9 టు 5 రోటీన్ జాబ్ మీకు నచ్చదా? అయితే ఈ కెరీర్స్ పై లుక్కేయండి!

 

దయాన్నే హడావుడిగా నిద్ర లేవడం, గబా గబా తయారై ట్రాఫిక్ లో ఆఫీస్ కు చేరుకోవడం అక్కడ ఓ 8 గంటలు పనిచేసి సాయింత్రం ఏడుకి మళ్లీ ఇంటికి చేరడం. ఇలా ప్రతీ రోజూ చేసే రోటీన్ జాబ్స్ ను ఈతరం ఇష్టపడటం లేదు. అధిక శాతం మంది 9 టు 5  జాబ్స్ కాకుండా కాస్త భిన్నంగా ఉంటే జాబ్స్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా తమకు నచ్చినప్పుడు మాత్రమే పనిచేసే వీలున్న జాబ్స్ ను చాలా మంది కోరుకుంటున్నారు. ఈ విధంగా ఆలోచించే వారి కోసం ప్రజంట్ జాబ్ మార్కెట్లో ఎన్నో జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. అనుకున్న సమయానికి టాస్క్ ను పూర్తి చేయగలిగితే చాలు వీరు ఏం టైం లో పనిచేస్తున్నారు? ఎంత సేపు పనిచేస్తున్నారు అని ఎవరూ అడగరు. రోటీన్ కు భిన్నంగా కూల్ గా జాబ్ చేయాలనుకునే వారి కోసం చాలా జాబ్స్ రెడీగా ఉన్నాయి. మన ‘కెరీర్ టైమ్స్’ లో ఇప్పుడు అటువంటి జాబ్స్ కోసం తెలుసుకుందాం.

 

ఫ్రీలాన్స్ వెబ్‌ డిజైనర్ 

 

      ఈ టెక్నాలజీ యుగంలో ప్రతీ పనీ వెబ్ సైట్ ద్వారానో లేక మొబైల్ యాప్ ద్వారానో జరుగుతుంది. సమాచార ప్రదర్శనకు, తమ సంస్థ ప్రధాన ఉద్దేశం చెప్పడానికి ప్రతీ కంపెనీకి ప్రత్యేకమైన వెబ్‌సైట్ ఉండాల్సిందే. దీనికి చిన్నా పెద్దా అన్న తేడా లేదు. ప్రతీ సంస్థకు ఇప్పుడు సొంత వెబ్‌ సైట్ తప్పనిసరి. కొన్ని కంపెనీలు తమ కంపెనీలు వెబ్‌సైట్ లో తమ ఉత్పత్తుల అమ్మకాలు కూడా జరుపుతున్నాయి. అయితే కంపెనీకి వెబ్‌సైట్ తప్పనిసరి కానీ కేవలం వెబ్‌డిజైనింగ్ కోసం ప్రత్యేకంగా ఉద్యోగిని నియమించుకోలేవు. అందుకే దాదాపు అన్ని సంస్థలు వెబ్‌డిజైనింగ్ ను ఔట్‌సోర్సింగ్ చేస్తున్నాయి. కాబట్టి పనివేళలతో సంబంధం లేకుండా నచ్చిన సమయంలో పనిచేసుకోవచ్చు. కానీ కంపెనీ నిర్దేశించిన గడువు లోగా వర్క్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వెబ్‌ డిజైనర్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో కంప్యూటర్స్ ఉంటే చాలు నెలకు రెండు మూడు ప్రాజెక్ట్ లు చేసి 25 నుంచి 30 వేల వరకూ సంపాదించే వీలుంది. బాగా పనిచేస్తారని పేరు సంపాదిస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. 
 
 
 
 

సోషల్ మీడియా కన్సల్టెంట్ 

 

       ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది.  యువత అంతా తమ అభిప్రాయాలను, భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎక్కువ సమయంలో అందులోనే గడుపుతున్నారు. దీంతో కంపెనీలు తమ ప్రచార వ్యూహాలను మార్చుకున్నాయి. సోషల్ మీడియాను తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. తమ కంపెనీని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే పనిని సోషల్ మీడియా కన్సల్టెంట్స్ కు అప్పగిస్తున్నాయి.  సోషల్ మీడియా కన్సల్టెంట్స్ తాము తీసుకున్న పనిని తమకు వెసులుబాటు ఉన్న సమయంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసినందుకు వీరికి నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకూ అందుతున్నాయి. ఇంగ్లీష్ పై కాస్త పట్టు ఉండి, చేతిలో మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా సోషల్ మీడియా కన్సల్టెంట్ అయిపోవచ్చు. 
 

పర్సనల్ ట్రైనర్ 

 

      ప్రస్తుతం నైపుణ్యం లేని వ్యక్తికి జాబ్ మార్కెట్ లో విలువ లేదు. అడకమిక్ అర్హతలు ఎన్ని ఉన్నా కమ్యూనికేషన్, లీడర్ షిఫ్ వంటి లక్షణాలు లేకపోతే కంపెనీలు జాబ్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా తర్వాత నిర్దాక్షిణ్యంగా తొలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఉద్యోగికి, ఉద్యోగార్ధికి భావవ్యక్తీకరణ, నాయకత్వం లక్షణాలను పెంపోదించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఈ రెండు విషయాలను నేర్పించే పర్సనల్ ట్రైనర్స్ కు ఆదరణ పెరిగింది. ఉద్యోగికి వెసులుబాటు ఉన్న సమయంలో వీరు అతని దగ్గరికి వెళ్లి ఈ విషయాల్లో అతన్ని ట్రైనప్ చేస్తారు. ముఖ‌్యంగా ఉదయం సాయింత్రం వేళ్లలో మాత్రమే వీరికి పని ఉంటుంది. మంచి భోధనా నైపుణ్యం ఉంటే పర్సనల్ ట్రైనర్స్ నెలకు 25 నుంచి 30 వేలు సంపాదించవచ్చు. 
 
 
 
 

రియల్ ఎస్టేట్ ఏజెంట్ 

 

        ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అనేది పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా మారిపోయింది. భూమికి ఉన్న విలువను గుర్తించి చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారికి ఎక్కడ , ఎలా, ఎంత అన్న విషయాలపై అవగాహన ఉండదు. ఇటువంటి గైడ్ చేసి వారికి అనుకూలమైన స్థలాన్ని, వారి పెట్టుబడి మెత్తం ఆధారంగా చూపించేందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అవసరం ఏర్పడింది. ఈ కెరీర్ లో చేయవలసింది చాలా చిన్న పని. ఇన్వెస్టర్ తో భూమి యజమానితో మాట్లాడి ఇద్దరికి సంధానకర్తగా వ్యవహరించి అనుకున్న సమయానికి భూమికి చూపిస్తే సరిపోతుంది. ఎటువంటి వివాదాలు లేని భూమిని ఇన్వెస్టర్లకు చూపిస్తే రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వెలిగిపోవచ్చు.  ప్రస్తుతం రియల్ ఎస్టేట్  పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కెరీర్ కు ఢోకా ఉండకపోవచ్చు. 
 
 
 
 

ట్యాక్స్ కన్సల్టెంట్ 

     
 

    ప్రస్తుతం ఉద్యోగుల్లో చాలా మందికి పన్నులకు సంబంధించిన విషయాలపై అంతగా అవగాహన ఉండదు. ఎంత ఆదాయం వస్తే ఎంత పన్ను చెల్లించాలి? పన్నుల భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పద్ధతులను అనుసరిస్తే పన్ను భారం అనిపించదు? వంటి విషయాలను తెలియజెప్పేందుకు నిపుణుల అవసరం పడింది. అలాంటి అవసరం లోంచి పుట్టుకొచ్చిందే ట్యాక్స్ కన్సల్టెంట్ కెరీర్. ప్రస్తుతం చాలా మంది వ్యక్తులు, సంస్థలు తమ పన్ను సంబంధిత వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయి. సమయం లేకపోవడం వలన వీరు ఆ బాధ్యతలను ట్యాక్స్ కన్సల్టెంట్ కు అప్పగిస్తారు. వీరు ఉద్యోగికి అనుకూలమైన సమయంలో వాళ్లను కలిసి వివరాలు సేకరించి ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? అన్న విషయాలపై ఒక ప్రణాళిక తయారు చేస్తారు. వారికి తగిన గైడెన్స్ ఇస్తారు. ట్యాక్స్ కన్సల్టెంట్ గా పేరు సాధిస్తే నెలకు 30 నుంచి 40 వేల వరకూ ఆదాయం సంపాదించేందుకు అవకాశం ఉంది. 

 
 
(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)
 
 
 

మీ పిల్ల‌లు మీకు శ‌త్రువులా??

 

నా విద్యార్ధి నేను చెప్పిన మాట జ‌వ‌దాటడు (ఒక టీచ‌ర్ ఆనందం)..మా పిల్ల‌వాడు మేం ఏం ప‌ని చెయ్య‌మంటే ఆ ప‌ని చేస్తాడు ( త‌ల్లిదండ్రుల ఆనంద త‌న్మ‌య‌త్వం).. ఇలా టీచ‌ర్, త‌ల్లిదండ్రుల మాట‌ల‌ను, ఆదేశాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తూ వాళ్ల‌కు ఆనందాన్ని క‌లిగించే పిల్ల‌లే ఉత్త‌మమైన విద్యార్ధులా? ఇటువంటి వారే రేప్పొద్దున దేశాన్ని ఉద్ధ‌రించే మంచి పౌరులుగా త‌యార‌వుతారా? ఇలా అడిగితే క‌చ్చితంగా కాదు అని స‌మాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్ర‌తీ పిల్ల‌వాడు ఒక ప్ర‌త్యేకం. వాడికంటూ ఒక ప్ర‌త్యేక‌మైన ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయి. వాటిని గుర్తించకుండా కేవ‌లం త‌మ అభిప్రాయాల‌ను, త‌మ క‌ల‌ల‌ను, త‌మ అభిరుచుల‌ను పిల్ల‌ల‌పై రుద్దుతున్నారు ఈ త‌రం త‌ల్లిదండ్రులు. ఇటువంటి ఆలోచ‌నా విధానం పిల్ల‌ల్లోని సృజ‌నాత్మ‌క‌త‌ను, ప్ర‌తిభ‌ను, వారిలోని స్వ‌తంత్ర వ్య‌క్తిత్వాన్ని నీరుగారుస్తోంది. దీంతో త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేయలేక, త‌న‌కు న‌చ్చ‌ని ప‌నిని చేస్తూ త‌ల్లిదండ్రుల‌ను ఆనంద‌ప‌ర్చాల‌నే ఒత్తిడితో చాలా మంది యువ‌కులు, విద్యార్ధులు త‌మ జీవితాల్లో ఆనందాన్ని కోల్పోతున్నారు. చివ‌రికి కేవ‌లం త‌ల్లిదండ్రుల‌ను ఆనంద‌ప‌రిచే మ‌ర‌బొమ్మ‌లుగా మిగిలిపోతున్నారు.

 

 

త‌రాల్లో అంత‌రాన్ని గుర్తించండి!

 

ఎప్పుడూ మీ మాట వింటేనే ఉత్త‌మ‌మైన విద్యార్ధి..బాగా మార్కులు తెచ్చుకుంటేనే మంచి విద్యార్ధి అన్నఆలోచ‌నా విధానాన్ని విడ‌నాడి విసృత ప‌రిధిలో ఆలోచించండి. మీరు కూర్చొమంటే కూర్చుని మీరు చెయ్య‌మ‌న్న ప‌ని చేసిన‌ప్పుడు అత‌ను మీ ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిరూపం అవుతాడు కానీ స్వ‌తంత్రంగా త‌న‌ను తాను తీర్చిదిద్దుకునే వ్య‌క్తిగా ఎన్న‌డూ ఎద‌గ‌లేడు. ప్ర‌తీ త‌ల్లీ తండ్రీ , ప్ర‌తీ ఉపాధ్యాయుడు తాను ఎప్పుడో 20 , 30 ఏళ్ల క్రితం నేర్చుకున్న విష‌యాల‌ను త‌మ పిల్ల‌ల‌కు, త‌మ విద్యార్ధుల‌కు చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. అయితే త‌రం మారింది.. సాంకేతిక‌త మారింది..సామాజిక ప‌రిస్థితులు మారాయి…ఇన్ని విష‌యాలు మారిపోయిన‌ప్పుడు ఎప్పుడో మీరు నేర్చుకున్న , మంచివి అనుకుంటున్న విష‌యాలు ప్ర‌స్తుత త‌రానికి అంత‌గా ఉప‌యోగ‌ప‌డ‌ని విష‌యాలు అయి ఉండొచ్చు. ఈ కోణంలో ఏ త‌ల్లిదండ్రులైనా ఆలోచ‌న చేసారా? ప‌్ర‌తీ విద్యార్ధికి త‌న‌దైన ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ త‌న‌లోని ఆ ప్ర‌త్యేక‌త‌ను ఆ విద్యార్ధి గుర్తిస్తాడు. త‌న సృజ‌న‌కు ఆ ప్ర‌త్యేక‌త‌ను జోడించి ప‌నిచేస్తేనే అత‌ను ప‌నిలో ఆనందాన్ని పొంద‌గ‌లుగుతాడు. అయితే స‌రిగ్గా ఇక్క‌డే చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల అభిరుచుల‌ను నిర్దాక్షిణ్యంగా తొక్కిపెడుతున్నారు. విద్యార్ధికి జ‌న్మ‌తః వ‌చ్చిన ఒక ముద్ర‌ను చెరిపేయ‌డానికి, అత‌ని మార్గం మళ్లించ‌డానికి అటు త‌ల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

 

 

పాఠాలు చెప్ప‌డం మానండి..ముందు నేర్చుకోండి!

 

మీ పిల్ల‌ల ఇష్టాల‌కు వాళ్ల అభిరుచుల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ వాళ్లు త‌మ‌దైన సొంత వ్య‌క్తిత్వంలో ఎదిగేందుకు మీరు స‌హాయం చేయాల‌నుకుంటే ముందుగా ఒక ప‌నిచేయండి. స్టాప్ టీచింగ్ ఆర్ స్టార్ట్ రీడింగ్..అంటే మీరు పాఠాలు చెప్ప‌డం అయినా మానేయండి లేదంటే మీరు నేర్చుకోవడ‌మైనా చేయండి. కొత్త విష‌యాలు నేర్చుకోలేనంత కాలం మీరు మీ పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పే అర్హ‌త‌ను మీరు ఎన్న‌టికీ సాధించుకోలేరు. ఉపాధ్యాయులుగా కానీ త‌ల్లిదండ్రులుగా కానీ మీరు చేయాల్సిన ప‌ని ఏంటంటే వాళ్ల‌ని వాళ్లుగా గుర్తించి వాళ్ల దృక్కోణం నుంచి వాళ్ల అంత‌రంగాన్నిచ‌దివేందుకు ప్ర‌య‌త్నించ‌డం. కానీ ఈ ప‌నిని ఈత‌రం త‌ల్లిదండ్రులు ఎవ‌రూ చేయ‌డం లేదు. పిల్ల‌ల‌కు ఒక ప్ర‌త్యేక‌మైన వ్యక్తిత్వం ఉంద‌ని, కొన్ని విష‌యాల్లో వాళ్లు త‌మ‌కంటే ఉన్న‌తంగా ఆలోచించ‌గ‌ల‌ర‌ని ఒప్పుకోవ‌డానికి త‌ల్లిదండ్రుల‌కు అహం అడ్డొస్తుంది. నాకు ఇర‌వై, ముప్ఫై ఏళ్ల అనుభ‌వం ఉంది. నాకున్న‌ అనుభ‌వంతో పోల్చుకుంటే పిల్ల‌ల‌కు తెలిసింది ఏపాటిది అన్న అహంకారంతో చాలా మంది త‌ల్లిదండ్రులు పిల్ల‌ల సొంత శైలిని, వాళ్ల ప్ర‌తిభ‌ను తుంగ‌లో తొక్కుతున్నారు.

 

 

త‌ల్లిదండ్రులకు అభ‌ద్ర‌తాభావం త‌గ‌దు!

 

ఈత‌రం త‌ల్లిదండ్రుల్లో చాలా మంది అభ‌ద్ర‌తాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. పిల్ల‌ల‌పై ఎంత ప్రేమ ఉన్నప్ప‌టికీ వాళ్లు తిరిగి త‌మ‌ను ప్ర‌శ్నించ‌డాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పిల్ల‌లు బ‌ల‌వంతులుగా, తెలివైన వారిగి మార‌డం అన్న ఒక స‌హ‌జ మార్పును అంగీక‌రించేటంత మాన‌సిక ప‌రిణితిని సంపాదించుకోలేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారుతోంది. పాశ్చాత్య దేశాల‌తో పోల్చుకుంటే ఈ విష‌యంలో మనం చాలా వెనుక‌బడి ఉన్నాం. ముఖ్యంగా ప్ర‌స్తుత సామాజిక ప‌రిస్థితులు, టెక్నాల‌జీ వంటి మార్పుల‌కు అనుగుణంగా పేరెంట్స్ త‌మ‌ను తాము మార్చుకోవాలి. అప్ డేట్ కావాలి. కానీ అది జ‌ర‌గ‌డం లేదు. దీని వ‌ల‌న పిల్ల‌ల‌కు, త‌ల్లిదండ్రుల‌కు ఒక అగాధం ఏర్ప‌డుతోంది. పిల్ల‌లు అడ్వాన్స్ డ్ గా దూసుకుపోయి త‌మ క‌ల‌ల‌ను, త‌మ భ‌విష్య‌త్ గ‌మ్యాన్ని నిర్దేశించుకుంటుంటే త‌ల్లిదండ్రులు మాత్రం పిల్ల‌లు త‌మ అభిరుచుల‌కు, క‌ల‌ల‌కు అనుగుణంగా ఉండాల‌ని భావిస్తున్నారు. స‌రిగ్గా ఇక్క‌డే ఒక సంఘ‌ర్ష‌ణ ఏర్ప‌డుతోంది. పేరెంట్స్ త‌మ ఆకాంక్ష‌ల‌ను, తాము సాధించలేని వాటిని పిల్ల‌ల‌పై బ‌ల‌వంతంగా రుద్ద‌డం అనేది అతిపెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది.

 

 

మీరు సంతోషంగా ఉండాలా? మీ పిల్ల‌లు సంతోషంగా ఉండాలా?

 

బ‌ద్ధుడు, ఏసుక్రీస్తు, మ‌హాత్మాగాంధీ, పూలే వంటి గొప్ప వ్య‌క్తులు అంద‌రికీ ఇష్ట‌మైన వారు, ప్రియ‌మైన వారు క‌దా? వారు చేసిన భోధ‌న‌లు, చూపించిన మార్గం, సేవాదృక్ఫ‌ధం, త్యాగ‌నిర‌తి ఇవ‌న్నీ ఎల్ల‌వేళ‌లా అనుస‌ర‌ణీయం. వీరిలా మీ పిల్ల‌ల్ని అంద‌రికీ ఇష్ట‌మైన వారిగా త‌యారు చేయాల‌నుకుంటున్నారా? లేక మీకు మాత్ర‌మే ఇష్ట‌మైన వారిగా త‌యారు చేయాల‌నుకుంటున్నారా? ఈ ప్ర‌శ్న‌కు ప్ర‌తీ త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర‌ క‌చ్చితంగా స‌మాధానం ఉండి తీరాల్సిందే. అలాగే మీరు సంతోషంగా ఉండాల‌నుకుంటున్నారా? లేక మీ పిల్ల‌లు సంతోషంగా ఉండాల‌నుకుంటున్నారా? మీరు మాత్ర‌మే సంతోషంగా ఉండాల‌నుకుంటే మీ పిల్ల‌ల అభిరుచుల‌ను, వాళ్ల వ్య‌క్తిత్వాన్ని, వారి క‌ల‌ల‌ను, వారి ప్ర‌శ్న‌ల‌ను అన్నింటినీ అణిచివేయండి. కానీ మీ పిల్ల‌వాడు త‌న జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండ‌డు. అలా కాకుండా మీ పిల్ల‌వాడు సంతోషంగా ఉండాలి…ప్ర‌పంచంతో కొనియాడ‌బ‌డాలి…అనుకుంటే వాడు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పండి. మీ ద‌గ్గ‌ర స‌మాధానం లేక‌పోతే స‌మాధానం దొరికే చోటు చూపించండి. ఇక్క‌డ మీరో విష‌యం గ‌మ‌నించాలి. మ‌న ముందు చెప్పుకున్న బుద్ధుడు, ఏసుక్రీస్తు, మ‌హాత్మాగాంధీ, పూలే వంటి మ‌హా వ్య‌క్తుల త‌ల్లిదండ్రులు ఎప్పుడూ సంతోషంగా లేరు. వాళ్లు ఎంచుకున్న దారిలో వాళ్లు వెళ్లారు. ఈ ప్ర‌పంచాన్ని మార్చారు. ఈ ప్ర‌పంచంతో కీర్తించ‌బ‌డ్డారు. ఈ విష‌యాన్ని ప్ర‌తీ త‌ల్లిదండ్రులు గుర్తించాలి.

 

 

మ‌న అహాన్ని మ‌న‌లోనే దాచుకుందాం!

 

ఘ‌ర్ష‌ణ అనేది ఎప్పుడూ అవ‌స‌ర‌మైన చెడును చేస్తుంది. పిల్ల‌ల పెంప‌కంలో ఈ మాట అతికిన‌ట్టు స‌రిపోతుంది. పిల్ల‌ల తెలివితేట‌ల‌కు, వాళ్ల ప్ర‌శ్న‌ల‌కు హ‌ద్దులు గీయ‌కండి. కొన్ని విష‌యాల్లో వాళ్లు మీకంటే తెలివైన వాళ్లుగా ఆలోచిస్తుంటే వాళ్ల‌ను ప్రోత్సాహించాలి. మీ పిల్ల‌లు మీ కంటే బ‌ల‌వంతులుగా, తెలివైన వాళ్లుగా మారుతున్నారంటే మీరు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. అభ‌ద్ర‌త‌భావంతో కొట్టుమిట్టాడాల్సిన అవ‌స‌రం లేదు. స‌మాజం మారుతోంది. టెక్నాల‌జీ మారుతోంది. మ‌నుష్య ప‌రిణామ క్ర‌మంలో మార్పులు వ‌స్తున్నాయి. వీట‌న్నింటిని అర్ధం చేసుకుని మీ కంటే బ‌ల‌వంతులను త‌యారు చేయండి. పిల్ల‌లు మీకంటే బ‌ల‌వంతులు, తెలివైన వారిగా మారితే మీ మాట విన‌రు అన్న అభ‌ద్ర‌త‌కు, అనుమానానికి తావే లేదు. ప్రేమ‌, స్వేచ్ఛ అనే రెండు క‌ళ్లేల‌తో వాళ్ల‌ను మీరు ఎప్పుడూ మీ ఆధీనంలోనే ఉంచుకుంటారు. మీరు సంతోషంగా లేకున్నా మీ పిల్ల‌ల సంతోషం కోసం వాళ్ల‌ ఆశ‌ల‌కు, ఆకాంక్ష‌ల‌కు ఇంధ‌నంగా మారండి. స‌రికొత్త స‌మాజం, స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌కు దోహ‌దం చేస్తూ నేటిత‌రం మంచి త‌ల్లిదండ్రులుగా మిమ్మ‌ల్ని మీరు మ‌లుచుకోండి.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేసిన‌వారు)