ఈ దేశానికి ఏమైంది???

 

ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ…

ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి?

ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం.

కాలే సిగరెట్, బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా.

ధూమపానం చేయకండి. చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం.

ఆనందాన్ని ఎవరు కోరుకోరు…కానీ ఎంత మూల్యానికి..?

 

 

మనం సినిమాకు వెళ్లినప్పుడు ఈ యాడ్ ను ఎన్నోసార్లు చూసి ఉంటాం. నిజానికి ధూమపానం వలన ఈ దేశానికి ఏమైందో, ఎంత నష్టం జరిగిందో తెలియదు కానీ ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తీర్పులు దేశ భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేసి నిజంగానే ఈ దేశానికి ఏమైంది? అన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్న మన సంస్కృతిని, వారసత్వాన్ని నిట్టనిలువునా పాతరేసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాశ్చాత్య దేశాలు ఇంకా కళ్లు తెరవక ముందే అత్యద్భుతమైన నాగరికతతో విరాజిల్లిన భారతదేశంలో ఇప్పుడు పాశ్చాత్య నాగరికతలను, వాళ్ల అసంబద్ధ పోకడలను అనుసరించాలన్న వెర్రి ఆలోచనలు ప్రబలుతున్నాయి. పైపై మెరుగులకు ఎప్పుడూ ఆకర్షించబడే ప్రజలను సరైన దారిలో పెట్టాల్సిన కోర్టులు, ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛ పేరుతో అనాగరిక చర్యలకు వంత పాడుతూ దాన్నే నిజమైన ప్రజాస్వామ్యమంటూ భారతదేశ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారు. ఒకవైపు స్వయంప్రకటిత మేధావులు, మరోవైపు స్వేచ్ఛ , సమానత్వం పేరుతో భాధ్యతలను గాలికొదిలి కేవలం హక్కులు కోసం మాత్రమే మాట్లాడే ప్రబుద్దులు విచ్చలవిడిగా వీధుల్లో పడి ఘనమైన భారతీయ మూలాలను మూలకు నెట్టేస్తున్నారు.

 

 

ఈ మహిళలకు ఏమైంది? ఒకవైపు విచ్చలవిడితనం, మరోవైపు స్వేచ్ఛా దుర్వినియోగం..!!

 

ప్రపంచంలో భారతీయ మహిళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తల్లిగా, భార్యగా, చెల్లిగా ఒక కుటుంబాన్ని నిలబెడుతూ , తన బాధ్యతలను నెరవేరుస్తూ స్త్రీ అనే మాటకు పరిపూర్ణత చేకూరుస్తుంది. అనాది నుంచి పితృస్వామ్య వ్యవస్థలో మహిళలకు తగినంత స్వేచ్ఛ దొరకలేదు అన్న మాట వాస్తవమే. వారిని కేవలం ఒక వస్తువుగా చూడటం బాధ కలిగించే విషయమే. ఈ ఆధునిక సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇది కచ్చితంగా ఆనందపడాల్సిన విష‍యం. కానీ సరిగ్గా ఇక్కడే ఒక పెను సమస్య మొత్తం భారతీయ కుటుంబ వ్యవస్థనే నామరూపాలు లేకుండా కబలించేందుకు సిద్ధమైంది. ఎంత సమానమైనా ఆడ, మగ మధ్య శారీరకంగా, మానసికంగా కొన్ని తేడాలు ఉంటాయి. అలాగే మన సంస్కృతి ఆడకు, మగకు కొన్ని బాధ్యతలను, పరిమితులను నిర్దేశించింది. ఆ సన్నని గీతను ఇటు ఆడవాళ్లు అటు మగవాళ్లు చెరిపేస్తూ మొత్తం మన వివాహ వ్యవస్థకే చేటు తెస్తున్నారు. ఆడవాళ్లు ఆకర్షణీయంగా ఉంటారు. అది ప్రకృతి నిర్దేశించిన నియమం. అందుకే మన సంస్కృతి వస్త్రధారణ విషయంలో కొన్ని పరిమితులను చేసింది. అయితే ఇప్పుడు సమానత్వం పేరుతో మగవాళ్లు ధరించే బట్టలు వేసుకుంటూ, వాళ్లలానే మేం కూడా సిగరెట్లు, మందు తాగుతాం అనే మహిళామణులు పెరిగిపోయారు. వేరే దేశాల్లో అలానే చేస్తున్నారు కదా అంటూ దీనికి సమర్ధింపులు కూడా ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్య దేశాల్లో మీరు ఆడవాళ్లు అన్న విషయం మర్చిపోయి, విచ్చలవిడిగా ఏమైనా స్వేచ్ఛగా చేయొచ్చు అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నారు. కానీ అలా చేసే వ్యక్తులు గౌరవం పొందే అర్హతను కోల్పోతారు. ఆడవాళ్లను గౌరవించడం రాదా? అని ఎవర్నీ ప్రశ్నించే హక్కును వాళ్లు కోల్పోతారు. ఎందుకంటే వాళ్ల గౌరవాన్ని వారే రోడ్డు మీదకు తెచ్చుకున్నప్పుడు ఇక ఆడ, మగ తేగా ఉండదు. స్వేచ్ఛ పేరుతో వారు కోరుకున్నది కూడా అదే కదా? ఆడ, మగ తేడా వద్దని అన్నప్పుడు ఇక ఆడవాళ్ల గౌరవించండి? అని అరవడంలో అర్ధం లేదు.

 

 

ఎవ్కరూ నోరు మెదపరేంటి? వివాహేతర సంబంధం నేరం కాదట..!

 

తాజాగా సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. సెక్షన్ 497 అనే చట్టం మహిళల పట్ల వివక్షాపూరితంగా ఉందని దాన్ని కొట్టి వేసింది. తాజా తీర్పు ప్రకారం సంక్షిప్తంగా, క్షుప్తంగా చెప్పాలంటే వివాహమైన ఒక మహిళ వేరే వ్యక్తితో, అలాగే వివాహమైన ఒక మగవాడు వేరే మహిళతో నిస్సిగ్గుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగించవచ్చు. స్త్రీ హక్కులకు భంగం కలుగకూడదని, భార్య అంటే భర్త సొత్తు కాదని భావించిన శ్రీమాన్ సుప్రీంకోర్టు జడ్జిగారు ఈ చారిత్రక తీర్పును చెప్పారు. దీని వలన కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని కానీ విచ్చలవిడితనం పెరిగిపోతుందని కానీ సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుందని కానీ సుప్రీంకోర్టు ఆలోచించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం కోసం మాత్రమే తీర్పును వెలువరించారు. దీని ద్వారా కలిగే పర్యవసానాలు, నష్టాలు గురించి వీసమెత్తు కూడా ఆలోచించలేదు. జీవితాల‌ను ప్ర‌భావితం చేసే ఇలాంటి ముఖ్యమైన తీర్పుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన  మీడియా సంస్థలు బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఏదో ఒక పార్టీకి ఊడిగం చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాయి. సెక్షన్ 497 పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ ఎంతగా పతనం అవుతాయో ఒక్క క్షణం ఆలోచించండి. ఇది సమానత్వం పేరిట స్త్రీ, పురుషుల మధ్య అగాధాన్ని సృష్టించేదిగా ఉంది కానీ మరేదీ కాదు. దీని వలన వివాహ వ్యవస్థ పతనం కావడం తథ్యం. కానీ దీనిపై ఇంతవరకూ అర్ధవంతమైన చర్చ జరిగిన దాఖలాలు లేవు. ఒకవైపు ట్రిపుల్ తలాక్ తప్పు అని చెపుతున్న సుప్రీంకోర్టే మరోవైపు వివాహేతర సంబంధం తప్పు కాదని చెపుతోంది. ఈ రెండింటికీ మధ్య ఉన్న వ్యత్యాసం అర్ధం కాక సామాన్య ప్రజలు ఆందోళన చెందుతుంటే , తప్పుడు మార్గంలో విచ్చలవిడిగా తిరిగే వాళ్లు ఆనందపడుతున్నారు.

 

 

ఈ తీర్పుల అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం!

 

ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను నిశితంగా గమనిస్తే… అసలు ఈ దేశానికి ఏమైంది? అని అనిపించకమానదు. అభివృద్ధి చెందిన దేశాలే అనుమతించేందుకు భయపడుతున్న స్వలింగ సంపర్కాన్ని మన దేశంలో అనుమతించారు. ప్రకృతికి విరుద్ధంగా జరిపే ఆ విచ్చలవిడి చర్యను అనుమతించడం వలన జరిగే పర్యవసానాలు, నేరాలను కోర్టు అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం స్వలింగ సంపర్కులకు స్వేచ్ఛ కల్పించారు. అలాగే శబరిమలలో అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని కూడా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. సాధారణంగా రుతు క్రమం సమయంలో హిందూ ఆలయాల్లోకి మహిళలు ప్రవేశించరు. దీనిపై ఎవరికి వారు స్వీయ నియంత్రణ విధించుకుంటారు. కాబట్టి అన్ని హిందూ ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తారు. కానీ శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి మాత్రం యుక్త వయస్సులో ఉన్న మహిళలకు ప్రవేశం లేదు. అది అక్కడ నమ్మకాలకు, ఆచారాలకు సంబంధించిన విషయం. కానీ సుప్రీంకోర్టు  మహిళలకు ప్రవేశం కల్పించాలని తీర్పునిచ్చింది. మహిళల రుతు క్రమం అందులో ఉన్న ఇబ్బందులు, ఆలయం, మూల విరాట్టు విశిష్టత ఇత్యాది విషయాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటి నుంచో ఈ ఆచారం అక్కడ ఉంది. ఇప్పుడు సమానత్వం పేరిట కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయం విశిష్ఠత, ఆచారాన్ని మంటకలిసినా ఫర్వాలేదంటూ సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడం బాధాక‌ర‌మ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

 

 

ఆనందాన్ని ఎవరు కోరుకోరు…కానీ ఎంత మూల్యానికి..?

 

గడిచిన పదేళ్లుగా సామాజిక విప్లవం ఊపందుకుంది. సామాజిక మాధ్యమాలు, మీడియా, టెక్నాలజీ మనుష్యుల జీవితాలను సమూలంగా మార్చివేసాయి. బాధ్యతలు, హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ ల మధ్య ఒక గట్టి సంఘర్షణ చోటుచేసుకుంది. ముఖ్యంగా స్వేచ్ఛను, సమానత్వాన్ని మహిళలు కోరుకుంటున్నారు. ఇది కచ్చితంగా అభినందించాల్సిన విషయమే. కానీ ఇక్కడే ఒక సరిదిద్దుకోలేని తప్పు జరుగుతోంది. స్వేచ్ఛ , సమానత్వం, హక్కుల కోసం పోరాటం చేస్తున్న మహిళలు బాధ్యతలు, విలువలను గాలికి వదిలేస్తున్నారు. దీంతో సమాజంలో, కుటుంబంలో, మొత్తం భారతీయ కుటుంబ వ్యవస్థలోనే పెద్ద అగాధం ఏర్పడుతోంది. స్త్రీ వాదం పేరుతో మేం మగవాళ్లతో సమానం అంటూ ఒక అసంబద్ధ వాదాన్ని తలకెక్కించుకుంటున్నారు. ఎన్ని చెప్పుకున్నా స్త్రీ వేరు..పురుషుడు వేరు. వీరిద్ధరు శరీర ధర్మాలు వేరు. కొన్ని విషయాల్లో ఒకరు చేసే పనులు ఇంకొకరు చేయలేరు. ఇద్దరూ సమానమే అందులో సందేహం లేదు. పరస్పరం గౌరవించుకోవడం అన్నది ముఖ్యం. అది చేయకుండా కేవలం ద్వేషం పెంచుకోవడం మగవాళ్లు బట్టలు వేసుకుంటాం. వాళ్లలా చెడు అలవాట్లు నేర్చుకుంటాం అంటే స్త్రీ గౌరవం కోల్పోతుంది. వీటన్నింటికి ప్రధాన కారణం సోషల్ మీడియా. ఒక నియంత్రణ, బాధ్యత లేకుండా విచ్చలవిడి అభిప్రాయాలు వెలిబుచ్చడం, కుటుంబ పరువును గాలికొదిలి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం పెరిగిపోయింది. తాజాగా జరిగిన ప్రణయ్, అమృతల ఉదంతంలో అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్ ను దారుణంగా చంపించడం ఈ కోణంలోంచే చూడాల్సి వస్తుంది. ఒక మనిషిని హత్య చేయడాన్ని ఎవరూ సమర్థించకపోయినా వయస్సుకు వచ్చిన కూతురు భాద్యత మరిచి ప్రవర్తించడం,సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్ లు పెట్టడం, అలాగే సామాజిక ఒత్తిడి మారుతీరావును ఈ దారుణానికి ఉసికోల్పాయి. సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చినా అందరూ, ముఖ్యంగా మహిళలు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గుప్పెట మూసి ఉన్నంత వరకే దానికి విలువ. దాన్ని తెరిచి చూపిస్తే విలువ ఉండదు. పురాతన కాలం నుంచి మన సంస్కృతిలో మహహిళలకు ఒక గౌరవం ఉంది. సమానత్వం పేరుతో దాన్ని వలువులతో పాటు విలువలను విప్పి చూపిస్తే వాళ్లకు గౌరవం ఉండదు. వాళ్లపై దాడులు పెరుగుతాయి. అత్యాచారాలు పెరుగుతాయి. సమాజంలో అశాంతి నెలకొంటుంది. ఆడదాన్ని ఎలా అయినా చూడాలన్న పరిపక్వత మన సమాజంలో ఇంకా రాలేదు. అది గమనించుకోవాలి. మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. విచ్చలవిడిగా తిరిగే అమ్మాయి, అబ్బాయి…ఆంటీ, అంకుల్…తప్పుడు సంబంధాలు ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. చెడు తిరుగుళ్లకు తప్పదు భారీ మూల్యం. అది మన దేశ భవిష్యత్ నే దెబ్బతీసి ఈ దేశానికి ఏమైంది? అన్న స్థితికి తీసుకురావద్దు. ఇది అందరి బాధ్యత.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)