ఎలుక హృద‌యం..ఏనుగు శ‌రీరం..ఇలా ఉంటే లైఫ్ గ‌ల్లంతే!!

 

మ‌నిషి పుట్టుకే ఒక పోరాటంతో మొద‌ల‌వుతుంది. ఎన్నో ల‌క్ష‌ల శుక్ర క‌ణాల‌తో పోటీప‌డి కేవ‌లం ఒక్క శుక్ర‌కణం మాత్ర‌మే అండాన్ని చేరుకుంటుంది. అంటే ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్న ఒక శుక్ర‌క‌ణం మాత్ర‌మే మ‌నిషిగా రూపుదిద్దుకుంటుంది. ఈ ప‌రిణామం మ‌న‌కు ఏం నేర్పుతుంది? ప్ర‌తీ మ‌నిషి ఒక ప్ర‌త్యేకమైన వాడు లోకంలో మ‌రెవ‌రికీ సాధ్యం కానిది త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. జీవం పోసుకునేట‌ప్పుడే పెద్ద పోరాటం చేసి విజేత‌గా నిలిచిన మ‌నిషి త‌న జీవితంలో మాత్రం త‌న ప్రత్యేక‌త‌ను గుర్తించ‌కుండా పోటీలో వెనక‌బ‌డిపోతున్నాడు. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో, కెరీర్ ను నిర్మించుకోవ‌డంలో చాలా మంది త‌ప్పులు మీద త‌ప్పులు చేస్తూ త‌క్కువ స్థాయిలో ఉండిపోతున్నారు. చాలా మందికి అర్ధం కాని విష‌యం ఏంటంటే కెరీర్ ఛేంజ్ చేస్తే ఉన్న‌త స్థాయికి వెళ్లిపోతాం అనుకుంటున్నారు. అది పొర‌పాటు. కెరీర్ ను మార్చాల‌నుకున్న‌ప్పుడు ఆ మార్పుకు అనుగుణంగా త‌మ‌ను తాము మార్చుకోవాలి. అప్పుడే విజ‌యం సాధ్య‌మ‌వుతుంది. చేసే ప‌నిపై నిబ‌ద్ధ‌త‌, ప‌నిపై ఆస‌క్తి, ప‌నిపై అంతులేని ప్రేమ ఉన్న‌ప్పుడు మాత్ర‌మే కెరీర్ ఛేంజ్ అనేది ఫ‌లితాల‌ను ఇస్తుంది. లేదంటే గొప్ప‌వాళ్ల‌ను చూసి తాను అలాగే త‌యార‌వాల‌నుకుని చివ‌రికి బోల్తా ప‌డ్డ ఎలుక క‌థ‌లా ఉంటుంది జీవితం.

 

 

నీలో ఉన్న ప్ర‌త్యేక‌త‌ను గుర్తించు!

 

పూర్వం ఒక అడ‌విలో ఒక ఎలుక ఉండేది. ఆహారానికి లోటు లేకుండా అది హాయిగా జీవించేది. కానీ త‌న రూపం చూసుకుని ఆ ఎలుక అనుక్ష‌ణం అసంతృప్తికి లోన‌య్యేది. ఒక‌రోజు ఆ అడ‌విలో త‌ప‌స్సు చేసుకుంటున్న ఒక మునీశ్వ‌రుని ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌న గోడు వెళ్ల‌బోసుకుంది. లోప‌ల నవ్వుకున్న రుషి స‌రే నేను నీకు ఏ విధంగా స‌హాయం చేయ‌గ‌ల‌ను అని అడిగాడు. అప్పుడు ఎలుక స్వామీ ఈ అడ‌విలో జింక కంటే వేగంగా ప‌రిగెత్త గ‌లిగే జంతువును నేను చూడ‌లేదు. న‌న్ను జింక‌గా మార్చండి అని కోరింది. స‌రేన‌న్న రుషి ఎలుక‌ను జింక‌గా మార్చాడు. అయితే ఎలుక ఆనందం రెండు రోజులు కూడా నిలువ లేదు. త‌న‌తో స‌మానంగా ప‌రిగెత్తే పులి నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని గ్ర‌హించి వెంట‌నే ముని ద‌గ్గ‌ర‌కు పరిగెత్తుకుంటూ వ‌చ్చింది. స్వామీ..నేను పొర‌పాటుగా కోరుకున్నాను. న‌న్ను పులిగా మార్చండి అని అడిగింది. స‌రేన‌ని ముని జింక రూపంలో ఉన్న ఎలుక‌ను పులిగా మార్చాడు. మ‌ర‌లా కొన్ని రోజుల‌కు ముని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అడ‌విలో బ‌ల‌మైన పులి కూడా భారీగా ఉన్న ఏనుగు ముందు త‌ల‌వంచ‌వ‌ల‌సిందే కాబ‌ట్టి న‌న్ను ఏనుగుగా మార్చండి అని కోరింది. ముని పులి రూపంలో ఉన్న ఎలుక‌ను ఏనుగుగా మార్చాడు. త‌ర్వాత‌ ఎన్ని అవాంతారాలు ఎదురైనా త‌లెత్కుకు నిల‌బ‌డే శిఖ‌రం ముందు భారీ ఏనుగు కూడా బ‌లాదూర్ కాబ‌ట్టి త‌న‌ను పెద్ద శిఖ‌రంగా మార్చ‌మ‌ని అడిగింది. శిఖ‌రంగా మారి గ‌ర్వంతో త‌లెగ‌రేసే లోపు ఒక ఎలుక వ‌చ్చి అంత పెద్ద శిఖ‌రానికి బొరియ చేయ‌డం చూసి ఎలుక ముందు శిఖ‌రం కూడా నిలువ‌లేదని గ్ర‌హించింది. త‌న పొర‌పాటును, అజ్ఞానాన్ని మ‌న్నించి త‌నను ఎప్ప‌టిలాగే ఎలుక‌లా మార్చ‌మ‌ని మునీశ్వ‌రుడ్ని శ‌ర‌ణు వేడింది.

 

 

ముందు నువ్వు మారాలి!

 

వేరొక‌రిని అనుస‌రించే వాళ్ల‌ను ఎవ‌రూ అనుస‌రించ‌రు అన్న మాట మీకు తెలిసే ఉంటుంది. ఎవ‌రో ఫలానా ప‌నిచేసార‌ని కెరీర్ ఛేంజ్ చేయ‌డం వ‌ల‌న ఉన్న‌త స్థానానికి చేరుకున్నార‌ని మ‌నం కూడా అలాగే చేస్తే ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు స‌రిక‌దా తిరిగి కెరీర్ దారుణంగా దెబ్బ‌తింటుంది. చేసే ప‌ని చిన్న‌దైనా అందులో నీకు ఆనందం ఉందా? అవ‌స‌ర‌మైన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా? భ‌విష్య‌త్ లో మ‌రింత ఎదిగేందుకు అవ‌కాశాలున్నాయా? అన్న విష‌యాల‌ను చూసుకోవాలి. కానీ చాలా మంది ప్ర‌స్తుతం ఒక రంగం బాగుంద‌ని అందులోకి మార‌డం అక్క‌డ నుంచి మ‌రో రంగానికి మార‌డం ఇలాంటి ప‌నులు చేస్తున్నారు. అలా అలా తిరిగి చివ‌రిని మొద‌ట చేసిన ప‌నినే మ‌ళ్లీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక్క‌డ మార్చాల్సింది కెరీర్ ను కాదు. మార్చుకోవాల్సింది మిమ్మిల్ని మీరు. లేదంటే ఎలుక క‌థ‌లా చివ‌రికి మీరు మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తారు. ఒక ప్రణాళిక ప్ర‌కారం ముందుకు వెళుతూ మీ మ‌న‌సుకు నచ్చిన ప‌ని చేసుకుంటూ ముందుకు వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే కెరీర్ ఛేంజ్ అనేది స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుంది. అలా కాకుండా మిడి మిడి జ్ఞానంతో ఎవ‌రో చేసార‌ని, ఎవ‌రో ఉన్న‌తంగా ఎదిగార‌ని లేని పోని పోలిక‌లు పెట్టుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంది.

 

 

సాకులు చెప్ప‌డం మానుకోండి!

 

ఉన్న‌త స్థానానికి వెళ్లిన వ్య‌క్తుల‌ను మ‌నం చూస్తూ ఉంటాం. వాళ్లు సాధించిన‌ప్పుడు మ‌నం ఎందుకు సాధించ‌లేం అన్న ఆలోచ‌న మీకు ఎప్పుడైనా వ‌చ్చిందా? ఇక్క‌డ వాళ్ల‌తో పోల్చుకుని తిక‌మ‌క ప‌డ‌మ‌ని కాదు పోల్చుకోవ‌డం వేరు స్పూర్తిని పొందడం వేరు. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని గుర్తించ‌గ‌ల‌గాలి. మ‌నం ముందు చెప్పుకున్నాం. ల‌క్ష‌లాది ఇత‌ర శుక్ర‌క‌ణాల‌తో పోటీప‌డి నువ్వు ఈ భూమిమీద‌కు వ‌చ్చావు. అంటే నీలో చాలా ప్ర‌త్యేక‌త ఉంది. మ‌రి అలాంట‌ప్పుడు మిగిలిన వారు సాధించింది నువ్వు కూడా సాధించ‌గ‌ల‌వు. కానీ సాకులు చెపుతూ కార‌ణాలు వెతుకుతూ చాలా మంది త‌మ‌కు తాము స‌ర్దిచెప్పుకుంటారు. విజ‌యం సాధించిన‌ వ్య‌క్తుల‌కు అన్నీ అనుకూలంగా ఉన్నాయ‌ని, వాళ్ల‌కు ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని, ఆర్థిక వన‌రులు ఉన్నాయ‌ని ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెపుతారు. జీవితం అంద‌రికీ అవ‌కాశాలను ఇస్తుంది. వాటిని గుర్తించ‌గ‌లిగిన వాడు ఉన్న‌త స్థానంలో ఉంటాడు. గుర్తించ‌లేని వాడు ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా కింది స్థాయిలోనే ఉండిపోతాడు.

 

 

నీ కెరీర్ ను నువ్వే నిల‌బెట్టుకోవాలి!

 

నిజానికి భూమి మీద సంభ‌వించే ప్ర‌తీ ఘ‌ట‌న‌కు ఒక కార‌ణం ఉంటుంది. నువ్వు కూడా ఈ భూమి మీద‌కు ఏదో ఒక‌టి సాధించ‌డానికే వ‌చ్చావు. ఇక్కడ ఉంటే కొద్ది కాలంలో దాన్ని సాధించేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. సాకులు చెప్పుకుంటూ స‌మ‌ర్ధింపులు చేసుకుంటూ కాలం గ‌డిపేస్తే సాధించేందుకు ఏమీ మిగ‌ల‌దు. అవ‌కాశాలు మ‌న త‌లుపు త‌డుతున్న‌ప్పుడు గుర్తించాలి. వాటిని రెండు చేతుల‌తో అందిపుచ్చుకోవాలి. అలా అందిపుచ్చుకోలేన‌ప్పుడు నిన్న కాపాడ‌టం ఎవ‌రి త‌ర‌మూ కాదు. అవకాశాలను అందిపుచ్చుకుంటూనే నీకు ఏ ప‌నిపై ఆస‌క్తి ఉందో.. ఏ ప‌ని చేస్తే నువ్వు ఉన్న‌తంగా ఎదుగుతాను అనుకుంటున్నావో దాన్ని గుర్తించ‌డం చాలా ముఖ్యం. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే మీ కెరీర్ పై మీకు స్ప‌ష్ట‌త ఉండాలి. వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా వినియోగించుకుంటూ ప‌క్క వాళ్ల‌తో పోలిక‌లు పెట్టుకోకుండా , స్పూర్తిగా మాత్ర‌మే తీసుకుంటే మీ కెరీర్ వెలిగిపోతుంది.

 

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)