‘పొగడ్త’ మంచిదే!!

 

త‌ల్లిదండ్రులుగా మార‌డం అన్న‌ది ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో ఒక మ‌ధురానుభూతి. పిల్లలు పుట్టాకే మ‌నిషి జీవితం ఒక అర్ధ‌వంత‌మైన మ‌లుపు తిరుగుతుంది. మ‌నిషిగా జీవితానికి ఒక సార్ధ‌క‌త ఏర్ప‌డుతుంది. అయితే పిల్ల‌ల పెంప‌కం అనేది అంత సులువైన‌ విష‌యం కాదు. పిల్ల‌ల వ‌య‌స్సు ఎంత ఉన్న కానీ త‌ల్లిదండ్రుల బాధ్యత అన్న‌ది తీరిపోయేది కాదు. పిల్ల‌లను ఎలా ప్రేమించాలి? వాళ్ల‌కు భ‌ద్ర‌మైన వాతావ‌ర‌ణం ఎలా క‌ల్పించాలి? ఏది మంచి..ఏది చెడు అన్న‌ది విడ‌మ‌ర్చి చెప్ప‌డం.? అన్న‌ది నిరంత‌రం సాగే ప్ర‌క్రియ‌. చివ‌రికి ఒక పిల్ల‌వాడు స్వ‌తంత్రంగా, విలువ‌ల‌తో, పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వంతో, పూర్తి ఆత్మ‌విశ్వాసంతో ఎంత బాగా ఎదిగాడ‌న్న‌ది త‌ల్లిదండ్రుల పెంప‌కంపై ఆధార‌ప‌డి ఉంటుంది. మంచి స‌మ‌ర్ధ‌త క‌లిగిన త‌ల్లిదండ్రులు మాత్రమే మ‌న ఇప్పుడు చెప్పుకున్న ల‌క్ష‌ణాల‌తో త‌మ పిల్ల‌ల‌ను పెంచ‌గ‌ల‌రు. అంద‌రూ తాము మంచి తల్లిదండ్రులుగా ఉంటూ త‌మ పిల్ల‌ల‌ను బాగా పెంచాల‌ని అనుకుంటారు. అయితే చివ‌రికి కొంద‌రు మాత్ర‌మే మంచి త‌ల్లిదండ్రులు అనిపించుకుంటారు. అయితే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అంద‌రూ త‌మ పిల్ల‌ల‌కు మంచి పెంప‌కాన్ని అందించి గుడ్ పేరెంట్స్ గా మారొచ్చు. పిల్ల‌ల‌కు అంద‌మైన భవిష్య‌త్ ను కానుక‌గా ఇవ్వొచ్చు.

 

 

మీ పిల్ల‌ల‌కు ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌ను పంచిపెట్టండి!

 

మీ పిల్ల‌ల‌కు ప్రేమ‌ను అందిస్తూ వాళ్ల‌తో ఆప్యాయంగా మెల‌గ‌డం అన్న‌ది పేరెంటింగ్ లో చాలా కీల‌కం. ప్రేమ అనేదే పిల్ల‌ల‌తో మీ బంధానికి పునాది. ఒక వెచ్చ‌ని స్ప‌ర్శ‌, ఒక భ‌ద్ర‌త‌తో కూడిన కౌగిలి వాళ్ల‌ను మీకు మానసికంగా చాలా ద‌గ్గ‌ర చేస్తాయి. చ‌క్క‌టి అనుబంధంతో త‌ల్లిదండ్రులతో పెరిగిన పిల్ల‌లు ఉన్న‌త స్థానానికి ఎదిగిన‌ట్టు శాస్త్రీయ ప‌రిశోధ‌న‌లు రుజువు చేస్తున్నాయి. ఒక అప్యాయ‌పూరిత కౌగిలి, మొఖంపై చ‌క్క‌ని చిరున‌వ్వు, ఒక మెచ్చుకోలు, ప్రేమ‌తో కూడిన అనుమతి పిల్ల‌ల ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. ప్ర‌తీ రోజూ వాళ్ల‌ను మీరు ఎంత ప్రేమిస్తున్నారో తెలియ‌జేయండి. కోపంలో ఉన్నాస‌రే వాళ్ల‌పై మీకు ఎంత ప్రేమ ఉంద‌న్న విష‌యం వాళ్ల‌కు తెలియాలి. మీ పిల్ల‌లు పుట్టిన ద‌గ్గ‌ర్నుంచి వాళ్ల‌కు వీలైన‌ప్పుడ‌ల్లా కౌగిలించుకొండి. వాళ్ల‌కు ఇబ్బంది లేకుండా ముద్దు పెట్టండి. స్ప‌ర్శ ద్వారా భద్రతను, ప్రేమను ఫీల్ అవుతారు. ఇది వాళ్లకు మానసిక ఎదుగులకు చాలా ముఖ్యమని పరిశోధకులు చెపుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు హద్దులు లేని ప్రేమను అందివ్వాలి. మీరు మా ప్రేమను పొందాలంటే ఫలానా విధంగా చేయాలి? ఈ పనులు చేస్తేనే మిమ్మల్ని ప్రేమిస్తాం..వంటి మాటలు పిల్లలు దగ్గర అస్సలు ఉపయోగించకండి.

 

 

మెప్పుకోలు పిల్లలకు ఉత్సాహాన్ని ఇస్తుంది!

 

పొగడ్త , మెచ్చుకోలు అనేది ఎవరికైనా సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది పిల్లల పెంపకంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. వాళ్లు ఏదైనా ఒక మంచి పని చేయగానే మనస్ఫూర్తిగా అభినందించి, ఆ పని చేసినందుకు వాళ్లను మెచ్చుకోండి. ఇది వాళ్లకు ఎనలేని శక్తిని ఇస్తుంది. మీరు ఇలాంటి పని కనుక చేయకుంటే వాళ్లు తమపై తాము నమ్మకం కోల్పోయి మెల్లగా ఈ ప్రపంచం నుంచి వేరై తమను తాము ఎందుకు పనికిరానివారుగా భావించుకుంటారు. మీ పిల్లలను ఒక మంచి పని చేసినప్పుడు వాళ్లను బాగా మెచ్చుకోవడంతో పాటు ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు సున్నితంగా మందలించాలి. అయితే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అనేది వాళ్లపై చాలా ప్రభావం చూపుతుంది. మందలించిటప్పుడు చాలా నెమ్మదిగా చెప్పి ఆ పని చేయడం వలన వచ్చే పర్యవసానాలు వివరించాలి. నువ్వు చాలా మంచి పిల్లాడివి కదా ఆ పని ఎందుకు చేసావు? అన్న రీతిలో ఆ మందలింపు ఉండాలి. పిల్లలకు ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అయితే మెచ్చుకోలు లో నిజాయితీ, వివరణ కూడా ఉండాలి.

 

 

ఇతరులతో మీ పిల్లలను అస్సలు పోల్చకండి

 

ప్రతీ పిల్లవాడు ఒక ప్రత్యేకం. తనదైన ప్రత్యేక లక్షణం, ప్రతిభతో ప్రతీ ఒక్కరిలో ఎనలేని శక్తి ఉంటుంది. ఇతరులతో పోల్చడం అనేది పిల్లల పెంపకంలో అస్సలు వద్దు. మిగిలిన పిల్లలతో పోల్చి నువ్వు ఎందుకూ పనికిరావు అన్న ఒక వ్యాఖ‌్య మీ పిల్లవాడిని పాతాళంలోకి తోసేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి నిజంగానే ఎందుకూ పనికిరాకుండా పోతాడు. పిల్లలపై విష‍యంలో తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రతికూల వ్యాఖ్యలు చేయకూడదు. ఇలా చేయడం వలన వాళ్లలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోతుంది. ఈ సృష్టిలో మీ పిల్లవాడు ఒక ప్రత్యేకమైన వాడు. అతన్ని అతని తోబుట్టువులతోనూ ఇతర స్నేహితులతోనూ ఎప్పుడూ పోల్చకండి. అతను ఇక్కడ మిగిలిన వాళ్లతో పోటీపడటానికి, వాళ్లలా మారడానికి లేడు. తనదైన ప్రతిభతో తన ప్రత్యేకతను చాటుకుంటూ స్వేచ్ఛగా ఎదిగేందుకు సృష్టించబడ్డాడు. అలాగే పిల్లల్లో ఎవర్నో ఒకర్ని ఎక్కువగా ఇష్టపడటం మిగిలిన వారిని అంతగా ఇష్టపడకపోవడం అన్నది కూడా చాలా తప్పు. అలా చేయడం పిల్లల ఎదుగుదలన తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పెంపకంలో పిల్లల మధ్య వ్యత్యాసం చూపించడం వాళ్లను మానసికంగా కుంగదీస్తుంది.

 

 

పిల్లలు చెప్పింది వినండి!

 

మీ పిల్లలతో మీకెప్పుడూ ఆరోగ్యకరమైన సంభాషణ ఉండాలి. మీరు చెప్పింది వాళ్లు వింటున్నట్టే వాళ్లు చెప్పింది కూడా మీరు ఓపిగ్గా వినండి. వాళ్లు మనసులో ఏమనుకుంటున్నారో , వాళ్లు మీతో చెప్పాలనుకుంటున్నారో అర్ధం చేసుకోండి. మీతో ఏ విష‍యమైనా స్వేచ్ఛగా చెప్పగలిగే వీలు కల్పించండి. అప్పుడే వాళ్లు మీతో స్నేహితులుగా ఉంటారు. లేదంటే అన్ని విషయాలు తమలో దాచుకుని సమస్యకు సరైన పరిష్కారం కనుక్కోలేక తప్పుడు సలహాలతో దారి తప్పుతారు. పిల్లవాడు సందిగ్దంలో ఉన్నప్పుడు అతనికి మంచి సలహా చెప్పే స్నేహితుడు మీరే కావాలి. ప్రతీరోజూ పడుకునే ముందు కానీ బ్రేక్ ఫాస్ట్ సమయంలో కానీ వాళ్లతో కొంచెం సమయం గడపండి. పిచ్చాపాటీ మాట్లాడండి. మీరెప్పుడు మీ పిల్లవాడి తెలివిని తక్కువ అంచనా వేయకండి. వాళ్లు చెప్పాలనుకుంటున్న విషయాన్ని శ్రద్ధగా వినండి. వాళ్లకు తగిన ధైర్యం ఇవ్వండి.

 

 

మీ పిల్లల కోసం సమయాన్ని సృష్టించుకోండి!

 

ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అస్సలు సమయమే కేటాయించలేకపోతున్నారు. మీరు మీ పిల్లల కోసం తగినంత సమయం కేటాయించలేకపోతున్నారంటే మీరే దేనికోసమైతే పగలు రాత్రీ కష్టపడుతున్నారో అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీ పిల్లలకు తగిన సమయం కేటాయించండి. వాళ్లతో మాట్లాడండి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడండి. వాళ్లతో కొంచెం సమయం గడపండి. వాళ్లతో పార్క్ లకు జూకి, మ్యూజియం కు ఇలా వాళ్లకి ఇష్టమైన ప్రదేశానికి వెళుతూ ఉండండి. వాళ్ల స్కూల్ ఫంక్షన్ కు హాజరుకండి. అలాగే పిల్లల ప్రవర్తనపై టీచర్ తో మాట్లాడండి. వాళ్ల చదువు గురించి టీచర్ తో చర్చించండి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)

 

 

మీ టీనేజీ పిల్ల‌ల‌తో గొడ‌వ రావొద్దంటే ఇలా చేయండి చాలు!!

పిల్ల‌ల పెంప‌కంలో త‌ల్లిదండ్రుల‌కు అస‌లైన స‌వాలు వాళ్ల‌ య‌వ్వ‌న ద‌శ‌లో ఎదుర‌వుతుంది. కౌమారం దాటి య‌వ్వ‌నం లోకి వ‌చ్చిన పిల్ల‌ల‌ను హ్యాండిల్ చేయ‌డం అంత సులువైన విష‌య‌మేమీ కాదు. స్నేహితుల్లా ఉంటూనే వాళ్ల‌ను అదుపు చేయాల్సి ఉంటుంది. ఒక మ‌నిషి భ‌విష్య‌త్ ను నిర్ణ‌యించే య‌వ్వ‌నంలో పిల్ల‌ల‌కు స‌రైన దిశానిర్దేశం చేయ‌కుంటే వాళ్ల జీవితం ఇబ్బందుల్లో ప‌డుతుంది. చాలా మంది టీనేజీ పిల్ల‌లు త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో, దూకుడుతో త‌ల్లిదండ్రుల‌కు స‌వాలు విసురుతారు. ఇటువంటి స‌మ‌యంలో సంయ‌మ‌నంతో, ఓర్పుతో వ్య‌వ‌హ‌రించాల్సింది త‌ల్లిదండ్రులు మాత్ర‌మే. వాళ్లు చేస్తున్న ప‌నులు కోపం తెప్పిస్తున్నా స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నా స‌రే త‌ల్లిదండ్రులు పిల్ల‌ల సంక్షేమాన్నే దృష్టిలో పెట్టుకుని ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది. స‌హ‌నం కోల్పోయి తమ టీనేజీ పిల్ల‌ల‌తో గొడ‌వ‌ల‌కు దిగితే ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారుతుంది. పిల్ల‌లు మ‌రింత మొండిగా త‌యార‌వ‌డంతో పాటు ఇంట్లో సంబంధాలు, వాతావ‌ర‌ణం దెబ్బ‌తింటాయి. ఇటువంటి ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు త‌ల్లిదండ్రులు ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌దానిపై కెరీర్ టైమ్స్ ప్ర‌త్యేక క‌థనం.

 

 

 స్వీయ స‌మీక్ష చేసుకోండి!

 

కుటుంబంలో మిగ‌తా సంబంధాల‌తో పోలిస్తే పిల్ల‌ల‌తో మ‌న సంబంధం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. భావోద్వేగాల ప‌రంగా అది మ‌న వైఖ‌రిపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఇత‌ర సంబంధీకుల‌తో మ‌న ఉద్వేగాల‌ను ప్ర‌ద‌ర్శించాల్సి వ‌చ్చిన‌ప్పుడు మ‌నం అంత సంఘ‌ర్ష‌ణ‌కు లోనుకాం. అదే మ‌న పిల్ల‌ల‌పై కోసం చూపించాల్సి వ‌చ్చిన‌ప్పుడు, వాళ్ల‌తో ఘ‌ర్షణ ప‌డాల్సిన సంద‌ర్భంలో మానసికంగా చాలా ఒత్తిడికి లోన‌వుతాం. ఉదాహ‌ర‌ణ‌కు పిల్ల‌లు ప్ర‌తీరోజూ తొంద‌ర‌గా ప‌డుకోకుండా మిమ్మ‌ల్ని స‌తాయిస్తూ నిద్ర‌పోమ్మ‌ని చెప్పినా త‌ల‌బిరుసుగా స‌మాధానం చెప్పిన‌ప్పుడు మీరు ఏం చేస్తారు? చాలా మంది త‌ల్లిదండ్రులు ఇక్క‌డ పిల్ల‌ల‌ను తీవ్రంగా కొప‌గించుకుని కొన్ని సంద‌ర్భాల్లో కొట్టి బ‌లవంతంగా నిద్ర‌పుచ్చుతారు. అయితే వాళ్లు నిద్ర‌పోతారు కానీ ఆ త‌ర్వాత త‌ల్లిదండ్రుల‌కు నిద్ర క‌ర‌వ‌వుతుంది. అయ్యో పిల్ల‌వాడ్ని అన‌వ‌స‌రంగా కొట్టామే! అలా కొట్ట‌కుండా న‌చ్చ‌చెప్పి ఉండాల్సింది! కోపాన్ని అదుపు చేసుకుంటే బాగుండేది! ఇలా ఆలోచిస్తూ నిద్ర‌కు దూర‌మై ఒత్తిడిని పెంచుకుంటారు. ఇటువంటి సంద‌ర్భంలో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న దానిపై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే ఈ ప‌రిస్థితికి కార‌ణం. అయితే పేరెంట్స్ ఎంత ఓపిగ్గా ఉండాల‌ని నిర్ణ‌యించుకుని ఫ‌లానా సంద‌ర్భంలో ఈ విధంగా ఉండాలి అని తీర్మానం చేసుకున్న త‌ర్వాత పిల్ల‌లు మ‌రో స‌వాలుతో రెడీగా ఉంటారు. అప్పుడు ఎంత గ‌ట్టిగా అనుకున్నా ప‌రిస్థితి తీవ్ర‌త‌ను బట్టి భావోద్వేగాలు మ‌రోసారి అదుపు త‌ప్పుతాయి. ఇటువంటి స‌మ‌యాల్లో స్వీయ స‌మీక్ష చేసుకుని పిల్ల‌ల‌తో ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌దానిపై స్వీయ స‌మీక్ష చేసుకుంటే ఫలితం ఉంటుంది.

 

 

పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌నకు ఒక కార‌ణం ఉంద‌ని అర్ధం చేసుకోండి!

 

కౌమారం తో పాటు య‌వ్వ‌న ద‌శలో ఉన్న పిల్ల‌లు విభిన్న కార‌ణాల రీత్యా అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌కు, కోపానికీ, అల్ల‌రికి పాల్ప‌డుతూ ఉంటారు. వాళ్ల అనుచిత ప్ర‌వ‌ర్త‌నకు ఒక కార‌ణం ఉంటుంటి. స‌రిగ్గా ఆలోచిస్తే వాళ్ల ప్ర‌వ‌ర్త‌న ఎందుకు అలా ఉంద‌న్న దానిపై ఒక అంచ‌నాకు రావ‌చ్చు. చాలా మంది త‌ల్లిదండ్రులు తాము అనుకుంటున్న‌దే స‌రైన‌ది అని పిల్ల‌ల‌దే త‌ప్పు అన్న రీతిలో ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ఆలోచ‌నా విధానం మంచి పేరెంటింగ్ లో అనుస‌ర‌ణీయం కాదు. ఎందుకంటే పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌నకు ఒక నిర్దిష్ట‌మైన కార‌ణం ఉంటుంది. ఎందుకు చేయ‌కూడ‌దు అన్న మొండిత‌నంతోనో, అసూయ‌తోనో, కోపంతోనో వాళ్లు అలా ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటారు. వాళ్ల ప్ర‌వ‌ర్త‌నను స‌రిగ్గా అర్ధం చేసుకుని అది ఎందుకు జ‌రుగుతుందో క‌నుక్కుని దానికి త‌గిన ప‌రిష్కారాన్ని వెత‌కాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దే. అలా కాకుండా వాళ్ల‌ను దండించి పెద్ద‌గా అరిచి వాళ్ల‌తో అల్ల‌రిని , వాళ్ల నిర‌స‌న‌ను అడ్డుకోవాల‌ని చూస్తే వాళ్లు మ‌రో ప‌ద్ధ‌తిలో దాన్ని కొన‌సాగిస్తారు. కాబ‌ట్టి స‌మ‌స్య‌కు మూల కార‌ణాన్ని గుర్తించి దానికి త‌గిన ప‌రిష్కార మార్గాన్ని క‌నిపెట్టాలి.

 

 

పిల్ల‌ల‌కు స్వంత నిర్ణ‌యాలు తీసుకునే స్వేచ్ఛనివ్వండి!

 

ఒక్క‌సారి మీ చిన్నత‌నాన్ని గుర్తుకు తెచ్చుకొండి. మీ త‌ల్లిదండ్రులు ఫ‌లానా టైంకి నిద్ర‌లేవాలి..ఫ‌లానా టైం తినాలి..ఈ టైంకే ఆ ప‌ని చేయాలి..చివ‌రికి ఫ‌లానా మాట‌లే మాట్లాడాలి అని మిమ్మ‌ల్ని స‌తాయిస్తున్న‌ప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు మీరు కూడా అటువంటి అభిప్రాయాలు, క్ర‌మ‌శిక్ష‌ణ రుద్దుడు కార్య‌క్ర‌మం పెడితే పిల్ల‌లు ఎంత ఒత్తిడికి లోన‌వుతారో ఆలోచించారా? పిల్ల‌లు సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునేలా, వ్య‌వ‌హ‌రించేలా వారికి స్వేచ్ఛ‌నివ్వండి. అయితే ఆ స్వేచ్ఛ దారి త‌ప్ప‌కుండా కాస్త ప‌ర్య‌వేక్ష‌ణ చేయండి చాలు. వాళ్లు సొంతంగా ఎదిగేందుకు మార్గం సుగ‌గ‌మ‌వుతుంది. మీ ఐదేళ్ల పిల్ల‌లైనా స‌రే షాప్ కు వెళ్లిన‌ప్పుడు నాకు ఫ‌లానా డ్రెస్ న‌చ్చింది అదే కొనుక్కుంటాను అంటే అలానే చేయండి. ఎందుకంటే వాళ్లు సొంతంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం నేర్చుకుంటున్నారు. వాళ్ల మ‌న‌స్సుకు న‌చ్చిన పని చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. వాళ్ల కాళ్ల‌కు బంధ‌నాలు వేయ‌కండి. వాళ్ల ఎంపిక‌ను గౌర‌వించండి. వాళ్ల ఆలోచ‌న‌ను అర్ధం చేసుకోండి.

 

 

స్నేహితుల్లా మెల‌గండి!

 

ఒక పిల్ల‌వాడు అదే ప‌నిగా త‌ల్లిదండ్రులు వ‌ద్ద‌న్న పనిని చేస్తున్నాడంటే అది వాళ్ల‌కు అతిపెద్ద స‌వాలే. ఇటువంటి స‌మ‌యంలో చాలా మంది త‌ల్లిదండ్రులు స‌హ‌నం కోల్పోతారు. చిన్న పిల్ల‌వాడు అయితే కొట్ట‌డ‌మో లేదా కాస్త పెద్ద పిల్ల‌వాడు అయితే ఘ‌ర్ష‌ణ ప‌డ‌ట‌మో చేస్తూ ఉంటారు. అయితే ఇలా స‌హ‌నం కోల్పోయి వాళ్ల‌తో గొడ‌వ ప‌డ‌టం అనేది అంత మంచి ఫ‌లితాల‌ను ఇవ్వ‌దు. పైగా మీ పిల్ల‌ల‌తో మీ అనుబంధాన్ని తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. అయితే చేయాల్సింది గొడ‌వ ప‌డ‌టం కాదు. వాళ్ల‌తో సామ‌ర‌స్యంగా మాట్లాడాలి. స‌రే ఈ స‌మ‌స్య‌కు నువ్వే ప‌రిష్కారం చెప్పు..నువ్వు చేస్తున్న ప‌నుల వ‌ల‌న ఇటువంటి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి..నువ్వు స‌మ‌స్య ఏంటో చెప్ప‌డం లేదు. కాబ‌ట్టి ప‌రిష్కారం చేయాల్సిందే కూడా నువ్వే అంటూ వాళ్లతో మాట్లాడాలి. ఇలా మాట్లాడ‌టం వ‌ల‌న పిల్ల‌లు ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. త‌న ప్ర‌వ‌ర్త‌న ఇంతలా త‌న పేరెంట్స్ ను బాధిస్తుందా? అన్న కోణంలో ఆలోచించ‌డం మొద‌లుపెడ‌తారు. త‌మ‌కు ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే త‌ల్లిదండ్రుల‌తో స్వేచ్ఛ‌గా చెపుతారు. కాబ‌ట్టి పెంప‌కంలో స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రించండి. మ‌నం ముందు చెప్పుకున్న‌ట్టు పెంప‌కం అనేది అంత సులువైన విష‌య‌మేమీ కాదు. మానసికంగా మ‌న‌ల్ని మ‌నం ఎప్ప‌టిక‌ప్పుడు స‌రి చేసుకుంటూ కొత్త విష‌యాలు నేర్చుకుంటూ ఉద్వేగాల‌ను అదుపులో ఉంచుకున్న‌ప్పుడే మంచి త‌ల్లిదండ్రులం అనిపించుకోగ‌లం.

 

(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)

 

 

 

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మీ కుటుంబం బాగా ఒత్తిడిలో ఉన్న‌ట్టే!

 

ఈ ఉరుకుల ప‌రుగుల ఆధునిక జీవితంలో ప్ర‌తీ ఒక్కరిని వేధించే స‌మ‌స్య ఒత్తిడి. అయితే ఇంట్లో, పనిలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాల‌న్న దానిపై పెద్ద‌వాళ్ల‌కు కాస్త అనుభ‌వం వ‌చ్చి తీరుతుంది. కానీ ఇంట్లో చిన్న పిల్ల‌లు కూడా ఒత్తిడి లోనైతే అది కుటుంబాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంది. పిల్ల‌ల‌పై ఒత్తిడి ఉన్న‌ప్పుడు అది క‌చ్చితంగా పెంప‌కంపై పెను ప్ర‌భావాన్ని చూపుతుంది. ఇంట్లో సామ‌ర‌స్య పూర్వ‌క వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించుకుని కుటుంబ స‌భ్యులంతా ఒత్తిడి లేకుండా జీవించ‌గ‌లిగిన‌ప్పుడే అది స‌రైన కుటుంబం అనిపించుకుంటుంది. లేదంటే ఒత్తిడి ద్వారా వ‌చ్చే దుష్పరిణామాలు ఊహకు అంద‌ని దారుణంగా ఉంటాయి. కుటుంబ క‌ల‌హాలు, తల్లిదండ్రుల మ‌ధ్య గొడ‌వ‌లు, ప్ర‌ణాళిక బ‌ద్ధంగా లేని జీవితం ఇవ‌న్నీ పిల్ల‌ల‌పై ఒత్తిడిని క‌లిగించే విష‌యాలే. వీలైనంత తొంద‌ర‌గా కుటుంబంలో ప్ర‌తికూల‌త‌ల‌ను తొలిగించుకుని పిల్ల‌ల‌కు ఒక సానుకూల వాతావ‌ర‌ణం క‌ల్పించ‌లేకుంటే మీ పిల్ల‌ల భ‌విష్య‌త్ ను చేజేతులా నాశ‌నం చేసిన వార‌వుతారు. అస‌లు ముందుగా మీ కుటుంబంలో ఒత్తిడిలో ఉందో లేదో తెలుసుకోవ‌డం ముఖ్యం. కుటుంబాల్లో ఒత్తిడిని గుర్తించేందుకు మాన‌సిక నిపుణుల కొన్ని ప‌ద్ధతుల‌ను పాటిస్తున్నారు. అవేంటో మ‌నం కూడా తెలుసుకుందామా?

 

 

ఇంట్లో ఎవ‌రూ సరిగ్గా నిద్ర‌పోక‌పోవ‌డం!

 

ఒత్తిడి ఉన్న‌ప్పుడు ముందుగా ఎదుర‌య్యే స‌మ‌స్య నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క‌పోవ‌డం. మ‌న‌స్సు అంతా అల‌జడిగా ఉన్న‌ప్పుడు ఏదైనా ఒక విష‌యం గూర్తి అతిగా ఆలోచిస్తున్న‌ప్పుడు మ‌న‌కు తెలీకుండానే ఒత్తిడిలోకి జారుకుంటాం. ఇంట్లో అల‌జడి, నిరుత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉన్న‌ప్పుడు పెద్ద‌ల‌తో పాటు పిల్ల‌లు కూడా ఒత్తిడిలోకి జారుకుంటారు. నిద్ర‌కు దూర‌మ‌వుతారు. ఈ ల‌క్ష‌ణం క‌నిపించిన వెంట‌నే త‌ల్లిదండ్రులు త‌గు జాగ్ర‌త్తలు తీసుకోవాలి. నిర్దేశిక స‌మ‌యం కంటే ఒక అర‌గంట ముందుగానే నిద్ర‌కు ఉప‌క్ర‌మంచాలి. నిద్ర‌పోయే ముందు ఎల‌క్ట్రానిక్ గాడ్జెట్స్ కు దూరంగా ఉండాలి. ముందుకు పిల్ల‌ల‌ను ప‌డుకోబెట్టి అప్పుడు త‌ల్లిదండ్రులు ప‌డుకోవాలి.

 

 

ఒక‌రితో ఒక‌రు గ‌ట్టిగా మాట్లాడుకోవ‌డం

 

మీ కుటుంబం ఒత్తిడిలో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీ చెవుల‌ను వాడితే స‌రిపోతుంది. ఏదైనా ఒక‌రోజు నిశితంగా గ‌మ‌నించి చూడండి. మీ కుటుంబ స‌భ్యులు ఒక‌రితో ఒక‌రు గ‌ట్టిగా అరుచుకున్న‌ట్టు మాట్లాడుకుంటున్నారంటే మీ ఫ్యామిలీలో ఒత్తిడి ఉన్న‌ట్టే. అస‌హ‌నం వ‌ల‌నే గొంతు పెరుగుతుంది. ఒక‌రంటే ఒక‌రు అస‌హ‌నంగా ఉండ‌టం వ‌ల‌న క‌లిగిన ఒత్తిడి గ‌ట్టిగా అరుస్తూ వెల్లడి చేస్తున్నార‌ని మీరు అర్ధం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా పిల్ల‌లు అయిన దానికీ కానీ దానికి అస‌హ‌నం వ్య‌క్తంగా చేస్తూ గ‌ట్టిగా అరుస్తున్నారంటే మీ కుటుంబం ప్ర‌మాదంలో ఉన్న‌ట్టే. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన‌ప్పుడు ముందు మీ మాట యొక్క శ‌బ్దాన్ని త‌గ్గించండి. అవ‌త‌లి వ్య‌క్తులు కోపం తెప్పించినా నిదానంగా విని మెల్ల‌గా స‌మాధానం ఇచ్చేందుకు రెడీ అవండి. బాగా కోసం వ‌చ్చిన‌ప్ప‌టికీ దీర్ఘ‌శ్వాస తీస్తూ దాన్ని అదుపు చేసుకునేందుకు ప్ర‌య‌త్నించండి. ఒత్తిడిని త‌గ్గించే ప్ర‌య‌త్నాన్ని మీ నుంచే మొద‌లు పెట్టండి.

 

 

త‌ర‌చూ క‌లిసి భోజ‌నం చేయ‌డం లేదా?

 

ప‌ని ఒత్తిడి మూలాన త‌ల్లిదండ్రుల్లో ఎవ‌రో ఒక‌రు రాత్రి వేళ‌ల్లో కుటుంబం అంతా క‌లిసి భోజ‌నం చేసే సంద‌ర్భంలో ఉండ‌రు. ఇది పిల్ల‌ల‌పై బాగా ప్ర‌భావాన్ని చూతుతుంది. త‌ల్లిదండ్రుల‌కు మేమంటే లెక్క‌లేద‌ని అందుకే త‌మ‌తో డిన్న‌ర్ చేయ‌డం లేని చాలా మంది పిల్ల‌లు భావిస్తారు. కొన్ని రోజుల త‌ర్వాత తాము ఇంట్లో నే ఉన్నా త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి భోజ‌నం చేసేందుకు వారు సుముఖత వ్య‌క్తం చేయ‌రు. ఈ పరిణామం అటు త‌ల్లిదండ్రుల‌ను ఇటు పిల్ల‌ల‌ను ఇద్ద‌ర్నీ ఒత్తిడికి గురిచేస్తుంది. మ‌న‌స్సు విప్పి మాట్లాడుకునే సంద‌ర్భాలు క‌ర‌వైపోవ‌డంతో ఒక‌రిపై ఒక‌రు న‌మ్మ‌కాన్ని కోల్పోతారు. ఇలాంటి సందర్భం ఎదురైన‌ప్పుడు ఇంట్లో త‌ల్లి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. రాత్రి పూట అంద‌రూ క‌లిసి భోజ‌నం చేసేలా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవాలి. భోజ‌నం చేసే స‌మ‌యంలో మ‌న‌సువిప్పి మాట్లాడుకుంటూ ఉల్లాసంగా గ‌డిపేందుకు ప్రాధాన్య‌త‌నివ్వాలి.

 

 

మీ పిల్ల‌లు పూర్తి సైలెంట్ గా మారిపోయారా?

 

ఇంట్లో ఒత్తిడి అధికంగా ఉన్న‌ప్పుడు చాలా మంది పిల్ల‌లు సైలెంట్ అయిపోతారు. ముభావంగా ఉంటూ అస్త‌మానూ త‌మ రూమ్ లోకి వెళ్లి త‌లుపులు వేసుకుంటారు. చివ‌రికి త‌ల్లిదండ్రుల‌తో పూర్తిగా మాట్లాడ‌టం మానేస్తారు. ఈ స‌మ‌యంలో త‌ల్లిదండ్రులు కూడా ఒత్తిడికి గురై వాళ్ల‌పై కోపంతో మాట్లాడ‌టం మానేస్తే ప‌రిస్థితి అదుపు త‌ప్పుతుంది. ఇటువంటి సంద‌ర్భాల్లో మీ పిల్ల‌ల‌తో మ‌న‌స్సు విప్పి మాట్లాడండి. వాళ్లు మ‌న‌సులో ఏం అనుకుంటున్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయండి.ఇటువంటి స‌మ‌యాల్లో పిల్ల‌లు అధికంగా తిన‌డం, అధికంగా నిద్ర‌పోవ‌డం చేస్తూ ఉంటారు. ఇది కూడా ఇంట్లో ఒత్తిడి ఉంది అన‌డానికి ఒక సంకేతం.

 

 

ప‌నిలో ఇబ్బందులు ప‌డుతున్నారా?

 

చేస్తున్న ప‌నిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే ఇది కూడా మీరు ఒత్తిడిలో ఉన్నార‌న‌డానికి ఒక సంకేత‌మే. ప్ర‌తీ సారి అనుకున్న స‌మ‌యానికి ప‌నిని పూర్తిచేయ‌లేకపోవ‌డం, త‌రుచూ ఆఫీస్ ప‌నిలో ఇబ్బందులు ప‌డుతున్నారంటే మీరు ఒత్తిడిలో ఉన్న‌ట్టే. ఇది మీ కెరీర్ ను అలాగే కుటుంబ భ‌విష్య‌త్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబ‌ట్టి ఈ ఒత్తిడిని వ‌దిలించుకునేందు మీరు వీలైనంత తొంద‌ర‌గా ప్ర‌య‌త్నం చేయాలి. ఎందుకంటే మీ కెరీర్ కు మీ పిల్ల‌ల భ‌విష్య‌త్ కు మంచి సంబంధం ఉంటుంది క‌నుక‌. ఈ విష‌యంపై మీ జీవిత భాగస్వామితో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకొండి. ఉద‌యం ఉత్సాహంగా ఆఫీస్ కు వెళ్లేందుకు రెడీ అవండి. దీని వ‌ల‌న రోజంతా ఉత్సాహంగా పనిచేయ‌డ‌మే కాక ఆ సానుకూల ప్ర‌భావం మ‌రుస‌టి రోజు కూడా ఉత్సాహాన్నిస్తుంది.

 

 

ఇంట్లో అంద‌రూ త‌ర‌చూ జ‌బ్బు ప‌డ‌టం!

 

వ‌య‌స్సుతో సంబంధం లేకుండా ఆరోగ్య స‌మ‌స్య‌లు వేధిస్తున్న‌ప్పుడు మీ ఇంట్లో ఒత్తిడి ఉందేమో ఒక‌సారి చెక్ చేసుకోండి. చిన్న పిల్ల‌లు కూడా త‌ర‌చుగా క‌డుపు నొప్పి అంటూ బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాగే రాత్రిపూట పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయ‌ని ఫిర్యాదు చేస్తారు. అలాగే పెద్ద వాళ్ల‌కి మెడ నొప్పి, భుజం నొప్పి, న‌డుం నొప్పి వంటి స‌మ‌స్య‌లు వేధిస్తాయి. ఇలా జ‌రుగుతుంది అంటే మీ ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావ‌ర‌ణం ఉన్న‌ట్టే. ఇక ఈ స‌మ‌స్య‌ల వ‌ల‌న నిద్ర స‌రిగ్గా ప‌ట్టక‌పోవ‌డంతో స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌మ‌వుతుంది. దీని వ‌ల‌న రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా త‌గ్గిపోతుంది. ఇలాంటి ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు కుటుంబ స‌భ్యులు ఉల్లాసంగా గ‌డిపేందుకు త‌గిన స‌మ‌యాన్ని వెచ్చించాలి. క‌లిసి భోజ‌నం చేయ‌డం, సినిమా చూడ‌డం, పార్క్ లో స‌ర‌దాగా సేద‌తీరడం వంటి ప‌నులు చేస్తే ఆరోగ్యం మెరుగ‌వుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

2018 లో తల్లిదండ్రులు ఈ తీర్మానాలు తప్పక తీసుకోవాలి!

 

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాము. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలతో ఈ ఏడాదిని ప్రారంభించాలని అందరూ తీర్మానాలు చేసుకుంటారు. కొందరు కెరీర్ ను నిర్మించుకోవాలని మరికొందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఇంకొందరు ప్రణాళికాబద్ధంగా జీవించాలని ఇలా ఏవేవో ప్లానింగ్ చేస్తారు. వ్యక్తిగత తీర్మానాలను కాస్త పక్కన పెడితే ఈ నూతన సంవత్సరంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెంపకంలో కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. విలువలతో కూడిన పెంపకాన్ని వారికి అందించేందుకు వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇప్పటి వరకూ చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని కొంగ్రొత్తగా తీర్మానాలు చేసుకుని వాటికి అనుగుణంగా పిల్లల బంగారు భవిష్యత్ కు బాటలు వేయాలి.

 

1. పిల్లలకు అభద్రతా భావం కలగనీయకండి

 

భయంభయంగా పెరిగే పిల్లల్లో అభద్రతా భావం గూడుకట్టుకుపోతుంది. ఇటువంటి పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి పిరికివాళ్లుగా తయారవుతారు. తమ పిల్లలు ధైర్యంతో ఉన్నారా? లేదా అన్నది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలీకుండానే పిల్లలకు అభద్రతాభావాన్ని కలిగిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మీ పిల్లలను అలా ఎప్పటికీ కానీయకండి. వారు ఎటువంటి భయాలకు లోనుకాకుండా పూర్తి భద్రతతో స్వేచ్ఛగా పెరిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి పెంపకంలో అభద్రత అనేదాన్ని మీ పిల్లల దరిచేరకుండా చూసుకొండి.

 

 

2. పిల్లలు మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకునేలా చేయండి

 

పిల్లలు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునేలా మీ పిల్లలను ప్రోత్సహించండి. అలా జరగాలి అంటే పిల్లలు చేసే మంచి పనులను ఎప్పటికప్పుడు మెచ్చుకొండి. గుర్తింపు లభించడం అన్నది పిల్లలకు ఎనలేని శక్తిని ఇస్తుంది. గుర్తింపు పొందే వాతావరణం అన్నది పిల్లల పెంపకంలో చాలా ముఖ్యమైన విషయం. ఈ కొత్త సంవత్సరంలో తల్లిదండ్రులు ఈ తీర్మానాన్ని కచ్చితంగా తీసుకోవాలి.

 

3. మీ పిల్లలతో అధిక సమయం గడపండి!

 

ఈ ఏడాది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సిన తీర్మానాల్లో ఇది కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలతో అధిక సమయం గడపలేకపోతున్నారు. ఉద్యోగం, కెరీర్ అంటూ పరుగెత్తడంతో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుంది. ఇది పెంపకంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కెరీర్ కు ఉద్యోగానికి ఇంపార్టెన్స్ ఇస్తూనే అదే సమయంలో వాళ్లతో గడిపేందుకు తగిన సమయ ప్రణాళిక వేసుకోండి. వాళ్లతో కలిసి ఆటలాడేలా, వాళ్లతో కలిసి పుస్తకాలు చదివేలా ప్రణాళిక తయారు చేసుకుంటే మంచిది. వాళ్లలో ఒకడిలా , స్నేహితుడిలా కలిసిపోతే అది వాళ్లకు మధుల జ్ఝాపంగా మిగిలిపోతుంది.

 

 

4. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోకండి!

 

పిల్లల పెంపకంలో సహనం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు సహనం కోల్పోతే మీరు మంచి తల్లిదండ్రులు ఎప్పటికీ కాలేరు. గతంలో మీరు సహనం కోల్పోయిన సమయాలను వదిలేయండి . ఈ కొత్త ఏడాదిలో సహనం కోల్పోకుండా ఉండాలని గట్టిగా అనుకోండి. పిల్లలు ఎంత విసిగించినా సహనాన్ని మాత్రం కోల్పోకండి. ఇలా మీరు సహనంతో ఉండటం అనేది వాళ్లలో ఓపికను పెంచుతుంది. మీ నుంచి ఈ మంచి గుణాన్ని వారు నేర్చుకుంటారు.

 

5. కల్మషం లేకుండా ఉండండి!

 

మీ పిల్లలను మీరు పరిపూర్ణ వ్యక్తులుగా చూడాలి అనుకుంటే ముందు మీరు అలా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనసులో ఎటువంటి కల్మషం వ్యక్తులు మాత్రమే పరిపూర్ణులవుతారు. మీ పిల్లలపై అదుపుతో కూడా అమితమైన ప్రేమను కురిపించండి. అలాగే మీ మాటలో, ప్రేమలో చివరికి కోపంలో కూడా ఎటువంటి కల్మషం లేకుండా నిజాయితీగా ఉండండి. వారు మెల్లగా ఆ గుణాన్ని మీ నుంచి నేర్చుకుంటారు. వాళ్ల మానసిక ఆరోగ్యం కుదుటపడి మంచి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు.

 

 

6. భార్యభర్తల బంధం విలువను తెలియజేయండి!

 

మీ పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకండి. ఇది పిల్లల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. భార్యాభర్తలు గొడవ పడే ఇళ్లలో పెరిగే పిల్లలు పెద్దయ్యాక వాళ్ల వైవాహిక జీవితం కూడా చిధ్రమైనట్టు పరిశోధనలో తేలింది. కాబట్టి మీ పిల్లల ముందు ఎప్పుడూ గొడవ పడొద్దు. పైగా మీ బంధం ఎంత ధృఢమైనదో వాళ్ల తెలియజేసేలా చెప్పండి. ఒకరిని ఒకరు ఎంత గౌరవించుకుంటారో ఎంత సామరస్యంగా ఉంటారో వాళ్లకు తెలిసేలా చేయండి. ఇలా చేయడం వలన మీపై గౌరవం పెరగడమే కాదు భవిష్యత్ లో ప్రేమ విలువను వాళ్లు తెలుసుకుంటారు.

 

7. అవసరమైన సందర్భంలో పిల్లల్ని పొగడండి!

 

మీ పిల్లలు ఏదైనా ఒక ఘనత సాధించినప్పుడు వాళ్లను వెంటనే మెచ్చుకొండి. వాళ్లు చేసిన మంచి పనుల్ని కీర్తించండి. నువ్వు అలా చేసి మంచి పిల్లాడివి అని నిరూపించుకున్నావు..నువ్వు చాలా మంచి అబ్బాయివి. అని బాహాటంగా చెప్పండి. ఇలా చెప్పడం వాళ్లకు ఎనలేని శక్తిని ఇస్తుంది. తర్వాత మంచి పనులు చేసేందుకు వాళ్లను ప్రేరేపిస్తుంది.

 

 

8. అమర్యాదను అస్సలు సహించకండి!

 

మంచి పెంపకంలో ఇటువంటి చెడు సందర్భం అస్సలు ఎదురుకాదు. కానీ ఇప్పటికే మీరు కాస్త నిర్లక్ష్యం చేసి ఇకపై మంచి పెంపకం అందించాలనుకుంటున్నప్పుడు మీరు చేయాల్సిన ప్రక్షాళన కార్యక్రమాల్లో ఇదొకటి. తల్లిని కానీ లేదా తండ్రిని కానీ గౌరవించకపోతే అసలు సహించకండి. అది ఎంత చెడు విష‍యమో వాళ్ల తెలియేజేయండి. అలా మాట్లాడటం తగదని తల్లిదండ్రులను గౌరవించడం ఎలానో చెప్పండి. ఈ విష‍యంలో అలసత్వం అసలు పనికిరాదు.

 

9. ఆదర్శనీయుల కథలు చెప్పండి!

 

పిల్లలకు నిద్రపోయే సమయంలో వాళ్ల పక్కన కొద్ది సమయం గడపండి. స్పూర్తినిచ్చే ఆదర్శనీయుల జీవితాలను వాళ్లకు విడమర్చి చెప్పండి. ఎందుకు అతన్ని అందరూ కీర్తిస్తున్నారో, అతని ఏ గుణాలు ఇంతలా అందరికీ నచ్చాయో తెలియజెప్పండి. ఇధి వాళ్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. తమకు తెలికుండానే మీరు గొప్పగా చెప్పిన ఫలానా వ్యక్తిలా మారేందుకు వాళ్ల ప్రయత్నం వాళ్లు చేస్తారు.

 

10. విలువల యొక్క విలువ తెలియజెప్పండి

 

మీరు దయతో , నిజాయితీతో, గౌరవంతో ఉన్నప్పుడు మీ చుట్టు ఉన్న వారు కూడా అదే విధంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది. విలువ యొక్క గొప్పతనం అది. మీ పిల్లలకు కూడా విలువల యొక్క ప్రాముఖ్యతను వివరించి చెప్పండి. విలువలతో బతికితేనే భవిష్యత్ ఉంటుందని చెప్పండి. దాని కోసం మీరు విలువలతో జీవించడం నేర్చుకోండి. అప్పుడే మీ పిల్లలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)