ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లందుకుంటున్న‌ ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’

 

ప్రముఖ విద్యావేత్త‌, ట్యూట‌ర్స్ ప్రైడ్ అధినేత‌ డా. ఆర్.బి. అంకం గారు రాసిన ‘పిల్లల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కం ఇప్పుడు మార్కెట్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ ఆధునిక యుగంలో అతిపెద్ద స‌వాలుగా మారిన పిల్ల‌ల పెంప‌కంపై డా. అంకం గారు చెప్పిన ప‌రిశోధ‌నాత్మ‌క అంశాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముక్కుసూటిగా చెప్పిన విష‌యాలు ప్రతీ త‌ల్లిదండ్రుల గుండెను తాకుతున్నాయి. సాంకేతిక విప్ల‌వం తెచ్చిన అభివృద్ధి మాన‌వాళి జీవితాల‌ను ఎంత‌గా స‌ర‌ళ‌త‌రం చేసిందో తెలీదు కానీ పిల్ల‌ల పెంప‌కాన్ని మాత్రం అతిపెద్ద స‌వాలుగా మార్చింది. ఇంట‌ర్నెట్ లో పిల్ల‌లు ఏం చూస్తున్నారో, సోష‌ల్ మీడియా ద్వారా ఏం నేర్చుకుంటున్నారో తెలియ‌క తల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లుతున్నారు. మ‌రోవైపు ఉమ్మడి కుటుంబాలు క‌నుమ‌రుగైన దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితుల్లో పిల్ల‌ల‌కు మ‌న సంస్కృతీ, సాంప్ర‌దాయాలు, విలువ‌లు నేర్పించే పెద్ద‌లు క‌రువైపోయారు. దీంతో ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌ గౌర‌వ మ‌ర్యాద‌లు తెలీక ప్ర‌తీ చిన్న విష‌యానికీ టెక్నాల‌జీపై ఆధార‌ప‌డుతున్న నేటి త‌రాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ పుస్త‌కంలో డా.ఆర్.బి. అంకం గారు స‌వివ‌రంగా పొందుప‌ర్చారు.

 

పుస్త‌కంలోని ప్ర‌తీ అక్ష‌రం త‌ల్లిదండ్రుల‌కు, పిల్ల‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే అద్భుత‌మైన విష‌యం కావ‌డంతో విడుద‌లైన త‌క్కువ స‌మ‌యంలోనే అశేష పాఠ‌కాద‌ర‌ణ పొందింది. ఈ పుస్త‌కంలో శాస్త్రీయంగా, విపులంగా చ‌ర్చించిన విష‌యాలు న‌చ్చి మాజీ ఐపీఎస్ అధికారి జే.డీ. ల‌క్ష్మీనారాయ‌ణ గారు అలాగే భార‌తీయ సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ కోసం కృషి చేస్తున్న భార‌తీయం స‌త్య‌వాణి గారు ముందుమాట‌ను రాసారు. పుస్త‌కంలోని అద్భుత విష‌యం పాఠ‌కులంద‌రికీ చేరాల‌న్న ఉద్దేశంలో ప్ర‌ముఖ ప‌బ్లిషింగ్ సంస్థ ఎమెస్కో ఈ పుస్త‌కాన్ని ప్ర‌చురించింది. అలాగే తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది.

 

 

జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న ప్ర‌ముఖ ర‌చయిత‌లు, సాహితీవేత్త‌లు, సాహిత్యాభిమానులు ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌శంసించారు. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కూడా ఈ పుస్త‌కాన్ని , ర‌చ‌యిత డా. ఆర్.బి.అంకం గారిని ప్ర‌త్యేకంగా అభినందించారు.

 

వైభ‌వంగా ఐటాప్ – 2018 అవార్డుల ప్ర‌ధానోత్సవం

 

అత్యుత్త‌మ ఉపాధ్యాయుల‌ను ఘ‌నంగా స‌త్క‌రించే ఐటాప్ 2018 అవార్డుల కార్య‌క్ర‌మం అక్టోబ‌ర్ 2 న హైద‌రాబాద్ లో ఘ‌నంగా జరిగింది. న‌గ‌రంలో హైటెక్ సిటీ స‌మీపంలో ఉన్న ట్రైడెంట్ హోట‌ల్ లో అంగ‌రంగ వైభ‌వంగా ఈ అవార్డుల వేడుకను నిర్వ‌హించారు. హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ట్యూట‌ర్స్ ప్రైడ్ సంస్థ ఈ అవార్డుల కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హరించింది.

 

 

20 కి పైగా విభాగాల్లో అక‌డ‌మిక్, నాన్ అక‌డ‌మిక్ ఉపాధ్యాయుల‌ను ఐటాప్ 2018 అవార్డుల కార్య‌క్ర‌మంలో స‌త్క‌రించారు. ఇందులో ఒక‌రికి మ‌హా మ‌హోపాధ్యాయ అవార్డు, 5 గురుకి జీవిత కాల సాఫ‌ల్య పుర‌స్కారం, 100 మందికి ఐటాప్ అవార్డులు అందుకున్నారు. అలాగే మ‌రో 70 మంది స్పెష‌ల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు.

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐటాప్ 2018 అవార్డు కోసం దాదాపు 700 మంది అక‌డ‌మిక్ , నాన్ అక‌డమిక్ ఉపాధ్యాయులు, కోచ్ లు, ప్రొఫెస‌ర్లు, డీన్ లు, ప్రిన్సిపాల్ లు నామినేష‌న్లు వేసారు. అత్యంత క‌ఠిన‌త‌ర‌మైన ఎంపిక ప్ర‌క్రియ అనంత‌రం జ్యూరీ సభ్యులు అవార్డు గ్ర‌హీత‌ల‌ను ప్ర‌క‌టించారు. నామినేష‌న్ వేసిన ప్ర‌తీ ఒక్క‌రూ కార్యక్ర‌మంలో పాల్గ‌నే వీలుండ‌టంతో దాదాపు 1000 మంది వ‌ర‌కూ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యారు.

 

 

దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి మొద‌లుకుని మెట్రో సిటీల్లో ఉన్న విశ్వ‌విద్యాల‌యాల్లో ప్రొఫెస‌ర్లుగా, డీన్లుగా ప‌నిచేస్తున్న వారు ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవ‌డం విశేషం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వ‌ర్యులు, శ్రీ కొణిజేటి రోశ‌య్య గారు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణా శాస‌న మండ‌లి ఛైర్మ‌న్, స్వామి గౌడ్ గారు, తెలంగాణా బీసీ క‌మీష‌న్ ఛైర్మ‌న్ శ్రీ బీ.సీ. రాములు గారు, సాగునీటి రంగ నిపుణులు, తెలంగాణా వాట‌ర్ రీసోర్సెస్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్. శ్రీ వీర‌మ‌ళ్ల ప్ర‌కాశ్ రావు గారు, తెలుగు విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సెల‌ర్ శ్రీ. ఎస్.వీ. స‌త్య‌నారాయ‌ణ గారు, ప‌లువురు ఐఏఎస్ ఆఫీస‌ర్లు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

 

చిన్న స్థాయి , గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయుల‌ను చిన్న చిన్న వేదిక‌ల‌పై స‌త్క‌రించ‌డం అన్న‌దే మ‌నం ఇప్ప‌టివ‌ర‌కూ చూసాం. కానీ ట్యూట‌ర్స్ ప్రైడ్ వారి స‌హ‌కారంతో ఐటాప్ 2018 లో ఉపాధ్యాయుల‌ను హైద‌రాబాద్ లో ఖ‌రీదైన ట్రైడెంట్ హోట‌ల్ లో వారికి ఒక ఆనంద అనుభూతిని పంచుతూ అందించ‌డం నిజంగా అభినంద‌నీయం.

 

తెలుగు మ‌హాస‌భ‌లతో తెలుగుకు ప‌ట్టిన తెగులు వ‌దిలిపోద్దా??

 

తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డ్డాక తొలిసారిగా హైద‌రాబాద్ లో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వీటిని నిర్వ‌హించేందుకు కేసీఆర్ స‌ర్కార్ స‌మాయుత్త‌మైంది. ఈ నెల 15 నుంచి 19 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు దాదాపు 50 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌నున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ప్ర‌పంచం న‌లుమూలల నుంచి తెలుగు వారు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఈ మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌తో తెలుగు భాష‌కు ఒరిగేదేంటి అన్న‌దే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. యునెస్కో విడుద‌ల చేసే మృత భాష‌ల జాబితాలోకి త్వ‌ర‌లో తెలుగు కూడా చేర‌వ‌చ్చ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించ‌డం తెలుగు భాషాభిమానుల గుండెల్ని పిండేసింది. ఇటాలియ‌న్ ఆఫ్ ద ఈస్ట్ గా ప్ర‌ఖ్యాతి గాంచిన‌ప్ప‌టికీ నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అద్భ‌త‌మైన భాష‌ల్లో తెలుగు ఒక‌టి. అటువంటి తెలుగు భాష ఇప్పుడు మ‌న విద్యా విధానంతో, ఇత‌ర భాష‌ల‌పై మోజుతో ప్ర‌మాదంలో ప‌డింది. ప‌క్క రాష్ట్రాల వారు త‌మ భాషను అభివృద్ధి చేసుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటుంటే మ‌న మాత్రం ప‌ర‌భాషా వ్యామోహంలో కొట్టుకుపోతున్నాం.

 

పిల్ల‌ల‌కు తెలుగును దూరం చేస్తుంది మ‌న‌మే!

 

తెలుగు భాష‌కు ద్రోహం చేస్తున్న వాళ్ల‌లో మొద‌టి దోషులు క‌చ్చితంగా త‌ల్లిదండ్రులే. ప‌ర భాషపై విప‌రీత‌మైన వ్యామోహాన్ని పెంచుకుని త‌మ పిల్ల‌ల‌ను తెలుగు భాష‌కు దూరం చేస్తున్న త‌ల్లిదండ్రులు ఎంద‌రో. తెలుగు మీడియంలో చ‌దివితే ఉద్యోగం రాదు తెలుగు చదివితే చిన్న స్థాయిలో ఉండిపోతారు అన్న అపోహ‌ల‌ను, అవాస్త‌వాల‌ను ప్రచారం చేయ‌డంలో కొన్ని ప్ర‌యివేట్ విద్యా సంస్థ‌లు విజ‌యం సాధించాయి. వారి మాయ‌లో ప‌డి చాలా మంది పేరెంట్స్ త‌మ పిల్ల‌ల‌ను తెలుగులో చ‌దివించ‌డం మానుకున్నారు. స‌మాజంలో వ‌చ్చిన ఈ స్ప‌ష్ట‌మైన, దుర‌దృష్ట‌క‌ర‌మైన మార్పుకు ఈ త‌రం ప్ర‌త్య‌క్ష సాక్షిగా ఘోర‌మైన పాపాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఒక వైపు స్కూల్లో తెలుగు మాట్లాడితేనే కొట్టే టీచ‌ర్లు, మ‌రోవైపు ఇంట్లో కూడా పిల్ల‌ల్ని ఇంగ్లీష్ లోనే మాట్లాడ‌మ‌ని ఒత్తిడి చేస్తూ న‌యా మాయానందంలో త‌మ‌ను తాము మోసం చేసుకుంటున్న త‌ల్లిదండ్రులు. వెర‌సి తెలుగు భాష ఇప్పుడు అంప‌శయ్య పైకి చేరుకుంది.

 

 

తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాలు రావా?

 

తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాలు రావ‌ని ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గ‌లేమ‌ని చాలా మందిలో ఉన్న భావ‌న‌. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో చ‌ద‌వ‌కుంటే పిల్ల‌లు ఈ పోటీ ప్ర‌పంచంలో మ‌నుగ‌డ సాగించ‌లేర‌ని చాలా మంది త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు. నిజ‌మే..ప్ర‌స్తుత కార్పోరేట్ జ‌మానాలో ఉద్యోగాన్ని సాధించాలన్నా దాన్ని కాపాడుకుంటూ మ‌రింత‌గా ఎద‌గాలన్నా ఇంగ్లీష్ లో నైపుణ్యం అవ‌స‌ర‌మే. ఇందులో సందేహం లేదు. అయితే ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషైన తెలుగుపై నిర్ల‌క్ష్యం ఎందుక‌న్న‌ది ఇప్పుడు అర్ధం కాని ప్ర‌శ్న‌. ఒక పీరియ‌డ్, ఒక స‌బ్జెక్ట్ గా తెలుగును చ‌దివినంత మాత్రాన పిల్ల‌లు ప‌నికిరాని వారిగా మారిపోతారా? ఇప్పుడు తెలుగు భాషాభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న ఇదే. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్ గా చేయ‌డంలో మీన‌మేషాలు లెక్కించింది. ఇప్పుడు తెలంగాణీ సీఎం కేసీఆర్ తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసారు. మ‌రి ఆయ‌న ఆదేశాలు ఎంత వ‌ర‌కూ అమ‌లవుతాయో క్షీణ ద‌శ‌లో ఉన్న తెలుగుకు ఎంత వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డ‌తాయో వేచి చూడాలి. ప్ర‌స్తుతం పుస్త‌కాలు చ‌దివే అలవాటున్న పిల్ల‌ల చేతుల్లో ఇంగ్లీష్ పుస్త‌కాలు త‌ప్పించి తెలుగు పుస్త‌కాలు అస్స‌లు క‌నిపించ‌డం లేదు. పిల్ల‌ల్లో పుస్త‌క ప‌ఠ‌నంపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు బాల సాహిత్యంలో మ‌రిన్ని పుస్త‌కాలు రావాల్సి ఉంది. అలాగే త‌ల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ నేర్పిస్తూనే అదే స‌మ‌యంలో తెలుగు చ‌ద‌వ‌డం, రాయ‌డం వ‌చ్చేలా వారికి శిక్ష‌ణ‌నివ్వాలి.

 

 

తెలుగును బ‌తికించ‌డం త‌ల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది!

 

తెలుగుకు ప్రాచీన భాష హోదా ద‌క్కింద‌న్న ఆనందం ఎక్కువకాలం నిల‌వ‌కుండానే ఇటీవ‌ల యునెస్కో విడుద‌ల చేసిన ఒక నివేదిక ఆందోళ‌న రేపింది. తెలుగు భాష‌పై ఇదే ర‌క‌మైన వైఖ‌రి కొన‌సాగుతూ ఉంటే మ‌రికొద్ది సంవత్సరాల్లో తెలుగు కూడా మృత భాషల జాబితాలో చేరిపోవ‌చ్చ‌న్న‌ది ఆ నివేదిక సారాంశం. తియ్య‌నైన తెలుగు భాష క‌నుమ‌రుగు కావ‌చ్చ‌న్న ఆలోచ‌నే భ‌రింప‌రానిదిగా ఉంది. దేశ భాష‌లందు తెలుగు భాష లెస్స అన్న శ్రీ కృష్ణ‌దేవ‌రాయ‌ల మాట‌ల‌ను గుర్తుకు తెచ్చుకుని మ‌న తెలుగు భాష‌ను బ‌తికించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అది ముందుగా త‌ల్లిదండ్రుల నుంచే మొదలు కావాలి. చిన్న‌త‌నం నుంచి పిల్ల‌ల‌ను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల‌లో జాయిన్ చేసినా ఇంటి ద‌గ్గ‌ర వాళ్ల‌కు తెలుగులో మాట్లాడ‌టం నేర్పించాలి. అలాగే కొంచెం స‌మ‌యం తీసుకుని వాళ్ల‌కు తెలుగు భాష‌ను క్షుణ్ణంగా నేర్పించాలి. వాళ్ల‌కు తెలుగులో ఉన్న మంచి బాల సాహిత్యాన్ని చ‌ద‌వ‌డం అల‌వాటు చేయాలి. స్కూళ్ల‌లో ఎలా అయితే తెలుగు మాట్లాడొద్ద‌ని ఆంక్ష‌లు విధిస్తారోఇంట్లో కూడా అలానే ఇంగ్లీష్ మాట్లాడొద్ద‌ని ఆంక్ష‌లు విధించి కుటుంబం మొత్తం తెలుగులోనే మాట్లాడుకోవాలి. క‌ఠిన ప‌దాల‌కు , సామెత‌ల‌కు పిల్ల‌ల‌కు అర్ధాల‌ను వివ‌రించి చెప్పాలి. ఏ ప‌దాన్ని ఎక్క‌డ ఏ సంద‌ర్భంలో వాడాలి అన్న‌దానిపై పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులే తెలియజేయాలి. కుంగిపోతున్న తెలుగును బ‌తికించ‌డం కేవ‌లం త‌ల్లిదండ్రులు చేతుల్లోనే ఉంది. వారు త‌ల్చుకుంటే మ‌న భాష‌ను బ‌తికించుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మైన విష‌య‌మేమీ కాదు.

 

 

చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్య‌మే!

 

తెలంగాణా జ‌రుగుతున్న ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల స్ఫూర్తితో మ‌నం తెలుగును బ‌తికించుకునేందుకు, దాన్ని త‌ర్వాత త‌రాల‌కు అందించేందుకు కృషి చేయాలి. తెలంగాణాలోని అన్ని పాఠ‌శాలలో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌న్నెండో త‌ర‌గ‌తి వ‌ర‌కూ తెలుగును త‌ప్ప‌నిసరి చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం చాలా గొప్ప‌ది. అయితే ఇది స‌రిగ్గా అమ‌లు జ‌రిగేలా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాలి. తెలుగు భాష‌ను మ‌రింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను మ‌హాస‌భ‌ల్లో చ‌ర్చించి వ‌దిలేయ‌డం కాకుండా వాటి అమ‌లును ప‌ర్య‌వేక్షించే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా తెలుగు భాష గొప్ప‌త‌నంపై త‌ల్లిదండ్రుల‌ను చైత‌న్యం చేయాలి. అలాగే తెలుగు మీడియంలో చ‌దివిన విద్యార్ధుల‌కు కూడా ఉద్యోగావ‌కాశాలు ఎక్కువ‌గా ఉండేట‌ట్టు చేస్తే చాలా మంది తెలుగులో చ‌దివేందుకు ఆస‌క్తి చూపిస్తారు. అలాగే మ‌న ప‌క్క‌రాష్ట్రాల త‌రాహాలోనే భాష‌పై ప్రేమ‌ను పెంచుకుని దాని అభివృద్ధికి అనుక్ష‌ణం ప్ర‌య‌త్నం చేయాలి. ఇలా చేసిన‌ప్పుడు తియ్య‌నైన మ‌న‌ తెలుగు భాష త‌న పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుని త‌ళుకులీనుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

 

వృత్తులందు యాచక వృత్తి మేలయా!

 

ప్ర‌తీ మ‌నిషి త‌న జీవితంలో ఏదో ఒక సంద‌ర్భంలో చేయి చాచి ప‌క్క‌వాడ్ని యాచించే ఉంటాడు. మ‌రీ అడుక్కోవ‌డం అన్న మాట‌ను ఉప‌యోగించడం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ యాచించ‌డం అనేది స్థాయిని పెద్ద చిన్న అని మారుతూ ఉంటుంది. కొంద‌రు అవ‌స‌రాల‌కు స‌హాయాన్ని యాచిస్తే కొంద‌రు చేసిన స‌హాయాన్ని కృత‌జ్ఞ‌త‌ను, డ‌బ్బును,వ‌స్తువుల‌ను యాచిస్తారు. అస‌లు ఇంత‌కీ యాచ‌న కోసం ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే తాజాగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె హైద‌రాబాద్ లో ఓ గ్లోబ‌ల్ స‌మిట్ లో పాల్గొంటోంద‌ని న‌గ‌రంలోని బిచ్చ‌గాళ్లంద‌రినీ న‌గ‌ర శివార్ల‌కు త‌ర‌లించారు. వాస్త‌వాల‌ను దాచిపెట్టి ఎవ‌రో మెప్పు పొందాల‌ని వాళ్ల‌ను తాత్కాలిక‌ శిబిరాల‌కు త‌ర‌లించ‌డం విమ‌ర్శ‌ల పాలైంది. చిత్త‌శుద్ధితో పరిష్కారించాల్సిన ఒక జ‌ఠిల‌ స‌మ‌స్య‌ను ఆది నుంచి పెంచి పోషిస్తూ ఇప్పుడు ఉన్న‌ది లేనట్టుగా చూపేందుకు తాపత్ర‌య‌ప‌డ‌టం విడ్డూరంగా అనిపిస్తోంది. భార‌తీయ జీవ‌న విధానంలో యాచ‌న లేదా బిక్షాట‌న అనేది ఒక అంత‌ర్భాంగా ఉంటూ వ‌స్తోంది. ఆధ్మాత్మిక జీవ‌న శైలిలో ఒక భాగ‌మైన బిక్షాట‌న త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా స్వార్ధ‌ప‌రులు, సోమ‌రుల‌కు జీవ‌నోపాధిగా మారింది. పురాణ కాలం నుంచి నేటి వ‌ర‌కూ వివిధ మార్పులు చెందుతూ వ‌చ్చిన బిక్షాట‌న నేటి స‌మాజాన్ని ప‌ట్టి పీడించే ఒక విష వ‌ల‌యంగా మారిపోయింది. విద్యార్ధులు ఆ ప‌రిణామ క్ర‌మాన్ని ఓసారి గ‌మ‌నిస్తే సామాజిక బాధ్య‌త‌పై అవ‌గాహ‌న తెచ్చుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది.

 

 

అస‌లు ఈ యాచ‌న ఎక్క‌డ మొద‌లైంది?

 

మ‌న పురాణాల్లో, ఇతిహాసాల్లోనూ యాచ‌న‌, బిక్షాట‌న అనే ప‌దాలు చాలా విరివిగా క‌నిపిస్తాయి. శ్రీకృష్ణుడు, కుచేలుని స్నేహం, స్నేహితుడ్ని నోరు తెరిచి యాచించేందుకు నోరు రాని కుచేలుడు త‌నే తిరిగి త‌న స్నేహితునికి అటుకుల‌ను కానుక‌గా ఇచ్చి అక్క‌డ నుంచి వెళ్లిపోవ‌డం ఇవ‌న్నీ మ‌నం భాగ‌వతంలో చ‌దువుకున్నాం. త‌ను భార్య పిల్ల‌ల‌తో ఉన్న గృహ‌స్తు క‌నుక స్నేహితున్ని స‌హాయం కూడా యాచించ‌కుండా వెళ్లిపోయాడు. మ‌రోవైపు కుటుంబాన్ని త్య‌జించిన స‌న్యాసులు, మ‌హ‌ర్షులు మాత్రం ఎటువంటి బెరుకు లేకుండా బిక్షాట‌న చేస్తారు. క‌ర్ణుడి క‌వ‌చ కుండ‌లాల‌ను తీసుకోవాలి అనుకున్న‌ప్పుడు ఇంద్రుడు, బ‌లి చ‌క్ర‌వ‌ర్తి అహంకారాన్ని అణిచేందుకు వామ‌నుడు…మ‌హ‌ర్షుల వేషంలోనే దానాన్ని తీసుకున్నారు. అలాగే బుద్ధుడు, సాయి బాబా వంటి వారు కూడా బిక్షాట‌న చేసిన వారే. వారు స‌ర్వం త్య‌జించిన స‌న్యాసులు క‌నుక త‌మ పొట్ట కూటి కోసం యాచించే వారు. వాళ్ల యాచ‌న‌లో ఒక ప‌విత్ర‌త‌, ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. ప్ర‌జ‌లు ఆహారాన్ని సంపాదించుకునే క్ర‌మంలో త‌మ‌కు తెలీకుండానే ఎన్నో పాపాలు మూట‌గ‌ట్టుకుంటారు. దైవ‌త్వం క‌లిగిన మ‌హ‌ర్షులకు ఆ ఆహారాన్ని బిక్ష‌గా వేసిన‌ప్పుడు వాళ్లు ఆ పాప ఫ‌లితాల నుంచి విముక్తి పొందుతారు. భారతీయ సంస్కృతీ, సంప్ర‌దాయాల్లో బిక్షాట‌న‌, యాచ‌న‌, దానం, ధ‌ర్మం వెనుక ఇన్ని నిగూఢ అర్ధాలు ఉంటాయి.

 

 

మ‌త గ్రంధాల ఊహ‌కు అంద‌ని మాఫియా ఏర్పాటైంది!

 

హిందూ మ‌తంలో , సంస్కృతిలో దానం చేయ‌డం అనేది చాలా ముఖ్య‌మైన విష‌యం. హిందువులు ప్ర‌తీ కార్య‌క్ర‌మంలో దాన ధ‌ర్మాల ప్ర‌స్తావ‌న ఉంటుంది.పండ‌గ‌ల్లోనూ, పెళ్లిళ్ల‌లోనూ, వేడుక‌ల్లోనూ పేద‌వారికి, నిస్స‌హాయుల‌కు స‌హాయం చేయ‌మ‌ని శాస్త్రాలు చెపుతాయి. అలాగే ఇస్లాం లో కూడా ఇదే ర‌క‌మైన ప్ర‌స్తావ‌న ఉంటుంది. ప్ర‌తీ ముస్లిం త‌న సంపాద‌న‌లో కొంత మొత్తాన్ని పేద‌వారికి, అభాగ్యుల‌కు దానం చేయ‌మ‌ని ఖురాన్ చెపుతుంది. దాన ధ‌ర్మాల‌కు క్రైస్త‌వం కూడా అతీతం కాదు. ఆ మతంలో కూడా ఎటువంటి ప‌నిచేయ‌లేని, క‌ష్టాల్లో ఉన్న వారికి స‌హాయం చేయ‌మ‌ని ఉంటుంది. అయితే ఎంతో మంచి ఉద్దేశ్యంతో మ‌తాలు, మ‌త గ్రంధాలు ఉద్భోధించిన దాన ధ‌ర్మాలు కాలం మారుతున్న కొద్దీ కొంద‌రికీ బ‌తుకు తెరువుగా మారిపోయాయి. అస‌హాయుల‌కు, నిర్భాగ్యుల‌కు, విక‌లాంగుల‌కు స‌హాయం చేయాల‌న్న మతాల ఉద్భోధ‌ను కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ప‌నిచేసే శ‌క్తి ఉన్నా, అన్ని అవ‌య‌వాలు స‌రిగ్గా ప‌నిచేస్తున్నా చాలా మంది సోమ‌రిపోతులుగా మారి బిచ్చ‌గాళ్లుగా చెలామ‌ణీ అవుతున్నారు. మ‌న సంస్కృతి అందించిన మంచి విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఎంత‌లా పెరిగిపోయింది అంటే బిచ్చ‌గాళ్లు అంద‌ర్నీ కంట్రోల్ చేసే ఒక నెట్ వ‌ర్క్ తో పాటు చిన్న పిల్ల‌ల‌తో, ఆడ‌వాళ్ల‌తో బిక్షాట‌న చేయించే గ్యాంగ్ లు ఏర్ప‌డి బెగ్గింగ్ మాఫియాను ఏర్పాటు చేసారు. దేశంలోని బొంబాయి, ఢిల్లీ వంటి మ‌హా న‌గ‌రాల‌ను ప‌క్క‌న పెడితే కోటి మంది జ‌నాభా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రంలో దాదాపు 14 వేల మంది బిచ్చ‌గాళ్లు ఉన్నారు. వీళ్లంద‌రి సంవ‌త్స‌ర ఆదాయం 25 కోట్ల రూపాయ‌ల‌కు పైమాటే. అయితే వీరిలో నిజమైన యాచ‌కులు కేవ‌లం 2 శాతం మంది మాత్ర‌మేన‌ని స‌ర్వేలో తేలింది. మిగిలిన 98 శాతం మంది ప‌నిచేసే స‌త్తా ఉన్న‌వారేన‌ని అయినా బిక్షాట‌న‌ను ఎంచుకున్నార‌ని తేలింది. కొంద‌రు వ్య‌క్తులు మాఫియాగా ఏర్ప‌డి చిన్న పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసి వాళ్ల‌తో బిక్షాట‌న చేయిస్తున్నారు.

 

 

కోటీశ్వ‌రులే బిచ్చ‌గాళ్లుగా మారారు!

 

ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ కు వ‌స్తున్న సంద‌ర్భంగా నగ‌రంలోని బిచ్చ‌గాళ్ల‌ను శివార్ల‌లోని ఒక పున‌రావాస శిబిరానికి త‌ర‌లించారు. అంత‌ర్జాతీయ ప్ర‌తినిధులకు న‌గ‌రం గొప్ప‌త‌నాన్ని చూపించేందుకు వాళ్ల‌ను తాత్కాలిక గుడారాల‌కు తర‌లిస్తూ ప్ర‌భుత్వం త‌న మ‌న‌స్సాక్షిని దెబ్బ‌తీసుకుంటోంది. అయితే ఈ యాచ‌కుల త‌రలింపులో క‌న్నీరు పెట్టించే క‌థ‌లు, వ్య‌థ‌లు లు వెలుగు చూస్తున్నాయి. మొత్తం బిచ్చ‌గాళ్ల‌తో కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా బిచ్చ‌గాళ్లు అయిన వారు ఉంటే మ‌రికొంద‌రు బ‌ల‌వంతంగా లాక్కురాబ‌డిన‌వారు. కొంద‌ర్ని ప‌రిస్థితులు, క‌ష్టాలు బిచ్చ‌గాళ్లుగా మార్చాయి. లండ‌న్ లో ఎంబీయే చేసి ఉన్న‌తోద్యోగం చేసిన వారూ, అమెరికా లో గ్రీన్ కార్డు హోల్డ‌ర్ కూడా న‌గ‌ర వీధుల్లో బిచ్చ మెత్తుకుంటున్నారు. ఒక‌ప్పుడు కోటీశ్వ‌రులైన వీళ్లు బిచ్చ‌గాళ్లుగా మారిన వైనం ఆలోచింప‌జేయ‌డంతో పాటు కంట‌త‌డి కూడా పెట్టిస్తుంది. హైద‌రాబాద్ లో ఆనంద్ బాగ్ కు చెందిన 60 ఏళ్ల ఫ‌ర్జానా హైద‌రాబాద్ లో డిగ్రీ పూర్తిచేసి ఆ త‌ర్వాత లండ‌న్ లో ఎంబీయే కంప్లీట్ చేసింది. అక్క‌డే ఓ ఉన్న‌తోద్యోగం కూడా చేసింది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ కు వ‌చ్చి పెళ్లి చేసుకుంది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భ‌ర్త మ‌ర‌ణించ‌డంతో మానసికంగా కుంగిపోయిన ఫ‌ర్జానా మానసిక ప్ర‌శాంత‌త కోసం లంగ‌ర్ హౌజ్ ద‌ర్గా ద‌గ్గ‌ర ఉండిపోయి అక్కడే భిక్షాట‌న చేస్తోంది. పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ లో ఆమెను కూడా పున‌రావాస కేంద్రానికి తీసుకొచ్చారు.అయితే అన‌ర్గ‌ళంగా ఇంగ్లీష్ మాట్లాడం చూసి అవాక్కై ఆరా తీస్తే ఈ విష‌యాలు తెలిసాయి. ఇక ర‌బియా బ‌సిరిది మ‌రో దీన‌గాధ‌. అమెరికా హోట‌ల్ వ్యాపారం చేస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ కు ఆమె మూడో భార్య‌. అమెరికాలో ఆమెకు గ్రీన్ కార్డు కూడా ఉంది. కొన్నాళ్ల క్రితం తండ్రి చనిపోవ‌డంతో హైద‌రాబాద్ కు వ‌చ్చింది. తండ్రి చ‌నిపోయాడ‌న్న బాధ‌కు తోడు అయిన‌వాళ్లంతా ఆమెను మోసం చేసి ఆస్తిని కాజేయ‌డంతో మాన‌సికంగా కుంగిపోయి ఇక్క‌డే ఉండిపోయింది. తర్వాత పొట్ట‌కూటి కోసం లంగ‌ర్ హౌజ్ ద‌ర్గాకు చేరుకుని అక్క‌డే ఉండిపోయింది.

 

 

శాశ్వ‌త ప‌రిష్కారం ఊసేదీ?

 

అస‌లు జీవితంలో బిచ్చ‌గాళ్ల‌ను చూడ‌లేదు అన్న వ్య‌క్తులు న‌గ‌రానికి అకస్మాత్తుగా ఊడిప‌డుతున్నారు అన్న చందంగా ప్ర‌భుత్వం చేస్తున్న అతి ఆపేక్ష‌ణీయంగా ఉంది. ముఖ్యంగా బిచ్చ‌గాళ్ల సంఖ్య‌ను త‌గ్గించ‌డానికి ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు శూన్యం. ఎవ‌రు నిజ‌మైన బిచ్చ‌గాళ్లు ఎవ‌రు బ‌ల‌వంతంగా ఈ రొంపిలోకి వ‌చ్చారు అన్న విష‌యం తేల్చ‌డం ప్ర‌భుత్వానికి ఏమంత క‌ష్టం కాదు. కానీ ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. ముఖ్యంగా చిన్న పిల్ల‌ల‌ను, మ‌హిళ‌ల‌ను బ‌ల‌వంతంగా శాశ్వ‌త బిచ్చ‌గాళ్లుగా మారుస్తున్న బెగ్గింగ్ మాఫియా ఆట‌క‌ట్టించేందుకు ఒక్క ముంద‌డుగు కూడా ప‌డ‌లేదు. ఇప్పుడు ఎవ‌రి ప్రాప‌కం కోసమో బిచ్చ‌గాళ్లును నెల‌రోజులు అక్క‌డ ఇక్క‌డా తిప్పి మ‌ళ్లీ వ‌దిలేస్తారు. బెగ్గింగ్ ను పూర్తిగా అరిక‌ట్ట‌లేకున్నా బెగ్గ‌ర్స్ సంఖ్య‌ను త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి అదీ జ‌ర‌గ‌డం లేదు. ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌రంగా చేయాల్సింది రెండు రోజులు ఉండి వెళ్లిపోయే విదేశీ ప్ర‌తినిధుల కోసం కాదు. బిచ్చ‌గాళ్ల‌కు శాశ్వ‌త పున‌రావాసం క‌ల్పించి వాళ్ల పిల్ల‌లు ఆ వృత్తి వైపు రాకుండా ఆలాగే కొత్త వాళ్లు ఆ వృత్తి రాకుండా చేసి బెగ్గింగ్ మాఫియాకు అరిక‌ట్ట‌డం. ఏ ప‌ని చేయ‌కుండా యాచించ‌డం ఎంత త‌ప్పో వాళ్ల పిల్ల‌ల‌కు చిన్న‌త‌నం నుంచి స‌రైన విధంగా భోధించ‌గ‌లిగితే బెగ్గింగ్ అనే దాన్ని మ‌న‌దేశంలో లేకుండా చేయొచ్చు.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)