ఇంటర్వ్యూలో కచ్చితంగా అడిగే ’10 ప్రశ్నలు’ ఏంటో తెలుసా?

పరిమిత మానవ వననరులతో అపరిమిత ప్రయోజనాలను పొందడమే కంపెనీల మెయిన్ టార్గెట్. అందుకే ఒక అభ్యర్ధిని ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు విభిన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్ధికి టెక్నికల్ నైపుణ్యాలతో పాటు తమ పని సంస్కృతికి అలవాటు పడగలడా లేదా తమ సంస్థకు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్న విషయాలను పరిశీలించాకే ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధపడతారు. టెక్నికల్ రౌండ్ లో ఎంత మంచి ప్రతిభ చూపినా హెచ్‌ఆర్ రౌండ్ మాత్రం అభ్యర్ధులకు చాలా కీలకమైనది. ఎందుకంటే టెక్నికల్ రౌండ్ అనేది తాము చదువుకున్న టాపిక్ కు సంబంధించినది కానీ హెచ్ఆర్ రౌండ్ లో మాత్రం అస్సలు ఊహించనటువంటి కఠిన ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకంటే విభిన్న ప్రశ్నల ద్వారానే అభ్యర్ధి యొక్క ఆప్టిట్యూడ్ ను ఆటిట్యూడ్ ను హెచ్‌ఆర్ మేనేజర్లు నిగ్గుతేల్చాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే హెచ్ఆర్ రౌండ్ అభ్యర్ధులకు కఠినమైన సవాలే. అయితే కాస్త సాధన చేసి, ప్రశ్నలకు ముందుగా ప్రిపేర్ అయి వెళితే హెచ్‌ఆర్‌ మేనేజర్లను మెప్పించడం కష్టమైన విషయమేమీ కాదు.

ఇంటర్వ్యూలో హెచ్ఆర్ మేనేజర్లు అడిగే టాప్ 10 ప్రశ్నలు ఇవే..

1. మీ గురించి కాస్త చెప్పండి?

ఈ ప్రశ్న ప్రతీ ఇంటర్వ్యూలో తరుచుగా అడిగే ప్రశ్నే. కానీ అభ్యర్ధులు సమాధానం చెప్పే తీరు రిహార్సల్స్ చేసి కంఠతా పట్టి చెప్పినట్టుగా ఉండకూడదు. చాలా కాన్ఫిడెంట్ గా నిటారుగా కూర్చుని ఈ ఉద్యోగానికి తన అర్హతలు ఎంత బాగా సరిపోతాయో వాళ్లకు చెప్పగలగాలి. అలాగే తనకున్న అనుభవం ఆ ఉద్యోగానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా వివరించాలి. అదే సమయంలో హెచ్‌ఆర్ మేనేజర్లు ఎటువంటి అభ్యర్ధిని కోరుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించాలి.

2. మీకున్న బలాలు ఏంటి?

ఈ ప్రశ్నకు సమాధానాన్ని చాలా సానుకూల దృక్ఫదంతో వివరించాలి. చాలా ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, వృత్తి నైపుణ‌్యం, నాయకత్వ నైపుణ్యాలు, పాజిటివ్ థింకింగ్, కష్టపడే గుణం వీటన్నింటినీ వాళ్లకు సరైన రీతిలో వివరించాలి. మీరు చెప్పే లక్షణాలు మీలో ఖచ్చితంగా ఉన్నాయని వాళ్లకు నమ్మకం కలిగేలా మీ సమధానం ఉండాలి.

3. మీలో ఉన్న లోపాలేంటి?

వాస్తవానికి ఇది చాలా కఠినమైన ప్రశ్న. ఇది అభ్యర్ధులను ఎలిమినేట్ చేసేందుకు ఉద్ధేశించిన ప్రశ్న. అదే విధంగా అభ్యర్ధుల సంఖ్యను తగ్గించేందుకు కూడా ఈ ప్రశ్న అడుగుతారు. వాస్తవానికి మీ బలహీనతలను మీరు స్వయంగా తెలుసుకోలేరు. కాబట్టి ఈ ప్రశ్నకు చాలా జాగ్రత్తగా జవాబు చెప్పాలి.

4. మీ పాత జాబ్ ను ఎందుకు వదిలేసారు?

మీరు మీ పాత జాబ్ ను విడిచిపెట్టడానికి గల కారణాలను చాలా పాజిటివ్ ఆటిట్యూడ్ తో చెప్పాలి. అవి కూడా చాలా సహేతుకంగా ఉండాలి. మీ పాత సంస్థపై నెగెటివ్ కామెంట్స్ అస్సలు చేయొద్దు. నిజంగా ఆ కంపెనీలో మీకు చేదు అనుభవాలు ఉన్నా అవి ఇక్కడ ప్రస్తావించొద్దు. జాబ్ వదిలేయడానికి సరైన కారణాలు చెప్తే సరిపోతుంది.

5. అసలు ఈ ఉద్యోగంలోకి నిన్నెందుకు తీసుకోవాలి?

ఇంటర్వ్యూ చేసే హెచ్ఆర్ మేనేజర్లు ఏం కోరుకుంటున్నారనో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సమాధానాలు కూడా వాటికి అనుగుణంగా సమయానుసారంగా ఇవ్వాలి. మీకు అవసరమైన పోజిషన్ కు సరిపోయే నైపుణ్యాలు నా దగ్గర ఉన్నాయని ప్రభావవంతంగా చెప్పాలి.

6. ఐదేళ్ల తర్వాత ఎటువంటి పోజిషన్ లో ఉండాలనుకుంటున్నావు?

సంస్థలో మీరు ఎక్కువ కాలం ఉంటారా? లేదా? అన్నది తెలుసుకోవడానికి హెచ్‌ఆర్ మేనేజర్లు సంధించే ప్రశ్న ఇది. దీనికి సమాధానం స్పెసిఫిక్ గా చెప్పాల్సిన పనిలేదు. ఏ పొజిషన్ కోరుకుంటున్నారో సహేతుకంగా, వాస్తవంగా చెపితే సరిపోతుంది.

7. నువ్వు టీమ్ ప్లేయర్ వా?

ఈ ప్రశ్న ఎదురుకాగానే మీ టీమ్ ఆటిట్యూడ్ ను వ్యక్త పర్చాలి. టీమ్ ప్లేయర్ నే అని చెప్పాలి. గతంలో టీమ్ కోసం ఏం చేసారో, ఎటువంటి కృషి చేసారో వివరించాలి. దానికి ఏమైనా ఉదాహరణలు ఉంటే వాటిని తెలియజేయాలి.

8. మీ మేనేజ్‌మెంట్ విధానం ఎలా ఉంటుంది?

అందర్నీ కలుపుకుపోయే లక్షణం అని చెప్పండి. లేదా పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఎదగాలి అన్న సమాధానం అయినా చెప్పొచ్చు. సిట్యుయేషన్ తగ్గట్టుగా సమాధానం ఉండాలి. మీ సమాధానం మీరు ఉద్యోగం చేయబోయే కంపెనీ ఆలోచనలకు సరిపోయే విధంగా ఉండాలి.

9. అసలు ఈ సంస్థకు నువ్వు అసెట్ ఎలా కాగలవు?

ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని బలంగా ఆకట్టుకోవాల్సిన సందర్భం ఇది. మీ సమాధానంతో వారి విశ్వాసాన్ని చూరగొనాలి. మిమ్మల్ని తీసుకోవడం వల సంస్థకు కలిగే ప్రయోజనాలు, ఎంత బలంగా చేకూరుతుందో చెప్పుకోవాలి.

10. మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా?

చాలా మంది అభ్యర్ధులు ఇక్కడ కూడా తడబడతారు. ఏడాదికి జీతం ఎన్నిసార్లు పెంచుతారు? వంటి సిల్లీ ప్రశ్నలు వేస్తారు. అలా కాకుండా నేను సెలెక్ట్ అయితే ఎప్పటిలోగా ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది? అన్న ప్రశ్నలు అడగొచ్చు. దీని వలన మీ ఆ ఉద్యోగంలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని రిక్రూటర్లు గుర్తిస్తారు.