ప్రధాని సెక్యూరిటీ గార్డ్ మీ కెరీర్‌ నూ కాపాడగలడు!!

 

 

శ్ర‌ద్ధ‌, నిబ‌ద్ద‌తతో పనిచేసే వాళ్లను మ‌నం నిశితంగా గ‌మ‌నిస్తే మ‌న‌కు కొన్ని విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. వాళ్లు తాము చేప‌ట్టిన ప‌నిని త‌దేక దృష్టితో ఎటువంటి పొర‌పాటు లేకుండా విజ‌యవంతంగా పూర్తి చేస్తారు. ఎన్ని ప్ర‌లోభాలు ఉన్నా ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నా వాళ్లు మాత్రం త‌మ దృష్టిని ప‌నిపైనే నిలుపుతారు. ఇటువంటి వ్యక్తుల‌ను ఆద‌ర్శంగా తీసుకుంటే మ‌నం కూడా కెరీర్ లో విజ‌యవంత‌మైన వ్య‌క్తులుగా ఎద‌గొచ్చు. అప్ప‌గించిన ప‌నిని శ్ర‌ద్ధ‌తో చేసిన ఉద్యోగుల‌కు కంపెనీల హెచ్ఆర్ పాల‌సీల్లో ఆకర్ష‌ణీయ‌మైన ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి వంటి ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీ అధికారులను ఒకసారి ఆపాద‌మ‌స్త‌కం ప‌రిశీలిస్తే వాళ్లు త‌మ ప‌నిపై త‌ప్ప మిగ‌తా విష‌యాల‌పై ఎంత అనాస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారో అర్ధం చేసుకోవ‌చ్చు. ఉద్యోగులు కూడా కంపెనీలోని ఇత‌ర విష‌యాల‌పై దృష్టిని మ‌రల్చ‌కుండా చేస్తున్న ప‌నిపై మాత్ర‌మే ఫోక‌స్ చేస్తే బెస్ట్ ఎంప్లాయ్ గా గుర్తింపును పొంద‌వ‌చ్చు.

 

 

 

ల‌క్ష్యం మాత్ర‌మే గుర్తుండాలి..ఆక‌ర్ష‌ణ‌లు కాదు!

 

మీరు ఎప్పుడైనా పీఎం, సీఎం, రాష్ట్రప‌తి వంటి ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే సెక్యూరిటీ వ్య‌క్తుల‌ను గ‌మ‌నించారా? తాము ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన నాయ‌కులు ఎటువంటి కార్య‌క్ర‌మంలో ఉన్నా స‌రే ఆ భ‌ద్ర‌తాధికారులు మాత్రం తాము ఇవ్వాల్సిన ర‌క్ష‌ణ‌పైనే దృష్టి పెడ‌తారు. ప్ర‌ముఖులు పాల్గొన్న కార్య‌క్ర‌మాల్లో ఎన్నో వెలుగు జిలుగులు, ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నా వారు మాత్రం చుట్టూ ఉన్న ప‌రిస‌రాల‌ను గ‌మ‌నిస్తూ తాము భ‌ద్ర‌త ఇవ్వాల్సిన వ్య‌క్తుల‌కు ఎటువంటి అపాయం క‌లుగుకుండా కాపాడుతూ ఉంటారు. చుట్టూ ఉన్న అంద‌రూ ఆ కార్య‌క్ర‌మాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తుంటే వారు మాత్రం ఒక్క క్ష‌ణం కూడా ప‌క్కకు చూపు తిప్ప‌కుండా పూర్తి అప్ర‌మ‌త్త‌త‌తో ఉంటారు. వారిని దృష్టిని ఏ ఆక‌ర్ష‌ణ కూడా చెడ‌గొట్ట‌లేదు. ఇది చాలా సామాన్య‌మైన విష‌య‌మే అయినా సెక్యూరిటీ ఆఫీస‌ర్లు ప్ర‌ద‌ర్శించే ఆ ఫోక‌స్ ను ప్ర‌తీ ఒక్క‌రూ గ్ర‌హించ‌గ‌లిగితే జీవితంలో ఊహించని అభివృద్ధిని సాధించ‌వ‌చ్చు. అయితే వారి వారి కెరీర్ ల‌కు అన్వ‌యించుకున్న‌ప్పుడు దాన్ని స‌రైన రీతిలో ఆపాదించుకున్న‌ప్పుడు అద్భుతాలు ఆవిష్కృత‌మ‌వుతాయి.

 

 

త‌న కోస‌మే రెడ్ కార్పెట్ వేసార‌నుకోవ‌డం గుర్రం త‌ప్పు!!

 

ఒక ప్ర‌ధాన మంత్రి ఎటువంటి అద్భుత‌మైన కార్య‌క్ర‌మానికి వెళ్లినా అక్క‌డ‌కు సెక్యూరిటీ ఆఫీస‌ర్ కూడా వెళ్తాడు. పెద్ద పెద్ద దేశాధినేత‌లు, గొప్ప గొప్ప వ్య‌క్తులు చుట్టూ ఉంటారు. అంత మాత్రం చేత‌న తన‌ను తాను గొప్ప‌వాడుగా ఊహించుకుని గ‌ర్వ‌ప‌డితే మొద‌టికే మోసం వ‌స్తుంది. త‌న ప‌ని కేవ‌లం ప్ర‌ధానికి ఎటువంటి హానీ జ‌ర‌గుకుండా అత్యుత్త‌మ ర‌క్ష‌ణను అందించ‌డం అంతే. మిగ‌తా విష‌యాలు, సంఘ‌ట‌న‌లు ఏమీ అత‌న్ని ఆక‌ర్షించ‌కూడ‌దు? అలా కాకుండా తాను ప్ర‌ధాని సెక్యూరిటీని నేను చాలా గొప్ప‌వాడ్ని అనే ఆలోచ‌నా ధోర‌ణిలోకి వెళితే మొద‌టికే మోసం వ‌స్తుంది. పూర్వం కాలంలో రాజుపై గుర్రంపై ఊరుగుతుంటే కింద రెడ్ కార్పెట్ వేసి పూలు జ‌ల్లి స్వాగ‌తం ప‌లికేవారు. ఇదంతా కేవ‌లం రాజుగారి కోసం మాత్ర‌మే జ‌రుగుతుంది. అలా కాకుండా గుర్రం ఈ రెడ్ కార్పెట్, ఈ పూలు ఇవన్నీ త‌న కోస‌మే అనుకుంటే అది గుర్రం అజ్ఞానం అవుతుంది. రాజుగారు మీద కూర్చున్నంత వ‌ర‌కూ మాత్ర‌మే గుర్రానికి విలువ‌. త‌ర్వాత అది కూడా మిగ‌తా గుర్రాల్లానే ఒక మామూలు గుర్రం అంతే.

 

 

కంపెనీ ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే గుర్తుండాలి!

 

కంపెనీ త‌న ఉద్యోగుల‌ను ఏదైనా సెమినార్ కు పంపి అక్క‌డ బ్రాండ్ ప్ర‌మోష‌న్ చేయ‌మ‌ని చెప్పిన‌ప్పుడు ఉద్యోగి కేవ‌లం కంపెనీ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఆలోచించాలి. అనుక్ష‌ణం త‌న జాబ్ పై దృష్టి సారించి కంపెనీ త‌న‌కిచ్చిన టార్గెట్ ను రీచ్ కావ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. అలా కాకుండా అక్కడ ఉండే మిగ‌తా విష‌యాల‌పై దృష్టి సారిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. ముఖ్యంగా కంపెనీని ప్ర‌మోట్ చేయ‌డానికి కంపెనీ విధివిధానాల‌ను ప్ర‌చారం చేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు కేవ‌లం కంపెనీ ప్ర‌తినిధులుగానే వ్య‌వ‌హ‌రించాలి . కానీ సెమినార్ లో పాల్గొనే సాధార‌ణ ప్ర‌తినిధుల్లా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు. సాధార‌ణ ప్ర‌తినిధుల్లా ప్ర‌వ‌ర్తించ‌డం అంటే కంపెనీకి న‌ష్టం చేకూరుస్తున్న‌ట్టు. ఈ విష‌యాన్ని ఉద్యోగులు బాగా గుర్తుంచుకోవాలి. అక్క‌డ కేవ‌లం త‌మ ఫోక‌స్ అంతా కంపెనీకి ఎటువంటి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌గ‌లం..ఈ వేదిక‌ను ఎంత బాగా వాడుకోగ‌లం..అన్న విష‌యాల‌పైనే ఉండాలి. ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే సెక్యూరిటీ ఆఫీస‌ర్ ఎంత ఫోక‌స్ తో ఉంటాడో అంతే ఫోక‌స్ గా ఉద్యోగి కూడా ఉండాలి. త‌ను నిర్దేశించుకున్న ల‌క్ష్యాన్ని సాధించే క్ర‌మంలో చుట్టూ ఉన్న ప్ర‌లోభాల‌ను, ఆక‌ర్ష‌ణ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోకూడ‌దు.

 

 

సంస్థ విశ్వాసాన్ని నిల‌బెట్టండి!

 

ఒక ఉద్యోగికి సంస్థ మాత్ర‌మే దైవం. త‌న‌కు సంస్థ కంటే ముఖ్య‌మైన‌ది ఇంకేది ఉండ‌కూడ‌దు. త‌ను విధుల్లో ఉన్న‌ప్పుడు కేవ‌లం సంస్థ ప్ర‌యోజ‌నాల కోసం మాత్ర‌మే పాటుప‌డాలి. సంస్థ త‌న‌పై పెట్టుకున్న విశ్వాసాన్ని, న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నం చేయాలి. ఇక్క‌డే చాలా మంది ఇలా ఆలోచిస్తారు. సంస్థ కోసం ఇంత‌లా ఆలోచిస్తే ఏమొస్తుంది? ఏదో పైపైన అలా చేసుకుంటూ వెళ్లిపోదాం అనుకుంటారు. ఇటువంటి ఆలోచ‌నా విధానం కెరీర్ ను తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. సంస్థ కోసం శ్ర‌మించిన‌ప్పుడు, దాన్ని త‌గిన విధంగా ప్ర‌చారం చేసుకున్న‌ప్పుడు క‌చ్చితంగా గుర్తింపు వ‌స్తుంది. మీ స‌మ‌ర్ధ‌త వెల్ల‌డైన‌ప్పుడు కంపెనీ మీపై ఎన‌లేని న‌మ్మ‌కాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. కెరీర్ లో ఉన్న‌త‌స్థానాన్ని క‌ల్పిస్తుంది. క‌ష్ట‌ప‌డే వాళ్ల‌ను, ఫోక‌స్ తో ప‌నిచేసే వాళ్ల‌ను వ‌దులుకునేందుకు ఏం కంపెనీ సిద్ధంగా ఉండ‌దు. అప్ప‌గించిన ప‌నిని జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీలా పూర్తి ఫోక‌స్ తో పూర్తి చేయాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)