ఈ భూమిపై అత్యంత విలువైన వస్తువేంటో తెలుసా?

ప్రతీ వస్తువుకు, ఒక అంశానికి, ఒక పరిణామానికి ఇలా అన్నింటింకి విలువ ఉంటుంది. ఆయా కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా ఆ విలువ మారుతూ ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏంటన్నదానిపై ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. కొందరు బంగారం విలువైనది అంటే మరికొందరు భూమి అన్నింటికంటే విలువైనది అని చెపుతూ ఉంటారు. కొందరు వారి వారి అనుభవాలు, పరిస్థితులు ఆధారంగా విలువైన వస్తువులు జాబితాకు నిర్వచనం చెప్పుకుంటారు. అయితే ఇదే విషయంపై ఓ ప్రముఖ సంస్థ జరిపిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసాయి. అసలు ఈ భూమిపై అన్నింటికంటే విలువైన వస్తువు మనిషి మాత్రమేనని ఆ సర్వే తేల్చింది. డబ్బులు, వస్తువులు, ఇళ్లు ఇవన్నీ విలువను కోల్పోయే వని కానీ మనిషి మాత్రం కాలంతో పాటు తన విలువను పెంచుకుంటాడని వెల్లడించింది. మానవ వనరులు అనేవి ఎప్పటికీ తరగని అంతులేని ఆస్తి అన్నది స్పష్టమైంది.

 

 

మనుష్యులే అత్యంత విలువైన వారు!

 

మనిషి చాలా విలువైన వాడని వెల్లడించిన సర్వే విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ విషయాలను వెల్లడించింది. ఈ భూమిలో ప్రతీ వస్తువు కాలగమనంలో తన విలువను కోల్పోతూ ఉంటుంది. అది బంగారం కావచ్చు. ఏదైనా ఇతర వస్తువు కావచ్చు. ఉదాహరణకు మనం ఎంత విలువైన కారును లేదా ఇళ్లును కొనుగోలు చేసినా కొన్ని రోజులు పోయాక వాటి విలువ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. దీన్నే ఆర్థిక పరిభాషలో విలువ తరుగుదల అని అంటూ ఉంటారు. కాలంతో పాటు మనం విలువైనవి అనుకున్నవి అన్నీ తమ విలువను పోగొట్టుకుంటున్నప్పుడు మరి కాలంతో పాటు విలువ పెరిగే సాధనం ఏమన్నా ఉందా? అంటే అది మనిషి మాత్రమే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషి తన చిన్నతనంలో నైపుణ్యాలలేమితో తక్కువ విలువను కలిగి ఉంటాడు. అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ తన నైపుణ్యాలను పెంచుకుంటూ తన విలువను కూడా పెంచుకుంటాడు. ఇది ఒక్క మనిషికే సాధ్యం. అందుకే ఈ భూమిపై విలువైనదేంటి అన్న సర్వేలో మనుష్యులకే అగ్రస్థానం దక్కింది.

 

 

మానవ వనరుల నిర్వహణ పరిశ్రమగా ఎదగాలి!

 

అయితే ఇంతటి కీలకమైన మనిషిని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలో సరైన ముందడుగు పడటం లేదు. మానవ వనరులు సద్వినియోగం విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష‌యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు మానవ వనరుల ఆధారంగా నిర్వహించే సర్వీసెస్ కు రుణాలు ఇచ్చేందుకు వాటిని ఒక పరిశ్రమగా గుర్తించేందుకు బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ ముందుకు రావు. అదే ఒక వస్తువు కొని పరిశ్రమ పెడతామంటే చాలా సులువుగా రుణాలు మంజూరు చేస్తారు. వస్తూత్పత్తి కి రుణాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం ఉద్దేశ్యం కాదు కానీ కాలంతో పాటు విలువను కోల్పోయే వస్తువుకు రుణాలు ఇస్తున్నప్పుడు కాలంతో పాటు విలువను పెంచుకునే వాటికి రుణాలు ఇస్తే ఇంకా బాగుంటుంది. మానవ వనరుల నిర్వహణ అనేది చాలా ముఖ్యమైన విషయం. వాటికి రుణాలు ఇచ్చి ప్రొత్సాహిస్తే విలువైన దానికి మరింత విలువ సమకూరి మెరుపును సంతరించుకుంటుంది.

 

 

మానవ సంబంధాలే మనిషి ఎదుగుదలలో కీలకం!

 

అయితే ఈ మానవ వనరుల నిర్వహణలో కూడా కొన్ని పద్ధతులను సరైన రీతిలో అవలంభించినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు ఒక పర్సనాలిటీ డవలప్‌మెంట్ క్లాస్ లో ఏం నేర్పిస్తారు? భావవ్యక్తీకరణ, అవతలి వ్యక్తులతో ఆకట్టుకునేలా మాట్లాడటం, ఆత్మవిశ్వాసంతో ఉండటం వంటివి నేర్పిస్తారు. ఇవన్నీ వ్యక్తిత్వ వికాసంలో చాలా ముఖ్యమైన విషయాలే కానీ ఒక మనిషితో సంబంధాలను ఎలా నెలకొల్పుకొవాలి? వాళ్లతో ఒక మంచి రిలేషన్ ను ఎలా కొనసాగించాలి? అన్న విషయాలను నేర్పించడం లేదు. ఒక మనిషితో మరో మనిషి ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నప్పుడే మాత్రమే మానవ వనరులు నిర్వహణలో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మనిషి తన ఆలోచనా శక్తి, సంబంధాలపై గౌరవాన్ని పెంచుకున్నప్పుడు సమాజానాకి మేలు జరుగుతుంది. లేదంటే ఎన్ని వ్యక్తిత్య వికాస తరగతులు చెప్పినా అవి కొరగాకుండా పోవడం ఖాయం.

 

 

విలువైన వస్తువును భద్రంగా కాపాడుకుందాం!

 

ఒక విలువైన వస్తువును మనం ఎంత భద్రంగా కాపాడుకుంటూ ఉంటాం. అలాగే ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువైన మనిషిని ఇంకెంత బాగా కాపాడుకోవాలి. ముఖ్యంగా కాలంతో పాటు తన విలువను పెంచుకునే మనిషికి మరింత విలువను ఆపాదించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మానవ వనరులు నిర్వహణ లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పి ఆ రంగంలో ఉన్న సంస్థలను చేయూతనిచ్చి వాటిని ఒక పరిశ్రమగా గుర్తిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. వాటిని సర్వీసెస్ గా కాకుండా ఒక విలువైన వస్తువును అందించే సంస్థలుగా గుర్తించి రుణాలు మంజూరు చేస్తే వాటికి మరింత మంది నిపుణులను అందించేందుకు వీలు కలుగుతుంది. సరైన మానవ వనరుల నిర్వహణ, శిక్షణ ఉంటే చాలు ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుంది. ఎందుకంటే విలువైనవి ఎప్పుడూ తమ విలువను గుర్తించమని అర్ధించవు. మనమే వాటి ప్రాధాన్యతను గుర్తించి ఆ విలువను మన అభివృద్ధికి వాడుకోవాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)