బెస్ట్ ప‌ర్స‌న్ Vs రైట్ ప‌ర్స‌న్!!

ఏదైనా ఒక వ్య‌వస్థ కానీయండి..సంస్థ కానీయండి..అది అత్యుత్త‌మ ఫ‌లితాలు సాధించాలంటే స‌మ‌ర్ధులైన వ్య‌క్తులు కావాల్సిందే. లేకుంటే ఆ సంస్థ మ‌నుగ‌డ ప్ర‌మాదంలో ప‌డుతుంది. ఒక వ్య‌వ‌స్థ‌ను నిర్మించాలంటే నిర్మించాలంటే దాన్ని విజ‌య‌వంతంగా న‌డిపించాలంటే ముందుగా స‌మ‌ర్ధుల‌ను ఎంపిక చేసుకోవ‌డ‌మే చాలా కీల‌క‌మైన విష‌యం. అయితే స‌రిగ్గా ఇక్క‌డే ఒక ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. అదేంటంటే రైట్ ప‌ర్స‌న్ ను ఎంపిక చేసుకోవాలా? లేక బెస్ట్ ప‌ర్స‌న్ ను ఎంపిక చేసుకోవాలా? మాన‌వ వ‌న‌రులు ఎంపికలో ఇది చాలా కీల‌క‌మైన విష‌యం. ఈ విష‌యంలో తీసుకునే నిర్ణ‌యం ఆధారంగానే సంస్థ భ‌విష్య‌త్ ఆధారప‌డి ఉంటుంది. స‌మ‌ర్ధుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ‘కెరీర్ టై్మ్స్’ ప్ర‌త్యేక క‌థ‌నం.

 

స‌క్సెస్ కు స‌ర్కిల్ కు సంబంధం ఉంది!

 

ఒక ప్ర‌ముఖ ర‌చ‌యిత చెప్పిన‌ట్టు నువ్వు ఇప్ప‌టికీ స‌క్సెస్ సాధించలేక‌పోతున్నావు అంటే ఒక్క‌సారి నీ చుట్టూ ఉన్న స‌ర్కిల్ ను ఒక్క‌సారి స‌రిచూసుకోవాల్సిందే. మ‌న చుట్టూ ఉన్న స‌ర్కిల్ మాత్ర‌మే మ‌న సక్సెస్ ను డిసైడ్ చేస్తుంది. విజ‌యం మిమ్మ‌ల్ని వ‌రించ‌డం లేదు అంటే క‌చ్చితంగా స‌ర్కిల్ ను మార్చాల్సిందే. స‌ర్కిల్ అంటే వేరే ఏమీ కాదు. నీ చుట్టూ రైట్ పీపుల్ ఉండేలా చూసుకోవ‌డ‌మే. స‌ర్కిల్ అంటే స్నేహితులు, స‌న్నిహితులే కాదు మీ కింద ప‌నిచేసే ఉద్యోగులు కూడా రైట్ ప‌ర్స‌న్ అయి ఉండాలి. రైట్ ప‌ర్స‌న్ నీ ప‌క్క‌న ఉన్న‌ప్పుడు ఆల‌స్య‌మైనా నీకు విజ‌యం వ‌చ్చి తీరుతుంది. నిరంత‌రం నీ ఉన్న‌తిని కోరుకుని అవ‌స‌ర‌మైన‌ప్పుడు నిన్ను హెచ్చ‌రించే రైట్ ప‌ర్స‌న్ వ‌ల‌న వ్య‌క్తికి వ్య‌వ‌స్థ‌కు మేలు జ‌రుగుతుంది.

 

బెస్ట్ ప‌ర్స‌న్స్ కు రైట్ ప‌ర్స‌న్స్ తేడా ఏంటి?

 

మనం ముందుగా చెప్పుకున్న‌ట్టు మానవ వ‌న‌రులు ఎంపిక‌లో ఇది ఎప్ప‌టికీ చాలా క్లిష్ట‌మైన ప్ర‌శ్నే. బెస్ట్ ప‌ర్స‌న్ అంటే పూర్తి స్థాయిలో నైపుణ్యం క‌లిగి ఉండి ఏ ప‌నిని ఎప్పుడు చేయాలో క‌చ్చితంగా తెలిసిన వాడే బెస్ట్ ప‌ర్స‌న్. అయితే బెస్ట్ ప‌ర్స‌న్ క‌దా మన ఛాయిస్ కావాల్సింది? ఇక రైట్ ప‌ర్స‌న్ అవ‌స‌రం ఏముంది? అన్న ప్ర‌శ్న ఉద‌యించ‌వ‌చ్చు. కానీ దీర్ఘ‌కాలానికి రైట్ ప‌ర్స‌న్ మాత్ర‌మే సంస్థ‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చ‌గ‌లుగుతాడు. ఎందుకంటే బెస్ట్ ప‌ర్స‌న్ ఎప్పుడూ ఒక సంస్థలో, ఒకే ప‌నిని విశ్వాసంగా చేసేందుకు సిద్థంగా ఉండ‌డు. వివ‌రంగా చెప్పాలంటే బెస్ట్ ప‌ర్స‌న్స్ కు స్థిర‌త్వం ఉండ‌దు. అది వాళ్ల‌కు అనివార్య‌త కూడా కావ‌చ్చు. అదే రైట్ ప‌ర్సన్స్ కు అంత నైపుణ్యం ఉండ‌క‌పోవచ్చు. కానీ న‌మ్మి ప‌నిని అప్ప‌గిస్తే క‌ష్ట‌ప‌డి దాన్ని సాధించేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తాడు.

 

రైట్ ప‌ర్స‌న్ ను గుర్తించ‌డ‌మే విజ‌యం!

 

బెస్ట్ ప‌ర్స‌న్ ఎవరికైనా హైరింగ్ ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. కానీ రైట్ ప‌ర్స‌న్ హైరింగ్ ద్వారా దొరికేందుకు వీలు లేదు. రైట్ ప‌ర్స‌న్ అనేవాడు వ్య‌క్తిగ‌త సంబంధాల ద్వారా మాత్ర‌మే మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తాడు. స‌రైన రైట్ ప‌ర్స‌న్ ను గుర్తించి అత‌న్ని స‌రైన ప్లేస్ లో డిప్యూట్ చేయ‌గ‌లిగితే సంస్థ‌కు తిరుగుండ‌దు. స్వాతంత్రోద్య‌మ కాలంలోనూ గాంధీజీ ఇదే ర‌క‌మైన విధానాన్ని అవ‌లంభించి స్వాత్రంత్రాన్ని సాధించ‌గ‌లిగాడు. కీల‌క‌మైన స్థానాల్లో రైట్ ప‌ర్స‌న్స్ కు నియ‌మించి వారి కింద బెస్ట్ ప‌ర్స‌న్ ను నియ‌మించ‌డం వ‌ల‌న అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. ఇదే సూత్రాన్ని వ్యాపారంలో కూడా అవ‌లంభిస్తే అవే విజ‌య‌వంత‌మైన ఫ‌లితాలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది.

 

స్థిరంగా ఉన్న‌దానికి బ‌ల‌మెక్కువ‌!

 

రైట్ ప‌ర్స‌న్ ఎంపిక చేసుకోవ‌డం అనేది ఒక్క వ్యాపార సంస్థ‌ల‌కే కాదు, వ్య‌వ‌స్థ‌ల‌కు, కుటుంటాల‌కు కూడా అది చాలా కీల‌కమైన విష‌యం. ఒక రైట్ ప‌ర్స‌న్ ఉన్న‌ప్పుడు ఆ కుటుంబం, ఆ వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా సాగిపోతాయి. ఎందుకంటే అక్క‌డ స్థిర‌త్వం ఉంటుంది. ఏదైనా స్థిరంగా ఉన్న‌దానికి ఉన్న విలువ ప‌రుగులు తీసే దానికి ఎప్ప‌టికీ ఉండ‌దు. మాన‌వ వ‌న‌రులు ఎంపిక‌కు ఈ సూత్రాన్ని అన్వ‌యించుకుని రైట్ ప‌ర్స‌న్ ను ఎంపిక చేసుకోగ‌లిగితే అది సంస్థ విజయానికి దోహ‌ద‌ప‌డుతుంది.