ఆ స‌మ‌స్య గ్రామీణ ప్రాంత‌ విద్యార్ధుల‌కు పెను శాపం!

ప్ర‌జ‌ల‌కు క‌నీస వ‌స‌తులు, మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డం ప్ర‌భుత్వాల విధి. అయితే ప్ర‌భుత్వాలు త‌మ బాధ్య‌త‌ల నుంచి పారిపోవ‌డంతో ఇప్పుడు కీల‌క‌మైన విద్య, వైద్యం లోకి కార్పోరేట్ శ‌క్తులు ప్ర‌వేశించి వాటిని త‌మ చెప్పుచేత‌ల్లోకి తెచ్చుకున్నాయి. ముఖ్యంగా విద్య అనేది ఇప్పుడు లాభ‌సాటి వ్యాపారంగా మారిపోయింది. ఈ దుర్మార్గ‌పు మార్పుకు ప్ర‌భుత్వాలు కూడా ప‌రోక్షంగా సాయం చేయ‌డంతో కార్పోరేట్ విద్యా సంస్థ‌లు భారీ ఫీజుల‌ను వ‌సూలు చేస్తూ పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వారిని విద్య‌కు దూరం చేస్తున్నాయి. ఇటువంటి ప‌రిస్థితుల్లో పేద‌వారికి స‌ర్కారీ స్కూళ్లే దిక్కు. అయితే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో కనీస సౌక‌ర్యాల‌ను కూడా క‌ల్పించ‌లేక ప్ర‌భుత్వం చేతులెత్తేస్తోంది. దీంతో పేద పిల్ల‌లు చిన్న‌తనంలోనే చ‌దువుకు అటు త‌ర్వాత అంద‌మైన భ‌విష్య‌త్ కు దూర‌మ‌వుతున్నారు.

చేతులు క‌డుక్కునేందుకు నీళ్లు లేవు!

 

పాఠ‌శాల‌ల్లో పిల్ల‌ల‌కు తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించ‌డం ప్ర‌భుత్వం యొక్క క‌నీస‌మైన బాధ్య‌త‌. అయితే చాలా పాఠ‌శాల‌ల్లో తాగునీరు సంగ‌తి దేవుడెరుగు..క‌నీసం చేతులు క‌డుక్కునేందుకు కూడా నీళ్లు లేవు. దీంతో పిల్ల‌లు అప‌రిశుభ్ర‌మైన చేతుల‌తోనే మ‌ధ్య‌హ్న భోజ‌నాన్ని చేస్తూ చాలా సంద‌ర్భాల్లో తీవ్ర అస్వ‌స్థ‌కు గుర‌వుతున్నారు. పాఠ్యపుస్త‌కాల వెనుక‌వైపు భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా స‌బ్బుతో క‌డుక్కోవాలి అని ఊద‌ర‌గొడుతున్న ప్ర‌భుత్వం ఆ విధంగా చేతులు క‌డుక్కునేందుకు త‌గిన స‌దుపాయాలు క‌ల్పించ‌క‌పోవ‌డం నిజంగా దుర్మార్గం. భోజ‌నం చేసే ముందుకు స‌బ్బుతో చేతులు క‌డుక్కునేందుకు అవ‌కాశం లేక గ్రామీణ ప్రాంత విద్యార్ధులు జ్వ‌రాలు, డ‌యేరియా బారిన ప‌డుతున్నారు.

బాత్ రూమ్ లు లేక బ‌డి మానేస్తున్న ఆడ‌పిల్లలు!

 

చాలా స‌ర్కారీ స్కూళ్ల‌లో పిల్లలు మ‌రుగుదొడ్ల‌కు వెళ్లేందుకు కూడా అవ‌కాశం లేదు. మ‌గ‌పిల్ల‌లు ఆరు బ‌య‌ట‌కు వెళ్లి వ‌స్తున్నారు. కానీ ఆడ‌పిల్ల‌లు ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. మ‌రుగుదొడ్లు అలా అని ఆరు బ‌య‌ట‌కు వెళ్లలేక అమ్మాయిలు న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. దీంతో చాలా మంది ఆడ‌పిల్ల‌లు అర్ధంత‌రంగా బ‌డి మానేస్తున్నారు. అయినా స‌రే ప్ర‌భుత్వాల‌కు చీమ కుట్టిన‌ట్టు లేదు. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 52 శాతం పాఠ‌శాల‌ల్లో పిల్లలు చేతులు కడుక్కునేందుకు, బాత్ రూమ్ కు వెళ్లేందుకు కూడా స‌దుపాయాలు లేవ‌ని తాజా స‌ర్వేలో తేలింది. బాత్ రూమ్ లు ఉన్న పాఠ‌శాల‌ల్లో కూడా ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. స్కూల్లో 500 మంది 600 మంది పిల్ల‌ల‌కు కేవ‌లం ఒక్క బాత్ రూమ్ క‌ట్టి అధికార్లు చేతులు దులుపుకున్నారు. దీంతో మూత్ర‌శాల‌కు వెళ్లేందుకు పిల్లలు ఊపిరి బిగ‌బ‌ట్టి త‌మ వంతు ఎప్పుడు వ‌స్తుందా అని లైన్ లో నిల‌బ‌డాల్సిన దుస్థితి ఏర్ప‌డింది.

హాజ‌రు శాతం పెంచాలంటే ఏం చేయాలి?

 

ఒక‌ప్పుడు త‌మ పిల్ల‌ల‌ను బ‌డికి పంపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది త‌ల్లిదండ్రులు నిరాక‌రించేవారు.ఇప్పుడు అటువంటి ప‌రిస్థితి చాలా వ‌ర‌కు తొలిగిపోయింది. అయినా స‌రే గ్రామీణ ప్రాంతాల్లో హాజ‌రు శాతం పెర‌గ‌డం లేదు. ఎందుకు? పిల్ల‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలు, వ‌స‌తులు క‌ల్పించ‌క‌పోవ‌డం అనారోగ్యం బారిన ప‌డి , బ‌డి మ‌ధ్య‌లో మానేస్తున్నారు. ఇక స్కూళ్ల‌లో బాత్ రూమ్ లు లేక ఆడ‌పిల్ల‌లు స్కూళ్ల‌కు రావ‌డం మానుకుంటున్నారు. హాజ‌రు శాతం పెంచుతాం. మంచి ఫలితాలు సాధిస్తాం అని ఊద‌ర‌గొడుతున్న ప్ర‌భుత్వాలు ఈ విష‌యంపై మాత్రం దృష్టి పెట్ట‌డం లేదు. చేతులు క‌డుక్కునేందు స‌బ్బు, నీరు లేక పిల్లలు అనారోగ్యం పాల‌వుతున్నార‌ని స‌ర్వేలో తేల‌డం ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని క‌ళ్ల‌కు క‌డుతోంది. ఇంత కంటే దుర్మార్గ‌మైన విష‌యం ఏమైనా ఉంటుందా? ప‌్ర‌భుత్వాలు ఆర్భాట‌పు ప్ర‌చారాలు, ఓట్ల కార్య‌క్ర‌మాలు ప‌క్క‌న పెట్టి స్కూళ్ల‌లో క‌నీస స‌దుపాయాలు పెంచేందుకు త‌క్ష‌ణం చ‌ర్య‌లు చేపట్టాలి. పిల్ల‌ల డ్రాప‌వుట్ల‌ను త‌గ్గించి భావి భారత పౌరుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాలి. అది ప్ర‌భుత్వాల క‌నీస బాధ్య‌త‌..ప్ర‌జ‌ల ముఖ్య‌మైన హ‌క్కు.