రాణీ ప‌ద్మావ‌తి..చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ‌కు మౌన సాక్షి!!

 

ఎప్పుడూ విజేత‌లే చ‌రిత్ర‌ను రాస్తార‌న్న‌ది ఒక‌ నిష్ఠుర‌ స‌త్యం. ఏ దేశ చ‌రిత్ర‌ను తీసుకున్నా, ఏ చారిత్రక‌ మ‌లుపును తీసుకున్నా అప్ప‌టి విజేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే చారిత్ర‌క ర‌చ‌న జ‌రిగేది. ఇందులో రెండో మాట‌కు తావులేదు. అయితే అబ‌ద్ధాలు, అభూత క‌ల్ప‌న‌లు చరిత్ర‌గా చెలామ‌ణీ అయిపోవ‌డం వాటినే నిజమ‌ని త‌ర్వాతి త‌రాలు న‌మ్మేయ‌డం అన్న‌ది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతూ వ‌స్తోంది. రాజుల పోయినా రాజ్యాలు అంత‌రించినా స్వాత్వంత్రం పూర్వం వ‌ర‌కూ మ‌న దేశంలో చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ అనేది జ‌రుగుతూనే వ‌స్తోంది. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా వారు చరిత్ర‌ను మార్చుకుంటూ వ‌చ్చార‌న్న‌ది కొట్టిపారేయ‌లేని నిజం. క్రీస్తు పూర్వం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న దేశ చరిత్ర‌లో ఏది నిజ‌మో, ఏది క‌ల్ప‌నో తెలుసుకోలేని దుస్థితికి కార‌ణ‌మెవ‌రు? వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా తిమ్మిని బ‌మ్మిని చేసిన ఈ దుస్సాంప్ర‌దాయానికి ఒడిక‌ట్టిందెవరు? అలెగ్జాండ‌ర్ మొదలుకుని , అక్బ‌ర్, రాణీ ప‌ద్మావ‌తి, అల్లాద్దీన్ ఖిల్జీ, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ వర‌కూ అందుబాటులో ఉన్న చ‌రిత్ర‌పై ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు.

 

 

 

చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణకు పాల్ప‌డిందెవ‌రు?

 

ప్ర‌పంచాన్ని జ‌యించి విశ్వ‌విజేత‌గా అవ‌త‌రించాల‌ని దండయాత్ర ప్రారంభించిన అలెగ్జాండ‌ర్ కంటే ముందు నుంచి కూడా చరిత్ర వ‌క్రీక‌ర‌ణ జ‌రుగుతూ వ‌స్తోంది. ప్ర‌పంచ చ‌రిత్ర‌ను కాస్త ప‌క్క‌న పెడితే అలెగ్జాండ‌ర్ జ‌యించిన యుద్ధాలు, గెలిచిన రాజుల వివ‌రాల‌పై కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. క్రీస్తూ పూర్వం 326 లో భార‌తదేశంపై దండెత్తిన అలెగ్జాండ‌ర్ పురుషోత్త‌ముని సైన్యాల దెబ్బ‌కు తీవ్రంగా దెబ్బ‌తిన్నాడ‌ని చెపుతారు. అయితే కొన్ని చరిత్ర పుస్తకాల్లో మాత్రం పురుషోత్త‌ముడు అలెగ్జాండ‌ర్ చేతిలో ఓడిపోయి చ‌నిపోయిన‌ట్టు ఉంది. ఇక గుప్త సామ్రాజ్యం క్రీస్తు శ‌కం 4 వ శ‌తాబ్దంలో అంత‌రించిన‌ట్టు , గుప్త సామ్రాజ్యంలో చివ‌రి చంద్ర‌గుప్త 2 అని చ‌రిత్ర పుస్త‌కాల్లో ఉంది. కానీ వాస్త‌వానికి గుప్తుల సామ్రాజ్యం క్రీస్తు 6వ శ‌తాబ్దం వ‌ర‌కూ ఉంది. ఇది చ‌రిత్ర‌లో లేదు. 1191 లో మ‌హ్మ‌ద్ ఘోరీ ఇండియాపై దండయాత్ర చేసి మొఘ‌ల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే ఢిల్లీ సుల్తానుల‌కు, గుప్తుల మ‌ధ్య కాలంలో అస‌లు ఏం జ‌రిగింది.? ఈ విష‌యం విద్యార్ధుల‌కు ఎప్ప‌టికీ తెలియ‌దు. గుప్తుల సామ్రాజ్యం అంత‌రించ‌డానికి, మొఘ‌ల్ సామ్రాజ్యం అవ‌త‌రించడానికి మ‌ధ్య 800 ఏళ్ల వ్య‌త్యాసం ఉంది. ఈ మ‌ధ్య కాలంలో ఇండియాలో ఏం జ‌రిగింది? అలాగే మొఘ‌లులు ఇండియాను 350 ఏళ్ల పాటు ప‌రిపాలించార‌ని చ‌రిత్ర పుస్త‌కాల్లో ఉంది. వాస్త‌వానికి 17 వ శ‌తాబ్దం నాటికి మొఘ‌లులు సామ్రాజ్యంలో చాలావ‌ర‌కూ మ‌రాఠా రాజులు పాల‌న‌లోకి వెళ్లిపోయాయి. ఆఖ‌రికి ఢిల్లీని కూడా మ‌రాఠా పాల‌కులు ఆక్ర‌మించుకున్నారు.

 

 

మ‌ధ్య యుగాల చ‌రిత్ర‌ను పూర్తిగా మార్చేసారు!

 

సుధీర్ఘ‌కాలం పాటు అధికారంలో ఉన్న కొంద‌రు కుహానా లౌకిక‌వాదులు భార‌త దేశ చ‌రిత్ర‌ను మార్చేసార‌న్న‌ది అధిక సంఖ్యాఖులైన హిందువుల్లో ఉన్న ప్ర‌ధాన‌మైన అసంతృప్తి. ముఖ్యంగా మ‌ధ్య యుగాల చ‌రిత్ర‌ను పూర్తిగా వ‌క్రీక‌రించార‌న్న‌ది వారి ఆరోప‌ణ‌. మ‌ధ్య యుగాల చ‌రిత్ర‌ను మ‌న దేశంలో నెహ్రూవాద‌, మార్క్సిస్టు, కుహానా లౌకిక‌వాదులు రాసారు. దీనిపై చాలా మందికి అభ్యంత‌రాలు ఉన్నాయి. హిందువుల‌ను సంస్కృతిని ప్ర‌తిబింబించే వేలాది క‌ట్ట‌డాల‌ను నేల‌మ‌ట్టం చేసి వేలాది మంది దారుణంగా చంపిన జౌరంగ‌జేబును ఈ చరిత్ర కారులు లౌకిక‌వాది అని కీర్తించారు. ఇటువంటి చ‌రిత్ర‌ను కొంద‌రు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించేందుకు సిద్ధంగా లేరు. ముఖ్యంగా రాజ్ పుత్ లు ఉత్త‌ర‌భార‌తంలోని హిందువులు నెహ్రువాదులు, మార్క్సిస్ట్ లు రాసిన చ‌రిత్ర‌ను త‌ప్పుల త‌డ‌క‌గా అభివ‌ర్ణిస్తున్నారు. సుధీర్ఠ‌కాలం పాటు వాళ్లే అధికారాన్ని అంటిపెట్టుకోవ‌డంతో భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ పేరుతో హిందూ మ‌తంపై దాడి జ‌రిగింద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే హిందూ దేవ‌త‌ల‌ను కించ‌ప‌రుస్తూ బొమ్మ‌లు గీయ‌డం, సినిమాలు తీయ‌డం చేసినా వాళ్ల‌కు ఎటువంటి ఇబ్బంది క‌లుగులేదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. అనుకూల పార్టీ అధికారంలో ఉండ‌టంతో ప్ర‌స్తుతం చాలా మంది హిందువులు త‌మపై ఎవ‌రైనా దాడి చేస్తే ఊరుకునేందుకు సిద్ధంగా లేరు.

 

 

‘ప‌ద్మావతి’పై వివాదం ఎందుకు?

 

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న ప‌ద్మావ‌తి చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద వివాదాస్పదంగా మారింది. చరిత్ర‌ను వ‌క్రీక‌రించి రాజ్ పుత్ ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ప‌ద్మావ‌తి క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని ఒక వ‌ర్గం వాదిస్తోంది. ముఖ్యంగా ఉత్త‌ర భార‌త దేశంలో గ‌ణ‌నీయ సంఖ్య‌లో ఉన్న రాజ్ పుత్ లు త‌మ ఆడ‌ప‌డుచును ఈ సినిమాలో త‌ప్పుగా చూపించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఈ వివాదం లోతుల్లోకి వెళ్తే 1303 లో అల్లావుద్దీస్ ఖిల్జీ రాజపుత్రుల సామ్రాజ్యం చిత్తోడ్ ఘ‌డ్ పై దండ‌యాత్ర చేసాడు. రాజ‌పుత్రుల‌కు ఖిల్జీకి మ‌ధ్య జ‌రిగిన యుద్ధంలో రాజ‌పుత్రులు ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే రాజుపుత్రుల రాణి ప‌ద్మావ‌తి అందాన్ని చూసి ముగ్దుడైన అల్లావుద్దీస్ ఖిల్జీ ఆమెను ఎలాగైనా ద‌క్కించుకోవాల‌నుకున్నాడు. అయితే ఖిల్జీ కి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చిక్క‌కూడ‌ద‌ని భావించి మిగిలిన అంతఃపుర కాంత‌ల‌తో క‌లిసి రాణీ ప‌ద్మావ‌తి అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. అస‌లు వాస్త‌వానికి రాణీ ప‌ద్మావ‌తి అందం గురించి విని ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాల‌నే ఖిల్జీ చిత్తోడ్ ఘ‌డ్ పై దాడి చేసాడ‌న్న వాద‌న కూడా ఉంది. ఇది చ‌రిత్ర‌లో ఉన్న క‌థ‌. అయితే భ‌న్సాలీ సినిమాలో ప‌ద్మావ‌తి క‌థ‌ను పూర్తి మార్చివేసార‌ని, చరిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని ఆమె ఖిల్జీతో స‌న్నిహితంగా ఉన్న‌ట్టు చూపించార‌ని రాజ‌పుత్ లు ఆందోళ‌న చెందుతున్నారు. అందుకే ఈ సినిమాను నిషేధించాల‌ని ఆందోళ‌న‌కు దిగుతున్నారు. అయితే అటువంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని ఉన్న క‌థ‌ను ఉన్న‌ట్టు చూపించామ‌ని చెప్పాల్సిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌చారం కోసమో మ‌రి దేనికోస‌మో తెలియ‌దు కానీ స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేస్తున్నారు. ఒక వ‌ర్గం మ‌నోభావాలు దెబ్బ‌తీసి భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ అంటే స‌రిపోద‌న్న‌ది కొంద‌రి వాద‌న‌.

 

 

‘వ‌క్రీక‌ర‌ణ’ భ‌విష్య‌త్ త‌రాల‌కు పెను శాపం!

 

చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌డం అంటే ఒక నిజాన్ని స‌మాధి చేసి ఒక అబ‌ద్ధాన్ని బ‌తికించ‌డం. ఇది ఎప్ప‌టికీ స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌దు. ఎందుకంటే అబద్ధం ఎప్ప‌టికైనా అబ‌ద్ధ‌మే. దానికి ఎటువంటి విలువా లేదు. భావి త‌రాల‌కు వాస్త‌వాల‌ను ఉన్న‌వి ఉన్న‌ట్టు అందించ‌లేన‌ప్పుడు ఆ దేశం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అభివృద్ధి సాధించ‌లేదు. మ‌రీ వందల ఏళ్ల నాటి విష‌యాల‌నే కాదు. స్వాతంత్రం పూర్వం స్వాతంత్రం త‌ర్వాత కూడా చాలా విష‌యాలు, వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాకుండా స‌మాధి అయిపోయాన‌న్న అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా దేశ విభ‌జ‌న‌, గాంధీజీ వైఫ‌ల్యాలు, గాంధీ హ‌త్య‌, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణం ముందు చోటుచేసుకున్న ప‌రిణామాలు ఇవ‌న్నీ పూర్తి స్థాయిలో బ‌య‌ట‌కు రాలేద‌ని చాలా మందిలో అసంతృప్తి ఉంది. కొంద‌ర్ని హీరోల‌ను చేసేందుకు కొంద‌ర్ని విల‌న్లుగా చిత్రీక‌రించార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇప్ప‌టికైనా పూర్తి స్థాయిలో ప‌రిశోధ‌న‌లు చేసి విశ్వ‌స‌నీయ‌మైన‌ అస‌లైన చ‌రిత్ర‌ను భావిత‌రాల‌కు అందిస్తే ఫ‌లితం ఉంటుంది.

 

(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)