ఇస్తూ ఉంటే మీకు వ‌స్తూ ఉండేది ఏంటో తెలుసా??

 

ఈ ప్ర‌పంచంలో క‌ష్ట‌మైన విష‌యాల్లో సంపాద‌న ఒక‌టి. అది డబ్బు కావ‌చ్చు కీర్తి కావ‌చ్చు.. వాటిని సంపాదించడం ఆ సంపాదించిన వాటిని ప‌దిలప‌ర్చుకోవ‌డం అంత సులువైన‌ విష‌యం కాదు. చిన్నపాటి పొర‌పాటు వ‌ల‌నో లేక వ్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ‌ను కోల్పోవ‌డం వ‌ల‌నో ఇవ‌న్నీ స్వ‌ల్ప‌కాలంలోనే మ‌నం నుంచి దూరం కావ‌చ్చు. అయితే త‌న ద‌గ్గ‌ర ఉన్న‌దాన్ని ప‌దిమందికి పంచే సేవా దృక్ఫ‌ధం ఉన్న‌వారే శాశ్వ‌త ఐశ్చ‌ర్య‌వంతులుగా మిగిలిపోతారు. ఎంత ఇస్తే అంత తిరిగి వ‌స్తుందన్న ప్ర‌కృతి సూత్రాన్ని అవ‌గ‌తం చేసుకుని ఆచ‌ర‌ణ‌లో పెడితే అత్యద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. కానీ మ‌నుష్యుల‌ను వాడుకుంటూ , వ‌స్తువుల‌ను ప్రేమిస్తూ సృష్టి ధ‌ర్మానికి, ప్రాథ‌మిక విలువ‌ల‌కు తిలోద‌కాలిస్తూ స్వార్ధం, డ‌బ్బు సంపాద‌నే ప్ర‌ధాన వ్యాప‌కంగా చేసుకున్న నేటి స‌మాజంలో తిరిగి ఇవ్వ‌డం అన్న‌ది ప‌రిమితంగానే క‌నిపిస్తోంది. వ్య‌క్తుల‌తో పాటు సంస్థ‌లకు ఉండాల్సిన సామాజిక బాధ్య‌త‌లు, విలువ‌ల‌పై ‘కెరీర్ టైమ్స్’ అందిస్తున్న ప్ర‌త్యేక క‌థనం.

 

 

నిన్ను పెంచిన స‌మాజానికి తిరిగి నువ్వేమిస్తున్నావ్ ?

 

బిల్ గేట్స్ , మార్క్ జుకెర్ బ‌ర్గ్ వంటి అప‌ర కుబేరులు స‌మాజ సేవ కోసం ఎన్నో మిలియ‌న్ డాల‌ర్ల‌ను వెచ్చిస్తున్నారు. పేద దేశాల్లో వివిధ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం త‌మ ఫౌండేష‌న్ ల ద్వారా కృషి చేస్తున్నారు. అలాగే మ‌నం దేశంలో టాటా , బిర్లా, ఇన్ఫోసిస్ వంటి కార్పోరేట్ సంస్థ‌లు కార్పోరేట్ సామాజిక బాధ్య‌త‌లో భాగంగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాయి. వీళ్లు ఎందుకు ఇంత భారీ మొత్తాల‌ను సామాజిక సేవ‌కు ఖ‌ర్చుపెడుతున్నారు? తూతూమంత్రంగా కాకుండా ఏదో నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని కాకుండా మ‌నం పైన చెప్పుకున్న సంస్థ‌లు ఒక స్థిర‌మైన ల‌క్ష్యంతో, దృక్ఫ‌ధంతో ఈ సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నాయి. ఎందుకు? ఎందుకంటే..త‌మ‌ను అంత వాళ్ల‌ను చేసిన స‌మాజానికి తిరిగి ఇవ్వ‌డం వ‌ల‌న వాళ్ల సంప‌ద మ‌రింత వృద్ధి చెందుతుంది అన్న ప్రాథ‌మిక ప్ర‌కృతి సూత్రం వాళ్ల‌కు తెలుసు కాబ‌ట్టి. వ్య‌క్తులైనా , సంస్థ‌లైనా ముందుగా తెలుసుకోవాల్సిన విష‌య‌మేమిటంటే త‌మ ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన స‌మాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడు మాత్ర‌మే వాళ్లు సంపాదించిన సంప‌ద‌కు సార్ధ‌క‌త చేకూరుతుంది. వాళ్ల సంప‌ద మ‌రింతగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే నీ అభివృద్ధిలో, సంప‌ద‌లో స‌మాజానికి కూడా వాటా ఉంది. ఆ వాటాను నువ్వు న్యాయ‌బ‌ద్ధంగా తిరిగి చెల్లిస్తే నీ బాధ్య‌త నెర‌వేరుతుంది. మాన‌సిక సంతృప్తి ల‌భిస్తుంది.

 

 

స్ఫూర్తినిచ్చే వ్య‌క్తుల‌కు కొదువ లేదు!

 

మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌దాన్ని ఎటువంటి లాభం ఆశించ‌కుండా, నిస్వార్ధంగా ఎదుటివాళ్ల‌కు ఇవ్వ‌డం అంటే మామూలు విష‌యం కాదు. వ్య‌క్తిగ‌త స్వార్ధం పెరిగిపోతున్న స‌మాజంలో అటువంటి ల‌క్ష‌ణాలు ఉన్న మ‌నుష్యులు అరుదుగానే క‌నిపిస్తారు. కానీ ఉన్న కొంద‌రు ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కంగా నిలిచి క‌నుమ‌రుగవుతున్న సామాజిక సేవ‌కు చిరునామాగా నిలుస్తారు. అటువంటి వ్య‌క్తే ల‌య‌న్ విజ‌య్ కుమార్ గారు. నిజ‌మైన సంపాద‌న అంటే స‌మాజానికి చేత‌నైనంత సాయం చేయ‌డమే అని న‌మ్మే నిస్వార్ధ‌ప‌రులు విజ‌య్ కుమార్ గారు. కోట్ల రూపాయ‌ల విలువ చేసే స్థ‌లాన్ని మార్కెట్ యార్డుకు ఉచితంగా ఇచ్చారు. తాను సంపాదించిన దాంట్లో అధిక భాగాన్ని ప్ర‌తీ రోజూ ఏదో ఒక సాయం కోసం దానం కోసం ఒక మంచి ప‌ని కోసం వినియోగిస్తూ ఉంటారు. ఇలా ఇస్తూ పోతే ఎలా? అన్న స్నేహితుల‌తో , శ్రేయోభిలాషుల‌తో ఆయ‌న ఒక‌టే మాట చెపుతూ ఉంటారు. నువ్వు ఎంత ఇస్తే అంత తిరిగి వ‌స్తుంది. క‌ష్ట‌ప‌డి సంపాదించాలి.ఆ సంపాదించిన మొత్తంలో మ‌న వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు కావ‌ల్సినంత ఉంచుకుని మిగిలిన దాన్ని తిరిగి మంచి ప‌నుల‌కు ఖ‌ర్చు చేయాలి. అప్పుడే ఎప్పుడూ ధ‌న‌వంతులుగా ఉంటాం. అని. మంచి మ‌న‌స్సుతో , నిస్వార్ధంగా ఇచ్చిన దానం, చేసిన సాయం ఎక్క‌డికీ పోవు. మ‌ళ్లీ తిరిగి మీ వ‌ద్ద‌కే చేరుతాయి. ఎందుకుంటే మీరు మ‌ళ్లీ వేరొక‌రికి స‌హాయం చేస్తార‌ని. అది ప్ర‌కృతి సూత్రం. ఇందులో ఎటువంటి మార్పు లేదు.

 

మ‌నుష్యులు ఉన్న‌ది ప్రేమించేందుకు..వాడుకునేందుకు కాదు!

 

ఒక యువ‌కుడు పొట్ట చేత‌ప‌ట్టుకుని బ‌తుకు తెరువు కోసం మ‌హా న‌గ‌రానికి వ‌ల‌స వ‌చ్చాడు. రోడ్డు ప‌క్క‌న చిన్న టీ దుకాణం ప్రారంభించి జీవ‌నోపాధిని పొంద‌డం ప్రారంభించాడు. ఒక మ‌ధ్య వ‌య‌స్కుడు వ‌చ్చి నీతో పాటు నేను కూడా ప‌నిచేస్తా ఎంతో కొంత ఇవ్వు చాలు అన్నాడు. దానికి స‌రేన‌న్న యువ‌కుడు అత‌న్ని కూడా త‌న‌తో పాటు ఉంచుకున్నాడు. శుభ్ర‌త‌ను, నాణ్య‌త‌ను పాటించడం వ‌ల‌న కొద్ది కాలంలోనే అత‌ని టీ షాప్ కు మంచి పేరు వ‌చ్చింది. క‌స్ట‌మ‌ర్లు కూడా పెరిగారు. దాంతో ఆదాయ‌మూ పెరిగింది. త‌ర్వాత ఆ షాప్ కు మెల్ల‌గా విస్త‌రించి హోట‌ల్ గా మార్చాడు. అందులోనూ మంచి లాభాలు వ‌చ్చాయి. అలా ఒక ప‌ది సంవ‌త్సరాల కాలంలోనే అత‌ను ఒక ఫైవ్ స్టార్ హోట‌ల్ కు అధిప‌తిగా మారిపోయాడు. అత‌ని ఎదుగుద‌ల‌లోని ప్రతీ మ‌లుపులోనూ అత‌నిపాటు ఆ మ‌ధ్య వ‌య‌స్కుడు కూడా ఉన్నాడు. ఫైవ్ స్టార్ హోట‌ల్ అధిప‌తి అయ్యాక ఆ యువ‌కుడు ఆ ముసలివాడ్ని పిలిచి ఒక బ్రీఫ్ కేస్ నిండా డ‌బ్బు ఇచ్చి ఎక్క‌డికైనా వెళ్లి సుఖంగా ఉండు అని చెప్పాడు. అత‌ని మాట‌ల‌కు చిన్న న‌వ్వు న‌వ్విన ఆ ముస‌లివాడు ఆ బ్రీఫ్ కేస్ ను అక్క‌డే వ‌ద‌లి వెళ్లిపోయాడు. ముస‌లివాడి వైఖ‌రి ఆ యువ‌కుడికి బొత్తిగా అంతుబ‌ట్ట‌లేదు. అదే విష‌యాన్ని త‌న త‌ల్లితో చ‌ర్చించాడు. అత‌ను ఎందుకు అంత పెద్ద మొత్తంలో ఉన్న డ‌బ్బును కాద‌న్నాడు. ఏమైనా పిచ్చివాడా అని అడిగాడు. దానికి అత‌ని త‌ల్లి బాబూ ‘అత‌ను నీ ద‌గ్గ‌ర ఏదో ఆశించి నీతో పాటు క‌లిసి ప‌నిచేయ‌లేదు. నీతో పాటు పాటు క‌లిసి ఉండాల‌నుకున్నాడు. నీపై వాత్స‌ల్యం, ప్రేమ‌ను పెంచుకున్నాడు. అంతేకానీ నువ్వు ఇచ్చే డ‌బ్బుకు ఆశ‌ప‌డి కాదు. ఈ ముసలిత‌నంలో అత‌నికి కావాల్సింది ప్రేమ‌గా చూసే మ‌నుష్యులు త‌ప్ప డ‌బ్బులు కాదు. ఆ డ‌బ్బులు అత‌ను ఏం చేసుకుంటాడు. నువ్వు చాలా పొర‌పాటు చేసావు. ఒక వ‌స్తువులాగే మ‌నుష్యుల‌ను కూడా వాడుకున్నావు. మ‌నుష్యుల‌ను ప్రేమించాలి. కానీ అవ‌స‌రం తీరాక ప‌క్క‌న పెట్టకూడదు’. అని చెప్పింది. ఈ క‌థ‌లోని యువ‌కుని లాగే ఇప్పుడు చాలా మంది మ‌నుష్యులు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వాడి పారేయాల్సిన సెల్ ఫోన్ ను జేబులో భ‌ద్రంగా దాచుకుని ప్రేమిస్తున్నారు. ప్రాణంగా ప్రేమించాల్సిన మ‌నుష్యుల‌ను విదిలించి కొడుతున్నారు. ఇటువంటి ప్ర‌వ‌ర్త‌నే ఇప్పుడు సామాజిక‌, మాన‌సిక అశాంతికి దారితీస్తోంది.

 

 

భ‌గ‌వంతుడు నీలోనే ఉన్నాడు..న‌మ్మ‌కంతో ప‌ని ప్రారంభించు!

 

నువ్వు నిస్వార్ధంగా నువ్వు సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని తిరిగి స‌మాజానికి ఇవ్వాల‌నుకున్న‌ప్పుడు నీకు అంత‌కు రెండింత‌లు సంప‌ద వ‌స్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భ‌గ‌వంతుడు అటువంటి నిస్వార్ధ సేవ‌ను కొన‌సాగించేందుకు మీకు స‌హాయం చేస్తాడు. మ‌హేష్ బాబు ఖ‌లేజ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘దేవుడు ఎక్క‌డో ఉండ‌డు. మ‌న‌లోనే ఉంటాడు. సాటి మ‌నిషికి స‌హాయం చేస్తామ‌ని మీరు గ‌ట్టిగా, మ‌న‌స్ఫూర్తిగా అనుకోగానే ట‌క్కున బ‌య‌ట‌కు వ‌స్తాడు’. ఇందులో సందేహం లేదు. ల‌య‌న్ విజ‌య్ కుమార్ లాంటి సేవానిర‌తి క‌ల‌వారు చెప్పేది కూడా ఇదే. నిస్వార్ధంగా సేవ చేయాలి అనుకున్న‌ప్పుడు మీకు సంప‌ద వ‌స్తూనే ఉంటుంది. అది ఎక్క‌డికీ పోదు అని. న‌మ్మ‌కంతో ఒక ప‌ని ప్రారంభిస్తే నువ్వు స‌గం చేస్తే చాలు మిగ‌తా స‌గం భ‌గ‌వంతుడే పూర్తి చేస్తాడు. ప్ర‌కృతే నెర‌వేరుస్తుంది. కావాల్సింది న‌మ్మ‌కం మాత్ర‌మే. నువ్వు ప‌క్క‌వాడికి ఏదైనా ఇవ్వాల‌నుకుంటే బాధ‌ప‌డాల్సిన అవ‌సర‌మే లేదు. అంత‌కు రెండింత‌లు నీ వ‌ద్ద‌కు వ‌చ్చి చేరుతుంది. ఇందులో సందేహమే లేదు.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

ట్యూట‌ర్స్ ప్రైడ్ సంస్థ వారు చేస్తున్న సామాజిక కార్య‌క్ర‌మాలు

 

 

 

 

నిన్ను నువ్వు తెలుసుకోవ‌డ‌మే విజ‌యం!

ఎప్పుడూ నెమ్మ‌దిగా, సైలెంట్ గా ఉండే ఒక వ్య‌క్తి అక‌స్మాత్తుగా కోపంతో ఊగిపోవ‌డాన్ని మీరు చాలా సంద‌ర్భాల్లో చూసి ఉంటారు. అంత సావ‌ధానంగా మ‌సులుకునే వ్య‌క్తి ఈ విధంగా ప్ర‌వ‌ర్తించ‌గానే మ‌నం సాధారణంగా ఒక మాట అంటుంటాం. ‘వీడి లోని అస‌లు మ‌నిషి నిద్ర లేచాడు. ఇప్పుడు మ‌నం చూస్తున్నది నిజంగా వీడినేనా?’  అవ‌త‌లి వాళ్ల కోపం మితిమీరిపోయిన‌ప్పుడు ఇదీ వీడి అస‌లైన స్వ‌భావం అంటూ విమ‌ర్శలు కూడా గుప్పిస్తాం. మ‌నం చూస్తున్న దృష్టి కోణం నుంచి మ‌నం ప్ర‌తీ ఒక్క‌రిపై ఒక్కో ర‌క‌మైన అభిప్రాయాన్ని ఏర్ప‌రుచుకుంటూ ఉంటాం. అదే స‌మ‌యంలో మ‌న‌కు సంబంధించి, మ‌న ప్ర‌వ‌ర్త‌నకు సంబందించి ఒక స్వీయ గుర్తింపును కూడా ఏర్ప‌రుచుకుంటాం. మెల్ల‌గా అన్ని విష‌యాల్లో మ‌న‌మే చాలా గొప్ప‌వాళ్లం. మ‌నం చేసిన‌వ‌న్నీ ఒప్పులే. మ‌నం త‌ప్పు చేయ‌డానికి చాలా ఫ‌లానా విష‌యం కార‌ణం అంటూ మ‌న‌ల్ని మ‌నం స‌మ‌ర్ధించుకుంటూ ఉంటాం. అదే స‌మ‌యంలో ఇత‌రులు త‌ప్పుల‌ను, లోపాల‌ను ఎత్తిచూపుతూ వాళ్ల‌ను త‌క్కువ చేయ‌డానికి, నింద‌లు మోప‌డానికి అల‌వాటు ప‌డ‌తాం. ఎంత‌సేపు ఇత‌రుల‌ను నిందించ‌డంలో మునిగిపోయి మ‌న‌లోని లోపాల‌ను, పొర‌పాట్ల‌ను గుర్తించ‌డం పూర్తిగా మానుకుంటాం. స‌రిగ్గా ఇక్క‌డే వ్య‌క్తిత్వ నిర్మాణం, వికాసం దెబ్బ‌తింటాయి. మ‌నిషి సంబంధాల ప‌రంగా, విలువ‌ల ప‌రంగా ప‌త‌నం కావ‌డం మొద‌ల‌వుతుంది.

అంద‌రూ మీలా ఎందుకు ఉంటారు?

 

ఈ ప్ర‌పంచంలో ఒక్కొక్క‌రు ఒక్కో ర‌క‌మైన వైఖ‌రిని, వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటారు.  పుట్టి పెరిగిన సామాజిక ప‌రిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, విలువ‌లు, నేప‌థ్యం ఆధారంగా ఒక మ‌నిషి వ్య‌క్తిత్వం నిర్మించ‌బ‌డుతుంది.  ఒక మనిషి ప్ర‌వ‌ర్త‌న‌, వ్య‌క్తిత్వం మ‌రో మ‌నిషిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ పోలి ఉండ‌దు. ఒకే ఇంట్లో పెరిగిన‌ప్ప‌టికీ వారి వారి అనుభ‌వాలు, ఆలోచ‌న‌లు బ‌ట్టి కుటుంబ సభ్యులే విభిన్నమైన ఆలోచ‌నల‌ను, వ్యక్తిత్వాన్ని క‌లిగి ఉంటారు. మ‌నిషికి మ‌నిషికి మ‌ధ్య ఆలోచ‌న‌ల్లో సారూప్య‌తులు ఉంటాయి కానీ అచ్చుగుద్దిన‌ట్టు ఒకే ర‌క‌మైన ఆలోచ‌న‌లు ఉండ‌టం అసాధ్యం అనే చెప్పాలి. కాబ‌ట్టి అంద‌రూ మీలా ఆలోచించాలి..మీలా ఉండాలి..అన్న ఒంటెత్తు పోక‌డ‌ల‌ను వ‌దిలేయండి. మీకు ఏ విధంగా అయితే ఒక ప్ర‌త్యేకమైన వ్య‌క్తిత్వం ఉందో అలానే మిగిలిన వారికి కూడా ఒక ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం ఉంటుంద‌ని గుర్తించండి. ఎంత‌సేపూ అవ‌త‌లి వ్య‌క్తుల‌ను మీ దారిలోకి తెచ్చుకోవడానికి ప్ర‌య‌త్నించ‌డం  అన్న‌ది మీ స‌మ‌యాన్ని వృధా చేస్తుంది త‌ప్ప మ‌రేమీ లేదు. ఒక‌రికి ఒక‌రు గౌర‌వంఇచ్చుకుని అపార్ధాలకు, అహాల‌కు తావులేకుండా స‌ర్దుకుపోవ‌డం అన్న‌ది జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణం చేయ‌గ‌ల‌రు. అది స్నేహితులైనా, భార్యాభ‌ర్త‌లైనా, కుటుంబ స‌భ్యులైనా.

 

‘నేను’ అనే దాన్ని మీ మ‌న‌స్సులోంచి తీసేయండి! 

 

మీరు గొప్ప ఉపాధ్యాయుల‌ను, నాయ‌కుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే వాళ్లు ఎప్పుడు ‘నేను’ అనే మాట‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప‌యోగించ‌రు. ‘నేను’ అనే మాట మీలో అహంభావాన్ని క‌లిగిస్తుంది. అహంభావం మ‌నిషిని నైతికంగా దెబ్బ‌తీసి ప‌త‌నం దిశ‌గా న‌డిపిస్తుంది. ‘నేను’ అన్న‌దాన్ని మ‌న ఆలోచ‌న‌ల్లోంచి పూర్తిగా తొలిగించ‌డం కాస్త‌ క‌ష్ట‌మైన ప‌నే. అయినా ప్ర‌య‌త్నం చేయాలి. చ‌దువుకునే చోట‌, ప‌నిచేసే చోట, ప‌నిచేయించే చోట ఎక్క‌డైనా కానీయండి ‘నేను’ అనే మాట‌ను వాడ‌టంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. నిజంగా మీరు ఒక్క‌రే బాగా క‌ష్ట‌ప‌డినప్ప‌టికీ మ‌నం క‌ష్ట‌ప‌డ‌టం వ‌ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని చెప్పండి. నేను అనే మాట అపార్ధాల‌కు, అపోహ‌ల‌కు దారి తీస్తుంది. సంబంధాల‌ను మెరుగుప‌ర్చుకోవాల‌న్నా, వ్యక్తుల‌కు గౌర‌వించాల‌న్నా ‘నేను’ అన్న ప‌దాన్ని మీ డిక్ష‌న‌రీ నుంచి పూర్తిగా తొలిగించి ఆ స్థానంలో ‘మేము’ అన్న ప‌దాన్ని చేర్చండి.

మిమ్మ‌ల్ని మీరు స‌రిదిద్దుకోండి! 

 

ప్ర‌తీ మ‌నిషిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. సంపూర్ణ‌మైన మ‌నిషి అంటూ ఎవ‌రూ ఉండ‌రు. అయితే త‌న‌లోని లోపాల‌ను గుర్తించ‌డం, వాటిని స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మే నిజ‌మైన విజ‌యం. ‘నాకు అన్నీ తెలుసు…నేను చేసిన ప‌నికి తిరుగుండ‌దు.’ అని అనుకోవ‌డం పొర‌పాటు. ఆత్మ‌విశ్వాసానికి, అతి విశ్వాసానికి వెంట్రుక‌వాసి తేడా మాత్ర‌మే ఉంటుంది. ఆత్మ‌విశ్వాసం క‌చ్చితంగా ఉండాల్సిందే అయితే అది అతి విశ్వాసంగా మార‌కుండా చూసుకోవాలి. సంబంధాల విష‌యంలోనూ, ప్ర‌వ‌ర్త‌న విష‌యంలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు స్వీయ స‌మీక్ష చేసుకోవాలి. నిజాయితీగా స‌మీక్ష చేసుకున్న‌ప్పుడు మ‌న‌లోని లోపాలు, చేసిన పొర‌పాట్లు క‌చ్చితంగా మీ దృష్టికి వ‌స్తాయి. త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం కాబ‌ట్టి దాన్ని అక్క‌డే వ‌దిలేసి అటువంటి త‌ప్పులు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూసుకొండి. కెరీర్ లోనూ, కుటుంబంలోనూ సంబంధాలు, గౌర‌వం ఇచ్చుపుచ్చుకోవ‌డంలో త‌ప్ప‌నిస‌రిగా స్వీయ స‌మీక్ష చేసుకోవాలి. మీదే త‌ప్పు ఉంద‌ని తేలితే లేదా ఎటువంటి భేజ‌షాల‌కు పోకుండా త‌ప్పును స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నం చేయండి. అవ‌స‌ర‌మైతే క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు కూడా వెనుకాడ‌కండి. క్ష‌మాప‌ణ చెప్ప‌డం అంటే మిమ్మ‌ల్ని మీరు త‌గ్గించుకున్న‌ట్టు కాదు మీరు సంబంధాల‌కు అధిక విలువ ఇస్తున్న‌ట్టు.

 

మీ అభిప్రాయాల‌తో ప్ర‌పంచానికి ప‌నిలేదు! 

 

మీరు కొంద‌రు వ్య‌క్తుల‌పై లేదా కొన్ని వ్య‌వస్థ‌ల‌పై ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను  క‌లిగి ఉండ‌టం మంచిదే. కానీ అది మీ ఎదుగుద‌ల‌ను దెబ్బ‌తీయ‌కుండా చూసుకోండి. ఎందుకంటే అభిప్రాయం క‌లిగి ఉండ‌టం వేరు అదే అభిప్రాయాన్ని మిగిలిన వారు కూడా క‌లిగి ఉండాల‌ని అనుకోవ‌డం వేరు. ప్ర‌తీ వ్యక్తికి ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను క‌లిగి ఉంటాడ‌ని గుర్తించ‌డ‌మే నిజ‌మైన విజ‌యం. అంద‌ర్నీ గౌర‌వించిన‌ప్పుడే మీకు గౌర‌వం ల‌భిస్తుంది. మీకు ఉన్న ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఏ ప‌నీ జ‌ర‌గ‌దు. మీదైన వ్య‌వ‌స్థ‌లో అది సాధ్య‌మేమో కానీ విభిన్న మ‌న‌స్త‌త్వాల మ‌నుష్య‌లు ఉన్న ప్ర‌పంచంలో అది అస్స‌లు సాధ్యం కాదు. ఎందుకంటే మీ అభిప్రాయాల‌తో ఏకీభ‌వించ‌ని వాళ్లు కూడా ఇక్క‌డ మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌రు. కాబ‌ట్టి అంద‌రి అభిప్రాయాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను గౌర‌విస్తూ ముందుకు సాగితేనే విజ‌యం మీ ద‌రికి చేరుతుంది. లేకుంటే మాన‌సిక సంఘ‌ర్ష‌ణ త‌ప్ప ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు.