యునెస్కో రిపోర్ట్…మన విద్య దుస్థితి మరోసారి వెల్లడైంది!!

 

ప్ర‌పంచంలో వేగ‌వంతమైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. ప్ర‌పంచంలో 35 ఏళ్ల లోపు యువ‌కులు ఎక్కువ‌గా ఉన్న న‌వ యువ దేశం..అంత‌రిక్ష ప‌రిజ్ఞానంలో అగ్ర‌దేశాల‌కు పోటీ.. ఇండియా గూర్చి చెప్పేట‌ప్పుడు విన‌సొంపుగా ఉన్న ఈ స్టేట్ మెంట్లు నాణెనికి ఒక వైపు మాత్ర‌మే. రెండో వైపు మాత్రం ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా విద్యా రంగంలో మ‌న దేశం వెనక‌బాటుత‌నం మ‌రోసారి సుస్ప‌ష్ట‌మైంది. తాజాగా యునెస్కో విడుద‌ల చేసిన ఓ నివేదిక, ప్ర‌పంచం మొత్తం మీద‌ ఉన్న నిర‌క్ష్య‌రాస్యుల్లో 35 శాతం మంది ఇండియాలోనే ఉన్నార‌ని వెల్ల‌డించింది. ఇండియా మొత్తం జ‌నాభాలో 26 కోట్ల మంది ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం రాని నిరక్ష్య‌రాస్యులేన‌ని వెల్లడించింది. ప్ర‌పంచం వేగంగా దూసుకుపోతున్న ప్ర‌స్తుత త‌రుణంలోనూ ఇప్ప‌టికీ సంపూర్ణ అక్ష‌రాస్యత‌ను సాధించ‌డంలో విఫలం కావ‌డం అంటే అభివృద్ధికి దూర‌మ‌వుతున్న‌ట్టే. అయినా మొద్దు నిద్ర పోతున్న పాల‌కులు విద్యా రంగంపై శీత‌క‌న్ను వేస్తూనే ఉన్నారు. విద్యా రంగంలో అభివృద్ధి సాధించ‌కుండా దేశాభివృద్ధి సాధ్యం కాద‌న్న ప్రాథ‌మిక సూత్రాన్ని మ‌ర్చిపోయి నేల విడిచి సాము చేస్తున్న ప్ర‌భుత్వం వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ఎప్పుడు అవ‌గ‌తం చేసుకుంటుందోన‌న్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల‌ ప్ర‌శ్న‌. మ‌రోవైపు తెలంగాణాలో కూడా ఇప్ప‌టికీ 34 శాతం మంది ప్ర‌జ‌ల‌కు క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం రాద‌ని యునెస్కో నివేదిక చెపుతోంది.

 

 

అస‌లు యునెస్కో నివేదిక‌లో ఏముంది?

 

తాజాగా యునెస్కో వారి గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ మాన‌ట‌రింగ్ నివేదిక విడుద‌లైంది. ఆ నివేదిక‌లో వెల్ల‌డైన విష‌యాలు ఇండియా విద్యా రంగ దుస్థితిని మ‌రోసారి క‌ళ్ల‌కు క‌ట్టాయి. ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశాల్లో రెండో స్థానంలో ఉన్న ఇండియాలో దాదాపు 26 కోట్ల మంది చ‌ద‌వ‌డం, రాయ‌డం రాని నిర‌క్ష‌రాస్యులేన‌ని ఆ రిపోర్ట్ లో తేలింది. గ‌తంతో పోల్చుకుంటే అక్ష‌రాస్యుల సంఖ్య కాస్త పెరిగిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ నిర‌క్ష్య‌రాస్యులు సంఖ్య భారీగా ఉండ‌టం ప‌రిస్థితి తీవ్ర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. దేశంలోని మొత్తం జ‌నాభాలో 73 శాతం మంది మాత్ర‌మే అక్ష‌రాస్యుల‌ని యునెస్కో నివేదిక వెల్ల‌డించింది. ఇక తెలంగాణా విష‌యానికొస్తే ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంది. తెలంగాణా మొత్తం జ‌నాభాలో అక్ష‌రాస్యుల సంఖ్య 65 శాతం మాత్ర‌మేన‌ని తేలింది. అంటే దాదాపు 35 శాతం మంది తెలంగాణా ప్ర‌జ‌ల‌కు క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం కూడా రాదు. స‌రైన వ‌స‌తులు లేక‌పోవ‌డం, పేద‌రికం కార‌ణంగా చాలా మంది పిల్ల‌లు ప్రాథ‌మిక స్థాయిలోనే చ‌దువుకు ఫుల్ స్టాప్ పెడుతున్నార‌ని యునెస్కో నివేదిక‌లో వెల్ల‌డైంది. మ‌రోవైపు అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ప్ర‌పంచంలో చాలా దేశాలు త‌మ జీడీపీ లో అధిక శాతం నిధులను విద్యా రంగానికి కేటాయిస్తున్నాయి. కానీ మ‌న దేశంలో మొత్తం జీడీపీలో విద్యారంగానికి కేటాయిస్తున్న మొత్తం 3.8 శాతం మాత్ర‌మే. ప్ర‌పంచంలో స‌గ‌టున ప్ర‌తీ దేశం త‌మ జీడీపీ 5 శాతం నిధులను విద్యా రంగానికి కేటాయించాలి. క‌నీసం ఆ బెంచ్ మార్క్ స‌గ‌టును కూడా ఇండియా అందుకోలేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర ప‌రిణామం.

 

 

తెలంగాణాలో ప‌రిస్థితి ద‌య‌నీయం!

 

యునెస్కో రిపోర్ట్ లో తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి వెల్ల‌డైన గ‌ణాంకాలు ఆందోళ‌న‌కరంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ చాలా మంది విద్య‌కు దూరంగా ఉన్నారు. తెలంగాణా మొత్తం జ‌నాభాలో దాదాపు 25 శాతం మంది నిర‌క్ష్య‌రాస్యులుగానే ఉంట‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ముందు నుంచీ ఉన్న నిర‌క్ష్య‌రాస్యుల‌కు తోడు కొత్త‌గా బ‌డిలో చేరుతున్న మ‌ధ్య‌లోనే మానేయ‌డం నిర‌క్ష్య‌రాస్యుల‌ను పెంచుతోంది. ఇండియాలో దాదాపు కోటీ ఇరవై లక్షల మంది పిల్లలు అసలు స్కూల్ కే రావడం లేదని లెక్కలు చెపుతున్నాయి. ఈ సంఖ్య తెలంగాణాలో కాస్త ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ డ్రాపవుట్లను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టకుంటే పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సుముఖంగా లేరు. దీంతో వాళ్లను ఒప్పించి పిల్లలను బడికి తీసుకురావడం అనేది అధికార్లకు సవాలుగా మారింది. అలాగే చదువురాని నడి వయస్కులకు ఇప్పుడు చదవడం,రాయడం నేర్పించడం కూడా ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. డిజిటల్ ఇండియా లక్ష్యాలను అందుకోవాలంటే ప్రతీ ఒక్కరు చదవడం,రాయడం పై కనీస అవగాహన తెచ్చుకోవాలి. మరి ఇంత మంది నిరక్ష్యరాస్యులు ఉన్న నేపథ్యంలో ఆ లక్ష్యాలను ఎలా చేరుకుంటారన్నది పెద్ద ప్రశ్న.

 

ఇంట్లో ఈగల మోత..బయట పల్లకీల మోత!

 

చైనా లాంటి దేశాల‌తో ఆర్థిక వృద్ధిలో పోటీప‌డ‌తామ‌ని చెపుతున్న ఇండియా , కీల‌కమైన విద్యా రంగంపై మాత్రం శ్ర‌ద్ధ చూపించ‌డం లేదు. ఇప్ప‌టికే భారీ సంఖ్య‌లో యువ‌కులు ఉన్నా వారికి సరైన నైపుణ్యాలు లేక అభివృద్ధి వెనుక‌బడుతున్నా మ‌న విధానక‌ర్త‌లు మాత్రం క‌ళ్లు తెర‌వ‌డం లేదు. ఒక‌వైపు చ‌దువుకున్న వాళ్లు ప‌నిచేసేందుకు అన‌ర్హులుగా తేలుతుంటే మ‌రోవైపు అస‌లు ఆ కొద్ది పాటి అక్ష‌రజ్ఞానం కూడా లేని వాళ్లు కోట్ల‌లో తేలుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనతో పాటు రేసులో ఉన్న వర్ధమాన దేశాలతో పోటీ ఎలా సాధ్యం? ఒక వైపు నిరక్షరాస్యత, మరోవైపు నైపుణ్యాల లేమి ఈ రెండు జాడ్యాలను వదిలించుకోకుంటే పోటీ పడటం మాట అటుంచి కనీసం రేసులో కూడా నిలవలేని పరిస్థితి వస్తుందని ప్రభుత్వాలు గ్రహించలేకపోవడం విడ్డూరంగా ఉంది. పైకి మాత్రం ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, పనిచేసే యువకులు మా దగ్గరే ఉన్నారు అని చంకలు గుద్దుకుంటున్నారు. ఇది ఒక రకంగా ఆత్మవంచన తప్పించి మరేమీ కాదు. సమస్యకు మూలాలు గుర్తించి పరిష్కారాన్ని వెతకడం మాని సాధించిన కొద్దిపాటి ప్రగతినే గొప్పగా చెప్పుకుంటే ఇండియా ఎప్పటికీ అగ్రదేశం కానేరదు.

 

 

తక్షణ చర్యలు చేపట్టకుంటే పరిస్థితి దిగజారుతుంది!

 

125 కోట్ల జనాభాలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలకు ఇంకా చదవడం రాయడం రాదు అంటే మన దేశం ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. యుద్ధప్రాతిపదికన నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రయత్నం చేయకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధి సాధ్యం కాదు. రానున్న 20 ఏళ్లలో చైనా ను దాటి అగ్రరాజ్యంగా ఎగుదుతామని గప్పాలు కొడుతున్న నేతలు ముందుగా అక్షరాస్యతను పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఏదైనా ఒక దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే విద్య, ఆరోగ్యం, సంక్షేమంలో పూర్తి స్థాయి అభివృద్ధి సాధించాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని మర్చిపోయి ప్రజలకు విద్యను అందించకుండా, విద్యార్ధులకు నైపుణ్యాలను అందించకుండా మీనమేషాలు లెక్కిస్తే ఎప్పటికే ఇండియా వర్ధమాన దేశంగానే మిగిలిపోతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)