ప‌నివాళ్ల‌ కాళ్లు మొక్కి కార్పోరేట్ కంపెనీల‌కు కొత్త పాఠం నేర్పిన‌ త‌మిళ వ్యాపారి!

 

తాజాగా త‌మిళ‌నాడులో ఒక ట్రాన్స్ పోర్ట్ సంస్థ యజమాని త‌న సంస్థ‌లో ప‌నిచేసే డ్రైవ‌ర్ల కాళ్లు మొక్క‌డం దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కోట్లాది రూపాయ‌ల‌కు అధిప‌తి అయ్యిండి చిన్న స్థాయిలో త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే ప‌నివాళ్ల కాళ్ల‌పై అత‌ను ఎందుకు ప‌డ్డాడు? త‌న కింద ప‌నిచేసే వాళ్ల‌ను అంత‌లా గౌర‌వించాల్సిన అవ‌స‌ర‌ముందా? అత‌ను చేసిన ప‌నిని అంద‌రూ ఎందుకు అంత‌లా ప్ర‌శంసిస్తున్నారు. ఒకవైపు ఈ విష‌యంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటే మ‌రోవైపు అత‌ను చేసిన ప‌ని హెచ్ఆర్ నైపుణ్యాల్లో అత‌నికున్న ప‌ట్టును తెలియజేస్తోంద‌ని మాన‌వ వ‌న‌రుల విభాగంలో త‌ల‌లు పండిన మేధావులు చెపుతున్నారు.

 

య‌జమాని ఉద్యోగుల‌తో ఎప్పుడూ క‌ఠినంగానే ఉండాలా?

 

ఒక యాజమాని ఎప్పుడూ త‌న కింద ప‌నిచేసే ఉద్యోగుల‌తో క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించాలా? లేక వాళ్ల ప‌నితీరుకు త‌గిన ప్రోత్సాహ‌కాలు అందిస్తూ వాళ్లు అందిస్తున్న సేవ‌ల‌కు త‌గిన గుర్తింపును ఇవ్వాలా? ఈ విష‌యంలో హెచ్ఆర్ విభాగంలో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ న‌డుస్తూనే ఉంటుంది. గ‌తంతో పోల్చితే ఇప్పుడు ఉద్యోగుల‌తో కంపెనీలు కాస్త మర్యాద‌పూర్వ‌కంగా, సున్నితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాన‌వ స్వ‌భావాన్ని అధ్య‌య‌నం చేసి దాన్ని హెచ్ఆర్ కు జ‌త చేయ‌డంతో కొన్ని కంపెనీలు అద్భుత‌మైన ఫ‌లితాలు సాధించాయి. ప్రొత్సాహం, ప్ర‌శంస అనేవి ఉత్పాద‌క‌త‌ను పెంచే రెండు అద్భుత‌మైన విష‌యాల‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. అందుకే కొన్ని టాప్ కంపెనీలు త‌మ హెచ్ఆర్ విభాగంలో ఈ రెండు విష‌యాల‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నాయి. ఈ మార్పుతో మంచి ఫ‌లితాల‌ను కూడా సాధిస్తున్నాయి.

 

పేప‌ర్ గొప్ప‌దా?? పేప‌ర్ వెయిట్ గొప్ప‌దా??

 

విన‌డానికి చాలా సింపుల్ గా ఉన్నా ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం అంత సులువైన విష‌య‌మేమీ కాదు. ఎందుకంటే విభిన్న కోణాల్లో, విభిన్న సంద‌ర్భాల్లో చూస్తే ఈ రెండు చాలా ముఖ్య‌మైన‌వి గా క‌నిపిస్తాయి. అదే స‌మ‌యంలో ఈ రెండింటికి మ‌ధ్య ఉన్న అవినాభావ సంబంధం కూడా ప‌రిగ‌ణించ‌ద‌గ్గ‌దే. ఒక‌టి లేకుంటే రెండోది మ‌నుగ‌డ సాగించ‌డం అసాధ్యం. నాపై ఉండ‌టం వ‌ల‌న ఎటువంటి ఉప‌యోగం లేని పేప‌ర్ వెయిట్ కు విలువ పెరిగింద‌ని పేప‌ర్ విర్ర‌వీగినా, నేను పైన‌ ఉండి ఎగ‌ర‌కుండా కాపాడ‌కుంటే పేప‌ర్ ఎక్క‌డో డ‌స్ట్ బిన్ లో ప‌డి ఉండేది అని పేప‌ర్ వెయిట్ అనుకున్నా అస‌లు కార్యం ర‌సాభాస‌గా మారుతుంది. సంద‌ర్భాన్ని అనుస‌రించి పేప‌ర్, పేప‌ర్ వెయిట్ రెండూ గొప్ప‌వే. ఒక‌దానికి మ‌రొక‌టి ప‌రస్ప‌ర గౌర‌వం ఇచ్చిపుచ్చుకున్న‌ప్పుడే వాటి గౌర‌వం మ‌రింత పెరుగుతుంది.

 

ఉద్యోగికి గౌర‌వం ఇస్తేనే యజ‌మానికి ఎదుగుద‌ల‌!

 

హెచ్ఆర్ విభాగాన్ని ప‌టిష్టం చేసుకున్న కంపెనీలను నిశితంగా గ‌మ‌నిస్తే వాళ్లు ఉద్యోగికి ఇచ్చే గౌర‌వం అర్ధ‌మ‌వుతుంది. కంపెనీకి ఉద్యోగులు అందిస్తున్న సేవ‌ల‌కు గాను వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ స్పంద‌న‌ను తెలియజేస్తారు. స‌రిగ్గా ప‌నిచేయ‌ని ఉద్యోగి విష‌యంలో ఎంత క‌ఠినంగా ఉంటారో అలానే కంపెనీ ఉన్న‌తికి కృషి చేసే ఉద్యోగికి త‌మ కృత‌జ్ఞ‌త‌తో కూడిన ప్ర‌తిస్పంద‌న‌ను కూడా అదే విధంగా తెలియ‌జేస్తారు. ఇప్పుడు త‌మిళ‌నాడులో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారి చేసిన ప‌ని కూడా అదే. ఉద్యోగికి ప్రేమ‌తో కూడిన కృత‌జ్ఞ‌త‌ను తెలియ‌జేసి త‌న కింద ప‌నిచేసే ఉద్యోగుల మ‌న‌సు గెల్చుకున్నాడు. వాస్త‌వానికి ఇది ప్ర‌స్తుతం పెద్ద పెద్ద కంపెనీల‌కు కూడా సాధ్యం కాని విష‌యం. ఇక స్టార్టప్ విష‌యం అయితే చెప్ప‌నే అక్క‌ర్లేదు. ఔత్సాహిక వ్యాపారవేత్త‌లు, కార్పోరేట్ రంగంలో దూసుకుపోవాల‌నుకుంటున్న వారు త‌మిళ వ్యాపారి చేసిన ప‌నిని ఒక‌సారి మ‌న‌నం చేసుకుంటే చాలు. భ‌విష్య‌త్ లో వాళ్ల కంపెనీలు ఉన్న‌త స్థానంలో నిల‌బ‌డ‌తాయి.

 

                                                     ( ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసిన వారు)