ఆ కీలక ‘మలుపు’ మీ జీవితాన్ని మార్చేస్తుంది!!

 

ఒక మ‌నిషి త‌న‌ వ్యక్తిగ‌త జీవితంలో కానీ అటు వృత్తి వ్యాపారాల్లో ఉన్న‌తంగా రాణించాలంటే క‌ష్టించే ల‌క్ష‌ణం ఉండాలి. క‌ష్టం, నేర్చుకోవాల‌న్న త‌ప‌న‌, నేర్చుకున్న దాన్ని ఆచ‌రించే నేర్పు మాత్ర‌మే విజ‌యవంత‌మైన మ‌నుష్యుల‌ను త‌యారు చేస్తాయి. కానీ కేవ‌లం క‌ష్ట‌ప‌డితే స‌రిపోదు.. దాన్ని ఎంత‌వ‌ర‌కూ కొన‌సాగించాలి అన్న అతి ముఖ్య‌మైన విష‌యం కూడా తెలిసి ఉండాలి. చాలా మంది క‌ష్ట‌ప‌డ‌తారు కానీ అస‌లైన ఫ‌లితం వ‌చ్చే కీల‌క స‌మ‌యంలో విర‌మించుకుంటారు. దీని వ‌ల‌న విజ‌యానికి దూర‌మ‌వుతారు. మ‌నం నీటిని 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వ‌ర‌కూ మ‌రిగిస్తే కానీ అది ఆవిర‌య్యే స్థితికి రాదు. అంటే మార్పు అనేది 100 డిగ్రీల వ‌ద్ద సంభ‌వించింది. 100 డిగ్రీల వ‌ద్దే నీరు ఆవిర‌య్యే స్థితికి చేరుకుంది కాబ‌ట్టి మిగిలిన 99 డిగ్రీల పాటు ఖ‌ర్చు చేసిన శ్ర‌మ అంతా వృధా అని కాదు. అంత‌వ‌ర‌కూ ఆ కృషిని ఒకే విధమైన‌ తీవ్ర‌త‌తో కొన‌సాగించ‌బ‌ట్టే 100 డిగ్రీల స్థాయికి చేరుకుని అనుకున్న ఫ‌లితం వ‌చ్చింది. అలాగే వ్యాపారంలో కానీ కెరీర్ లో కానీ అనుకున్న ఫ‌లితం రావాలంటే క‌ష్ట‌ప‌డ‌టాన్ని కొన‌సాగించాలి. కొద్ది రోజులు ప్ర‌య‌త్నం చేసి మ‌న వ‌ల్ల కావ‌డం లేదు, మంచి ఫ‌లితాలు, లాభాలు రావ‌డం లేద‌నుకుని ప్ర‌య‌త్నాన్ని నిలిపేస్తే కీల‌క‌మైన మార్పును చూసే స‌ద‌వకాశాన్ని కాల‌ద‌న్నుకున్న‌ట్టవుతుంది.

 

 

 

ఒక కీల‌క ఆవిష్కర‌ణ‌ను కొన‌సాగించ‌డ‌మే అభివృద్ధి!

 

మానవ ప‌రిణామ క్ర‌మాన్ని తీసుకుంటే అప్ప‌టివ‌ర‌కూ లేని ఒక ఆవిష్క‌ర‌ణను చేసి దాన్ని అదే తీవ్ర‌త‌తో కొన‌సాగించుకుంటూ వెళ్ల‌డం. ఈ అంశ‌మే సృష్టిలో మాన‌వున్ని తెలివైన జీవిగా నిల‌బెట్టింది. రాతి యుగం నుంచి ఇప్ప‌టి ఆధునిక యుగం వ‌ర‌కూ మ‌నం ఇంత‌టి అభివృద్ధి సాధించామంటే దానికి కార‌ణం ఈ ల‌క్ష‌ణ‌మే. గ్రాహంబెల్ టెలిఫోన్ క‌నిపెట్టాడ‌ని ఆ ఆవిష్క‌ర‌ణ అక్క‌డితో ఆగిపోలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అదే ఆవిష్క‌ర‌ణ‌కు మార్పులు చేస్తూ అదే తీవ్ర‌త‌తో సెల్ ఫోన్, పేజ‌ర్, స్మార్ట్ ఫోన్ ఇలా మ‌నిషి స‌మాచార ఆవిష్క‌ర‌ణలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఒక కొత్త విష‌యాన్ని పునాదిగా చేసుకుని దానిపై కొంగొత్త మార్పును నిర్మించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇన్ని స‌దుపాయాల‌తో స్మార్ట్ ఫోన్ ఉంద‌ని, గ్రాహంబెల్ టెలిఫోన్ ను త‌క్కువ చేయ‌డానికి వీలులేదు. స్మార్ట్ ఫోన్ ఆవిష్క‌ర‌ణకు మూలం టెలిఫోన్. క‌ష్టం అనే ముడి స‌రుకును ఉప‌యోగించి కీల‌క ద‌శ‌కు చేరుకునేందుకు నిరంత‌రం కృషి చేయ‌డమే అభివృద్ధి అంటే.

 

 

 

మార్పు సంభ‌వించే వ‌ర‌కూ నువ్వు బ‌రిలో ఉన్నావా?

 

అంద‌రికీ వ‌ర్తించే ఒక సాధార‌ణ ఉదాహ‌ర‌ణ‌ను తీసుకుంటే ..మ‌నలో చాలా మంది జిమ్ కు వెళుతూ ఉంటాం. కానీ కొంద‌రే జిమ్ కు వెళ్లే అల‌వాటును కొన‌సాగిస్తారు. అందులో కూడా కొంద‌రికే అనుకున్న‌ ఫ‌లితాలు వ‌స్తాయి. ఎందుకు? ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఫిట్ నెస్ ల‌క్ష్యాన్ని కొన‌సాగించ‌డం ఒక ఎత్తైతే, కీల‌క‌మైన, మార్పు సంభ‌వించే స‌మ‌యంలో క‌ష్టాన్ని ఓర్చుకోవ‌డం మ‌రో ఎత్తు. మ‌నం ఏదైనా ఒక శారీర‌క వ్యాయామం చేస్తున్న‌ప్పుడు చివ‌రి 30 సెక‌న్ల‌లో ఓర్చుకోలేని క‌ష్టం, శ్ర‌మ ఉంటాయి. దాన్ని త‌ట్టుకుని ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డ‌మే విజ‌యం. అలా త‌ట్టుకున్న వాళ్లే మంచి ఆరోగ్యాన్ని , శ‌రీరాకృతిని సొంతం చేసుకుంటారు. మొద‌టి రెండు నిమిషాలు బాగా వ్యాయామం చేసి మార్పు సంభ‌వించే చివ‌రి 30 సెక‌న్ల‌లో క‌ష్టాన్ని త‌ట్టుకోలేక దాన్ని మ‌ధ్య‌లో వ‌దిలిపెట్టే వాళ్లే ఎక్కువ‌. అందుకే ఫిట్ నెస్ విజేత‌లు చాలా త‌క్కువ మంది ఉంటారు. ఈ ఉదాహ‌ర‌ణ‌ను మ‌నం జీవితంలో అన్ని విష‌యాల‌కు అన్వ‌యించుకోవ‌చ్చు. వృత్తి , వ్యాపారం, వ్య‌క్తిగ‌త ఎదుగుద‌ల ఇలా దేనికైనా అన్వ‌యించుకోవ‌చ్చు. ఒక విష‌యం కోసం, ఒక ప‌ని కోసం, ఒక ల‌క్ష్యం కోసం ప‌ని చేయ‌డం మొద‌లుపెట్టిన‌ప్ప‌డు మొద‌టి నుంచి ఒకే తీవ్ర‌త‌తో ప‌నిచేస్తూ మార్పు సంభ‌వించే కీల‌క‌మైన స‌మ‌యంలోనూ దాన్ని ప‌ట్టువిడ‌వ‌కుండా కొన‌సాగించ‌గ‌ల‌గాలి. అప్పుడే విజేత‌గా మారేందుకు వీలుంటుంది.

 

 

కీల‌క‌మైన మార్పుకు ఒక్కసారిగా చేరుకోవాలంటే సాధ్యం కాదు!

 

చాలా మంది యువకులు, ఔత్సాహికులు ఇప్పుడు వ్యాపారంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇది మంచి పరిణామమే. అయితే ఓపిక, కష్టాన్ని ఎంత వరకూ కొనసాగించాలన్న కీలకమైన దశలో వాళ్లు విఫలమవుతున్నారు. వ్యాపారంలో రాణించాలంటే కష్టపడటం ఒక్కటే సరిపోదు. దాన్ని ఎంతకాలం కొనసాగించాలి? ఏ స్థితిలో ఫలితాలు రాబట్టుకుంటాయ్ అన్నదానిపై వాస్తవ సదృశ్యమైన అవగాహన ఉండాలి. వ్యాపారం మొదలుపెట్టిన వెంటనే మొదటి ఎటువంటి లాభం రాలేదు అనుకుందాం. ఇటువంటి సందర్భంలో చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే పని చేసా కానీ ఫలితం రాలేదు అనుకుంటారు. అలాగే నేను సమయం వృధా చేసాను. నేను సరిగా వ్యాపారం చేయలేదు..ఇలాంటి ఆలోచనలతో మధన పడుతూ ఉంటారు. అది చాలా తప్పు ఆలోచన. నువ్వు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు వెంటనే అనుకున్న ఫలితాలు రావు. కష్టాన్ని కొనసాగించినప్పుడు ఒక స్థాయి దగ్గర ఫలితాలు రావడం మొదలుపెడతాయి. అంతకు ముందు చేసిన కష్టం వల్లనే అది సాధ్యమైంది. అంత వరకూ ఓపిగ్గా, ఒక వ్యూహంతో ఉండటమే విజయం. ప్రకృతి కూడా మనకు వేచి ఉండి సాధించాలన్న సూత్రాన్ని నిర్దేశించింది. మనిషి తన భాగస్వామితో భావోద్రేకం చెంది శృంగారం చేయాలన్నా..అందులోని ఆనందాన్ని అనుభవించాలన్నా..చివరి స్థాయి వరకూ వేచి ఉండాల్సిందే. వేచి చూస్తున్నావా? కష్టపడుతున్నావా? అన్న విషయాలే చివరకు నీ విజయాన్ని నిర్దేశిస్తాయి.

 

 

గెలుపుకు, ఓటమికి మధ్య తేడా కొన్ని సెకన్లు మాత్రమే!

 

మనందరికీ జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కోసం తెలుసు. పరుగు పందెంలో ఎన్నో ప్రపంచ రికార్డులను కైవసం చేసుకున్న ఉసేన్ 100 మీటర్ల పరుగులో తన ప్రత్యర్ధుల కంటే కేవలం ఒకట్రెండు సెకన్ల ముందుంటాడు. కేవలం ఒకటి రెండు సెకన్లు మాత్రమే విజేతలను నిర్ణయిస్తాయి. చివరి స్థాయిలో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారన్నదే ఇక్కడ కీలకం. పరీక్షలు, వ్యాపారం ఏదైనా బాగా కష్టపడి ఒక కీలకమైన మలుపు వరకు వేచి చూసినప్పుడే ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు వచ్చే ముందు తలెత్తే సమస్యలు ఎదుర్కొని ధైర్యంగా ఎవరు వేచి చూస్తారో వారే విజేత. మార్పు అనేది సహజం. అది సంభవించేందుకు కొంత సమయం పడుతుంది. విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న చివరి నిమిషం వరకూ వేచి చూసి, ఓపిక వహించాలి. పన్నెండేళ్ల పాటు తెలంగాణా ఉద్యమాన్ని కెసీఆర్ మధ్యలో ఎన్నో కష్టాలు వచ్చినా పార్టీని అలా కొనసాగించాడు. చివరికి ఫలితం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఇంకెందుకులే అని నిరాశ చెందితే అత్యున్నత స్థాయికి ఎప్పటికీ చేరుకోలేం. కష్టపడు..ఓర్చుకో..కీలకమైన మలుపు దగ్గర మరింతగా శ్రమించు..విజయం నీ మీ వెంటే ఉంటుంది.

 

 

( ఈ ఆర్టికల్ మీకు స్పాన్సర్ చేసిన వారు)