మీ పిల్లల్నిస్కూల్లో జాయిన్ చేయాలా? అయితే వారికి అంతరిక్ష శిక్షణ అవసరం!!

 

పిల్ల‌ల పెంప‌కం అనేది ప్రేమ‌తో, వాత్స‌ల్యంతో, ముందుచూపుతో కూడిన బాధ్య‌తాయుత‌మైన వ్య‌వ‌హారం. పెంప‌కంలో చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ‌కు తెలీకుండానే పొర‌పాట్లు చేస్తూ త‌మ క‌ల‌ల ప్ర‌తిరూపాల‌ను అంద‌మైన భ‌విష్య‌త్ కు దూరం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్య‌తిరేక భావ‌న‌లు, మాట‌లు పిల్ల‌లు మ‌న‌సుల‌ను మ‌లినం చేస్తాయి. తెలిసి చేయ‌కున్నప్ప‌టికీ అధిక శాతం మంది త‌ల్లిదండ్రులు ఈ పొర‌పాటు చేస్తూ పిల్ల‌ల్లోని సృజ‌నాత్మ‌క‌త‌ను, ఆస‌క్తిని చేజేతులూ చంపేస్తున్నారు. అల్ల‌రి చేస్తే నిన్ను స్కూల్ లో చేర్పిస్తా.. నిన్ను హాస్ట‌ల్ లో ప‌డేస్తా అనే మాట‌లు వాడుతూ ఉంటారు. ఇటువంటి మాట‌లు పిల్ల‌ల మ‌నసుల్లో ఎటువంటి భావ‌న‌ను క‌లుగుజేస్తాయంటే న‌న్ను కేవ‌లం శిక్షించ‌డానికే స్కూల్ లో వేస్తున్నార‌ని వాళ్లు అనుకుంటారు. ఇటువంటి ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు వాళ్లు స్కూల్ కు ఆనందంగా ఎలా వెళ్ల‌గ‌లుగుతారు? పిల్ల‌ల్లో సృజ‌నాత్మ‌క‌త‌ను మ‌ట్టుబెట్టే ప్ర‌క్రియ‌కు స‌రిగ్గా ఇక్క‌డే బీజం ప‌డుతుంది.

 

 

పెంప‌కంలో నిబ‌ద్ధ‌త ఉండాలి!

 

సంసిద్ధ‌త అనే ప‌దాన్ని ఎటువంటి సంద‌ర్భంలో వాడుతాం. ఒక ప‌నిని పూర్తి ప్రేమ‌తో, బాధ్య‌త‌తో, ఇష్టంతో పూర్తి చేయ‌డానికి స‌న్న‌ద్ధంగా ఉన్న‌ప్పుడు వాడుతూ ఉంటాం. ఇప్పుడు పిల్ల‌ల పెంప‌కంలో కూడా త‌ల్లిదండ్రులకు కావాల్సింది నిబ‌ద్ధ‌తే. మ‌నం గ‌తంలో చెప్పుకున్న‌ట్టు పిల్ల‌ల పెంప‌కం అనేది ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. చాలా బాధ్య‌త‌తో కూడిన‌ క‌ఠిన‌మైన అంశం. అందుకే ఇప్పుడు పేరెంటింగ్ లో చాలా మంది త‌ల్లిదండ్రులు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుంటున్నారు. మ‌నం దేశంలో ఇటువంటి ప‌ద్ధ‌తి ఇంకా అమ‌ల్లోకి రాలేదు. కానీ పిల్ల‌ల పెంప‌కంలో ప్రాథ‌మిక అంశాల‌ను తెలుసుకోకుండా ఉండ‌టం మాత్రం క‌చ్చితంగా త‌ప్పే. ఇలా ఉండ‌టం మూలంగానే చాలా మంది త‌ల్లిదండ్రులు తెలియ‌నిత‌నంతో పొర‌పాట్లు చేస్తున్నారు. పిల్ల‌ల్లో వ్య‌తిరేక భావ‌న‌ల‌ను నింపుతున్నారు. ఒక ప‌నిని ఇష్టంతో చేసిన‌ప్పుడే క‌దా దాని ఫ‌లితం ఆనందాన్ని క‌లిగిస్తుంది. ఇష్టం లేని ప‌ని ఏదైనా స‌రే అది నిరుత్సాహాన్ని, అశ్ర‌ద్ధ‌ను, జ‌డ‌త్వాన్ని వెంట‌పెట్టుకుని తిరుగుతుంది. పిల్ల‌ల‌కు చ‌దువు అన్నా , పాఠ‌శాల అన్నా ఇష్టాన్ని క‌లిగించాలి. అది రెండో పాఠ‌శాలైన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అంతేకానీ స్కూల్ అంటే ఏదో జైల్ , టీచ‌ర్ అంటే రాక్ష‌సి, చ‌దువు అంటే పెద్ద బ్ర‌హ్మ పదార్ధం అనే భావ‌నను పిల్ల‌ల‌కు క‌లిగించొద్దు. వారు చాలా ఇష్టంతో, ఆనందంగా స్కూల్ కు వెళ్లేలా వాళ్ల‌ని మాన‌సికంగా సంసిద్ధుల‌ను చేయాలి.

 

 

పిల్ల‌వాడు పాఠ‌శాల ఆధీనంలోకి వెళ్లాలి!

 

నీల్ అనే అత‌ను ఇంగ్లండ్ లో ఒక స్కూల్ ను ఏర్పాటు చేసాడు. మిగిలిన పాఠ‌శాలలు అన్నింటికంటే ఈ స్కూల్ చాలా ప్ర‌త్యేకం. ఎందుకంటే నీల్ స్థాపించిన స్కూల్ లో పిల్ల‌ల‌కు పుస్త‌కాలు ఉండ‌వు, బ్యాగ్ లు ఉండ‌వు, హోమ్ వ‌ర్క్ లు ఉండ‌వు. పిల్లలు ప్ర‌తీ రోజు స్కూల్ కు వ‌చ్చి తోటి పిల్ల‌ల‌తో ఆడుకుని, ప్ర‌కృతిలో కాసేపు సేద‌తీరి ఇంటికి వెళ్లిపోతారు. పిల్ల‌లు ఆనందంతో కూడిన వాతావ‌ర‌ణంలో చ‌దువుకోవాల‌న్న‌దే నీల్ స్కూల్ లోని ముఖ్య ఉద్దేశం. వాళ్లు ప్ర‌తీ రోజూ స్కూల్ కు వ‌చ్చేందుకు ఆస‌క్తితో ఇష్టంతో ఎదురు చూస్తూ ఉంటారు. బాగా అల్ల‌రి చేసే పిల్ల‌లు కూడా నీల్ స్కూల్ లో మంచి పిల్ల‌లుగా త‌యార‌య్యారు. ఎందుకంటే అక్క‌డి ఉత్సాహ‌పూరిత‌మైన వాతావ‌ర‌ణంలో వాళ్లు స్కూల్ ను ప్రేమించి ఆ స్కూల్ ఆధీనంలోకి వెళ్లిపోయారు. స్కూల్ ఆధీనంలోకి వెళ్లిన పిల్లవాడు స్కూల్ ను ప్రేమిస్తాడు. స్కూల్ ను ప్రేమించిన‌ప్పుడు ప్ర‌తీ రోజూ స్కూల్ కు వెళ్లేందుకు అక్క‌డి కొత్త విష‌యాల‌ను నేర్చుకునేందుకు పిల్ల‌వాడు ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు.

 

 

జేమ్స్ వాట్, న్యూట‌న్ ల‌ను చంపేయ‌కండి!

 

చిన్న‌తనంలో పిల్ల‌ల‌కు సృజ‌నాత్మ‌క‌త అధికంగా ఉంటుంది. ప్ర‌తీ విష‌యాన్ని నేర్చుకోవాల‌ని, దాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా చేసి చూడాలని వాళ్లు ఉవ్విళ్లురుతూ ఉంటారు. అటువంటి స‌మ‌యంలో వాళ్ల‌కు త‌ల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్లు చేయాల‌నుకుంటున్న విష‌యాన్ని, వాళ్ల ఉత్సుక‌త‌ను అర్ధం చేసుకోవాలి. న్యూట‌న్ అదే ప‌నిగా చెట్టు కింద కూర్చున్న‌ప్పుడు, జేమ్స్ వాట్ వంట గ‌దిలో ప్రెజ‌ర్ ఎలా వ‌స్తుందో ఆసక్తిగా గ‌మ‌నిస్తున్న‌ప్పుడు వాళ్ల త‌ల్లిదండ్రులు అడ్డుకుని అరిచి ఉంటే వాళ్లు ప్రపంచానికి అద్భుత ప్ర‌యోగాల‌ను అందించ‌గ‌లిగే వారు కాదు. మీ పిల్ల‌ల్లో కూడా జేమ్స్ వాట్, న్యూట‌న్ లు ఉండే ఉంటారు. వాళ్ల ఆసక్తికి ప్రోత్సాహం ఇచ్చి , వాళ్ల ఉత్సుక‌త‌కు నీళ్లు పోస్తే గొప్ప వ్య‌క్తులుగా మారుతారు. అంతే కానీ ప్ర‌తీ విష‌యానికి అరిచి గీపెట్టి తిడుతూ వాళ్ల‌లోని సృజ‌నాత్మ‌క‌త‌ను చంపేయ‌కండి. వాళ్లు చేసే ప‌నిలో ఏదో కొత్త విష‌యం మీకు క‌నిపించిన‌ప్పుడు క‌చ్చితంగా వాళ్ల‌కు త‌గిన స‌హకారం అందించండి.

 

 

వ్యోమ‌గామిలా పిల్ల‌ల‌కూ శిక్ష‌ణ అవ‌సరం!

 

ఒక వ్య‌క్తిని అంత‌రిక్షంలోకి పంపాల‌నుకున్న‌ప్పుడు అత‌నికి ఎంతో శిక్ష‌ణ‌ను ఇస్తారు. ఒక వ్యోమ‌గామిగా అత‌ను ఎదుర్కోవాల్సిన స‌వాళ్ల‌కు అనుగుణంగా ఆ శిక్షణ సాగుతుంది. అక్క‌డి వాతావ‌ర‌ణం, ప్ర‌తికూల ప‌రిస్థితులు, మ‌నుగ‌డ ఇలా ఎన్నో విష‌యాలను వాళ్లు త‌ట్టుకునేలా త‌యారు చేస్తారు. అన్ని విష‌యాల‌పై ప‌ట్టు ఉన్న వ్య‌క్తికే అంత‌టి శిక్షణ అవ‌స‌రం అయిన‌ప్పుడు కొత్త‌గా ప్రపంచంలోకి అడుగుపెట్టి స్కూల్ అనే ఒక కొత్త ప్ర‌దేశానికి వెళుతున్న‌ప్పుడు పిల్ల‌ల‌కు ఇంకెంత బాగా శిక్ష‌ణ‌నివ్వాలి. ఇళ్లు అనే రెండో పాఠ‌శాల‌లోనే వాళ్ల‌కు త‌గిన శిక్ష‌ణనిచ్చి వాళ్ల‌కు స్కూల్ అంటే ఇష్టం ఏర్ప‌డేలా చేస్తే వాళ్ల‌కు స్కూలింగ్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్ల‌ల‌ను ఇలా బ‌య‌ట ప్ర‌పంచానికి మానసికంగా సంసిద్ధుల‌ను చేయాలంటే ముందు త‌ల్లిదండ్రులు మానసికంగా ప‌రిణితి సాధించాలి. పిల్ల‌ల పెంప‌కంపై అవ‌గాహ‌న తెచ్చుకోవాలి. అప్పుడే వాళ్లు త‌మ పిల్ల‌ల‌కు అంద‌మైన భ‌విష్య‌త్ ను కానుకగా ఇవ్వ‌గ‌ల‌రు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)