ఆ విషయంలో నిజాయితీగా ఉంటే మీకు ఉద్యోగం వచ్చినట్టే !!

 

ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే ఒక మహా యుద్ధాన్ని గెలవడం లాంటిది. గెలుపుకి ఓటమికి మధ్య చిన్న అంతరం మాత్రమే ఉంటుంది. బలం ఉన్నా పొరపాట్లు చేసినవాళ్లు యుద్ధంలో ఓడిపోయినట్టు ఎన్ని నైపుణ్యాలు ఉన్నా చిన్న చిన్న తప్పులు మీకు ఉద్యోగం రాకుండా అడ్డుపడతాయి. ముఖ్యంగా క్లాస్ రూమ్ సబ్జెక్ట్ లో నెంబర్‌వన్ గా ఉన్న వాళ్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడం మనం చూస్తూనే ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంటర్వ్యూకు, గదిలో కూర్చుని పరీక్ష రాయడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇంటర్వ్యూ అంటే రెండు గంటల్లో మీ నైపుణ్యాలతో పాటు మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఒక ప్రక్రియ. ఇక్కడ నైపుణ్యం మాత్రమే ఉంటే సరిపోదు. నిజాయితీ, వాస్తవికంగా ఆలోచించే లక్షణం ఉన్నవాళ్లే విజేతలుగా నిలుస్తారు. ఉన్నది ఉన్నట్టు.. తెలిసింది తెలిసినట్టు చెప్పడమే మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా హాబీలు, జామ్ ( జస్ట్ ఏ మినిట్ ) రౌండ్ లో నిజాయితీ అనేది అభ్యర్ధులకు బాగా ఉపయోగపడుతుంది.

 

 

తప్పులో కాలేయకండి!

 

చాలా మంది అభ్యర్ధులు హాబీల విషయంలో రెజ్యుమెలో పేర్కొన్న దానికి వాస్తవంగా వాళ్లు ఇష్టపడే దానికి ఎక్కడా పొంతన ఉండదు. ఇటువంటి సందర్భాల్లో ఇంటర్వ్వూలో విఫలం అయ్యే అవకాశాలున్నాయి. ఉదాహరణకు మీరు రెజ్యుమెలో హాబీల దగ్గర బుక్ రీడింగ్ అని రాసారు అనుకోండి. అక్కడ చాలా పర్టిక్యులర్ గా మీరు ఎటువంటి పుస్తకాలు చదువుతారో తప్పనిసరిగా వివరించాలి. బుక్ రీడింగ్ అని చెప్పినప్పుడు రిక్రూటర్ల నుంచి మీకు విభిన్న ప్రశ్నలు ఎదురు కావచ్చు. ప్రముఖ వ్యక్తులు బయోగ్రఫీలు చదివారా? అని అడగొచ్చు. అప్పుడు తెల్లమొఖం వేసే పరిస్థితి ఎదురుకావచ్చు. అందుకే చాలా క్లియర్ గా నేను ఫిక్షన్ పుస్తకాలు మాత్రమే చదువుతాను అని వెల్లడించాలి. అది కూడా మీకు నిజంగా పుస్తకం పఠనం అంటే ఆసక్తి ఉండి మీరు నిజంగా ఫిక్షన్ పుస్తకాలు చదువుతున్నప్పుడు మాత్రమే అలా రాయాలి. లేని విషయాన్ని చెప్పడం వలన రిక్రూటర్స్ అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉండవు. ఎవరో రాసారని కాకుండా నిజంగా మీకు ఆసక్తి అంశాన్నే హాబీలుగా పేర్కొనాలి.

 

 

అబద్దాలు చెపితే అడ్డంగా బుక్కవుతారు!

 

మనం ముందు చెప్పుకున్నట్టు హాబీల విషయంలో అస్సలు అబద్దాలు చెప్పకూడదు. ఒక విష‍యంపై సరైన అవగాహన లేనప్పుడే అది నా హాబీ అని చెప్పడం అంటే మీకు మీరు నష్టం చేసుకుంటున్నట్టే. ఉదాహరణకు సినిమాలు చూడటం నా హాబీ అని చెప్పారనుకొండి. సినిమాకు సంబంధించి అన్ని విషయాలపైన కనీసం ప్రాథమిక అంశాల మీద కాస్త అయినా పట్టు ఉండాలి. ఫలానా దర్శకుడు తీసిన హిట్ సినిమాలు ఏవి అన్న ప్రశ్న ఎదురు కావచ్చు. లేదా ఫలానా నటుడి గురించి వివరాలు అడగొచ్చు. అప్పుడు నీళ్లు నమిలితే ఉపయోగం ఉండదు. మీరు అబద్దం చెప్పారన్న విషయం రిక్రూటర్స్ కు చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది. హాబీ అనేది మీ ఇష్టంలోని గాఢతను తెలియజేయాలి. అది సినిమా కావచ్చు, పోటగ్రఫీ కావచ్చు, క్రికెట్ కావచ్చు మరేదైనా కావచ్చు. అందులోని ప్రాథమిక విషయాలపై ఏం అడిగినా చెప్పే విధంగా ఆ గాఢత ఉండాలి. అంతేకాని నోటికి వచ్చింది చెపితే మీరు ఇంటర్వ్యూలో విజేతలు కాలేరు.

 

 

‘జస్ట్ ఏ మినిట్’ లో కూడా నిజాయితీయే కీలకం!

 

ఇప్పుడు ఇంటర్వ్యూలో జామ్ ( జస్ట్ ఏ మినిట్ ) కూడా చాలా కీలకంగా మారింది. ఒక నిమిషం టైం ఇచ్చి ఒక అంశం ఇచ్చి మాట్లాడమని చెపుతారు. చాలా వరకూ ఇంటర్వ్యూల్లో జామ్ లో మీ రోల్ మోడల్ గురించి చెప్పండి అని అడుగుతారు. మీకు ఎంత మంచి కమ్యూనికేషన్ ఉన్నా ఎంత పద సంపద ఉన్నా మీరు చెప్పినదాంట్లో వాస్తవికత కనిపించకపోతే రిక్రూటర్స్ నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. జామ్ లో చాలా మంది అభ్యర్ధులు రోల్ మోడల్ గురించి చెప్పమనగానే తమ కమ్యూనికేషన్ ను ఉపయోగించి ఒక ప్రముఖ వ్యక్తి గురించి గడాగడా చెప్పేస్తారు. అది పూర్తి తప్పు. రోల్ మోడల్ గురించి చెప్పమన్నప్పుడు ఆ వ్యక్తి మీకు ఏ విధంగా స్ఫూర్తిగా నిలిచాడో అతని నుంచి ఏం నేర్చుకున్నారో మీరు చెప్పగలగాలి. ధైర్యం, ఏదైనా సాధించగలననే నమ్మకం మీకు ఎలా వచ్చిందో చెప్పాలి. అంతేకానీ అతని జీవిత చరిత్రను అప్పజెపితే రిక్రూటర్స్ మీకు ఎందుకు ఉద్యోగం ఇస్తారు? ఎందుకంటే మీ నిజాయితీని పరీక్షించాలనుకుంటున్నవారికి మీరు కృత్రిమ జవాబులు చెపితే ఎలా నచ్చుతుంది?

 

 

మీ నిజాయితీకి అడుగడుగునా పరీక్ష ఎదురవుతుంది!

 

ఇంటర్వ్యూలో ఇదొక్కటే కాదు. మీ నుంచి వాస్తవికతతో కూడిన సమాధానం రాబట్టేందుకు రిక్రూటర్స్ చాలా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అభ్యర్ధుల సమయస్ఫూర్తిని పరీక్షించేందుకు రకరకాల ప్రశ్నలు సంధిస్తారు. అకస్మాత్తుగా వారు వేసే ప్రశ్నలకు తెల్లమొఖం వేసినా గుర్తుకు రావట్లేదు అని చెప్పినా మీరు విఫలమైనట్టే. ఉదాహరణకు మధ్యాహ్నం భోజనం ఏం చేసావు? మీ నాన్న ఈరోజు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? అని అడుగుతారు. వాటికి వెంటనే ఉన్నది ఉన్నట్టు టక్కున సమాధానం చెప్పాలి. మీ ఐక్యూని, ఒక విష‍యంపై మీ నిజాయితీని అంచనా వేసేందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అయోమయానికి గురికాకుండా సమయస్పూర్తిగా సమాధానాలు చెప్పాలి. వాస్తవికతతో నిజాయితీగా ఉంటే ఇంటర్వ్యూలో మీ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)