వందేళ్ల చరిత్ర ఉన్న ఓ కాలేజీ..చదివే విద్యార్ధుల సంఖ్య 1..ఎందుకు?

 

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా మొదలయ్యాయి. రోడ్లపై ఎక్కడ చూసినా కనిపిస్తున్న హోర్డింగ్స్ చూస్తూ తెలుగు భాషకు పూర్వ వైభవం వచ్చేసిందని చంకలు గుద్దుకుంటున్నాం. మనకు మనమే తెలుగు భాషాభిమానులుగా తెగ ఫీలైపోతున్నాం. ఇక ప్రభుత్వం హంగామా అయితే చెప్పనే అవసరం లేదు. ఈ హడావుడిలో ఓ దినపత్రికలో వచ్చిన ఒక వార్త ఇప్పుడు మరుగున పడిపోయింది. అదేదో మామూలు అషామాషీ వార్త కాదు. నిజమైన భాషాభిమానుల గుండెల్ని పిండేసే వార్త. అన్నింటికంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ వార్త ఒక ఇంగ్లీష్ పేపర్ లో వచ్చింది ప్రపంచ తెలుగు మహా సభల్లో ప్రభుత్వాన్ని కీర్తించడంలో బిజీగా ఉన్న మన తెలుగు పత్రికలు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ విచారకరమైన వార్త ఏంటంటే.. వందేళ్ల చరిత్ర కలిగిన ఓ ప్రముఖ కళాశాలలో తల్లి భాషను నేర్చుకునేందుకు ముందుకు వచ్చిన విద్యార్ధుల సంఖ్య కేవలం ఒక్కటంటే ఒక్కటి. ఇతర భాషలో సరైన విధంగా భావవ్యక్తీకరణ చేయాలంటే సొంత భాషపై తల్లి భాషపై పట్టు ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని అందరూ విస్మరిస్తున్న వేళ తెలుగును బతికించుకోవాలంటే సమావేశాలు, సభలు మాత్రమే పెట్టుకుంటే సరిపోదు.

 

 

 

ఒక్కడే విద్యార్ధి, ఒక్కరే టీచర్!

 

1860 లో ప్రారంభించిన విజయనగరం మహారాజా కాలేజీకి మంచి గుర్తింపు ఉంది. మొదట్లో రాజులు ఈ కాలేజీని నిర్వహించినప్పటకీ స్వాతంత్ర వచ్చాక ప్రభుత్వ కళాశాలగా మారింది. ఇక్కడ సంస్కృత కళాశాలకు మంచి గుర్తింపు ఉంది. దేశంలో గొప్ప గొప్ప సంస్కృత, తెలుగు పండితులు ఇక్కడ విద్యాభ్యాసం చేసారు. ప్రస్తుతం ఈ కాలేజీలో సంస్కృతం, తెలుగు పాఠ్యాంశాలుగా ఒక ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంది. అయితే ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ మాత్రమే కావాల్సి రావడంతో ఈ కోర్సు వైపు కన్నెత్తి చూసే నాథుడు కూడా లేడు. ప్రస్తుతం విద్యా సంవతర్సంలో ఈ కాలేజీలో సదరు కోర్సులో కేవలం ఒకే ఒక్క విద్యార్ధి చదువుతున్నాడు. దీంతో ఉన్న ఇద్దరు తెలుగు, సంస్కృతం పండితులను వేరే కాలేజీలకు బదిలీ చేసారు. మొత్తం కాలేజీకి ఒక్క స్టూడెంట్, ఒక ప్రిన్సిపల్, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. వందేళ్లు చరిత్ర కలిగిన ఒక గొప్ప కాలేజీలో కేవలం ఒక విద్యార్ధి మాత్రమే ఉండటం తెలుగు తో పాటు ఇతర భాషలపై మనకున్న నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది.

 

 

తెలుగులో చదివితే పనికిరాని వాళ్లమైపోతామా?

 

మన శరీరంలో ఏదైనా ఒక అవయవం ఎక్కువగా పెరిగితే ఏమవుతుంది. దాన్ని అంగవైకల్యం అంటాం. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ అలాంటి అంగవైకల్యం తోనే బాధపడుతోంది. కేవలం ఇంగ్లీష్ పైన మాత్రమే దృష్టి సారిస్తూ మాతృభాషను సమాధి చేస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్ అవసరమే. ఇది ఎవరూ కాదనరు. ఇంగ్లీష్ కావాలి అని మన తెలుగును చంపుకుంటామా? ఇంగ్లీష్ అనేది మనకు జీవన భృతిని కల్పించే భాష మాత్రమే. అందులో మన ఆత్మ ఉండదు. మన తల్లి భాషలోనే మన నిజమైన ఆత్మ ఉంటుంది. పైగా తెలుగు భాషను క్షుణ‌్ణంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ భాషపై మరింత పట్టు సంపాదించొచ్చు. ఎందుకంటే మాతృభాషలో మనం భావవ్యక్తీకరణ సరైన విధంగా చేయగలిగితే మరే ఇతర భాషలు నేర్చుకున్నా అది చాలా సులువుగా వంటబడుతుంది. అలా కాకుండా ఏకంగా మాతృభాషను వదిలేసి ఇంగ్లీష్ భాషనే పట్టుకు వేలాడుతున్న వారిని ఏమనాలి?

 

 

తల్లిదండ్రులే మొదటి దోషులు!

 

మరే ఇతర దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు. ప్రపంచంలో ఏ దేశం వాళ్లు అయినా ముందు వాళ్ల మాతృభాషకు ప్రాధాన్యత నిచ్చి తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మనం మాత్రం ఏకంగా మన భాషలను చంపేసుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. చైనాలో, జపాన్ లో ఇలా ఎక్కడైనా వాళ్లు వాళ్ల భాషకే పెద్ద పీట వేస్తారు. వాళ్ల భాష నేర్చుకోవడం వలన వాళ్లేమీ వెనుకబాటు తనంలో ఉండిపోలేదే. ప్రపంచంలోనే వేగవంతమైన శక్తులుగా ఎదుగుతున్నారు. మనం మాత్రం బాగా ఇంగ్లీష్ నేర్చుకుని రాత్రిళ్లు కాల్ సెంటర్లలో పనిచేస్తున్నాం. ఈ పరిస్థితి మారాలి? మాతృభాషకు అధిక ప్రాధాన్యతినివ్వాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ముందుగా మేల్కోవాలి. తమ పిల్లలకు ఇంగ్లీష్ తో సమానంగా మాతృభాషను కూడా నేర్పించాలి. ఇంట్లో పిల్లలు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడినప్పుడు మాత్రమే ఆనందపడాలి. ఇంటిదగ్గర వాళ్లకు ఎలా మాట్లాడాలో, ఎలా రాయాలో, ఎలా చదవాలో కొద్ది సమయం కేటాయించి వాళ్లకు తెలుగు నేర్పించాలి. అప్పుడే తెలుగు బతుకుతుంది.

 

 

ఆర్భాటాలు మాని చర్యలు చేపట్టాలి!

 

హైదరాబాద్ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఇలా జరగడం చాలా మంచిదే. అయితే అసలు ఉద్దేశాన్ని గాలికొదిలే ప్రచారాలకు , ఆర్భాలకు దూరంగా తెలుగును బతికించేందుకు నిజమైన కార్యాచరణ కావాలి. ఇప్పటికే తెలుగు మహాసభల హోర్టింగ్ ల్లో అక్కడక్కడా చోటుచేసుకున్న కొన్ని తప్పులు ఇబ్బందిగా ఉన్నాయి. ఇది రంద్రాన్వేషణ కాదు కానీ తెలుగును బతికించడంలో మన చిత్తశుద్ధిని చాటిచెప్పే విధంగా చర్యలు ఉండాల్సిందే. తెలంగాణాలో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చడం మంచి నిర్ణయం. అలాగే ఏపీ లో కూడా అటువంటి చర్యలు జరగాలి. మరే తెలుగు కాలేజీలోనూ ఒక్కడే విద్యార్ధి ఉండే దుస్థితి రాకుండా ప్రభుత్వాల తక్షణ చర్యలు చేపట్టాలి. తెలుగు చదివే వాళ్లకు నమ్మకం కలిగించాలి. తెలుగులో చదివితే కలిగే ఉపయోగాలను చెప్పాలి. లేకుంటే రానున్న రోజుల్లో తెలుగు చదివే ఆ ఒక్కడు కూడా మిగలకపోవచ్చు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)