ఇంటర్వ్యూ సరే..’గ్రూప్ డిస్కషన్’ కోసం మీకెంత తెలుసు?

 

ఇటీవలి కాలంలో ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్ అనేది చాలా ముఖ్యమైన విష‍యంగా మారింది. బిజినెస్ స్కూల్స్ ప్రవేశాలతో పాటు ప్రస్తుతం చాలా పెద్ద కంపెనీల్లో ఇంటర్వ్యూల్లో గ్రూప్ డిస్కషన్ ను ఆధారంగా చేసుకునే ప్రవేశాలు కల్పిస్తున్నారు. కేవలం అడకమిక్ , ఇతర విషయాలు చదివి రాత పరీక్షలో విజయం సాధిస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. రాత పరీక్షకు పర్సనల్ ఇంటర్వ్యూకు మధ్య ఉండే గ్రూప్ డిస్కషన్ లో కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. లేకుంటే ఉద్యోగం రావడం కష్టమవుతుంది. అలాగే దేశంలో ప్రముఖ మేనేజ్‌మెంట్ కాలేజీల్లో క్యాట్ ర్యాంక్ వచ్చినా గ్రూప్ డిస్కషన్ లో చూపించే ప్రతిభ ఆధారంగానే సీటు దొరుకుతుంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్ లో రాణించేందుకు విద్యార్ధులు తగినంత కసరత్తు చేయాల్సిందే.

 

 

అసలు గ్రూప్ డిస్కషన్ ఎందుకు?

 

ప్రస్తుతం మార్కెట్లో ఏం జరుగుతుందో, ఏయే విషయాలు ప్రాముఖ్యత వహిస్తున్నాయో విద్యార్ధులకు స్పష్టంగా తెలియాల్సి ఉంది. తెలియడం ఒక్కటే కాదు సదరు విష‍యంపై అభిప్రాయాలు వ్యక్తం చేసే అవగాహనా స్థాయి పెంచుకోవాలి. ఇందులో అభ్యర్ధులకు ఎంత వరకూ విష‍యంపై అవగాహన ఉందో తెలుసుకునేందుకు కంపెనీలు, విద్యా సంస్థలు గ్రూప్ డిస్కషన్స్ ను నిర్వహిస్తున్నాయి. సమకాలీన విషయాలపై అవగాహన ఒక్కటే కాదు అభ్యర్ధికి ఉన్న కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విషయ పరిజ్జానం, సమయస్ఫూర్తి తదితర లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది ఒక్క ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ అభ్యర్ధులకు మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ కార్పోరేట్ సంస్థలు గ్రూప్ డిస్కషన్స్ కు పెద్ద పీట వేస్తున్నాయి.

 

 

గ్రూప్ డిస్కషన్ లో ఏం ఉంటాయి?

 

అసలు గ్రూప్ డిస్కషన్ లో ఫలానా విషయం ఉంటుందని చెప్పేందుకు వీలు లేదు. అప్పటి ట్రెండ్ కు పరిస్థితులను అనుసరించి గ్రూప్ డిస్కషన్ లో ఏ టాపిక్ ను అయినా ఇవ్వొచ్చు. బిజినెస్ స్కూల్స్ లో ప్రవేశాలకు అయితే ప్రధానంగా మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్, బిజినెస్ కాన్సెప్ట్స్ , ఆర్థిక విషయాలు ఇతర విషయాలను అడగొచ్చు. అలా అని మిగతా ఇతర విషయాలను అడగరని కాదు. ఏదైనా అడగొచ్చు . అప్పటికప్పుడు మైండ్ విషయాన్ని ఫ్రేమ్ చేసుకుని సందర్భానుసారంగా సమయస్ఫూర్తిగా మిగిలిన వ్యక్తులతో చర్చ చేయాల్సి ఉంటుంది. ఇక కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగ ఇంటర్వ్యూల్లో రాజకీయాలతో పాటు, సామాజిక సమస్యలు, విద్యా రంగం, సినిమాలు, క్రీడలు, టెక్నాలజీ ఇలా ఏదైనా టాపిక్ రావచ్చు. విభిన్న విషయాలపై అవగాహనను, విషయంపై మీదైన ఆలోచనా విధానాన్ని పెంపోదించుకున్నప్పుడు సాధికారికంగా గ్రూప్ లో డిస్కషన్ ను చేయొచ్చు.

 

 

గ్రూప్ డిస్కషన్ లో ముఖ్యమైనవి ఏంటి?

 

మనం ముందు చెప్పుకున్నట్టు గ్రూప్ డిస్కషన్ లో విజయం సాధించాలంటే సమకాలీన విషయాలు, అంశాలపై పట్టు పెంచుకోవాలి. అయితే కరెంట్ టాపిక్స్ పై మేనేజ్‌మెంట్, బిజినెస్ కాన్సెప్ట్స్ , జనరల్ టాపిక్స్ పై పట్టు ఉంటే మాత్రమే సరిపోదు. గ్రూప్ డిస్కషన్ లో ముఖ్యంగా కావాల్సింది కమ్యూనికేషన్ నైపుణ‌్యం. చెప్పాలనుకున్న విష‍యంగా సూటిగా, సరళంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పగలగాలి. దీంతో పాటు అన్ని సమకాలీన అంశాలపై పట్టు కోసం ప్రతీరోజూ దినపత్రికలు, మ్యాగజైన్లు చదువుతూ ఉండాలి. అలాగే లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. గ్రూప్ లో మిగిలిన అభ్యర్ధుల అభిప్రాయాలతో విభేదాలున్నా డిస్కషన్ సరిగా జరిగేలా వ్యవహరించడం, సందర్భానుసారంగా మాట్లాడటం, ఒకవేళ ఏదైనా వివాదం తలెత్తితే హుందాగా దాన్ని పరిష్కరించడం అన్నీ నాయకత్వ లక్షణాల కిందకే వస్తాయి. ముఖ్యంగా ఇతరులు మాట్లాడాకే మాట్లాడటం. ఎదుటి వారి మాటలకు, అభిప్రాయాలను గౌరవించడం వంటి వాటిని జాగ్రత్తగా గమనిస్తారు. అలాగే మంచి భాషా నైపుణ్యాలు, బాడీ లాంగ్వేజ్, నిటారుగా కూర్చోవడం, మంచి డ్రెస్ సెన్స్, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

 

 

గ్రూప్ డిస్కషన్ లో విజయ సూత్రాలివే!

 

గ్రూప్ డిస్కషన్ లో విజయం సాధించాలంటే ముందుగా ఒత్తిడి లేకుండా చిరునవ్వుతో ఉండటం నేర్చుకోవాలి. హుందాగా ఉంటూ మీ లీడర్‌షిప్ క్వాలిటీని ప్రదర్శించాలి. ఇచ్చిన టాపిక్ ను మాత్రమే మాట్లాడాలి. అదే సమయంలో ఇతరులు అభిప్రాయాలను శ్రద్ధగా విని అప్పుడు మీ సమాధానం, మీ అభిప్రాయం తడబాటు లేకుండా చెప్పాలి. ఉత్సాహంగా , చొరవ చూపుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలి. అయితే అదే సమయంలో గట్టిగా మాట్లాడటం, ఆధిపత్యం కోసం ప్రయత్నించడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం తగదు. ఈ పనులు చేస్తే మీకెంత నాలెడ్జ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నా అవి కొరగాకుండా పోతాయి. కాబట్టి కరెంట్ టాపిక్స్ పై నాలెడ్జ్ ‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కొంచెం సైకాలజీ స్కిల్స్ పెంచుకుంటే గ్రూప్ డిస్కషన్ లో మీదే విజయం.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)