ఉద్యోగం కావాలంటే నైపుణ్యం మాత్ర‌మే స‌రిపోదు..ఇది కూడా కావాలి!

 

శ్రీకాంత్ అప్పుడే ఇంజినీరింగ్ పూర్తి చేసిన కుర్రాడు. మిగిలిన విద్యార్ధుల్లానే త‌ను కూడా ఉద్యోగం కోసం కోటి ఆశ‌లు పెట్టుకున్నాడు. హైస్కూల్ నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ శ్రీకాంత్ హాస్టల్ లో చ‌దువుకున్నాడు. కానీ ఇంజినీరింగ్ మాత్రం కాలేజీ ద‌గ్గ‌రంగా ఉండ‌టంతో ఇంటి నుంచి కాలేజీకి వెళుతూ పూర్తి చేసాడు. చిన్న‌త‌నం నుంచి ఎక్కువ రోజులు హాస్టల్ లో ఉండి చ‌దువుకోవ‌డం వ‌ల‌న శ్రీకాంత్ కి సొంత ప‌నులు, ఇంటి ప‌నులు స‌రిగ్గా చేయ‌డం చేత‌కాదు. త‌న ప‌నులు స‌రిగ్గా చేసుకోవ‌డం చేత కాక‌పోవ‌డం వ‌ల‌న‌ ఇంజినీరింగ్ చ‌దివిన నాలుగేళ్లు త‌ల్లిదండ్రుల‌తో తిట్లు తింటూనే ఉన్నాడు. ఎలాగోలా ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీకాంత్ ఉద్యోగ వేట‌లో ప‌డ్డాడు. మ‌రుస‌టి రోజు శ్రీకాంత్ కు చాలా ముఖ్య‌మైన జాబ్ ఇంట‌ర్వ్యూ ఉంది. ఆ కంపెనీలో ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ ఆలోచ‌న శ్రీకాంత్ ను స్థిమితంగా ఉండ‌నివ్వ‌డం లేదు. ఎలాగైనా అక్క‌డ జాబ్ సంపాదించాలి అని గట్టిగా అనుకున్నాడు. కానీ విపరీత‌మైన పోటీ ఉంటుంద‌న్న ఆలోచ‌న అతని ప‌ట్టుద‌ల‌ను ఒక‌వైపు నీరుగారుస్తోంది. స‌బ్జెక్ట్ , కమ్యూనికేష‌న్ వంటి అంశాల్లో త‌న కంటే చాలా మంది ముందు ఉండవ‌చ్చు. ఒక వైపు ఆశ మ‌రోవైపు నిరాశ అత‌నితో దోబూచులాడుతున్నాయి.

 

ఇంట‌ర్వ్యూ అన్న ఆలోచ‌నల‌తో శ్రీకాంత్ కు రాత్రి స‌రిగ్గా నిద్ర కూడా ప‌ట్ట‌లేదు. ఉద‌యాన్నే కాస్త ముందుగా నిద్ర లేచిన శ్రీకాంత్ హ‌డావుడిగా ఇంట‌ర్వ్యూకు త‌యారు కావ‌డం మొద‌లుపెట్టాడు. బాత్ రూమ్ లో గ‌బా గ‌బా స్నానం చేసిన ట్యాప్ స‌రిగ్గా క‌ట్ట‌కుండానే బ‌య‌ట‌కు వ‌చ్చేసాడు. బాత్ రూమ్ లో నీళ్ల శ‌బ్దం విని అత‌ని తండ్రి గ‌ట్టిగా అరిచాడు.’ శ్రీకాంత్ నీటిని అలా వృధా చేయ‌కూడ‌దు. ముందువెళ్లి ట్యాప్ క‌ట్టి రా’. అని చెప్పాడు. శ్రీకాంత్ కు ఇది న‌చ్చ‌డం లేదు. ‘కాసిని నీళ్లు పోతే ఏమ‌వుతుంది?. అన్నింటికి చాద‌స్తం’ అని గొణుక్కుంటూ వెళ్లి ట్యాప్ క‌ట్టాడు. అలా వ‌స్తూ బాత్ రూమ్ త‌లుపు వేయ‌లేదు స‌రిక‌దా బ‌య‌ట ఉన్న డోర్ మ్యాట్ కు కాళ్లు తుడుచుకోకుండా అలానే రూమ్ లోకి వెళ్లిపోయాడు. అది చూసిన తండ్రి మ‌ళ్లీ కేకేసాడు. ముందు రూమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బాత్ రూమ్ త‌లుపు వేసి, కాళ్లు తుడుచుకుని అప్పుడు నీ రూమ్ లోకి వెళ్లు అని ఆదేశించాడు. శ్రీకాంత్ లోప‌ల గొణుక్కుంటూనే బాత్రూమ్ త‌లుపు వేసి కాళ్ల‌ను డోర్ మ్యాట్ కు తుడిచాడు. మ‌ళ్లీ రూమ్ లోకి వ‌చ్చి గ‌బా గ‌బా బ‌ట్ట‌లు వేసుకుని స‌ర్టిఫికెట్స్ ఫైల్ చేతిలో పెట్టుకుని బ‌య‌లు దేరాడు. రూమ్ నుంచి బ‌య‌ట‌కు రాగానే ఈ సారి త‌ల్లి అత‌న్ని ఆపింది. ‘ఏంటి ఆ కంగారు…ముందు బ‌ట్ట‌లు నీట్ గా వేసుకో.. ఒక బ్యాగ్ ప‌ట్టుకుని అందులో స‌ర్టిఫికేట్ ఫైల్ పెట్టు. ఇదిగో లంచ్ బాక్స్, వాట‌ర్ బాటిల్ ఇవ‌న్నీ కూడా బ్యాగ్ లో పెట్టి అప్పుడు బ‌య‌లుదేరు’ అని చెప్పింది. శ్రీకాంత్ కు మ‌రోసారి చిరాకు వ‌చ్చింది. ‘ఇంట‌ర్వ్యూకు వెళ్తున్న‌ప్పుడు లంచ్ బాక్స్ ఎందుకు? నేను తీసుకువెళ్ల‌ను’ అని అన్నాడు. కానీ త‌ల్లి ప‌ట్టుబ‌ట్ట‌డంతో బ్యాగ్ ను భుజాన త‌గిలించుకుని ఇంట‌ర్వ్యూకు బ‌య‌లుదేరాడు.

 

 

ఇంట‌ర్వ్యూ జ‌రుగుతున్న చోటుకి వెళ్లేస‌రికి అప్ప‌టికే చాలా మంది అభ్య‌ర్ధులు వ‌చ్చి వేచి ఉన్నారు. లిస్ట్ త‌న పేరు న‌మోదు చేయించుకుని ఓ చోట కూర్చున్న శ్రీకాంత్ ను మ‌ళ్లీ నిరాశ ఆవ‌రించింది. ఇంత మందిలో నాకు ఎందుకు ఉద్యోగం వ‌స్తుంది? కానీ ఎటువంటి ప‌రిస్థితుల్లో అయినా ఆత్మ‌విశ్వాసం కోల్పోకూడ‌ద‌న్న తండ్రి మాట‌లు గుర్తుకువ‌చ్చాయి. ఎందుకో తండ్రి చెప్పిన అన్ని విష‌యాలు త‌న మంచికే క‌దా అన్న ఆలోచ‌న వ‌చ్చింది. నేనే అత‌న్ని స‌రిగ్గా అర్ధం చేసుకోలేక‌పోయాను అని అనుకున్నాడు. గుండెల నిండా ఆత్మ‌విశ్వాసాన్ని నింపుకుని త‌న తండ్రి మాట‌ల‌ను ఓసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రి మీద గౌర‌వం అమాంతం పెరిగింది. త‌న పేరు పిలిచే దాకా వేచి చూస్తున్న శ్రీకాంత్ బాత్రూమ్ కి వెళ్లాడు. అక్క‌డ బాత్రూమ్ చాలా చ‌క్క‌గా ఉన్న‌ప్ప‌టికీ ఇంట‌ర్వ్యూకు వ‌చ్చిన అభ్య‌ర్ధులు దాన్ని అస్త‌వ్య‌స్థంగా వాడుతున్నారు. బాత్రూమ్ వాడాక ఎవ‌రూ ఫ్ల‌ష్ చేయ‌డం లేదు. చేతులు క‌డుక్కుని ట్యాప్ ను క‌ట్ట‌కుండానే వెళ్లిపోవ‌డం వ‌ల‌న నీళ్ల‌న్నీ వృధాగా పోతున్నాయి. బ‌య‌ట డోర్ మ్యాట్ ఉన్నా దాన్ని ప‌క్క‌కు తోసేసి కాళ్లు తుడుచుకోకుండా వెళ్లిపోతున్నారు. వెంట‌నే శ్రీకాంత్ కు త‌న‌కు ఎప్పుడూ తండ్రి చెప్పే మాట‌లు గుర్తుకు వ‌చ్చాయి. ‘ఇళ్లు అయినా ఆఫీస్ అయినా బాధ్య‌తాయుతంగా ప్ర‌వ‌ర్తించాలి క‌దా’ అనుకున్నాడు. వెంట‌నే ఒక తెల్ల‌కాగితం తీసుకుని ‘నీరు వృధా చేయొద్దు. బాత్రూమ్ వాడాక ఫ్ల‌ష్ ఆన్ చేయండి. బ‌య‌ట డోర్ మ్యాట్ ను వాడండి’ అని రాసి బాత్రూమ్ లో అతికించాడు. అలానే బాత్రూమ్ బ‌య‌ట కూడా అదే విధ‌మైన సూచ‌న‌లు అతికించాడు. మ‌ళ్లీ వ‌చ్చి త‌న స్థానంలో కూర్చున్నాడు. ఇంట‌ర్వ్యూ కాస్త ఆల‌స్యం కావ‌డంతో త‌ల్లి ఇచ్చిన లంచ్ బాక్స్ ను తీసుకుని అక్క‌డి క్యాఫిరేటియాకు వెళ్లాడు. అక్క‌డ కూడా చాలా మంది నిర్ల‌క్ష్యంగా అన్నం తిని టేబుల్స్ ను అప‌రిశుభ్రంగా వ‌దిలేసి వెళ్లిపోవ‌డం క‌నిపించింది. వెంట‌నే ఒక పేప‌ర్ తీసుకుని దానిపై ‘మీరు అన్నం తినే ప్ర‌దేశాన్ని ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం మీ బాధ్య‌త’ అంటూ రాసి అక్క‌డ కూడా అతికించాడు.

 

చాలాసేపు నిరీక్షించాక చివ‌రికి శ్రీకాంత్ పేరు పిలిచారు. ఇంట‌ర్వ్యూకు హాల్ లోకి వెళ్లిన శ్రీకాంత్ త‌న‌కు ఉద్యోగం రాక‌పోయినా స‌రే ఆత్మ‌విశ్వాసంతో స‌మాధానాలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే ఎటువంటి ఇంట‌ర్వ్యూ చేయ‌కుండానే అక్క‌డ హెచ్ఆర్ మేనేజ‌ర్లు ‘యూఆర్ సెలెక్టెడ్’ అంటూ చెప్పారు. ఆనందంతో, ఆశ్చ‌ర్యంతో శ్రీకాంత్ కు ఒక్క‌సారిగా నోట మాట‌రాలేదు. ఎన్నో ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని ఉన్నా త‌మాయించుకుని అప్పాయింట్ మెంట్ లెట‌ర్ తీసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చేసాడు.

 

 

ఇంట‌ర్వ్యూ చేయ‌కుండానే శ్రీకాంత్ ను ఎందుకు ఎంపిక చేసారు?

 

ఇదే డౌట్ శ్రీకాంత్ కు కూడా వ‌చ్చింది. అస‌లు ఏమీ ప్ర‌శ్న‌లు అడ‌క్కుండానే, త‌న నైపుణ్యాలు ప‌రీక్షించ‌కుండానే త‌న‌ను ఎలా సెలెక్ట్ చేసారు? అన్న సందేహం అత‌న్ని నిలువ‌నీయ‌లేదు. ఉద్యోగం చేరిన మ‌రుస‌టి రోజే హెచ్ఆర్ మేనేజ‌ర్ ని క‌లిసి ‘సార్ న‌న్ను ఎందుకు.. ఎలా సెలెక్ట్ చేసారు’ అని అడిగాడు. దానికి చిన్న చిరున‌వ్వు న‌వ్విన మేనేజ‌ర్..’నిన్ను ఇంట‌ర్వ్యూ చేయ‌లేదు అని ఎవ‌ర‌న్నారు? ఇంట‌ర్వ్యూ హాల్ లోకి రాక‌ముందే నిన్న ఇంట‌ర్వ్యూ చేసి సెలెక్ట్ చేసాం’ అని చెప్పారు. ఆశ్చ‌ర్య‌పోయిన శ్రీకాంత్ ఎలా సార్ అని అడిగాడు. ‘సీసీటీవి కెమెరాల ద్వారా బ‌య‌ట అభ్య‌ర్ధులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఎంత బాధ్య‌త‌గా ఉన్నారు? అన్న విష‌యాల‌ను మేం నిశితంగా గ‌మ‌నించాం. అందులో నువ్వు బాత్ రూమ్ బ‌య‌ట నోటీస్ అతికించ‌డం, క్యాఫిటేరియాను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో చెప్ప‌డం ఇవ‌న్నీ మేం ప‌రిశీలించాం. ఇప్పుడు కంపెనీల‌కు కావాల్సింది నైపుణ్యం ఒక్క‌టే కాదు బాధ్య‌త‌. త‌ను ప‌నిచేసే చోటును త‌న సొంత ఇంటిలా బాధ్య‌తగా చూసుకునే వ్య‌క్తులు ప‌నిని కూడా అంతే శ్ర‌ద్ధగా చేస్తారు. అందుకే నిన్ను ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేసాం’ అని చెప్పాడు. మేనేజ‌ర్ కు థ్యాంక్స్ చెప్పి బ‌య‌ట‌కు వ‌చ్చిన శ్రీకాంత్ కు త‌ల్లిదండ్రుల మీద ఒక్క‌సారిగా గౌర‌వం పెరిగిపోయింది. వాళ్లు త‌న జీవితానికి అవ‌స‌ర‌మైన విష‌యాల‌ను నేర్ప‌డం వ‌ల‌నే నేను ఈ రోజు స్థాయిలో ఉన్నాను అనుకుని వాళ్ల‌కు మ‌న‌స్పూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకున్నాడు.

 

 

కంపెనీల‌కు ఇప్పుడు కావాల్సింది ప‌ని నైపుణ్యాలు ఒక్క‌టే కాదు!

 

ప్ర‌స్తుతం కంపెనీలు ప‌ని నైపుణ్యాల‌నే కాదు జీవ‌న నైపుణ్యాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నాయి. ఎందుకుంటే జీవ‌న నైపుణ్యాల క‌లిగి ఉన్న అభ్య‌ర్ధులు ప‌ని నైపుణ్యాల‌ను నేర్చుకోవ‌డం సుల‌భ‌మ‌న్న‌ది హెచ్ఆర్ నిపుణుల అంచ‌నా. అందుకే ఇప్పుడు అభ్య‌ర్ధుల వ్య‌వ‌హార శైలి, అల‌వాట్లు, వైఖ‌రి, బాధ్య‌త మొద‌లైన విష‌యాలు చాలా ముఖ్య‌మైన‌విగా మారిపోయాయి. ఉద్యోగాన్ని ఆశించే అభ్య‌ర్ధులు హెచ్ఆర్ విధానంలో వ‌చ్చిన ఈ మార్పును అవ‌గాహ‌న చేసుకుంటే త‌ప్ప విజ‌యాన్ని సాధించ‌డ‌డం సాధ్యం కాదు. త‌ల్లిదండ్రుల మాట‌కు గౌర‌వం ఇస్తూ ఇంట్లో చిన్న ప‌నుల‌ను, బాధ్య‌త‌ల‌ను పూర్తి చేస్తూనే సామాజిక అంశాల‌పై ప‌ట్టు ఉన్నవారు ఇంట‌ర్వ్యూలో విజ‌య‌వంత‌మ‌వుతారు. త‌న ఇంటిని, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోని వ్య‌క్తులు ఆఫీస్ ప‌ట్ల కూడా అదే ర‌క‌మైన నిర్ల‌క్ష్య వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తార‌ని ఇప్పుడు కంపెనీలు బ‌లంగా న‌మ్ముతున్నాయి. అందుకే ప‌ని నైపుణ్యాల కంటే ముందు అభ్య‌ర్ధి తోటి వారి ప‌ట్ల వ్య‌వ‌హ‌రించే విధానం, త‌న చుట్టూ జ‌రుగుతున్న విష‌యాల ప‌ట్ల బాధ్య‌త‌, త‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకునే ప‌ద్ధ‌తిని క్షుణ్ణంగా గమ‌నిస్తున్నాయి. అటువంటి ల‌క్ష‌ణాలు లేని వారిని వారికెన్ని ప‌ని నైపుణ్యాలు ఉన్నా స‌రే నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న పెడుతున్నాయి. ఎందుకంటే బాధ్య‌త ఉన్న‌వారికి ప‌ని రాకున్నాస‌రే వారినే ఉద్యోగాల్లోకి తీసుకుంటే త‌ర్వాత వారికి సులువుగా ప‌ని నేర్ప‌వ‌చ్చ‌న్న‌ది వారి న‌మ్మ‌కం.

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేసిన‌వారు)

 

 

ఇంటర్వ్యూలో కచ్చితంగా అడిగే ’10 ప్రశ్నలు’ ఏంటో తెలుసా?

పరిమిత మానవ వననరులతో అపరిమిత ప్రయోజనాలను పొందడమే కంపెనీల మెయిన్ టార్గెట్. అందుకే ఒక అభ్యర్ధిని ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు విభిన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్ధికి టెక్నికల్ నైపుణ్యాలతో పాటు తమ పని సంస్కృతికి అలవాటు పడగలడా లేదా తమ సంస్థకు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్న విషయాలను పరిశీలించాకే ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధపడతారు. టెక్నికల్ రౌండ్ లో ఎంత మంచి ప్రతిభ చూపినా హెచ్‌ఆర్ రౌండ్ మాత్రం అభ్యర్ధులకు చాలా కీలకమైనది. ఎందుకంటే టెక్నికల్ రౌండ్ అనేది తాము చదువుకున్న టాపిక్ కు సంబంధించినది కానీ హెచ్ఆర్ రౌండ్ లో మాత్రం అస్సలు ఊహించనటువంటి కఠిన ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకంటే విభిన్న ప్రశ్నల ద్వారానే అభ్యర్ధి యొక్క ఆప్టిట్యూడ్ ను ఆటిట్యూడ్ ను హెచ్‌ఆర్ మేనేజర్లు నిగ్గుతేల్చాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే హెచ్ఆర్ రౌండ్ అభ్యర్ధులకు కఠినమైన సవాలే. అయితే కాస్త సాధన చేసి, ప్రశ్నలకు ముందుగా ప్రిపేర్ అయి వెళితే హెచ్‌ఆర్‌ మేనేజర్లను మెప్పించడం కష్టమైన విషయమేమీ కాదు.

ఇంటర్వ్యూలో హెచ్ఆర్ మేనేజర్లు అడిగే టాప్ 10 ప్రశ్నలు ఇవే..

1. మీ గురించి కాస్త చెప్పండి?

ఈ ప్రశ్న ప్రతీ ఇంటర్వ్యూలో తరుచుగా అడిగే ప్రశ్నే. కానీ అభ్యర్ధులు సమాధానం చెప్పే తీరు రిహార్సల్స్ చేసి కంఠతా పట్టి చెప్పినట్టుగా ఉండకూడదు. చాలా కాన్ఫిడెంట్ గా నిటారుగా కూర్చుని ఈ ఉద్యోగానికి తన అర్హతలు ఎంత బాగా సరిపోతాయో వాళ్లకు చెప్పగలగాలి. అలాగే తనకున్న అనుభవం ఆ ఉద్యోగానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా వివరించాలి. అదే సమయంలో హెచ్‌ఆర్ మేనేజర్లు ఎటువంటి అభ్యర్ధిని కోరుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించాలి.

2. మీకున్న బలాలు ఏంటి?

ఈ ప్రశ్నకు సమాధానాన్ని చాలా సానుకూల దృక్ఫదంతో వివరించాలి. చాలా ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, వృత్తి నైపుణ‌్యం, నాయకత్వ నైపుణ్యాలు, పాజిటివ్ థింకింగ్, కష్టపడే గుణం వీటన్నింటినీ వాళ్లకు సరైన రీతిలో వివరించాలి. మీరు చెప్పే లక్షణాలు మీలో ఖచ్చితంగా ఉన్నాయని వాళ్లకు నమ్మకం కలిగేలా మీ సమధానం ఉండాలి.

3. మీలో ఉన్న లోపాలేంటి?

వాస్తవానికి ఇది చాలా కఠినమైన ప్రశ్న. ఇది అభ్యర్ధులను ఎలిమినేట్ చేసేందుకు ఉద్ధేశించిన ప్రశ్న. అదే విధంగా అభ్యర్ధుల సంఖ్యను తగ్గించేందుకు కూడా ఈ ప్రశ్న అడుగుతారు. వాస్తవానికి మీ బలహీనతలను మీరు స్వయంగా తెలుసుకోలేరు. కాబట్టి ఈ ప్రశ్నకు చాలా జాగ్రత్తగా జవాబు చెప్పాలి.

4. మీ పాత జాబ్ ను ఎందుకు వదిలేసారు?

మీరు మీ పాత జాబ్ ను విడిచిపెట్టడానికి గల కారణాలను చాలా పాజిటివ్ ఆటిట్యూడ్ తో చెప్పాలి. అవి కూడా చాలా సహేతుకంగా ఉండాలి. మీ పాత సంస్థపై నెగెటివ్ కామెంట్స్ అస్సలు చేయొద్దు. నిజంగా ఆ కంపెనీలో మీకు చేదు అనుభవాలు ఉన్నా అవి ఇక్కడ ప్రస్తావించొద్దు. జాబ్ వదిలేయడానికి సరైన కారణాలు చెప్తే సరిపోతుంది.

5. అసలు ఈ ఉద్యోగంలోకి నిన్నెందుకు తీసుకోవాలి?

ఇంటర్వ్యూ చేసే హెచ్ఆర్ మేనేజర్లు ఏం కోరుకుంటున్నారనో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సమాధానాలు కూడా వాటికి అనుగుణంగా సమయానుసారంగా ఇవ్వాలి. మీకు అవసరమైన పోజిషన్ కు సరిపోయే నైపుణ్యాలు నా దగ్గర ఉన్నాయని ప్రభావవంతంగా చెప్పాలి.

6. ఐదేళ్ల తర్వాత ఎటువంటి పోజిషన్ లో ఉండాలనుకుంటున్నావు?

సంస్థలో మీరు ఎక్కువ కాలం ఉంటారా? లేదా? అన్నది తెలుసుకోవడానికి హెచ్‌ఆర్ మేనేజర్లు సంధించే ప్రశ్న ఇది. దీనికి సమాధానం స్పెసిఫిక్ గా చెప్పాల్సిన పనిలేదు. ఏ పొజిషన్ కోరుకుంటున్నారో సహేతుకంగా, వాస్తవంగా చెపితే సరిపోతుంది.

7. నువ్వు టీమ్ ప్లేయర్ వా?

ఈ ప్రశ్న ఎదురుకాగానే మీ టీమ్ ఆటిట్యూడ్ ను వ్యక్త పర్చాలి. టీమ్ ప్లేయర్ నే అని చెప్పాలి. గతంలో టీమ్ కోసం ఏం చేసారో, ఎటువంటి కృషి చేసారో వివరించాలి. దానికి ఏమైనా ఉదాహరణలు ఉంటే వాటిని తెలియజేయాలి.

8. మీ మేనేజ్‌మెంట్ విధానం ఎలా ఉంటుంది?

అందర్నీ కలుపుకుపోయే లక్షణం అని చెప్పండి. లేదా పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఎదగాలి అన్న సమాధానం అయినా చెప్పొచ్చు. సిట్యుయేషన్ తగ్గట్టుగా సమాధానం ఉండాలి. మీ సమాధానం మీరు ఉద్యోగం చేయబోయే కంపెనీ ఆలోచనలకు సరిపోయే విధంగా ఉండాలి.

9. అసలు ఈ సంస్థకు నువ్వు అసెట్ ఎలా కాగలవు?

ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని బలంగా ఆకట్టుకోవాల్సిన సందర్భం ఇది. మీ సమాధానంతో వారి విశ్వాసాన్ని చూరగొనాలి. మిమ్మల్ని తీసుకోవడం వల సంస్థకు కలిగే ప్రయోజనాలు, ఎంత బలంగా చేకూరుతుందో చెప్పుకోవాలి.

10. మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా?

చాలా మంది అభ్యర్ధులు ఇక్కడ కూడా తడబడతారు. ఏడాదికి జీతం ఎన్నిసార్లు పెంచుతారు? వంటి సిల్లీ ప్రశ్నలు వేస్తారు. అలా కాకుండా నేను సెలెక్ట్ అయితే ఎప్పటిలోగా ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది? అన్న ప్రశ్నలు అడగొచ్చు. దీని వలన మీ ఆ ఉద్యోగంలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని రిక్రూటర్లు గుర్తిస్తారు.