సీడీఎస్ఈతో 414 పోస్టులు భర్తీ


త్రివిధ దళాల్లో ఉద్యోగమే లక్ష్యంగా నిర్ణయించుకున్న యువతకు సీడీఎస్ఈకి మించిన అవకాశం మరొకటి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా నేరుగా లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. పైలట్ కావాలని కోరుకున్నవారి కల కూడా ఎయిర్ఫోర్స్ ద్వారా నెరవేరుతుంది. శిక్షణ సమయంలో రూ.21,000 స్టైపెండ్ అనంతరం రూ.75 వేల వేతనంతో కెరీర్ ప్రారంభించవచ్చు. అంతేకాదు కెరీర్లో త్వరగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు చూద్దాం…

గ్రాడ్యుయేట్లకు కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలుంటాయి. అయితే వాటిలో ఉన్నత స్థాయి ఉద్యోగాన్నిచ్చే పరీక్షలు మాత్రం కొన్నే. అలాంటి పోటీ పరీక్షల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది సీడీఎస్ఈ. ఎందుకంటే ఈ పరీక్షలో ఎంపికైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ వీటిలో ఎందులోనైనా ఉన్నత స్థాయి ఉద్యోగం సొంతమవుతుంది. భారతదేశ సైనిక దళాల్లో ఆఫీసర్ ఉద్యోగం లెఫ్టినెంట్ హోదాతో ఆరంభవవుతుంది. ఆ హోదాను సొంతంచేసే పరీక్ష ఇదే. ఇంతకంటే పెద్ద పోస్టులేవీ త్రివిధ దళాల్లో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీచేయరు. లెఫ్టినెంట్గా చేరినవాళ్లకే తర్వాత దశలకు అనుమతిస్తారు. దీనికోసం సీనియారిటీ, ప్రతిభను కొలమానంగా తీసుకుంటారు. ఉదాహరణకు ఇప్పుడున్న చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఒకప్పుడు లెఫ్టినెంట్గా కెరీర్ ప్రారంభించినవాళ్లే. భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లకు చీఫ్ అయ్యేవారంతా ఒకప్పుడు సీడీఎస్ఈ (కొంతమంది విషయంలో ఎన్డీఏ) ద్వారా కెరీర్ ప్రారంభించినవాళ్లేనని చెప్పుకోవచ్చు. లెఫ్టినెంట్గా చేరినవాళ్లు పరీక్షల ద్వారా పదిహేనేళ్ల సర్వీస్తోనే కల్నల్ హోదాకు చేరుకోవచ్చు. సీనియార్టీ ద్వారా ఇదే హోదాను అందుకోవడానికి 26 ఏళ్లు పడుతుంది. ఆకర్షణీయ వేతనం, కెరీర్లో ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉండడం ఇవన్నీ సీడీఎస్ఈ ద్వారా కలిసివచ్చే అవకాశాలు. అందుకే డిగ్రీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కెరీర్ జీవితంలో స్థిరపడిపోవచ్చు.

పరీక్ష స్థాయి కఠినమే…
ప్రయోజనాలకు తగ్గట్టుగానే పరీక్ష స్థాయి ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేస్తే పోలా అనుకునో, ఒకరాయి వేసి చూద్దామనో భావించి ఈ పరీక్షరాస్తే ప్రయోజనం శూన్యమే. ఎందుకంటే చీకట్లో బాణాలు సంధించడం ద్వారా సీడీఎస్ఈలో అదృష్టం వరించదు. ఈ పరీక్షలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ సీడీఎస్ఈ పరీక్షను నిర్వహిస్తోంది. కాబట్టి దీన్నే లక్ష్యంగా చేసుకుని చదివితే రెండు లేదా మూడు ప్రయత్నాలతో గమ్యాన్ని చేరుకోవచ్చు.