ఈ చదువులు మాకొద్దు!!

పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతీది వ్యాపారమే.. అది విద్య కావొచ్చు.. వైద్యం కావొచ్చు..మరొకటి కావచ్చు..ప్రజలకు అవసరమైన ప్రతీదాంట్లోనూ వ్యాపారం చేసి లాభాలు దండుకోవడమే కార్పోరేట్ వ్యవస్థ అంతిమ లక్ష్యం. విద్య, వైద్యం అనేవి ప్రతీ ఒక్కరికీ చాలా ముఖ్యమైన అవసరాలు. సామాజిక, వ్యక్తిగత, ఆర్థిక, మానవ సంబంధమైన అంశాలు ఇమిడి ఉంటాయి కాబట్టి విద్య, వైద్యం కోసం ప్రజలు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. సరిగ్గా ఈ బలహీనతను ఆసరా చేసుకునే కార్పోరేట్ విద్యాలయాలు, ఆస్పత్రులు మనదేశంలో లక్షలాది కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ముఖ్యంగా కార్పోరేట్ విద్యా సంస్థలు డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ మన విద్యా వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయి. దేశ భవిష్యత్ నిర్మాతలైన విద్యార్ధుల ఉసురు తీస్తున్నాయి. కేవలం మార్కుల ప్రాతిపదికన విద్యను కార్పోరేటీకరణ చేసి పిల్లలను చదివే యంత్రాల్లా మారుస్తున్నాయి. దీంతో ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్ధులు కొందరైతే, ఇళ్లు వదిలి పారిపోతున్నవారు మరికొందరు. ఆడుతూ పాడుతూ చదవాల్సిన చదువును చదవలేక కన్న తల్లిదండ్రులను, అద్భుతమైన భవిష్యత్‌ను, కలలు కన్న లక్ష్యాన్ని వదిలి విద్యార్ధులు ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు? మన విద్యా వ్యవస్థలో, విద్యా విధానంలో అసలు ఏం జరుగుతోంది?

 

మిథ్యా వ్యవస్థగా మారిన మన విద్యా వ్యవస్థ!

 

ఒక పిల్లవానికి ఐదేళ్లు వయస్సు వస్తే కానీ అతనికి ఒక విషయం నేర్చుకునే, తెలుసుకునే పరిణితి రాదు. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఒక పిల్లవానికి మూడేళ్లు రాగానే స్కూల్ లో చేర్పిస్తున్నారు. మూడేళ్ల వయస్సు నుంచే ఆ పిల్లవానికి ఉదయం నుంచి సాయింత్రం వరకూ స్కూల్, హోమ్ వర్క్, పుస్తకాల బరువు, ఒత్తిడి. ఇటువంటి వాతావరణంలో అతను మానసికంగా పరిణితి సాధించిన విద్యార్ధిగా తయారు కాగలడా? ఐదేళ్లు వచ్చే వరకూ పిల్లలు ఉల్లాసంగా ఆటలు ఆడుకుంటూ ప్రకృతి నుంచి, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల నుంచి, విభిన్న పరిస్థితుల నుంచి ఎన్నో విషయాలను గ్రహిస్తారు. ఆ తర్వాత స్కూల్ కు వెళ్లి చదువు నేర్చుకుంటారు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతోంది. మూడేళ్లకే వేలకు వేలు ఫీజులు కట్టి స్కూల్ లో జాయిన్ చేసి ఆ పిల్లవాడు చెపుతున్న ఏబీసీడీలు విని ఇటు పేరెంట్స్ మురిసిపోతుంటే… అటు ఇదంతా మా ఘనతే అంటూ కార్పోరేట్ స్కూల్స్ వ్యాపారం చేసుకుంటున్నాయి. కానీ విద్యార్ధి మానసిక ఆరోగ్యంపై కానీ భరిస్తున్న ఒత్తిడిపై కానీ ఆలోచించే పరిస్థితులు కరవవుతున్నాయి. ఇక విద్యార్ధిలో మానసిక వికాసం ఎలా కలుగుతుంది?

మార్కులు రాకపోతే బతుకు దండగా?

 

టీవీలో ప్రతీ రోజూ వచ్చే ఒక ఫ్లోర్ క్లీనర్ యాడ్ లో ఏం చెప్తారు… ఈ క్లీనర్ వాడకపోతే మీరు అపరిశుభ్రతతో జబ్బులు పాలవుతారని. తన క్లీనర్ ను అమ్ముకోవడానికి ప్రజల్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తారు. ప్రజల్లో ఉన్న ఆ భయం నుంచి తన వ్యాపారాన్ని పెంచుకోవడమే ఆ కార్పోరేట్ కంపెనీ లక్ష్యం. ఇప్పుడు కార్పోరేట్ విద్యా సంస్థలు కూడా ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. మీ పిల్లవానికి ఇన్ని మార్కులు రాకపోతే వేస్ట్..ఇంజినీరింగ్, మెడిసిన్ లు మాత్రమే చదువులు. మిగతా కోర్సులు ఏం చదివినా ఉన్నత స్థానానికి వెళ్లలేరు. వందకు వంద మార్కులు వస్తేనే నీ బతుక్కి ఒక అర్ధం ఉంది. అంటూ స్టూడెంట్స్ ను ఒత్తిడిలోకి నెడతారు. ఆ మార్కులు కోసం ఇరుకు గదుల్లో ఉదయం ఐదు నుంచి రాత్రి 9 , 10 గంటల వరకూ స్పెషల్ క్లాస్ లు, స్పెషల్ టెస్ట్ లు అంటూ వాళ్లను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తారు. ఆ ఒత్తిడికి తట్టుకుని నిలబడే వారు కొందరైతే మానసికంగా బలహీనంగా ఉన్న పిల్లలు ఆ యాతనను భరించలేక ప్రాణాలైనా తీసుకుంటున్నారు. లేదంటే ఎవరికీ అందనంత దూరంగా పారిపోతున్నారు. ఈ దురవస్థకి ప్రభుత్వాలు కూడా ఒక కారణంగా మారుతున్నాయి. తన బాధ్యతను కార్పోరేట్ సంస్థలకు బదలాయించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం మార్కుల కోసం, వ్యాపారం కోసం వాళ్లు చేస్తున్న బరితెగింపు వ్యవహారాన్ని చూసీ చూడనట్టు నటిస్తోంది. గడిచిన కొన్ని రోజుల్లో పదుల సంఖ్యలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, వాళ్లు పెడుతున్న మార్కుల ఒత్తిడికి భరించలేక నరకయాతన అనుభవిస్తున్నా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యక్ష చర్యలు శూన్యం.

‘చైనా’ సంస్థలను బహిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందా?

 

మన దేశ మార్కెట్ ను కొల్లగొడుతున్న చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఇటీవలి కాలంలో ఒక ప్రచారం ఊపందుకుంది. మన ఆర్థిక వ్యవస్థకు, ఆరోగ్యానికి చేటుగా మారిన చైనా వస్తువులను బహిష్కరించడంలో తప్పులేదు. అదే విధంగా విద్యార్ధుల ఉసురు తీస్తూ లాభాలు తప్ప ప్రాణాలు పట్టని చైనా సంస్థలను కూడా బహిష్కరించాలి. చైనా సంస్థలంటే (చై)తన్య (నా)రాయణ విద్యా సంస్థలు. ఈ రెండు కార్పోరేట్ సంస్థలే కాదు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్ధులను ఒత్తిడికి గురి చేస్తూ వారిని మానసిక దుర్భలురుగా మారుస్తున్న అన్ని సంస్థలను నిషేధించాల్సిన సమయం వచ్చింది. లేకుంటే మన భావి భారత పౌరులు విద్యార్ధి దశలోనే ప్రాణాలు తీసుకోవడమో లేక కేవలం మార్కుల కోసమే బతికి చివరికి మానసిక రోగులుగా మారడమో జరుగుతుంది. ఈ కార్పోరేట్ విద్యా సంస్థలు అనుసరిస్తున్న విధానాలు చూస్తే మన ప్రాచీన విద్యావిధానం సిగ్గుతో చచ్చిపోతుంది. బాగా చదివే విద్యార్ధులు అంతా ఒక సెక్షన్, యావరేజ్, బిలో యావరేజ్ అంటూ ముందుగానే విద్యార్ధుల మధ్య గోడలు కట్టి వాళ్లను మానసికంగా ఒత్తిడిలోకి నెడతారు. ఒక తెలివైన విద్యార్ధి పక్కన ఉన్నప్పుడే కదా ఒక సాధారణ విద్యార్ధి ఏమైనా నేర్చుకోగలుగుతాడు? ఇటీవలి కాలంలో ఓ కార్పోరేట్ కాలేజీ యజమాని కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతే సానుభూతి బదులు విమర్శలు వచ్చాయి. ఎందుకు? సమాజంలో కార్పోరేట్ కాలేజీల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. మార్కులు బాగా వస్తేనే మీ పిల్లవాడు ఉన్నత స్థానానికి చేరుతాడా? ఇంజీనిరింగ్, డాక్టర్ కోర్సులు చదవకపోతే అతనికి భవిష్యత్ లేదా? మీ ఆశలు,కలలు నెరవేర్చుకోవడానికి మీ పిల్లలు కలలకు పాతరేసి ఎదురు డబ్బులిచ్చి వారిని నరకంలోకి తోసేయకండి.

 

మార్కుల ‘విష’ వలయాన్ని చేధించండి!

 

గతంలో పాఠశాలలను ఉదయం ఏడున్నర ప్రారంభించేవారు. మధ్యహ్నం 12 గంటలకు విరామం ఇచ్చేవారు. మధ్యహ్నం 3 వరకు పాఠాలు చెప్పి పిల్లలను ఆడుకునేందుకు క్రీడా మైదానాల్లోకి విడిచిపెట్టేవారు. వారు సాయింత్రం వరకూ వారికి నచ్చిన ఆటలు ఆడుకుంటూ మానసిక ఉల్లాసాన్ని పొందేవారు. మానసిక ఉల్లాసం వలన మంచి ఆహారం తీసుకుని క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది సరిగ్గా వినేందుకు అవకాశం కలిగేది. ఇప్పుడు క్రీడా మైదానం అన్న ఊసే లేదు. అపార్ట్‌మెంట్లలో ఇరుకు గదుల్లో బాల్యాన్ని బంధించి వారి విద్యార్ధులను మానసిక వికలాంగులుగా మార్చుతున్నారు. విద్యార్ధికి నెల రోజులకు ఒక్కసారి మాత్రమే పరీక్షలు పెట్టాలి. హోమ్ వర్క్ సబ్జెక్ట్ లో 10 శాతం కంటే ఎక్కువ ఇవ్వకూడదు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ప్రతీ స్కూల్ లోనూ సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ తప్పకుండా ఉండాలి. అవేమీ ఇప్పుడు అమలు కావడం లేదు. విద్యార్ధికి ఆడుకోవడానికి, మానసిక ఉల్లాసానికి తగిన సమయం ఇస్తే ఆత్మహత్యలు తక్షణం ఆగిపోతాయి. అలాగే టీచర్, విద్యార్ధి మధ్య వ్యాపారి, వినియోగదారుని సంబంధం మాత్రమే ఉంటోంది. అది పోయి విద్యార్ధి తన మనసులో మాటను టీచర్ తో చెప్పుకునే విధానం ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం, మానసికంగా బలవంతులైన విద్యార్ధులు తయారవుతారు. ఇవన్నీ అమలు చేయనంత వరకూ కార్పోరేట్ సంస్థలు లాభార్జన దాహం ఆగదు..విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగవు..తల్లిదండ్రుల కడుపుకోత ఆగదు.

 

(ఇన్నాళ్లూ మా ఆర్టికల్స్  Careertimesonline.blogspot.com లో వచ్చేవి. మీకు మా ఆర్టికల్స్ ను మరింత ఆకర్షణీయంగా అందించేందుకు మేము ఇప్పుడు www.careertimesonline.com వెబ్‌సైట్‌ను ప్రారంభించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇకపై కూడా మీ  ఆదరణతో అదే ఉత్సాహంతో ఆర్టికల్స్ ను లేటేస్ట్ అప్‌డేట్స్ ను పోస్ట్ చేస్తాం)

 

ఈ ఆర్టికల్ ను స్పాన్సర్ చేసినవారు