నిక్షిప్తం అయిపోతుంది. అది వాళ్ల‌కు జీవితాంతం ఒక తియ్య‌ని అనుభవంగా గుర్తుండిపోతుంది. మంచి త‌ల్లిదండ్రులు ఎప్పుడూ త‌మ పిల్ల‌ల‌కు ఏది మంచి ఏది చెడు అన్న‌ది ప్రేమ‌పూర్వ‌కంగా వాళ్ల‌కు అర్ధ‌మ‌య్యేలా చెపుతారు. ఒక పిల్ల‌వాడి ప్ర‌వ‌ర్త‌న బాగా లేన‌ప్పుడు దాని వెనుక కార‌ణ‌మేమిట‌న్న‌ది అన్వేషించాలి. దాన్ని తొలిగించి అటువంటి త‌ప్పులు జ‌ర‌గుకుండా చూసుకోవాలి.

 

4. పిల్ల‌ల‌కు ఒక సుర‌క్షిత‌మైన స్వ‌ర్గాన్నిఅందివ్వండి!

 

పిల్ల‌ల‌కు ఎప్పుడూ మీరు వారితోనే ఉన్నార‌న్న ఒక భ‌ద్ర‌త‌ను క‌ల్పించండి.వాళ్ల అవ‌స‌రాల‌ను ప్రేమ‌తో తీరుస్తూ నా కోసం నా త‌ల్లిదండ్రులు ఉన్నార‌న్న ఆలోచ‌న‌ను క‌లిగించండి. మీ పిల్ల‌ల‌ను ఎప్పుడూ ఒక ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా గుర్తిస్తూ వాళ్లకు త‌గినంత గుర్తింపును ఇవ్వండి. మీరిచ్చే భ‌ద్ర‌త వాళ్ల‌లో భ‌యాన్ని పోగొట్టి స్వ‌ర్గాన్ని త‌లపించాలి.ఇలాంటి భ‌ద్ర‌త‌ను అందించ‌డం వ‌ల‌న పిల్ల‌లు భావోద్వేగాల ప‌రంగా అభివృద్ధి సాధించి మాన‌సికంగా బాగా ఎదిగేందుకు అవ‌కాశం ఏర్పడుతుంది.

 

 

5. మాట్లాడండి. వాళ్ల‌తో క‌లిసిపోండి!

 

మాట్లాడ‌టం అనేది సంబంధాల‌ను మెరుగుప‌రుస్తుంది. ఇది పిల్ల‌ల పెంప‌కం విష‌యంలోనూ వ‌ర్తిస్తుంది. వీలైన‌ప్పుడ‌ల్లా మీ పిల్ల‌ల‌తో అధిక స‌మ‌యం మాట్లాడండి. అలాగే వారు చెప్పేది ఓపిగ్గా, జాగ్ర‌త్త‌గా వినండి. మీ పిల్ల‌ల‌తో మ‌న‌స్సు విప్పి ఒక స్నేహితునిలా మాట్లాడిన‌ప్పుడు వాళ్ల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుగా మీకే చెపుతారు. ఇలా మ‌న‌స్సు విప్పి మాట్లాడ‌టం, సామ‌ర‌స్యంగా క‌లిసిపోవ‌డం అనేది పిల్ల‌ల మాన‌సిక ఎదుగుద‌ల‌కు పెద్ద సానుకూల అంశంగా మారుతుంది.

 

6. ప్ర‌తిబింబంలా ఉండండి!

 

చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను తాము పెరిగిన‌దానికంటే మ‌రింత ఉన్న‌తంగా పెంచాల‌ని ఆరాట‌ప‌డుతూ ఉంటారు. తాము మంచి పెంప‌కంలో బాగానే పెరిగిన‌ప్ప‌టికీ వాళ్లు ఏదైతే అసంతృప్తిగా ఫీల్ అయ్యారో దాన్ని త‌మ పిల్ల‌ల‌కు అందించాల‌ని భావిస్తారు. అయితే ఇటువంటి ఆలోచ‌న స‌రికాదు ఎందుకంటే కాల‌మాన ప‌రిస్థితుల‌ను అనుస‌రించి కొన్ని విష‌యాలు జ‌రుగుతూ ఉంటాయి. అప్పుడు త‌మ త‌ల్లిదండ్రులు చేయ‌లేనిది వాళ్ల‌కు సాధ్యం కానిది అయ్యి ఉండ‌వ‌చ్చు. లేదా ఇంకేదైనా అవ‌రోధం ఎదురై ఉండ‌వ‌చ్చు. అలాగే వాళ్లు ఫ‌లానా విధంగా చేసారు నేను కూడా అలానే చేస్తాను అని అనుకోవడానికి కూడా వీలులేదు. వాస్త‌వ ప‌రిస్తితుల ఆధారంగా పెంప‌కంలో, పిల్ల‌ల‌తో వ్య‌వ‌హ‌రించే తీరులో మార్పులు చేసుకోవాల్సిందే.

 

 

7. మీ సొంత శ్రేయ‌స్సు కోసం ఆలోచించండి!

 

పెంప‌కంలో ఇది కూడా చాలా ముఖ్య‌మైన విష‌యం. మీరు మీ పిల్ల‌ల‌ను స‌రైన రీతిలో, మంచి సౌక‌ర్యాలు క‌ల్పిస్తూ ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో పెంచాలంటే ముందు మీ సొంత శ్రేయ‌స్సు కోసం ఆలోచించాలి. పిల్ల‌లు పుట్టాక చాలా మంది దంపతుల్లో ఎడ‌బాటు క‌లుగుతుంది. ఇది కొన్నిసార్లు వాళ్లు సంబంధం విచ్ఛిన్నానికి కూడా దారితీస్తుంది. పిల్ల‌ల పెంప‌కం ఎంత ముఖ్యమో మీ సొంత ఆరోగ్యాన్ని , సంతోషాన్ని కాపాడుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. మీరు మీ భాగ‌స్వామితో స‌రైన సంబంధం క‌లిగి ఉండ‌క‌పోతే మీరు ఎప్ప‌టికీ మీ పిల్ల‌ల‌కు మంచి పెంప‌కాన్ని అందివ్వ‌లేరు.

 

 

8. ద‌గ్గ‌రి దారిని ఎంచుకొండి!

 

షార్ట్ కట్ అంటే మీ పిల్ల‌ల‌కు ఏదో త‌క్కువ‌ స‌మ‌యంలోనే మార్చేసే టెక్నిక్ కాదు. అప్ప‌టికే పెంప‌కంపై శాస్త్ర‌వేత్త‌లు నిరూపించిన విష‌యాల‌ను అథ్య‌యనం చేస్తే పెంప‌కం సులువుగా మారుతుంది. ఈ రోజుల్లో పిల్ల‌ల పెంప‌కం అనేది సైకాల‌జీలో బాగా అథ్య‌య‌నం చేసిన విష‌యం. పెంప‌కంలో చాలా ప‌ద్ధ‌తులు శాస్త్రీయంగా నిరూపించ‌బ‌డ్డాయి. వాటిని మీరు స్వంతం చేసుకోండి. అవ‌స‌ర‌మైతే పెంప‌కంపై నిపుణుల స‌ల‌హాలు తీసుకోండి. శాస్త్రీయంగా రుజువైన విష‌యాల‌పై అథ్య‌య‌నం చేయండి. తెలుసుకొండి. మీ పిల్ల‌ల‌ను ప్రేమ‌తో, ఆప్యాయ‌త‌తో ఆనంద‌భ‌రిత‌మైన, బాధ్య‌తాయుత‌మైన మంచి పౌరులుగా తీర్చిదిద్దండి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)