రాలిన ‘ఆకు’ చెప్పే జీవిత ర‌హ‌స్యం!

 

ప‌రిణితి చెందిన ఆలోచ‌న‌ల‌తో నిశితంగా గ‌మ‌నిస్తే ఈ స‌మ‌స్త సృష్టిలో ప్ర‌తీ విష‌యం ఒక‌దానితో మ‌రొక‌టి అంత‌ర్గ‌త సంబంధం క‌లిగి ఉంటుంది. ముఖ్యంగా ప్ర‌కృతి, స‌మ‌స్త ప్రాణ కోటితో త‌న సంబందాన్ని కొన‌సాగిస్తూ వాటికి అనుక్ష‌ణం కొత్త విష‌యాల‌ను నేర్పించేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రుతువులు అనేవి మ‌నిషి భావోద్వేగాల‌కు స‌రిగ్గా అతికిన‌ట్టు స‌రిపోతాయి. ప్ర‌తీ రుతువు మ‌నిషికి ఒక కొత్త విష‌యం నేర్పిస్తుంది. ప్ర‌కృతి నుంచి ఏం నేర్చుకున్నాం, ఎంత నేర్చుకున్నాం అన్న‌దానిపైనే మ‌నిషి ఎదుగుద‌ల అలాగే స‌మాజం, వ్య‌వ‌స్థ‌ల ఎదుగుద‌ల ఆధార‌ప‌డి ఉంటాయి. శిశిరంలో చెట్లు ఆకులు రాల్చి జీవం లేకుండా ఎండిపోయిన మోడులా త‌యార‌వుతుంది. ఆకులు రాలిపోయినంత మాత్రాన‌ చెట్టు ప‌ని అయిపోయిన‌ట్టు కాదు. మ‌ళ్లీ వ‌సంతం రాగానే చెట్టు కొత్త అందంతో చిగురిస్తుంది. అలాగే ఏదైనా క‌ష్టం రాగానే మ‌నిషి ప‌ని అయిపోయిన‌ట్టు కాదు క‌ష్టాల‌ను ఓర్చుకుంటూ వేచి ఉండ‌టం నేర్చుకుంటే జీవితంలో మ‌ళ్లీ వ‌సంతం వ‌స్తుంది. ఇదే సూత్రం సంస్థ‌ల‌కు కూడా వ‌ర్తిస్తుంది.

 

 

వెన‌క‌డుగు వేసినంత మాత్రాన సింహం జింక‌కు భ‌య‌ప‌డిన‌ట్టా!?

 

వేటాడే ముందు సింహం రెండడుగులు వెన‌క్కు వేస్తుంది. అంటే దాన‌ర్ధం సింహం భ‌య‌ప‌డింద‌ని కాదు. మ‌రింత బ‌లంగా రెట్టింపు వేగంతో అది ప్ర‌త్య‌ర్ధిపై లంఘించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు. అలాగే చెట్టు ఆకులు రాల్చింది అంటే చచ్చిపోయిన‌ట్టు కాదు. క‌ఠిన స‌మ‌యంలో త‌ట్టుకుని నిల‌బ‌డే చ‌ర్య‌ల్లో భాగంగానే చెట్టు త‌న ఆకుల‌ను త‌నంత తానుగా విడిచేస్తుంది. మ‌ళ్లీ వ‌ర్షాలు ప‌డి నీరు, పోష‌కాలు స‌మృద్ధిగా దొరికాక త‌న శాఖ‌ల‌ను విస్త‌రించుకుంటుంది. ఆకులు రాలి మోడుబారిపోయినా మ‌ళ్లీ కొత్త చిగురులతో క‌ళ‌క‌ళ‌లాడే చెట్టును చూస్తే చాలు జీవితాన్ని ఎలా జీవించాలో తెలిసిపోతుంది. మ‌నిషి జీవితంలో కూడా గ‌డ్డు కాలం దాపురిస్తుంది. జీవితం ఒక్క‌సారిగా అంధ‌కారంలా క‌నిపిస్తుంది. అయితే ఆశ‌ను విడ‌నాడకుండా క‌ష్టాల‌ను ఎదుర్కొంటూ జీవించ‌డం నేర్చుకుంటే మంచి రోజులు త‌ప్పకుండా వ‌స్తాయి. కానీ అప్ప‌టి వ‌ర‌కూ క‌ష్ట‌ప‌డుతూ ఆశావ‌హ దృక్ఫ‌దంతో జీవించాలి. ఎందుకంటే జీవితం అంటే రుతువుల గ‌మ‌నం లాంటిదే. శిశిరం వ‌చ్చిందంటే దాన‌ర్ధం క‌చ్చితంగా వ‌సంతం వ‌స్తుంద‌ని. కాబ‌ట్టి మ‌నిషి కూడా జీవితంలో ఆశ‌ను విడ‌నాడ‌కుండా ఓపిక‌తో, స‌హ‌నంతో మంచి రోజులు కోసం ఎదురు చూడ‌టం నేర్చుకోవాలి.

 

 

గెల‌వాలంటే ముందు ఓడిపోవ‌డం నేర్చుకొండి!

 

గెలుపంటే ఏంటే ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ స‌రైన అర్ధం చెప్ప‌లేక‌పోయారు. కానీ అనుక్ష‌ణం గెలుపు కోసం ప్ర‌య‌త్నించ‌డ‌మే మ‌నిషిగా మ‌న క‌ర్త‌వ్యం. అయితే ఈ క్ర‌మంలో వ‌చ్చే ఓట‌ములను ఎవ‌రైతే గెలుపుతో స‌మానంగా చూస్తారో వారే నిజ‌మైన విజేత‌లుగా నిలుస్తారు. ఎప్పుడూ ఓడిపోని వాడు ఎన్న‌టికీ ఉన్న‌త స్థానానికి చేరుకోలేడు. ఓడిపోయిన‌ప్పుడే గెల‌వ‌డం తెలుస్తుంది. బ‌ల్బును క‌నిపెట్టిన థామ‌స్ అల్వా ఎడిస‌న్ బ‌ల్బ్ క‌నిపెట్ట‌డంలో కొన్ని వంద‌ల సార్లు విఫ‌ల‌మ‌య్యాడు. అయినా అత‌ను ఎప్పుడూ కుంగిపోలేదు. బ‌ల్బును ఎలా త‌యారు చేయ‌కూడ‌దో అన్న విష‌యాన్ని నేను నా ఓట‌ముల ద్వారా నేర్చుకున్నాను అని చెప్పాడు. అలాగే ప్ర‌స్తుతం ఉన్నత స్థానాలో ఉన్న చాలా మంది వ్య‌క్తులు జీవితంలోనూ, కెరీర్ లోనూ ఎన్నోసార్లు ఓడిపోయి ఎదురుదెబ్బ‌లు తిన్న‌వాళ్లే. ఇప్ప‌టికీ మెగాస్టార్ గా వెలుగెందుతున్న చిరంజీవి త‌న సినీ కెరీర్ లో ఒకానొక స‌మ‌యంలో గ‌డ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. వ‌రుస‌గా సినిమాలు ఫెయిల్ కావ‌డంతో కొన్నాళ్లు సినిమాలు చేయ‌డం మానేసాడు కూడా. అయినా మ‌ళ్లీ రెట్టించిన ఆత్మ‌విశ్వాసంతో సినిమాలు చేసి విజ‌యాల‌ను ద‌క్కించుకున్నాడు. అలాగే జ‌న‌సేన అధినేత , ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా దాదాపు ప‌దేళ్లు పాటు కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు. గ‌డ్డు కాలం ఎదురైనా ఆత్మ‌విశ్వాసం కోల్పోకుండా విజ‌యం కోసం ప్ర‌య‌త్నించ‌డ‌మే వారిని ఇప్పుడు ఉన్న‌త స్థానంలో నిలబెట్టింది. ఇది ఎవ‌రికైనా వ‌ర్తిస్తుంది. కష్టాలు వ‌స్తాయి. చెట్టులా ఆకులాలు కాలం వ‌స్తుంది. కానీ ధైర్యంగా ఉంటూ చేసిన త‌ప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే గెలుపు మీ పాదాల చెంత‌కు వ‌స్తుంది.

 

 

ఆకురాల్చే చెట్టు సంస్థ‌కూ పాఠాలు భోధిస్తుంది!

 

మ‌నం ఒక సంస్థ‌ను తీసుకుంటే సంస్థ‌కు వ‌చ్చే ఆదాయాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండ‌వు. ఒక్కోసారి సంక్షోభ ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. సంస్థ మ‌నుగ‌డ ప్ర‌మాదంలో ప‌డుతుంది. అటువంటి స‌మ‌యంలో సంస్థ ప‌నైపోయిందని అనుకోవ‌డానికి వీలు లేదు. అటువంటి సంక్షోభ ప‌రిస్థితుల్లో సంస్థ ఎంత గ‌ట్టిగా నిల‌బ‌డిందో అన్న‌విష‌యాన్ని చూస్తే చాలు దాని స‌త్తా సామ‌ర్ధ్యం అర్ధ‌మైపోతుంది. ఖ‌ర్చు త‌గ్గింపు చ‌ర్య‌లు, ఉద్యోగాల తొలిగింపు నివార‌ణా చ‌ర్య‌లు ఏమైనా కానీ సంస్థ బ‌త‌క‌డం ముఖ్యం. ఈ క్ర‌మంలో ఆర్థిక స‌మ‌స్య‌లతో పాటు విమ‌ర్శ‌లు కూడా చుట్టుముడ‌తాయి. అయినా స‌రే ఆశ‌ను విడ‌నాడ‌కుండా సంస్థ‌ను బ‌తికించేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంది. రిజ‌ర్వ్ ఫండ్స్ ఉన్న కంపెనీలు సంక్షోభ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొగ‌ల‌వు. మిగిలిన కంపెనీలు చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఆశావ‌హ దృక్ఫ‌దంతో ఉంటూ ఆశ‌ను విడ‌నాడ‌ని సంస్థ‌లే మ‌నుడ‌గ సాగిస్తాయి. మిగిలినవి సంక్షోభ వ‌ర‌ద‌లో కొట్టుకుపోతాయి. స్టార్ట‌ప్ సంస్థ‌లు ఈ విష‌యాన్ని చాలా చ‌క్క‌గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టార్ట‌ప్ ల‌కు ప్రారంభంలోనే ఒడిదుడుకులు వ‌స్తే త‌ట్టుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. కాబ‌ట్టి సంక్షోభం వ‌చ్చిన‌ప్పుడు ధైర్యం కోల్పోక‌పోవ‌డం, రిజ‌ర్వ్ ఫండ్ ను త‌యారు చేసుకోవ‌డం చేయాలి.

జీవితం మ‌న‌కు ఎన్నో అవ‌కాశాల‌ను ఇస్తుంది!

 

ఆకురాల్చు కాలంలో చెట్టు చూసేందుకు ఒక మోడులా క‌నిపిస్తుంది. అలా అని అది చ‌నిపోయేందుకు అనేందుకు వీలు లేదు. అది మ‌రింతగా బ‌ల‌ప‌డేందుకు ఆ సంక్షోభ స‌మ‌యాన్నిఅది ఉప‌యోగించుకుంటుంది. మ‌నిషి కూడా త‌న జీవితంలో ఈ సూత్రాన్నే అమ‌లు చేయాలి. సంబంధాలు దూర‌మైనంత మాత్రాన మ‌నుషులు దూరంగా వెళ్లిపోయినంత మాత్రాన జీవితం ముగిసిన‌ట్టు కాదు. జీవితం మ‌న‌కు ఎన్నో అవ‌కాశాల‌ను ఇస్తుంది. మ‌ళ్లీ కొత్త సంబంధాలు, కొత్త ఆత్మీయుల‌ను సంపాదించుకునేందుకు ప్ర‌య‌త్నించాలి. ముఖ్యంగా ఎమోష‌న్స్ ను అదుపు చేసుకుంటూ చేసిన త‌ప్పుల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ చేయ‌కుండా వైఫ‌ల్యాల నుంచి పాఠాల‌ను నేర్చుకున్న‌ప్పుడు జీవితం బ్యూటిఫుల్ గా మారుతుంది. ఎటువంటి సంక్షోభ ప‌రిస్థితుల్లో అయినా మ‌నిషి జీరో అయిపోయాడు అనేందుకు లేదు. ఒక కొత్త శ‌క్తితో మ‌ళ్లీ ఎదగాల‌న్న క‌సితో ఉన్న వ్య‌క్తులు జీరో నుంచి ప్రారంభించేందుకు ప్ర‌కృతి అవ‌కాశాలు క‌ల్పిస్తుంది. ఆ అవ‌కాశాల‌ను వాడుకుంటూ ఎదిగితే చాలు. పొగొట్టుకున్న‌ది తిరిగి సంపాదించుకోవ‌చ్చు. ఆశ చ‌నిపోతే మ‌నిషి జీరో అయిన‌ట్టు కానీ ఎద‌గాల‌న్న త‌పన ఉంటే ఎవ‌రూ ఎప్ప‌టికీ జీరో కాదు. కొత్త చిగురులు వేసి మ‌రింత బ‌లంగా విస్త‌రిస్తారు.

 

 

ప్ర‌కృతి నియ‌మాల‌కు ఎవ‌రూ అతీతులు కారు!

 

క‌ష్టాలు, స‌వాళ్లు లేని జీవితం జీవితం కానే కాదు. ప్ర‌స్తుతం ఉన్నత స్థితిలో ఉన్న గొప్ప వ్య‌క్తుల‌ను గ‌మ‌నిస్తే వాళ్లు ఎన్ని క‌ష్టాలు ప‌డి ఆ స్థాయికి చేరుకున్నారో అర్ధ‌మ‌వుతుంది. జీవితంలో ఏది సులువుగా రాదు. ప్ర‌తీ దానికోసం పోరాటం చేయాల్సిందే. ప్ర‌తీ జీవికి ప్ర‌కృతి నేర్పే మొద‌టి పాఠం ఇదే. క‌ష్ట‌ప‌డితేనే ఇక్క‌డ జీవించేందుకు అర్హ‌త వ‌స్తుంది. క‌ష్ట‌ప‌డ‌ని వాళ్ల‌కు, స‌వాళ్ల‌ను త‌ట్టుకోని వాళ్ల‌కు ఇక్క‌డ స్థానం లేదు. ప్ర‌కృతి ఎంత బ‌ల‌మైన‌దంటే ఎంత‌టి వారైనా దాని నియ‌మాల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల్సిందే. చివ‌రికి దేవుడు కూడా ప్ర‌కృతికి అతీతుడు కాదు. వైకుంఠం నుంచి వ‌చ్చి శ్రీనివాసుడు శేషాచ‌లం అడ‌వుల్లో ప‌డిన క‌ష్టాలను తెలుసుకుంటే ఎంత‌టి వారైనా ప్ర‌కృతి ముందు చిన్న‌వారే. కాబ‌ట్టి క‌ష్టాలు రావ‌డం అనేది చాలా సాధార‌ణ‌మైన విష‌యం. దానికి సిద్ధ‌మై ఉన్న‌వాడు విజ‌య‌వంత‌మైన వ్య‌క్తిగా ఎదుగుతాడు. క‌ష్టానికి కుంగిపోతే ఎదుగుద‌ల ఆగిపోతుంది. ఆకు రాలు కాలాన్ని చెట్టు ఎంత స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటుందో అలాగే వ్య‌క్తులు, సంస్థ‌లు సంసిద్ధంగా ఉండాలి. ఆకురాలు కాలాన్ని త‌ట్టుకునేందుకు మ‌నిషికి రిజ‌ర్వ్ ఎమోష‌న్స్ ఉండాలి. అలాగే సంస్థల‌కు రిజ‌ర్వ్ ఫండ్స్ ఉండాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)