పేరెంట్స్ ఓవర్ యాక్షన్..పిల్లలకు రియాక్షన్!

 

ప్రస్తుత ఆధునిక యుగంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు దాదాపుగా కనుమరుగు కావడంతో ఉన్న ఒకరిద్దరు పిల్లల్ని తల్లిదండ్రులే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పెంపకంలో పేరెంట్స్ తమకు తెలియకుండానే ఒక తప్పు చేస్తూ పిల్లల్ని చేజేతులూ మొండి వాళ్లుగా మారుస్తున్నారు. ఇది చూడటానికి చాలా చిన్న విషయమే కానీ పేరెంట్స్ తమ వైఖరి మార్చుకోకుంటే అది పెను సమస్యగా మారే ప్రమాదం ఉంది. తిండి తినిపించే విధానంలో మనం చేస్తున్న పొరపాట్లు పెంపకంలో పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. చాలా మంది తల్లులు పిల్లలకు ఆహారం పెట్టే విషయాన్ని ఒక పెద్ద తతంగంలా మారుస్తున్నారు. వాళ్లు తిండి తినడం లేదని బాధపడిపోతూ ఎప్పుడూ వాళ్ల తిండి మీదే ధ్యాస పెట్టి పిల్లల్ని మొండివాళ్లుగా మారుస్తున్నారు. తిండి విషయంలో పిల్లల స్వేచ్ఛను హరిస్తూ వాళ్ల మానసిక అభివృద్ధికి అవరోధంగా మారుతున్నారు.

 

 

తిండి పెట్టడాన్ని ఓ తతంగంలా మార్చకండి!

 

ప్రస్తుతం చాలా మంది తల్లులు పిల్లలకు తిండి పెట్టడాన్ని ఒక పెద్ద కార్యక్రమంలా చూస్తున్నారు. వాళ్లకు బలవంతంగా తిండి తినిపించాలని ప్రయాస పడుతున్నారు. వాళ్లకు ఆకలిగా ఉందా ? లేదా? అన్న విషయాన్ని చూడకుండా పిల్లలకు ఎలాగైనా తిండి తినిపించాలన్న ఆత్రంతో వాళ్లకు బలవంతంగా తిండిని కుక్కుతున్నారు. పిల్లలకు సరైన ఆహారం పెట్టాలన్న పేరెంట్స్ ఆలోచన అర్ధం చేసుకోదగిందే. కానీ పిల్లలకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎలాగైనా తిండి పెట్టాలన్న ఆత్రం సమస్యలు తెచ్చిపెడుతోంది. పిల్లలకు ఆకలి వేసే సమయానికి అన్నీ సమకూర్చి పెట్టాలి. వాళ్ల తిండి వాళ్లు తినేలా చూడాలి. అంతేకానీ ఎప్పుడూ తినమని చెపుతుంటే వాళ్లు స్వేచ్ఛ కోల్పోతున్నట్టు భావిస్తారు. ఇంట్లో తినని పిల్లలు పక్కింటికి వెళ్లినప్పుడు బాగా తినడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎవరూ వాళ్లను తినమని బలవంత పెట్టరు. వాళ్లకు నచ్చినట్టు తింటారు. ఇంట్లో కూడా అటువంటి పరిస్థితి కల్పించాలి.

 

 

పిల్లలు మిమ్మల్ని ఏమోషనల్ గా బ్లాక్‌మెయిల్ చేస్తారు!

 

చాలా మంది పేరెంట్స్ పిల్లలకు ఏలాగైనా తిండి పెట్టాలనే ఉద్దేశంతో వాళ్లపై వరాల జల్లులు కురిపిస్తూ ఉంటారు. నువ్వు ఇప్పుడు అన్నం తింటే ఫలానా వస్తువు కొనిపెడతా, అక్కడికి తీసుకువెళతా ఇలా చెప్పి వాళ్లతో తిండి తినిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇలాంటి వరాలు పిల్లల్లో విపరీత ధోరణులను పెంచుతాయి. యస్..నేను ఇప్పుడు తిననని మారాం చేస్తే ఇవన్నీ నాకు సమకూరుతాయి. వాళ్లను బతిమాలించుకుంటే నాకు కోరినవన్నీ లభిస్తాయి. అన్న ధోరణిలోకి వెళ్లిపోతారు. పిల్లల్లో అలాంటి ఆలోచనలు లేకుండా జాగ్రత్త పడాలి. పూర్వం ఉమ్మడి కుటుంబంలో పిల్లలే వచ్చి తల్లిదండ్రులను ఆకలి వేస్తోంది అన్నం పెట్టండి అని అడిగే వారు. వాళ్లు అడిగిన తర్వాత తల్లి వారికి భోజనం పెట్టేది. మరి ఇప్పుడు ఎందుకు పరిస్థితి తారుమారైంది. ఆర్థికంగా ఎదగడంతో ఇంట్లో అపరిమితంగా తినుబండారాలు ఉంటున్నాయి. అదే సమయంలో ఒకరిద్దరే పిల్లలే కావడంతో గారాబం పెరిగిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఆకలి తెలిస్తే , స్వేచ్ఛనిస్తే వాళ్ల తిండి వాళ్లే తింటారు. పేరెంట్స్ ప్రత్యేకంగా తినిపించాల్సిన అవసరం లేదు.

 

‘నా కోసం తింటున్నాను’ అన్న భావన కలిగించాలి!

 

ఈ సమస్త ప్రకృతిలో ఈ జీవి కూడా తన పిల్లలకు అన్నం కలిపి నోట్లో తిండి పెట్టదు. తమ పిల్లలకు ఆహారం సమకూర్చి దాన్ని వారే ఎలా తినాలో నేర్పిస్తాయి. ఎందుకంటే ప్రతీ జీవికి తన ఆకలి తనకు తెలుస్తుంది. తన ఆకలి తనకు తెలిసినప్పుడు తమకు కావాల్సిన ఆహారాన్ని అడిగి తినేలా వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. అలా కాకుండా అస్తమాను పిల్లలకు తిండి తినిపించడం అనే కార్యక్రమం పెట్టుకుంటే వాళ్లు నా కోసం కాదు. మా అమ్మ, నాన్న కోసం తింటున్నాం అనే భావనలోకి జారిపోతారు. పిల్లలకు ఇష్టమైన ఆహారం, మంచి పుష్టికరమైన ఆహారం అందుబాటులో ఉంచి వాళ్లు అడిగినప్పుడు దాన్ని అందించాలి తప్పితే వాళ్లకు నోట్లో కుక్కితే పరిస్థితి వికటిస్తుంది. తిండి తినే విషయంలో పిల్లలకు ఎనలేని స్వేచ్ఛను కల్పించాలి. చిలుకను బంగారు పంజరంలో పెట్టి అన్ని రకాల పండ్లను పెడితే ఉపయోగం ఏంటి? దాన్ని బయటకు వదిలేస్తే అది వెళ్లి తనకు నచ్చిన పండ్లు తింటుంది. అప్పుడే ఆ చిలుకకు నిజమైన ఆనందం.

 

 

పరిష్కారాలు మన చేతుల్లోనే ఉన్నాయి!

 

అమెరికా వంటి దేశాల్లో పిల్లవానికి ఏడాది వయస్సు దాటగానే తల్లిదండ్రులు ఇక ఆహారం నోట్లో పెట్టే పని పెట్టుకోరు. వాళ్లను ఒక కుర్చీలో కూర్చొబెట్టి వాళ్ల ముందు ఒక గిన్నెను ఉంచుతారు. మొదట్లో ఇబ్బందులు పడినా వాళ్ల తిండి వాళ్లు తినడం పిల్లలు అలవాటు చేసుకుంటారు. అలాగే ఆహారం పెట్టేటప్పుడు తల్లులు ఆందోళన , కోపం, తిట్టడం వంటి పనులు చేయకూడదు. ఇలా తల్లి విసుక్కుంటే పిల్లలు తిండి అంటే విముఖత పెంచుకుంటారు. పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారో లేదో చూసుకోవాలి. వాళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా తిండి తినడం లేదంటే వాళ్లకు తిండి ఎక్కువైంది అని అర్ధం. తిండి తినకపోతే ఓ నాలుగైదు గంటలు గ్యాప్ ఇచ్చి అప్పుడే తిండి పెట్టండి. తాము తినకపోతే తల్లిదండ్రులు దృష్టంతా తమ మీదే ఉందన్న భావన వాళ్లకు కలిగించకూడదు. ఎందుకంటే తమ కోసం తాము తినాలన్న ఆలోచన పిల్లలకు తల్లిదంద్రులు కలిగించాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)