వైభ‌వంగా ఐటాప్ – 2018 అవార్డుల ప్ర‌ధానోత్సవం

 

అత్యుత్త‌మ ఉపాధ్యాయుల‌ను ఘ‌నంగా స‌త్క‌రించే ఐటాప్ 2018 అవార్డుల కార్య‌క్ర‌మం అక్టోబ‌ర్ 2 న హైద‌రాబాద్ లో ఘ‌నంగా జరిగింది. న‌గ‌రంలో హైటెక్ సిటీ స‌మీపంలో ఉన్న ట్రైడెంట్ హోట‌ల్ లో అంగ‌రంగ వైభ‌వంగా ఈ అవార్డుల వేడుకను నిర్వ‌హించారు. హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ట్యూట‌ర్స్ ప్రైడ్ సంస్థ ఈ అవార్డుల కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హరించింది.

 

 

20 కి పైగా విభాగాల్లో అక‌డ‌మిక్, నాన్ అక‌డ‌మిక్ ఉపాధ్యాయుల‌ను ఐటాప్ 2018 అవార్డుల కార్య‌క్ర‌మంలో స‌త్క‌రించారు. ఇందులో ఒక‌రికి మ‌హా మ‌హోపాధ్యాయ అవార్డు, 5 గురుకి జీవిత కాల సాఫ‌ల్య పుర‌స్కారం, 100 మందికి ఐటాప్ అవార్డులు అందుకున్నారు. అలాగే మ‌రో 70 మంది స్పెష‌ల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు.

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐటాప్ 2018 అవార్డు కోసం దాదాపు 700 మంది అక‌డ‌మిక్ , నాన్ అక‌డమిక్ ఉపాధ్యాయులు, కోచ్ లు, ప్రొఫెస‌ర్లు, డీన్ లు, ప్రిన్సిపాల్ లు నామినేష‌న్లు వేసారు. అత్యంత క‌ఠిన‌త‌ర‌మైన ఎంపిక ప్ర‌క్రియ అనంత‌రం జ్యూరీ సభ్యులు అవార్డు గ్ర‌హీత‌ల‌ను ప్ర‌క‌టించారు. నామినేష‌న్ వేసిన ప్ర‌తీ ఒక్క‌రూ కార్యక్ర‌మంలో పాల్గ‌నే వీలుండ‌టంతో దాదాపు 1000 మంది వ‌ర‌కూ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యారు.

 

 

దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి మొద‌లుకుని మెట్రో సిటీల్లో ఉన్న విశ్వ‌విద్యాల‌యాల్లో ప్రొఫెస‌ర్లుగా, డీన్లుగా ప‌నిచేస్తున్న వారు ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవ‌డం విశేషం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వ‌ర్యులు, శ్రీ కొణిజేటి రోశ‌య్య గారు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణా శాస‌న మండ‌లి ఛైర్మ‌న్, స్వామి గౌడ్ గారు, తెలంగాణా బీసీ క‌మీష‌న్ ఛైర్మ‌న్ శ్రీ బీ.సీ. రాములు గారు, సాగునీటి రంగ నిపుణులు, తెలంగాణా వాట‌ర్ రీసోర్సెస్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్. శ్రీ వీర‌మ‌ళ్ల ప్ర‌కాశ్ రావు గారు, తెలుగు విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సెల‌ర్ శ్రీ. ఎస్.వీ. స‌త్య‌నారాయ‌ణ గారు, ప‌లువురు ఐఏఎస్ ఆఫీస‌ర్లు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

 

చిన్న స్థాయి , గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయుల‌ను చిన్న చిన్న వేదిక‌ల‌పై స‌త్క‌రించ‌డం అన్న‌దే మ‌నం ఇప్ప‌టివ‌ర‌కూ చూసాం. కానీ ట్యూట‌ర్స్ ప్రైడ్ వారి స‌హ‌కారంతో ఐటాప్ 2018 లో ఉపాధ్యాయుల‌ను హైద‌రాబాద్ లో ఖ‌రీదైన ట్రైడెంట్ హోట‌ల్ లో వారికి ఒక ఆనంద అనుభూతిని పంచుతూ అందించ‌డం నిజంగా అభినంద‌నీయం.

 

ఏపీ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది!

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష ( టెట్) పరీక్ష‌ల షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. టెట్ ప‌రీక్ష‌ను ఆన్ లైన్ లో నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌వరి 17 నుంచి 27 వ‌ర‌కూ రోజూ రెండు సెష‌న్స్ గా ఈ పరీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వెల్లడించారు. ఈ ఏడాది టెట్ ప‌రీక్ష‌ను దాదాపు 3 ల‌క్ష‌ల మంది విద్యార్ధులు రాయొచ్చ‌న‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక్కో సెంట‌ర్ లో ఒక్కో సెష‌న్ కు దాదాపు 5 వేల మంది విద్యార్ధులు ప‌రీక్ష రాసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఏపీ టెట్ 2018 షెడ్యూల్

 

ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ  :  డిసెంబ‌ర్ 18 నుంచి జ‌న‌వ‌రి 1 వ‌ర‌కూ
ద‌ర‌ఖాస్తు రుసుముల చెల్లింపులు  :  డిసెంబ‌ర్ 18 నుంచి 30 వ‌ర‌కూ
హాల్ టిక్కెట్ డౌన్ లోడ్  :   జ‌న‌వ‌రి 9 నుంచి
ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ  :   జ‌న‌వ‌రి 17 నుంచి 27 వ‌ర‌కూ
సెష‌న్ 1  :   ఉద‌యం 9:30 నుంచి 12 గంట‌ల వ‌ర‌కూ
సెష‌న్ 2  :  మ‌ధ్య‌హ్నం 2:30 నుంచి సాయింత్రం 5 వ‌ర‌కూ
ప్రాథ‌మిక కీ విడుద‌ల‌  :   జ‌న‌వ‌రి 29 న
తుది కీ విదుద‌ల  :   ఫిబ్ర‌వ‌రి 6
తుది ఫ‌లితాలు  :   ఫిబ్ర‌వ‌రి 8 న

ఈ అమ్మాయి కథ చదవండి…కచ్చితంగా స్ఫూర్తి పొందుతారు!!

 

మన‌కు స్ఫూర్తినిచ్చేవారు గొప్ప గొప్ప వ్య‌క్తులే కాన‌క్క‌ర్లేదు. ఒక్కోసారి మ‌న‌లో ఒక‌రిగా ఉంటూ, మ‌న స్థాయి కంటే త‌క్కువ స్థాయిలో ఉన్న‌వాళ్లు కూడా మ‌న‌కు స్ఫూర్తిప్ర‌ధాత‌లుగా నిలుస్తారు. వాళ్ల శ్ర‌మ‌, దార్శినిక‌త, దేన్నైనా సాధించాల‌న్న ప‌ట్టుద‌ల మ‌న‌కు ఆద‌ర్శ‌నీయంగా మారుతుంది. బీటెక్ చివ‌రి సంవత్స‌రం చ‌దువుతున్నమ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబానికి చెందిన ఓ విద్యార్ధిని ఒక స్టార్ట‌ప్ ను నెల‌కొల్పి మ‌రో 10 మందికి ఉపాధిని క‌ల్పిస్తుందంటే ఆశ్చ‌ర్యంతో పాటు ఆస‌క్తి కూడా క‌ల‌గ‌క‌మాన‌దు. ఉన్న‌పాటి కొద్ది పాటి వ‌నరుల‌తోనే రికార్డు స్థాయిలో కేవ‌లం 40 రోజుల్లోనే 101 వెబ్ సైట్ల‌కు రూప‌క‌ల్ప‌న చేసి ఎందరికో రోల్ మోడ‌ల్ గా నిలిచిన ఆ అమ్మాయే గుంటూరు జిల్లాకు చెందిన ర‌జిత‌. కాలేజీ యాజ‌మాన్యం ప్రొత్సాహంతో వెబ్ సైట్ డిజైనింగ్ పై ఆస‌క్తిని పెంచుకుని, స్టార్ట‌ప్ ను ప్రారంభించడ‌మే కాదు రానున్న రోజుల్లో దాన్ని పెద్ద సంస్థ‌గా నిల‌బెడ‌తాన‌ని ఆత్మ‌విశ్వాసంతో చెపుతున్న రజిత, విద్యార్ధుల‌కే కాదు ఏదైనా సాధించాల‌నుకునే ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కం. స్ఫూర్తిగా నిలిచేవారు ఉన్న‌త‌స్థాయిలో ఉన్న వాళ్లే కాన‌క్క‌ర్లేద‌న‌డానికి ఒక ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ ఆల్ టెక్ ట్రెండ్. డాట్ కామ్ సీఈఓ రజిత‌.

 

స్టార్ట‌ప్ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది?

 

బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్ లో ఉండ‌గా కాలేజీ యాజ‌మాన్యం ప్రొత్సాహంతో ర‌జిత స్టార్ట‌ప్ ను ప్రాంభించింది. ర‌జిత చ‌దువుతున్న కాలేజీలో స్టార్ట‌ప్ విభాగం ఏర్పాటు కావ‌డం ఆమె ఎంట్రెప్రెన్యూర్ షిఫ్ కు బీజం వేసింది. వెబ్ డిజైనింగ్ పై ఆస‌క్తి ఉండ‌టంతో కంపెనీల‌కు, సంస్థ‌ల‌కు వెబ్ సైట్ ల‌ను డిజైన్ చేసే ఇచ్చే సంస్థ‌ను ప్రారంభించింది. ఆల్ టెక్ ట్రెండ్ డాట్ కామ్ పేరుతో ప్రారంభ‌మైన ఈ స్టార్ట‌ప్ కు క‌నీస పెట్టుబ‌డి కూడా లేక‌పోవ‌డం విశేషం. వెబ్ సైట్ డిజైనింగ్ పై అవ‌గాహ‌న సంపాదించుకుంటే స‌రిపోద‌ని డొమైన్, హోస్టింగ్ ను కొనుగోలు చేయాలంటే డబ్బు ఖ‌ర్చ‌వుతుంది. మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్ధిని కావ‌డంతో కొంచెం మొత్తం కూడా పెట్టుబ‌డిగా పెట్ట‌డం ర‌జిత‌కు సాధ్యం కాదు. దీంతో డొమైన్, హోస్టింగ్ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలో రజిత‌కు మొద‌ట్లో అర్ధం కాలేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో వెబ్ 2.0 అనే సంస్థ రజిత‌కు అండ‌గా నిల‌బ‌డింది. డొమైన్ తో పాటు హోస్టింగ్, ప్రాసెసింగ్ ను ఉచితంగా అంద‌జేసింది. దీంతో ర‌జిత‌కు ఆర్థికంగా కాస్త వెసులుబాటు ల‌భించింది.

 

 

స్టార్ట‌ప్ స‌రే..ఆర్డ‌ర్ల సంగ‌తేంటి?

 

స్టార్ట‌ప్ ఆలోచ‌న స‌రే మ‌రి ఆర్డ‌ర్లు , రాబ‌డి సంగ‌తేంటి? ఈ ప్ర‌శ్న మొద‌ట్లో ర‌జిత‌ను కూడా తీవ్రంగా వేధించింది. ఒక‌వైపు చ‌దువును కొన‌సాగించాలి మ‌రోవైపు స్టార్ట‌ప్ ను న‌డిపిస్తూ అదే స‌మ‌యంలో ఆదాయాన్ని కూడా పొందాలి? అయితే ప‌ట్టుద‌ల‌తో ఈ సవాలును అధిగ‌మించింది ర‌జిత. వెబ్ 2.0 స‌హ‌కారం అందించ‌డంతో ఖ‌ర్చు త‌గ్గిపోవ‌డంతో ఖ‌ర్చుల‌ను అధిగ‌మించి రెవెన్యూ సాధించాల‌న్న ఒత్తిడి లేక‌పోవడం ర‌జిత‌కు క‌లిసొచ్చింది. దీంతో లాభ న‌ష్టాల‌ను బేరీజు వేసుకోకుండా పూర్తి స్థాయిలో చేసే పనిపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది. ప్రస్తుతం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న హుకేష్ ఐటీ సోల్యూషన్స్ అనే సంస్థకు వెబ్‌ సైట్ డిజైన్లు చేసే అవకాశం ఆల్‌ టెక్ ట్రెండ్ డాట్‌కామ్ కు లభించింది. అలాగే వీఎల్ సర్వీసెస్ అనే సంస్థకు కూడా వెబ్‌ డిజైనింగ్ చేసారు. రానున్న రోజుల్లో వెబ్‌ డిజైనింగ్ తో పాటు అప్లియేటేడ్ మార్కెటింగ్, మొబైల్ యాప్స్ డిజైనింగ్ పై కూడా దృష్టి పెడతామని చెపుతోంది ఆల్ టెక్ ట్రెండ్ డాట్‌కామ్ సీఈఓ రజిత.

 

 

వెబ్‌సైట్ల రూపకల్పనలో సామాజిక కోణం!

 

సాంకేతిక విప్లవం అందరికీ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరికీ టెక్నాలజీ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో ఆల్‌టెక్ ట్రెండ్ డాట్‌కామ్ పనిచేస్తోందని చెపుతోంది రజిత. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంత వాసులు కూడా టెక్నాలజీని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటువంటి పరిస్థితుల్లో పెద్దగా చదువుకోని వారికి కూడా సులువుగా అర్ధమయ్యేలా వెబ్‌సైట్లను, మొబైల్ యాప్స్ ను డిజైన్ చేయడమే తన లక్ష్యం అని చెపుతోంది రజిత. ఎక్కువగా సర్వీసెస్ రంగాలని ఉపయోగపడే వెబ్‌సైట్లను డిజైన్ చేసిన రజిత , వాటితో పాటు బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్యుకేషన్ వంటి సైట్లను ను కూడా డిజైన్ చేసింది. వీటిలో చాలా సైట్లకు గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి ప్రకటన రూపంలో కొంచెం ఆర్థిక సహాయం లభిస్తోంది.

 

 

ఎందరికో స్ఫూర్తి రజిత స్టార్టప్ స్టోరీ!

 

కేవలం 40 రోజుల్లోనే 101 వెబ్‌సైట్లను డిజైన్ చేసి రికార్డును నెలకొల్పిన రజిత, రానున్న రోజుల్లో మరింత చురుగ్గా పనిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం రజిత నెలకొల్పిన ఆల్‌టెక్ ట్రెండ్ డాట్‌కామ్ లో రజితతో పాటు మరో 12 మంది పనిచేస్తున్నారు. ప్రాజెక్ట్ ల ఆధారంగా వాళ్లకు జీతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం నెలకు 50 వేల రూపాయల వరకూ ఆదాయం వస్తోంది. సంస్థను మరింత విస్తరించి మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను చేజిక్కించుకునేందుకు రజిత ప్రస్తుతం బ్యాంక్ రుణం కోసం ప్రయత్నం చేస్తోంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన చదువు ఇంకా పూర్తికాని ఒకమ్మాయి స్టార్టప్ ను ప్రారంభించి విజయవంతంగా నడిపించడం ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తినిచ్చే విషయం. ఆత్మవిశ్వాసం, శ్రమించే గుణం ఉంటే ఎవరైనా ఏదైనా చేయవచ్చని నిరూపించింది రజిత. మనకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు గొప్ప వాళ్లే కానక్కర్లేదని, మన మధ్యే ఉన్న సామాన్యులు కూడా స్ఫూర్తినిస్తారని చాటి చెప్పింది. ఆల్‌ ది బెస్ట్ రజిత.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)